28, సెప్టెంబర్ 2011, బుధవారం

ఛందస్సు - 2 (సరసయతి)

.................... సరసయతి .....................
"పుడు పితృదేవతల పూజ హితము కాదు"
పై పాదంలో ఇ-హి లకు మైత్రి కూర్చడం ‘సరసయతి’.
‘సరస’ అంటే సమీపం. భిన్నవర్గాలకు చెంది, ఉచ్చారణాసామీప్యం కలిగిన వర్ణాలకు మైత్రి కూర్చడం సరసయతి.
కం.
అయహలు, చఛజఝశషసలు
నయసంయుత నణలు రేచనా సరసగుణా
ప్రియ యవి యొండొంటికి ని
శ్చయముగ వల్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా! (కవిజనాశ్రయము, 1-74)
ఆ.వె.
ణనలు చెల్లుఁ గమలనాభ యొండొంటికి
నయహ లమరియుండు హస్తివరద
శషస లొందునండ్రు చఛజఝంబులతోడ
సరసయతు లనంగ జలధిశయన! (అనంతుని ఛందోదర్పణము, 1-107)
కం.
పరగు న్నణ లొండొంటికి
సరవిన్ శషసలు దనర్చు చఛజఝములకున్
పరికింప నయహ లేకము
సరసవిరామంబు లవి నిశాకరమకుటా!
(కూచిమంచి తిమ్మకవి లక్షణసార సంగ్రహము)
కం.
హయ లత్వమునకు, శషసలు
నయవర్తన చఛజఝలకు, నలి మధ్యమ వ
ర్గయుతానునాసికము ని
శ్చయముగ ద్రుతమునకుఁ జెల్లు సరసవళు లన్న్. (అప్పకవీయము)
పై లక్షణాల ప్రకారం మూడువిధాల యతులు ఏర్పడుతున్నాయి.
1) అకారానికి యహలు.
2) చఛజఝలకు శషసలు
3) ద్రుతము (నకారము)నకు మధ్యమవర్గ అనునాసికాక్షరమైన ణకారము (న కు ణ)
"యకార హకారములకు అఆఐఔలున్ను, యకార హకారములకు గుడియు నేత్వమైనా ఉంటే ఇఈఎఏలున్ను, కొమ్మైనా ఒత్వమైనా ఉంటే ఉఊఒఓలున్ను చెల్లును. ఇవి సరసయతులు." (‘సుకవిమనోరంజనము’ కర్త కూచిమంచి వేంకటరాయని వ్యాఖ్య)
"అయహలకు మైత్రి చెల్లు నన్నప్పుడు ‘అ’ అనునది సర్వాచ్చులకు ఉపలక్షణము"
(‘ఛందోదర్పణ’ వ్యాఖ్యాత శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు).
"అయహల మైత్రి నిట్లు విస్తరించి చెప్పవచ్చును.
1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో
‘తెలుగులో ఛందోవిశేషములు’ - యతిభేదపరిశీలనము నుండి)
కొన్ని ఉదాహరణలు.
1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
ఉదా||
మలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేద ... (భార. ఆది. ౧-౧౯)
సూకర| మై యప్పుడ యెత్తికొని రయంబునఁ జనుచోన్. (భార. ఆది. ౧-౧౩౩)
డిచినఁ దిట్టినన్ మఱి మహాపరుషంబున పల్కి ... (భార. ఆది. ౧-౧౩౮)
కుటిలుఁ డార్యసమ్మతుఁ డహంకృతిదూరుఁడు ... (భార. విరా. ౧-౯౮)
2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
ఉదా||
హిమకరుఁ దొట్టి పూరుభరతే కురుప్రభు పాండుభూపతుల్ (భార. ఆది. ౧-౧౪)
వచ్చి య| య్యెర నొక డుండుభం బను నహిం గని వ్రేయఁగ ... (భార. ఆది. ౧-౧౫౨)
యాత్మలో| నిడుగడఁ జేయుచుం గడు సహింపక కద్రువ ... (భార. ఆది. ౨-౪౨)
మ| హీ నాయకు సొమ్ము పాము నెమ్ములు గాలో ... (భార. విరా. ౧-౧౩౬)
బా| హిరములైనఁ గెలని కెగ్గు లగుట (భార. విరా. ౧.౧౩౭)
హీనత నున్కి మీకు వగ పేమియుఁ జేయద యేమి ... (భార. విరా. ౨-౨౧౮)
ఇందు నొప్పారు శ్రీరామహృదయ మనెడు (పండిత నేమాని రామాయణము, పీఠిక - ౧౪)
హితబృందములతోడ నేగి తనదు (పం. నే. రామా. బాల. ౧సర్గ. ౨౦)
హితమా రీతి గురుండు తెల్ప వసుధాధీశుండు కేల్మోడ్చి... (పం. నే. రామా. బాల. ౩సర్గ. ౯)
చ్చె నానతి జనకమహీవిభుండు. (పం. నే. రామా. బాల. ౬సర్గ. ౧౪)
౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో
ఉదా||
అసురకు| నోయన చెప్పుటయు విని మహోగ్రాకృతితో (భార. ఆది. ౧-౧౩౩)
పుదుఁ దత్తద్విధప్రయోగముల మెయిన్. (భార. విరా. ౧-౭౯)
కనాడు వచ్చె నయోధ్యకు కైక ... (పం. నే. రామా. బాల. ౭సర్గ. ౩౩)
చఛజఝశషస; నణల మైత్రి గురించి మరో పాఠంలో తెలుసుకుందాం.

4 కామెంట్‌లు:

  1. శంకరార్యులకు నవరాత్రి శుభా కాంక్షలు.
    'ఛందోపాఠం' మొదలు పెట్టి సోదాహరణముగా ఓపికగా మాకు అందించుచున్న మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా ! ఈ రోజు కొత్త పాఠం నేర్చుకున్నా !

    "అయహలకు మైత్రి చెల్లు నన్నప్పుడు ‘అ’ అనునది సర్వాచ్చులకు ఉపలక్షణము"

    ఈ సంగతి నా కింత వరకూ ఎఱుక లేదు !
    ధన్యవాదములు !
    మీకూ మిత్రులందరికీ శరన్నవరాత్రుల సందర్భముగా శుభాకాంక్షలు !

    రిప్లయితొలగించండి