4, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -449 (మోదక మన్న సుంతయును)

వారాంతపు సమస్యా పూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
మోదక మన్న సుంతయును
మోదము లేదు గణాధినాధుకున్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

26 కామెంట్‌లు:

  1. పాదముపైననేఁబడుదు పాపవినాశక! పూజలందుమా!
    వేదము నమ్మిగొల్తునయ! విఘ్ననివారక!నీకుఁ బెట్టితిన్
    కాదనకుండగాఁకుడుము గైకొనుమయ్య! వినాయకా,మరే
    మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.

    రిప్లయితొలగించండి
  2. ఖేదము బాసి భక్తులకు, గొల్చిన వారికి మోద మందుగా
    మోదక మన్న ప్రేతిగల మూషిక వాహను పూజ సేయ గా !
    మీదట నేదొ చెర్వులను ముంచగ, ముక్కులు మూయు నట్టి 'ఖ
    ర్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ! ధన్యవాదములు. త్వరపాటు లో జరిగిన పొరపాటు...సరిజేయు చున్నాను.

    ఖేదము బాసి భక్తులకు, కీర్తన జేసిన మోద మందుగా
    మోదక మన్న ప్రేతిగల మూషిక వాహను పూజ సేయ గా !
    మీదట నేదొ చెర్వులను ముంచగ, ముక్కులు మూయు నట్టి 'ఖ
    ర్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    రిప్లయితొలగించండి
  4. మీ భావం బాగుందండి. అభినందనలు.
    మూడో పాదంలో మరి??? కాపీ పేస్ట్ చేయటం మరిచినట్టున్నారు.
    మేము మోదకాలు చెయ్యం. కుడుములు చేస్తాం.కాబట్టి మోదకమంటే ఇష్టం లేదు,మా కుడుములంటేనే ఇష్టమని తేలిగ్గా అనేశాను.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరిపూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    మోదక మిచ్చుచో మిగుల - మోదము నొందును ! భక్త కోటికిన్
    మోదము గల్గజేయు గద - మోహన రూపుడు ,విఘ్నహారి! దా
    మోదరు వద్దనున్న, ఘన - మోహనమై తనరారు చుండు, కౌ
    మోదక మన్న సుంతయును - మోదము లేదు గణాధినాధుకున్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ! ధన్యవాదములు. నిజమే ..మూడవ పాదం లో కూడా పప్పులో కాలేశాను. సరిజేయుచున్నాను..
    స్వయంగా జేసిన మీ కుడుముల నైవేద్య పూరణ బాగుంది.
    కిశోర్జీ ! కౌమోదకముతో మోదక, మోదకములకే ఆమోదము తెలుపుతూ మోదమందే మీ గణపతి పురాణ బాగుంది.
    (కలుషిత జలమును 'ఖర్మోదక' మని ప్రయోగము చేశాను. మాస్టరు గారు ఏమంటారో...)

    ఖేదము బోవ భక్తులట , కీర్తన జేయుచు మోద మందగా
    మోదక మన్న ప్రేతిగల మూషిక వాహను పూజ జేసి య
    మ్మో! దరి నేదొ చెర్వులను ముంచగ, ముక్కులు మూయు నట్టి 'ఖ
    ర్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    రిప్లయితొలగించండి
  7. మోదక ఖాదికిన్ సముదమూషికసాదికి,సుప్రసాదికిన్
    ఆదిసురాళివంద్యునకు,ఆగమవేదికి,మంజువాదికిన్
    నాదవినోదికిన్ కవిగణమ్మునకున్ను'డురాజువర్ణ్యస
    మ్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    [మొదటి పాదం పోతనామాత్యులది]

    రిప్లయితొలగించండి
  8. మోదకమన్న నెంతయును మోదము గల్గు గణాధి నాధుకున్
    పాదుగ నెయ్యి చక్కెరలు పప్పులు మున్నగువన్ని నిప్పు డీ
    మేదిని గల్తియై చనుట - మేలిమి లేని , రుచుల్ గన రాని యిట్టి యీ
    మోదకమన్న సుంతయును మోదము లేదు గణాధి నాధుకున్

    రిప్లయితొలగించండి
  9. పేదల నోరు కొట్టి, ధర పెంచు చుపెద్దలకమ్ము వర్తకుల్.
    బాధల కోర్చుచున్ పరమ భక్తిగ శ్రీ గణ నాధుఁ గొల్చు. ఈ
    బాధిత సజ్జనాళి యగు భక్తులఁ గాంచి తపించె. బాధచే
    మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్:
    ఆదర భక్తిలేదు మరియాదలఁ జూపరు మారినారుగా
    ఏదరి కేగ నెంచెదరొ యీజనసంద్రము బుద్ధిసిద్ధులన్
    చోదన శక్తులన్ మరచి సోలుచు పేరుకు మాత్రమిచ్చు నా
    మోదకమన్న సుంతయును మోదము లేదు గణాధి నాధుకున్!

    రిప్లయితొలగించండి
  11. మోదక హస్తు హస్తమున మోదక ముండును, కాని, యాంధ్రలో
    మోదము మీర లడ్డులను, ముగ్ధుడయెన్, తన చేతి నుంచ లం-
    బోదర మంత పెద్దవి! ప్రమోదముతో రుచి చూచె! నింక నా
    మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    రిప్లయితొలగించండి
  12. మిస్సన గారి పద్యమొక మేలిమి బంగరు పూలసెజ్జ - ప్రా
    తస్సమయాన విచ్చి యరుదైన సువాసన లీను పువ్వులన్
    లెస్సగ గోసి తెన్గు నుడు లింపుగ గూర్చిన తీరు - తల్లి యా
    శీస్సులు బొందగా నలరు - చెప్పగ నాకు ప్రమోద మయ్యెడిన్

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమ:

    వేదము వంటి కావ్యమును వేడ్కగ చెప్పగ వేదవ్యాసుడే
    ఆదిగ పూజలందుకొను ఆగణనాథుడు వ్రాసె నేర్పునన్
    మోదము నొందినాడు తను ముచ్చట గొల్పెడు కావ్యమున్నచో
    మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్!

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ,
    చక్కని ధారతో పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
    కాని కుడుములన్నా, మోదకాలన్నా ఒకటే కదా! ‘కుడుము, ఉండ్రకము, ఉండ్రము, ఉబ్బుకుడుము, మోదకము’ ఇవన్నీ పర్యాయపదాలే. మోదకం సంస్కృతపదం, కుడుము తెలుగు పదం.
    * * * * * *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మందాకిని గారు చెప్పినట్లు మంచి భావంతో పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
    కాని ‘ఖర్మోదకము’ ఎక్కడిదండీ? ‘ఖర్మ" శబ్దమే నిఘంటువులో లేదు. అయినా "ఎవరూ పుట్టించకపోతే పదా లెక్కడనుండి వస్తాయి?" అన్నారు కదా ఘటోత్కచులవారు. అక్కడ ‘భీమోదకము’ అందాం. భయంకరమైన నీరు అనే అర్థంలో ...
    * * * * * * *
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పద్యం చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని ‘కౌమోదము’ ఎక్కడిది? అర్థం ఏమిటి? విష్ణువు గద ‘కౌమోదకి’ ఉంది.
    * * * * * *
    ఊకదంపుడు గారూ,
    చక్కని పూరణ. మంది పద్యం. అభినందనలు.
    అయితే ‘సమ్మోదకము’ ఏ అర్థంలో వాడారు? ‘సన్మోదకము’ అంటే బాగుండేదేమో? చంద్రుని చేత వర్ణింపబడిన మంచి కుడుము అనే అర్థంలో ...
    * * * * * *
    రాజారావు గారూ,
    చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    కాని మూడవపాదంలో గణదోషం. ‘మేలిమి లేని , రుచుల్ గన రాని యిట్టి యీ’ అన్నదానిని ‘మేలిమియున్ రుచు లింత లేని యీ’ అంటే ఎలా ఉంటుంది? లేదా ... ‘మేల్మి రుచుల్ గనరాని యిట్టి యీ’ అన్నా సరే!
    ‘మిస్సన్న’ గారి మీద చెప్పిన పద్యం అమూల్యరత్నం. ధన్యవాదాలు.
    * * * * * * *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    * * * * * * *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘జనసంద్రము’ దుష్టసమాసం కదా! .... ‘జనవార్నిధి’ అయితే ..?
    * * * * * *
    మిస్సన్న గారూ,
    చమత్కారభరితమైన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    * * * * * *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మోదకానందం కంటె కావ్యానందం గొప్పదన్న మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    ‘వేదవ్యాసుడు’ అన్నప్పుడు ‘ద’గురువై గణదోషం వస్తుంది. ‘చెప్పగ వేదవ్యాసుడే’ అన్నచోట ‘చెప్పగ బూనె వ్యాసుడే / చెప్పగ సాగె వ్యాసుడే’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  15. గురువుగారూ,
    సమ్మోదకము - ఆనందదాయకము అన్న అర్ధం లో వాడానండీ..


    కవిగణమ్మునకు - ఉడురాజు - వర్ణ్య సమ్మోదకమన్న -
    కవులకు (వర్ణించటానికి) చంద్రుడు ప్రీతికరమైన వస్తువు -అని అంటే - గణనాధుడికి మోదము లేదు అనే అర్ధం కిట్టించే విఫల ప్రయత్నం చేశాను.

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ధన్యవాదములు.
    మనకు ఇష్టం లేని దానను ఖర్మ అంటాం కదా ..ఖర్మోదకం అని 'సింబాలిక్' గా ఒక ప్రయోగం చేశానంతే.... మీరన్నట్లు "ఎవరూ పుట్టించకపోతే పదా లెక్కడనుండి వస్తాయి?" అయినా తప్పు ప్రయోగం కనుక పండితులు మన్నింతురు గాక !

    రిప్లయితొలగించండి
  17. మాస్టారూ, సవరణకు ధన్యవాదాలు. హనుమచ్చాస్త్రి గారి పద్యం మీద మీ వ్యాఖ్య ననుసరించి - మనం మాట్లాడుకొనే టప్పుడు వాడే "ఖర్మ" అనే పదం "కర్మ" అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడుకలో వచ్చేసింది. అందునా యెప్పుడూ negative connotation లో వాడతామేమో, "ఖ" వత్తి పలకటాని వీలవటంతో ఇంకా సహజంగా అనిపిస్తుంది. మా ఎనిమిదో తరగతి తెలుగు మాష్టారు చెప్పిన పాఠం గుర్తుకొచ్చింది.
    భవదీయుడు,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  18. ఊకదంపుడు గారూ,
    నేనే పొరబడ్డాను. అది ఉడురా‘జ’వర్ణ్య అని చదువుకున్నాను. ఉడురా‘జు’ వర్ణ్య అన్నప్పుడు అన్వయం కుదిరిన విషయాన్ని గమనించలేదు. మన్నించండి!

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    .......... ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ ధన్యవాదాలు.
    రాజారావు గారూ మరీ మునగ చెట్టు నెక్కిం చేస్తున్నారు.
    అంతా గురుకృప.
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  21. మోదకము, కుడుము ఒక్కటేనని తెలుకోలేకపోయాను. మన్నించండి.

    సోదరుడైనవాడినటు చోద్యముఁ మాకగు రీతిగెల్చి,యా
    మోదము పొందుచో; నమరి,ముందుగ పూజల నందువాడిగా
    వేదన గల్గజేయగల విఘ్నము దీర్చుచు మోదమందుచో,
    మోదక మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ..,
    ఇక్కడ నాకు పద్యములు వ్రాయడానికి అనుమతివ్వడమే - మహద్భాగ్యం. మీరు అంత మాటలనరాదు.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  23. వేదము లన్నియున్ చదివి వెంకయ నాయుని ధర్మపత్ని భల్
    మోదము నొందుచున్ కడుపు మొత్తము నిండెడి పాయసమ్ముతో
    బాదర బంది కాగ కడు బందరు లడ్డులు క్రుక్కినంతనే
    మోదక మన్న సుంతయును
    మోదము లేదు గణాధినాధుకున్

    రిప్లయితొలగించండి