22, మే 2011, ఆదివారం

సమస్యా పూరణం -345 (రాహుకాలాన వెడల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రాహుకాలాన వెడలఁ గార్యము సఫలము.

8 కామెంట్‌లు:

  1. రాహు కాలాన వెడల గార్యము సఫలము
    కాదు యెప్పుడు తెలియగ, గాన మీరు
    విఘ్న మన్నది లేకుండ విజయమంద
    మంచి చెడ్డలు గమనించి మసలు కొనుడు.

    రిప్లయితొలగించండి
  2. హేతువాదుల పల్కుల విట్టులుండు:
    దుర్ముహూర్తము! వర్జ్యము! మర్మ మేమొ?
    గ్రహణ కాలపు తిండిని కల్గు శక్తి!
    రాహుకాలాన వెడలఁ గార్యము సఫలము.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సమస్యను మొదటిపాదంగా చేసిన పూరణ చూడడం నా అనుభవంలో ఇదే మొదటి సారి. చాలా బాగుంది. అభినందనలు.
    "కాదు + ఎప్పుడు" అన్నప్పుడు యడాగమం రాదు. "కా దనుచు చెప్పుచుందురు" అందామా?

    మిస్సన్న గారూ,
    హేతువాదంతో సమస్యను సమర్థించిన విధానం బాగుంది. భేషైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా! ధన్యవాదములు.
    'కాదు, నిజమది తెలియగ గాన మీరు ' అంటే ఎలా ఉంటుందండీ!

    రిప్లయితొలగించండి
  5. రాహు కాలాన వెడలఁ గార్యము సఫలము
    కాక చిక్కులు వచ్చుట ఖాయమంచు
    వింటి నంతియె గానిక వివరమెఱుఁగ
    నేమి తెలిపెద నొరులకు నీరజాక్ష!

    రిప్లయితొలగించండి
  6. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి


    బ్రహ్మ వ్రాయగ నొసటపై భావిఁ దీర్చి
    పురుష యత్నంబు భువిలోన బూటకమ్ము
    దైవ ముండగ దీటుగా దనకుఁ దోడు
    రాహు కాలాన వెడలఁ గార్యము సఫలము.

    రిప్లయితొలగించండి
  7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు సూచించిన మార్పు బాగుంది. సంతోషం!

    మందాకిని గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    దైవబలం తోడుంటే అన్నీ శుభఘడియలే అన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    రాహు కాలాలు వర్జ్యాలు - రాశు లంచు
    గుడ్డి నమ్మక ముండిన - చెడ్డ జరుగు !
    ఆత్మ విశ్వాస మొక్కటే - ఆదు కొనును !
    రాహు కాలాన వెడలఁ గా - ర్యము సఫలము !
    __________________________________

    రిప్లయితొలగించండి