7, మార్చి 2011, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - (స్ఫురణ భవత్స్వరూప మను)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా.
ఈ సమస్యను పంపిన మిస్సన్న గారికి ధన్యవాదాలు.

48 కామెంట్‌లు:

  1. వర కవితాప్రసాదమయి , పావన మంజుల వాగ్విలాసమై ,
    పరమ పవిత్ర భావనలు బంచెడి నిర్మల కావ్య రాశియై ,
    నిరుపమ మాధురీ మహిమ నిచ్చలు వెల్గెడి సత్కవిత్వ వి
    స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా !!!

    రిప్లయితొలగించండి
  2. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంసోమవారం, మార్చి 07, 2011 6:05:00 PM

    మీ పూరణ అద్భుతం గా ఉంది డాక్టర్ గారూ.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  3. శారదాస్వరూపము ను, పవిత్ర భావనలు పంచెడి కావ్యరాశి తో చక్కగా సరిపోల్చారు.
    అపురూపంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. డా.విష్ణు నందన్ గారి, పూరణ అద్భుతం. డా.ప్రసాదరాయ కులపతి గారి పద్యరచనా శైలి గుర్తుకొస్తోంది ఇది చదువుతుంటే.

    రిప్లయితొలగించండి
  5. మాష్టారుగారు, మిస్సన్న గారూ, ఒక సందేహం. ఇచ్చిన పాదంలో సాహిత్య పరంగా గానీ, అర్థపరంగా గానీ "సమస్య" యేమిటనేది తోచటం లేదు. చిన్న మాట, మీరు వ్రాసిన పదం Artificial Intelligence subject లోని Sphota Theory లో చెప్పిన దానికి దగ్గర గా వుంది. మన శాస్త్రాలు చాలా విషయాలను abstract form లో వివరించాయి. విడమరచి చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు.

    రిప్లయితొలగించండి
  6. అరువది నాల్గు విద్దెలకునమ్మయె ముద్దుల బల్కు రాణి ,శ్రీ
    కరముల నిచ్చు నక్షరపు కమ్మని నాకృతి ,వేద రూపిణీ !
    వరముల నిచ్చి పామరుని పండితు జేసిన వాణి, సద్గుణ
    స్పురణ భవత్స్వ రూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!

    రిప్లయితొలగించండి
  7. చంద్ర శేఖర్ గారూ నాకున్న చిన్ని జ్ఞానం బట్టి చెబుతున్నాను.
    కొన్ని సందర్భాల్లో సమస్యగా ఇచ్చిన పద్య పాదంలో ఏదో చిక్కుముడి గానీ, సమస్య గానీ ఖచ్చితంగా ఉండి తీరాలని నియమం ఏమీ ఉన్నట్లు కనుపించడం లేదు పెద్దలు, పండితులు,కవి వరేన్యులు చేసిన, చేస్తూన్న అవధానాలను పరిశీలించి నట్లయితే. ఇచ్చిన పద్య పాదం ఒక మనోహరమైన వర్ణనను గానీ, సందర్భాన్ని గానీ, వ్యక్తిని గానీ, సంఘటనను గానీ ఇలా దేనినైనా ప్రస్తావించేదిగా కూడా ఉంటూ ఉంటుంది
    ఒక్కోప్పుడు. అందుచేత ఈరోజు ఈ సమస్య ఇవ్వడంలో గురువుగారు ఔచిత్యాన్ని పాటించారని నా అభిప్రాయం.
    ఇక మీరు చిన్న మాట గా వ్రాసిన తర్వాతి వాక్యాలు,వాటిలోని సాంకేతిక పదాలు నా చిన్ని బుర్రకు అవగాహన కాలేదు. అన్యథా భావించకండి.

    గురువుగారు ఇంత కన్నా మంచి సమగ్రమైన వివరణ ఇస్తారని నా నమ్మకం.

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారు, నేనూ ఇలాగే అనుకున్నాను. ప్రతీసారీ చిక్కుముడిగా కాకుండా, వర్ణనలను చేయమంటే రకరకాల వర్ణనలను, ఉపమానాలను మనం చూడవచ్చు కదా అని నా భావన. గురువుగారిని కూడా ఈ విషయం పరిశీలించమని అభ్యర్థించాను.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ, నిజమే. చిక్కుముడి వుండవలసిన అవసరం లేదని నేను కూడా చాలా చాలా సాహితి సమ్మేళనాల్లో చూశాను. కానీ, శంకరయ్య మాష్టారి కోరికకి (అదివరలో వారు ఇమెయిల్లోచెప్పిన దాన్ని బట్టి)ఇది సమస్యగా సమకూడలేదని పించింది. అందువల్ల నాకు తెలియని అంతరార్థ మేదైన దాగి వుందా అని అనుమానం వచ్చింది. అంతే.

    రిప్లయితొలగించండి
  10. డా. విష్ణు నందన్ గారూ,

    సత్కవిత్వ విస్ఫురణము, శశ్వదర్థ
    పూర్ణమును, కవిపండితామోద యోగ్య
    శైలి గల్గిన పద్యమ్ము సంతస మిడె
    విందుగా; విష్ణునందనా! వందనములు.

    రిప్లయితొలగించండి
  11. అభినందించిన కవిపండితులకూ , రసజ్ఞులకూ పేరుపేరునా ధన్యవాదాలు. శంకరయ్య గారూ మీ మెచ్చుకోలు ఏనుగునెక్కినంత సంబరమివ్వదూ ? శిరసా నమామి !!!

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ గారూ,
    సాధారణంగా అవధానాల్లో ఇచ్చే సమస్యలు క్లిష్టంగానో, విపరీతార్థ స్ఫోరకంగానో, అసమంజసంగానో ఉంటాయి. అయితే కొన్ని ప్రసిద్ధ అవధానాలలో అర్థవైపరీత్యం లేని సమస్యలను ఇవ్వడం చూసాను.
    ఇచ్చిన పాదాన్ని సమర్థించే మూడు పాదాలను వ్రాయడం సమస్య కాదా?
    గతంలో నేను మీకు మెయిల్ చేసిన వ్యాఖ్య గురించి ...............
    ఈ మధ్య నేను చూసిన అవధానాల్లో సమస్యలను పరిశీలించినప్పుడు నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఉదాహరణగా నేను విన్న కొన్ని సమస్యలు....
    1. కోరి భజించెడు నరులకు కోర్కెలు దీరున్.
    2. రాము చేతిలో మడిసెను రణములోన.
    3. స్వరమున నాలపించెద వసంత వనాంత రసాల శాఖలన్.
    4. చెన్నకేశవ! చూడుమా కన్ను తెఱచి.

    రిప్లయితొలగించండి
  13. మాస్టారూ,
    మీ ప్రశంస అమోఘమైన పద్య రూపం దాల్చింది. మీరు మాకోసం ఎంతో కుదించి మిగతా పద్యాలు సులభంగా వ్రాస్తున్నారని చాలా సార్లు అనుకొన్నాను. నా భావన నిజమే. మీరు కూడా అప్పుడప్పుడూ విజృ౦భించటం మాకు ఆనందదాయకమే:-)

    రిప్లయితొలగించండి
  14. మాస్టారూ, వివరణకు ధన్యవాదాలు. మీ లిస్టు లో ఒకటి, ఏడు నేను కూడా విన్నట్లు గుర్తు. ఇప్పుడు మీరు ఇచ్చిన స్వతంత్రం వల్ల ఇంకొన్ని సమస్యలు పూరణల కోసం పంపే అవకాశం మాకు కలిగింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. మంద పీతాంబర్ గారూ,

    వృత్తలేఖన ప్రావీణ్య విదుఁడవై మ
    నోహరములగు భావము లూహ జేసి
    హృద్యమయిన ధారాశుద్ధిఁ బద్యములను
    వ్రాయు మంద పీతాంబరా! వందనములు.

    రిప్లయితొలగించండి
  16. పీతాంబర్ గారి పూరణ కూడా బాగున్నది.
    విష్ణునందన్ గారి పూరణ గంగాఝరి లాగానూ, పీతాంబర్ గారి పూరణ గోదావరి లాగానూ ముచ్చట గొలుపుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  17. డా.విష్ణు నందన్ గారూ, మీ పూరణలో అద్భుతమైన నిరుపమ మాధురీ మహిమ తొణికిసలాడుతున్నది. హృదయపూర్వక అభినందనలు.
    శ్రీ పీతాంబర్ గారూ, మీ కవితలో కమ్మదనము నిండుగా ఉన్నది, మీకు మనసారా అభినందనలు !
    గురువుగారూ చంద్రశేఖర్ గారు శలవిచ్చి నట్లు మీ ప్రశంసా పద్యాలు,మధురంగా ఉన్నాయి. మీకు మరోసారి ప్రణామములు.

    రిప్లయితొలగించండి
  18. డాక్టర్ గారి పూరణ చదివిన తర్వాత, నా బోంట్లు రాస్తే పేషెంటు రాసినట్టు ఉంటుందని ప్రయత్నం చేయలేదు.

    పీతాంబర్ గారి రచన కూడా ముగ్ధంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  19. డా.విష్ణునందన్ గారి పూరణ ప్రశస్తంగా ఉంది .
    వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న గురువు గారికి ,తోటి కవి మిత్రులకు కృతఙ్ఞతలు ,ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి
  20. కరముల పద్మయుగ్మముల కంపిత తంత్రుల వీణరావముల్
    స్వరములు, నాద రాగమయ సత్కవి గీతి సుధాంబు లందుటన్
    తెరలను భావసంపదల , తెల్లని యంచను నోలలాడు నీ
    స్ఫురణ భవత్స్వరూపమను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా !


    ( తెరలు = అలలు )

    రిప్లయితొలగించండి
  21. ఆర్య విష్ణువర్ధన్ గారూ మీ పూరణ ప్రాచీన కవుల శైలితో శారదా ప్రసన్నం చేస్తూ అద్భుతంగా అలరారుతోంది.
    మంద పీతామ్బర్ గారూ గురువుల ప్రశంసకు పాత్రమైన మీ పూరణ మంచి మనోహరంగా ఉంది.
    నరసింహ మూర్తి గారూ మీ పూరణ హంస మీద ఆశీనురాలై వీణ నాదం చేస్తూన్న శారదను సాక్షాత్కరింప జేస్తూ చాల బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ కృతజ్ఞతలు. బ్రహ్మాండమైన పూరణలు చూచి యీ పూరణకు దూరంగా ఉందామనే తలచాను ,గాని నిద్ర లేవకముందు మగత నిద్రలో పద్యము కూడింది. చాపల్యముతో వ్రాసాను.

    మందాకిని గారూ యీ సందిగ్ధము వస్తుందని తెలుసు. ఓలలాడున్ + ఈ స్ఫురణ = ఓలలాడు నీ స్ఫురణ అని నా భావము. వ్యాకరణము లో కూడా నేను వీకే !
    పద్యము వ్రాసి పడేస్తాను, గురువులు దిద్దు కొంటారని .

    రిప్లయితొలగించండి
  23. మూర్తిగారు,
    ఇప్పుడు అర్థమయ్యిందండి. కృతజ్ఞురాలిని.
    మీ పద్యం చాలా బాగుంది.
    తెలియని వాళ్ళకు నాలాంటి వాళ్ళకు సందేహాలుకానీ,
    విజ్ఞులకు తెలుస్తుంది కదా!

    రిప్లయితొలగించండి
  24. మూర్తి గారూ !
    ముచ్చటైన పూరణ !

    మీరు వీక్ కాదు బాబూ ,మేకే !

    రిప్లయితొలగించండి
  25. మందాకిని గారూ,కృతజ్ఞతలు. మనందఱమూ విద్యార్ధులమే ! సందిగ్ధము రాకుండా మరోలా వ్రాయ వచ్చు గాని పరుగుల బ్రతుకులు. మీ దగ్గఱ నుండి వారము దినములలో ఒక పద్యము ఆశిస్తున్నాము.మా అందఱి లాగే మీరు దూకండి.

    కిశోర్ జీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. మూర్తిగారు,
    మీ ఆశీస్సులతో నియమాలన్నీ కొంతవరకైనా ఆకళింపు చేసికొని దూకాలనుకుంటున్నాను.
    ఇప్పుడే దూకేస్తే నా కాళ్ళు విరిగినా పర్లేదు కానీ రసజ్ఞుల మనసు విరగకూడదని...:) జాప్యం చేస్తున్నాను.
    అభ్యసించుటలో భాగంగానే సందేహాలు అని భావించి ధైర్యంగా అడిగేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  27. సరసులు పండితుల్ కవులు చక్కగ కైతల జెప్పు వేళలన్
    పరిణతి నొంది శబ్దములు, పల్కులు, వాక్కులు, పద్య గద్యముల్
    కురియుట నీ కృపా రసపు కూరిమి జల్లుల చిల్కరింపులే
    'స్ఫురణ' భవత్స్వరూపమను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!

    రిప్లయితొలగించండి
  28. మందాకిని గారూ, అడివరలో నేను బ్లాగులో పోస్ట్ చేసినదే మీ స్పందన చూశాక మళ్ళా వ్రాయాలని పించింది. మనం చిన్నప్పుడు నేర్చుకొనే విధానం వేరు (rote learning, memorization dominating), కానీ పెద్దవుతున్న కొద్దీ comparative, analysis based, critical reading based etc. వంటి పద్ధతుల వాళ్ళ తేలికగా నేర్చుకొంటాము. కాబట్టి, మనకు నేర్చుకొనేటప్పుడు "Guess and check", "write first and rewrite later to correct" లాంటి methods తేలికగా వుంటాయి. దూకేయండి, "...నా కేటి సిగ్గు..." అని కృష్ణ శాస్త్రి గారి స్వేచ్చా గీతం తలుచుకొంటూ. రసజ్ఞుల మనసు ద్రాక్ష పాకం లాంటిది, అది విరగదు, సాగుతుంది. Dont worry, "Learn to swim while in the pond not sittting on the banks".

    రిప్లయితొలగించండి
  29. అందరికీ వందనములు.
    అందరి పూరణలూ
    అద్భుతముగా నున్నవి!

    మందాకిని గారు సంకోచిస్తున్నారు గాని
    తేడా వస్తే గురువు గారే శరణనుకొని
    నేను దూకేస్తున్నాను !

    01)

    __________________________________________

    అరయగ కాళిదాసు గళ - మందున కావ్య సుధా ప్రవాహముల్ !
    స్థిరమగు పోతనార్యు నుత - శ్రీహరి భాగవతా మహాత్మ్యముల్ !
    వరమిడె నాంధ్రజాతికిని - భారత సంహిత నన్నయాదులున్ !
    స్ఫురణ భవత్స్వరూప మను - సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  30. వసంతకిశోర్ గారూ, దంచేశారు, సంస్కృతాంధ్ర కవులను కలిపి జెప్పారు. మన:పూర్వక ప్రశంసలు. మీకు అర్థరాత్రి అయితే గానీ కవితావేశం వస్తున్నట్లు లేదు (నవ్వుతూ).

    రిప్లయితొలగించండి
  31. చంద్రశేఖరా !
    ధన్యవాదములు !
    మీరు సరిగ్గానే ఊహించారు !
    ఆ సంగతి నేనింతకుముందు
    మనవి చేసాను కూడా !

    రిప్లయితొలగించండి
  32. స్ఫురణ విధాత సృష్టి ఘన సూత్రము, ధారుణి ప్రాణి కోటికిన్
    స్ఫురణ యనుక్షణమ్ము నిడు సొంపగు జీవన శైలి, ఎంచగా
    స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె? దివ్య శక్తి యా
    స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!

    రిప్లయితొలగించండి
  33. మిస్సన్నగారూ మీ పూరణ అద్భుతంగా ' పరిణతి నొంది శబ్దముల,' చక్కని శైలిలో చాలా బాగుంది.

    కిశొర్ జీ మీ పూరణ చాలా మధురంగా ఉంది. పేరు పేరునా కవిశేఖరులను ప్రస్తావించారు. పద్యము అందంగా ఉంది

    రిప్లయితొలగించండి
  34. మిస్సన్న గారూ మీ రెండవ పూరణ కూడా చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  35. ఎందఱో మహానుభావులు అందఱికీ వందనములు.
    ఈ సమస్య కి వచ్చిన పూరణలు అన్నీ కూడా బాగున్నాయి.
    మన భారతీయసాహిత్యసంగీతాది కళల స్ఫురణ వలెనే ఈ బ్లాగు కూడా బ్లాగ్ధరిత్రిలో వాణీ స్వరూపమును సాక్షాత్కరింపఁజేస్తున్నది.

    ప్రోత్సహిస్తున్న మిత్రులందఱికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  36. మిత్రు లందరూ మన్నించాలి. అందరి పూరణలూ బాగున్నాయి. పెళ్ళికి వరంగల్ వచ్చిన నేను సమయాభావం వల్ల వారాంతపు సమస్యా పూరణలను వ్యాఖ్యానించలేక పోతున్నాను. హైదరాబాదుకు తిరిగి వచ్చాక వ్యాఖ్యానిస్తాను.

    రిప్లయితొలగించండి
  37. శ్రీ నరసింహ మూర్తి,వసంత కిశోర్ మరియు మిస్సన్న గారల పూరణలు చాలా బావున్నాయి అందరికి నమస్కారములు .
    శ్రీ చంద్ర శేఖర్ గారు నమస్కారం .మీ వివరణాత్మక motivation నా వంటి వారలందరికి ఉపయుక్తంగా ఉంటుంది .

    రిప్లయితొలగించండి
  38. మిస్సన్న మహాశయా !
    ధన్యవాదములు !
    "స్ఫురణ వినా ప్రపంచమున శూన్యము నిండదె"
    మీ రెండవ పూరణ అద్భుతం !
    స్ఫురణ లేకపోతే ఏదీ లేదని తేల్చేసారు !

    మూర్తిగారికీ
    మందాకిని గారికీ
    పీతాంబరధరులకూ
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  39. గురువుగారూ ధన్యవాదాలు.
    వసంత మహోదయా నరసింహ మూర్తి గారూ పీతాంబర ధారా
    అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  40. శ్రీ మంద పీతాంబర్ గారికి నమస్కృతులు, కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  41. పేషెంట్ పూరణ :)

    సరసులు,పండితోత్తములు,స్రష్టలు, ద్రష్టలు, శ్లేషబద్ధులున్
    విరసులు,ఛాందసాగ్రణులు,వేత్తలు తోచిన ప్రశ్నలేయగా
    అరసినరీతిజెప్పును రసార్ద్రకవిత్వము సూ!వధాని, తత్
    స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా

    రిప్లయితొలగించండి
  42. పరపతి కోరుచున్ తరలి భాగ్యపు నగ్రపు వీధులందునన్
    కరముల బుడ్డి నందుకొని కైతల కోసము ప్రాకులాడగా
    వరముల నిచ్చెడిన్ సినిమ పాటలు వ్రాయగ హృత్తునందునన్
    స్ఫురణ భవత్స్వరూప మను సూక్తి నిజమ్ము ధరిత్రి శారదా!

    రిప్లయితొలగించండి