18, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -463 (పట్టుబడెను చేఁప)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పట్టుబడెను చేఁప తుట్టతుదకు!
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. నా పూరణ ....

    ద్రుపదరాజు పెట్టె దుహిత పెండ్లికి మత్స్య
    యంత్రభేదనా నియమము; రాజ
    వరులు విఫలు లైరి; నరుని బాణమునకు
    పట్టుబడెను చేఁప తుట్టుతుదకు.

    రిప్లయితొలగించండి
  2. ఆగని పని నాప నాగని దోపిడి
    'గాలి' వాటము గని గాల మేయ
    ఎదురు గాలి దగిలి ఏవైపు పోలేక
    పట్టుబడెను చేఁప తుట్టతుదకు!

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ ! మొట్టమొదట మీ పూరణం చూడటం ఆనందం కలిగించింది .
    నరుని చేత మత్స్య యంత్రాన్ని భేదింప జేశారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ ఎన్నినాళ్ళకు మీ ప్రథమ పూరణ!

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! నాకెన్నాళ్ళనుండో కోరిక !
    సమస్యతో పాటూ మీ పూరణ కూడా చూడాలని !
    ఇన్నాళ్ళకు నెఱవేరింది !
    ధన్యవాదములు !
    మామూలు చేపను గాకుండా అర్జునుడు పట్టిన చేపను పట్టారు !
    అభినందనలు !

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శంకరార్యుల స్ఫూర్తితో :

    01)
    _________________________________

    అట్టె విఫలురైరి - జట్టుగ నృపులెల్ల
    కొట్టి మత్స్యము నట - పట్టు కొనగ !
    ఇట్టె కొట్టి నంత - నట్టువరాయడు
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    నట్టువరాయడు = నాట్య చక్రవర్తి = బృహన్నల (అర్జునుడు)

    రిప్లయితొలగించండి
  7. గుట్టుగా ధనంబు కోట్లను భూమిని
    చీలిచి గొనినట్టి గాలి కబురు
    తెలిసి పట్టిరతని వలవేసి పాలకుల్.
    పట్టుబడెను చేఁప తుట్టతుదకు!

    రిప్లయితొలగించండి
  8. వేగ పోయి రమ్ము యాగమ్ము నకు బల-
    రామ కృష్ణులఁ గొని రాగ మగధ
    నాకు మృత్యు వనెడు పోకిరిఁ జంపుదు
    పట్టుబడెను చేఁప తుట్టుతుదకు

    రిప్లయితొలగించండి
  9. శాస్త్రిగారి స్ఫూర్తితో :

    చెట్లు, పుట్టలు ,గుట్టలు , గట్టులు(కొండలు)కొల్లగొట్టిన
    గాలిగాడు :

    02)
    _________________________________

    గట్టులన్ని యెంతొ - గుట్టుగ దొలగించె
    చెట్టు పుట్ట లన్ని - బిట్టు గాను !
    చిట్ట చివరి కేమొ - ఱట్టుచేయ సిబియై
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్నమహాశయుల స్ఫూర్తితో :

    బలరామ కృష్ణులను మగధకు రమ్మని ఆహ్వానిస్తూ కంసుడు :

    03)
    _________________________________

    ఇట్టె పోయి వారి - నిష్టి జూడ, బిలువు
    ఒంటిపోగు తోడ, - కొంటె వాణ్ణి !
    కిట్టికోల చేత - మట్టు బెట్టెద వారి
    పట్టు వడు(డె)ను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    ఇష్టి = యాగము
    ఒంటిపోగు = బలరాముడు
    కొంటెవాడు =తుంటరి(శ్రీకృష్ణుడు)
    కిట్టికోల = ఇఱికించుటకుఁగా నొకతట్టు కొనలఁజేర్చికట్టి చిన్న కోలలతో నేర్పఱపఁబడిన సాధనము(మాయోపాయము)

    రిప్లయితొలగించండి
  11. భార్యా భర్తలు సినిమాలో నాగేశ్వరరావు వేశ్యాలోలుడు !
    పంతులమ్మయిన కృష్ణ కుమారి వెంటబడితే ఛీత్కరిస్తుంది !
    ఆమె నెలాగైనా సాధించాలని బలవంతంగా పెద్దల నొప్పించి
    పెళ్ళి చేసుకుంటాడు !
    తొలిరేయి
    "నా మనసుతో నీకు పనేమిటి ఈ శరీరమేగదా నీక్కావలసింది తీసుకో"
    మని నిష్ఠూర మాడిన నిస్సహాయ యైన భార్యను
    "నీ మనసు గెలిచే వరకూ నిన్ను ముట్టుకో"నని
    మాటిస్తాడు నాగ్గాడు ! ఒక వంక చేప చేతికి చిక్కిందని ఆనందిస్తూనే !
    అయ్యా అదీ సంగతి :

    భార్యా భర్తలు సినిమాలో నాగేశ్వరరావు స్వగతం :

    04)
    _________________________________

    పాడు పనుల జేసి - పాడైతినని నన్ను
    పావని యగు నామె - పలుకు లాడ
    పాణిబట్టి యామె - వలపు గోరితి నేను
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    పలుకు = నింద
    పాణిబట్టి = కరగ్రహణము( పరిణయము)

    రిప్లయితొలగించండి
  12. మత్స్యగంధిని మోహించి యోజన గంధిగా మార్చిన పరాశర మహర్షి :

    05)
    _________________________________

    పడవ నడుపు పల్లె - పడతిని ప్రేమించి
    పరవశంబు నొంది - పడతి బొంద
    పల్లె పడుచు జేసె - పరిమళ భరితంబు !
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  13. తన వలపును భీమసేనుడు నిరాకరిస్తే
    కుంతినాశ్రయించి తన పంతం నెరవేర్చుకున్న హిడింబ :

    06)
    _________________________________

    ప్రథమ వీక్షణమున - వలపుకు లోనయి
    అన్నను పరిమార్చ - ననిలసుతుడు
    కుంతి చెంత జేరి - యింతికా గోరిన
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    యింతి = భార్య

    రిప్లయితొలగించండి
  14. గుట్ట పుట్ట నేల మట్టంబు పట్టించి
    పట్టు బట్టి మంత్రి పదవి బట్టె
    సూర్య పట్టి గట్టి చుట్ట మై నెట్టంగ
    పట్టు బడెను చేప తుట్ట తుదకు!!!

    (సూర్య పట్టి= శనేశ్వరుడు)
    (గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్ యితివృత్తము )

    రిప్లయితొలగించండి
  15. పీతాంబరధరా ! సూర్య పట్టి గట్టి చుట్ట మై నెట్టంగ ! భేష్ !

    బలరాముని కిష్టం లేకపోయినా :

    07)
    _________________________________

    బావ కృష్ణు కరుణ - బైరాగిగా మారి
    బబ్రు వాహను పిత - భద్ర కొఱకు
    పరిణయంబు నాడె - బలరాము చెల్లెల్ని!
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    భద్ర = సుభద్ర

    రిప్లయితొలగించండి
  16. బలరాముని కిష్టం లేకపోయినా :

    ప్రతీకారం తీర్చుకొనుటకు మరొక జన్మ యెత్తిన అంబ :

    08)
    _________________________________

    పడతి హింస బెట్టు - పాపిని పరిమార్చ
    పరమ శివుని వేడి - వరము బొంది
    భీష్ము గూల్చె గాదె - వీర వనిత యంబ
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  17. వేలాది సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి
    మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి ఒప్పించి
    గంగను దివి నుండి భువికి దింపిన భగీరథ ప్రయత్నం !

    09)
    _________________________________

    క్షీర మిలకు దిగ , భ - గీరథు డానాడు
    బ్రహ్మ దేవు ,శివుని - భజన జేసి
    పెద్ద లందు కలిపె - పితృ దేవతల నెల్ల !
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  18. గురువు గారు,
    పీతాంబర్ గారి పూరణలో "సూర్య పట్టి" సాధు సమాసమేనా?

    రిప్లయితొలగించండి
  19. జిగురు సత్యనారాయణ గారూ,
    అసాధువే. ధన్యవాదాలు.
    అక్కడ ‘సూర్యు పట్టి’ లేదా ‘సూరి పట్టి’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  20. పద్మవ్యూహ భేదనలో పాండవుల నడ్డగించి అభిమన్య కుమారు
    మృతికి కారణమైన సైంధవుణ్ణి సంహరించిన అర్జునుడు :

    10)
    _________________________________

    సుతుని మృతిని, యనిని - సులభమ్ము జేసిన
    పాతకుణ్ణి దునుమ - ప్రతిన జేసి
    సైంధవుణ్ణి జంపె - శతముఖసుతు డంత !
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    శతముఖసుతుడు = అర్జునుడు

    రిప్లయితొలగించండి
  21. ' నేను , నాది ' యనుచు నీల్గు నహంకారి
    మనిన యంత కాల మవని యందు
    కాల మిచట దీర కాలుని చేత దా
    బట్టు వడె(డు)ను 'చేప' తుట్ట తుదకు

    రిప్లయితొలగించండి
  22. కట్టుకున్న వాడే కాదన్నా పట్టుదలతో మళ్ళీ పతిని జేరిన శకుంతల :

    11)
    _________________________________

    కణ్వు నాశ్ర మమున - గాంధర్వ విధి జేసి
    పడతి నెరుగ ననుచు - పలుక విభుడు
    భరతు మాత మరల - పతిని జేరి వరలె !
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  23. ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన విధానం,
    "పాకి" దేశమందు పట్టదలంచిన
    చేప పైకిఁ దేలె, చీమ చిటుకు
    పొటుకుమనక పొంచి పొరిగొనంగ
    పట్టుబడెను చేఁప తుట్టతుదకు!

    రిప్లయితొలగించండి
  24. సీత జాడ కోసం
    అరణ్యాలూ మైదానాలూ, గుహలూ , గుట్టలూ,కొండలూ , కోనలూ
    గాలించిన హనుమ చిట్ట చివరకు :

    12)
    _________________________________

    పడతి సీత గొనెను - పాపి రావణు డంత !
    పరిఖ దాటి , లంక - పవన సుతుడు
    పావనియగు సీత - పదముల జేరెను !
    పట్టు వడెను చేప - తుట్ట తుదకు !
    _________________________________
    పరిఖ = సముద్రము

    రిప్లయితొలగించండి
  25. 'ఎట్ట కేలకు చేప వలకు చిక్కింది 'అనే నానుడి లోకంలో వాచ్యార్ధం లో గాకుండా వ్యంగ్యార్ధంలో ప్రచారం లో ఉంది . '(మోసంచేసి )తప్పించు కు తిరుగుతూ తుదకు దొరికి పోవడం 'అనే అర్ధం లో ననుకుంటాను .

    రిప్లయితొలగించండి
  26. ప్రళయ జలములందు ప్రభువులీల,జగత్తు
    పట్టుబడెను; చేప తుట్టతుదకు
    సత్యవంతునొకని, చల్లగ చూచెను
    మరల సృష్టి మొదలు మహిని నాడు

    రిప్లయితొలగించండి
  27. 'ఎట్ట కేలకు చేప వలకు చిక్కింది 'అనే నానుడి లోకంలో వ్యంగ్యార్ధం
    లోనే గాదు, కష్టానికీ , ఓరిమికీ , పట్టుదలకూ కూడా ప్రతీకయే !

    రిప్లయితొలగించండి
  28. మత్స్య గంధి నేను మన్నించి నామనవి
    రట్టు చేయ వలదు పట్ట పగలు
    మంచు తెరలు గప్పి మహిపైన నినుమార్తు
    పట్టు బడెను చేప తుట్ట తుదకు !

    రిప్లయితొలగించండి
  29. బెట్టు చేయ వలదు పట్టు కొనెద నిన్ను
    చెట్టు పుట్ట లెక్కి గట్లు దాటి
    రట్టు చేయ బోకు రాణిగా నినుగొల్తు
    పట్టు బడెను చేప తుట్ట తుదకు !

    రిప్లయితొలగించండి
  30. అందరి పూరణలు మనోహరంగా ఉన్నాయి. ధన్యవాదాలు. నిన్న దినమంతా తీరికలేని పనులవల్ల మీ మీ పూరణలను సమీక్షించలేక పోయాను. ఈ రోజు సాయంత్రం వరకు నా వ్యాఖ్యలను ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  31. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘గాలి’ చేపను పట్టిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణల ‘ఫిడేల్ రాగాల డజన్’ ఆద్యంతం అలరించింది. అభినందనలు, ధన్యవాదాలు.
    నా స్ఫూర్తితో వ్రాసినట్టు చెప్పినా నా పూరణకంటె ప్రశస్తంగా ఉంది మీ మొదటి పూరణ.
    గోలి వారి స్ఫూర్తితో వ్రాసిన రెండవ పూరణ బాగుంది. మూడవపాదంలో ‘ఱట్టయ్యె సిబియైకి’ అంటే ఇంకా బాగుంటుం దని నా సలహా
    మిస్సన్న గారి స్ఫూర్తితో వ్రాసిన మూడవ పూరణ ముచ్చటగా ఉంది. ‘ఒంటిపోగు’ పదప్రయోగం అలరించింది.
    భార్యాభర్తలు చిత్రం స్ఫూర్తితీ నాలుగవ పూరణ అదిరింది. అయినా పట్టుబడ్డ చేప చాలా కాలంవరకు ‘సతాయించింది’ పాపం!
    చేపలు పట్టే పిల్లనే పట్టిన ఐదవ పూరణ బాగుంది.
    ఆరవ పూరణలో భీముణ్ణే చేపను చేసారు. భేష్!
    ఏడవ పూరణ చక్కగా ఉంది. రెండవపాదాన్ని ‘ఫల్గుణుండు చనె సుభద్ర కొఱకు’ అంటే ఎలా ఉంటుంది?
    ఎనిమిదవ పూరణలో ఏడవ పూరణకు చెందిన ‘బలరాముని కిష్టం లేకపోయినా’ అనేది జంపయింది :-) అంబ వృత్తాంతంతో ఎనిమిదవ పూరణ అద్భుతంగా కుదిరింది.
    తొమ్మిదవ పూరణలో భగీరథప్రయత్నం చేసి ‘చేప’ను పట్టారు. బాగుంది.
    సైంధవుణ్ణి పట్టిన పదవ పూరణ బాగుంది. కాని ‘శతముఖ ...’ కాదు, ‘శతమఖ...’.
    అభిజ్ఞానశాకుంతలాన్ని ప్రస్తావించిన మీ పదకొండవ పూరణ చక్కగా ఉంది.
    పన్నెండవ పూరణ కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రులు మన్నించాలి. ఉదయం వసంత కిశోర్ గారి పూరణపై వ్యాఖ్యానించగానే ‘పవర్ కట్’! మళ్ళీ ఇంతకు ముందే వచ్చింది. ఆలస్యానికి మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  33. చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణ చేసి కవిమిత్రులను అలరించారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    వృత్యనుప్రాస శోభితమైన మీ పూరణ ఉత్తమంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *
    రాజారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘మోసం చేసే ఉద్దేశంతో ఇతరులను లొంగదీసుకొనడం’ అనే వ్యంగ్యార్థం కూడా ఉంది.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీరు ‘మత్స్యావతారాన్నే’ పట్టారే! బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండవ పూరణ రెండవ పాదంలో ‘చెట్టు’ ను ‘చెట్లు’ అంటే ప్రాసయతి సరిపోతుంది.

    రిప్లయితొలగించండి