13, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -458 (రణము హర్షంబు గూర్చు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

42 కామెంట్‌లు:

 1. పండిత నేమాని గారి పూరణ ...

  సార సాహిత్య సత్క్రియా తోరణమ్ము
  కమ్ర రచనావివర్ధన కారణమ్ము
  శంకరానంద సత్కృతి, శంకరాభ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ

  రిప్లయితొలగించండి
 2. ఎల్ల వేళల జీవున కిలను రణమె
  దైవ నామము జపియించఁ దరుణమెద్ది?
  పలుకు మోయి!చేయవలయు భక్తిని స్మ
  రణము, హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ

  రిప్లయితొలగించండి
 3. ధనము ధాన్యమ్ము లెన్నున్న మనము నందు
  శాంతి కలుగదు జీవికి. భ్రాంతి బాపి
  సన్నుతంబుగ స్థిర మతి నున్న హరి చ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.

  రిప్లయితొలగించండి
 4. తెలుగు నందున శ్రద్ధను గలిగి యుండి
  పద్యమన్నది 'శంకరాభరణ' మందు
  వ్రాయ నేర్వగ, పఠియించ బాల వ్యాక
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.

  రిప్లయితొలగించండి
 5. బాధ్యత గల పౌరునిగ సమాజ మందొ
  కటయిన సమస్య సరిచేయ గల్గు పరి హ
  రణము హర్షందు గూర్చు విశ్రాంతి వేళ
  మనము జీవించు నది జన మధ్య మందు

  రిప్లయితొలగించండి
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  రమణి దరిలేని వేళల - రమ్య మైన
  రాగ భావన మనమున - రాజు కొనిన
  రహిత మొనర్చు వేదన, - రమణి సంస్మ
  రణము ! హర్షంబు గూర్చు వి - శ్రాంతి వేళ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 7. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
  రైతులకు సరైన కాలమునకు ఎరువులు అందడంలేదు

  పౌరునిగ సేవ జేసిన పండితుల, భ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ,
  కష్ట జీవులకు సరైన కాలమున, కి
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ
  ( కిరణము= సహాయము)

  రిప్లయితొలగించండి
 8. టైటు ప్యాంట్లపై చొక్కాలు టైలు గట్టి
  టక్కుఁ జేయ చెమట కారి చిక్కు గలుగు
  పంచె లుంగీలఁ బోలెడి వస్త్రముల ధ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!

  రిప్లయితొలగించండి
 9. వాయులీనశ్రవణముయు, హాయి నొసగు
  హాస్యరసపుస్తకపఠనమంతటన్,చ
  తుర్ధపాదస్ఫురితవిరుద్ధార్ధసంస్క
  రణము(?) హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.

  రిప్లయితొలగించండి
 10. తిని పనిముగించి రాతిరి తీరుబాటు
  గలుగ గూర్చుండి పోట్లాడి దంపతులు ము
  దము దనర నిద్దరొక టౌట తరచి చూడ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతివేళ

  రిప్లయితొలగించండి
 11. రెండవ పాదం లో ' గలుగ ' బదులు ' దగిలి ' యని చదువ గలరు.

  రిప్లయితొలగించండి
 12. క్షణము తీరిక లేనట్టి జనులకిపుడు
  చింతయేగాని నిశ్చింత సుంతలేదు
  రామ భద్రుడౌ జానకీ రమణుని స్మ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!!!

  రిప్లయితొలగించండి
 13. నేమాని గారి పద్యము
  సామాన్య జనాల కైన సరళ గ్రాహ్యం
  బై మనుట జేసి పండిత
  నామం బన్వర్ధ మయ్యె ననగా నొప్పున్

  రిప్లయితొలగించండి
 14. సార సాహిత్య సంసృతీసంప్రదాయ
  సహిత రచితకావ్య దుహితృ మహిత పద్య
  పర్వ పఠనమ్ము, మననమ్ము వలన ప్రతి చ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ

  పండిత నేమాని తాతగారి ఆశీస్సులతో...

  - "అవధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ

  రిప్లయితొలగించండి
 15. పండిత నేమాని గారి వ్యాఖ్య .....

  కవి మిత్రులారా శుభాకాంక్షలు.

  రణసంబంధ సమస్యయే కవి హృదారామమ్ములన్ పద్యతో
  రణరాజిన్ వెలుగొంద జేసె బహుధా రాజన్మనోభావ భూ
  షణముల్ దాల్చెను సత్కవిప్రకర భాషాపాటవోత్సాహమే
  గణనీయంబుగ వర్తిలెన్ బహు శుభాకాంక్షల్ కవి శ్రేణికిన్

  రిప్లయితొలగించండి
 16. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, సెప్టెంబర్ 13, 2011 7:36:00 PM

  విమల చిత్తులు, బుధజన వినుత మతులు,
  సకల ధర్మార్థ శాస్త్ర విశారదులు, సు
  భాషితంబుల జెప్పెడు పండితాద
  రణము,హర్షంబు గూర్చు విశ్రాంతివేళ.

  పండితాదరణము = పండితులయొక్క ఆదరణము

  రిప్లయితొలగించండి
 17. వరుని బంధువులము మేము తరలినాము
  దూరభారమ్ములను సైచి తొందరపడి
  యలసితిమి కాని మా మరదలి చమత్క
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ.
  (చమత్కరణము = చమత్కారము)

  రిప్లయితొలగించండి
 18. క్రాంతి పధమున నడచిన బ్రాంతి తొలగు
  ఇహ పరముల నొనరించు నహరహమ్ము
  దైవ మార్గము పయనింప శివుని స్మ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ !

  రిప్లయితొలగించండి
 19. శంకరార్యా !మీ పూరణము 'చమత్కారయుతం' గా నున్నది.
  కవి మిత్రుల పూరణములు చదువ 'హర్షంబు గూర్చు' చున్నవి.

  రిప్లయితొలగించండి
 20. కనక సింహాసనాసీన ఘనుల కిపుడు
  కటిక నేలపై బవళిoచు గతులు బట్టె
  పతన మైనట్టి తమగతవైభవస్ఫు
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ!

  రిప్లయితొలగించండి
 21. వంక దొరకని శంకరా భరణ మందు
  తోటి మిత్రుల విబుధుల సాటి లేని
  భావ సాహిత్య సంపదా భరిత పద్య
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ

  రిప్లయితొలగించండి
 22. చిక్కు ముడుల పదమ్ముల జేర్చి వాని
  పూరణము చేయుడీ యన బుద్ధికుశలు
  రాసమస్యలబూరింప నమరెడి వివ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ
  --------

  రిప్లయితొలగించండి
 23. పంచు కొనగలి గినమంచి బ్లాగు మనది
  వంచ నలులేవ ననంతట మంచి యేను
  పంచు చుండిరి యందరు భ్రాత ప్రేమ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ !

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని గారూ,
  మీ పూరణతో ‘శంకరాభరణం’ శోభ ద్విగుణీకృతమయింది. ధన్యవాదాలు.
  *
  మందాకిని గారూ,
  మీ స్మరణభక్తి పూరణ అచ్భుతంగా ఉంది. అభినందనలు.
  ‘భక్తిని స్మ’ అన్నప్పుడు ‘ని’ లఘువుగానే ఉండి గణదోషం వస్తుంది. ‘భక్తితో స్మ’ అంటే సరి!
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  మనోహరమైన పూరణ. హర్షాన్ని కూర్చడంలో హరిచరణమును మించిన దేమున్నది? చక్కని భావన. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  పద్యం వ్రాయడానికి వ్యాకరణజ్ఞానం అవసరమన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  ‘బాలవ్యాక/రణము’ అన్నప్పుడు ‘ల’ గురువై గణదోషం వస్తుంది. ‘పఠియించవలెను వ్యాక/రణము’ అందాం.
  *
  రాజారావు గారూ,
  సామాజికస్పృహతో చక్కని పూరణ నిచ్చారు. బాగుంది. అభినందనలు.
  మొదటి పాదంలో ‘బా-మా’లకు యతి చెల్లదు. ‘సమాజ మందొ’ అనేదాన్ని ‘ప్రపంచ మందొ’ అందాం.
  ప్రణయకలహాన్ని రణంగా మార్చిన మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ విరహవేదనా భరితమైన పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరన నిర్దోషంగా ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
  కాని కిరణమునకు సహాయము అనే అర్థం ఎక్కడిది?
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  పంచె, లుంగీల ప్రయోజనాన్ని ఉదాత్తంగా పూరణలో వివరించారు. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  ‘చతుర్ధపాదస్ఫురితవిరుద్ధార్ధసంస్కరణము’ చక్కని ప్రయోగం. మంచి పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో ‘శ్రవణమును’ అంటే బాగుంటుంది.
  *
  మంద పీతాంబర్ గారూ,
  అద్భుతంగా ఉన్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
  *
  "అవధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం. ధన్యవాదాలు.
  నిజమే! పండిత నేమాని వారి రామాయణ కావ్యంలో ప్రతిపద్యమూ, పద్యంలో ప్రతిచరణమూ హర్షప్రదాలే. చక్కగా సెలవిచ్చారు. మంచి పూరణ. అభినందనలు.
  *
  పండిత నేమాని గారూ,
  కవిమిత్రు లందరి పక్షాన మీకు ధన్యవాదాలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. భాద్ర పద శుధ్ధ పూర్ణిమ పర్వ మందు
  సరస సారస్వతా మధూక రస సార
  వ్యాఖ్య పద్యాల శంకరాఖ్య వివర సవ
  రణము హర్షంబు గూర్చువిశ్రాంత వేళ

  రిప్లయితొలగించండి
 26. రాజేశ్వరక్కయ్యా,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో 2వ పాదంలో గణదోషం, మూడవ పాదంలో యతిదోషం. నా సవరణ ...
  ఇహ పర(మ్ము)ల నొనరించు నహరహమ్ము
  దైవ మార్గము పయనింప (దే)వుని స్మ
  రెండవ పూరణలో రెండవ పాదంలో గణదోషం. ‘వంచనలు లేని దంతట’ అంటే సరి. మూడవ పాదంలో భ్రాతృప్రేమ అన్నప్పుడూ గణదోషం. ‘తృ’ గురువౌతుంది. నా సవరణ... ‘పంచు వారలు భ్రాతలు వారి పద్య/ రణము ...’ అందామా?
  *
  మిస్సన్న గారూ,
  మీ పద్యరణము చాలా బాగుంది. అభినందనలు.
  *
  కమనీయం గారూ,
  మహదానందంగా ఉంది. కమనీయమైన ‘వివరణము’తో మీ పూరణ రమణీయంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. రాజారావు గారూ,
  నా ‘సవరణము’ హర్షాన్నే ఇస్తున్నదన్న మాట! నన్ను రంధ్రాన్వేషి అని, ఎంత కష్టపడి వ్రాసినా ఏదో ఒక తప్పు వెదుకుతుంటాడు అని తిట్టుకొనడం లేదన్నమాట :-)
  మంచి పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీగురుభ్యోనమ:

  పనుల వత్తిళ్లకున్ జిక్కి బ్రతుకునీడ్చు
  కార్మికులకును చెమటోడ్చు కర్షకులకు
  శరదృతువునందు చల్లని సాదు శశి కి
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా ! ధన్యవాదములు !
  మిత్రుల పూరణలు ముచ్చటగా నున్నవి !

  మనం సినిమాల్లో చూచి ఆనందించేది తారల మారువేషాన్నే గదా !

  02)
  _________________________________

  రంగు రంగుల రంగులు - రాసుకొనుచు (makeup)
  రక రకములైన జడలతో - రమ్యమొలుక(hair styles)
  రాగములతోడి నాట్యమ్ము - రంజకముగ(dances/duets)
  తళుకు బెళుకుల నొలికెడి - తార సంవ
  రణము హర్షంబు గూర్చు వి - శ్రాంతి వేళ !
  _________________________________
  తార = నటి/నటుడు
  సంవరణము = మారువేషము

  రిప్లయితొలగించండి
 30. 03)
  _________________________________

  రమ్య చరితుడు రాముడు - సౌమ్యశీలి
  రక్ష సేయును భక్తుల - "రామ"యనిన !
  రామ నామ మహిమమున - రట్టు సంహ
  రణము, హర్షంబు గూర్చు వి - శ్రాంతి వేళ !
  _________________________________
  రట్టు సంహరణము = కష్టాలనుండి గట్టెక్కడం

  రిప్లయితొలగించండి
 31. అమిత హర్షము, శాశ్వత విశ్రాంతి :

  04)
  _________________________________

  కాలుసేతులు పడిపోయి - కదల లేక
  కన్న బిడ్డకు , భార్యకు - కాని నాడు !
  కడకు ,ప్రార్థించ కాలుడే - కరుణ జూప
  కాల గర్భాన జేర్చగా - గల ,మహా మ
  రణము, హర్షంబు గూర్చు! వి - శ్రాంతి వేళ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 32. వృద్ధాప్య పింఛను :

  05)
  _________________________________

  దినము గడచుటె ,కష్టమై - దిగులు తోడ
  దిక్కులేనట్టి వారికి - దిక్కు యనగ
  దేవుడే పంపు భృతియది - దీనులకు , భ
  రణము, హర్షంబు గూర్చు వి - శ్రాంతి వేళ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 33. శాశ్వత విశ్రాంతిని పొందిన పిదప :

  06)
  _________________________________

  సాధు సజ్జన చెలిమియే - మోదమిచ్చు!
  శారదా మాత కరుణయే - శాంతినిచ్చు !
  శంకరుని పూజ , పుణ్యమె - శాశ్వతాభ
  రణము! హర్షంబు గూర్చు!వి - శ్రాంతి వేళ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 34. మన శంకరాభరణము :

  07)
  _________________________________

  సాటి మిత్రులతో గూడి - సరస మైన
  శంకరార్యుని గరుణను - చక్క నైన
  పద్యముల వ్రాయ నుంకించు - వారి పాలి
  శంకలను దీర్చు నెలవిదె- శంకరాభ
  రణము! హర్షంబు గూర్చు వి - శ్రాంతి వేళ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 35. శ్రీ గురుభ్యో నమః

  నేను కూడా శ్రీ పండిత నేమాని వారి పంథా లోనే,

  స్వాదు కవితలు వెదజల్ల సౌరభమ్ము
  సరస సల్లాప చతురత సౌరు మీఱ
  శంకరార్యులు సృజియించు శంకరాభ
  రణము హర్షంబు గూర్చు విశ్రాంతి వేళ !

  రిప్లయితొలగించండి
 36. మిత్రుల పూరణలు చాలా ఆనందాన్ని కలుగ చేస్తున్నాయి.చిరంజీవి అవధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మకి తాతగారి ఆశీస్సుల బలము పుష్కలముగా ఉంది.తాతగారి వలె చక్కని కావ్య రచనా యోగము మనుమనికి కూడా కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 37. Ayyaa! Doctor Kamaneeyam Garu. Namaste. Kindly indicate your contact address and phone Numbers. Pandita Nemani 0891-2565944
  Mobile:94402 33175

  రిప్లయితొలగించండి
 38. వాని సేమంబు లడగదు గాని వార
  కాంతకు విటుఁ డొ సంగెడి కాంచనాభ
  రణము హర్షంబు గూర్చు;; విశ్రాంతి వేళ
  సన్న జాజులు ముడిచిన జాయఁ గూడు,
  వలదు వలదు వేశ్యా సంగ మిలను చంద్ర!

  రిప్లయితొలగించండి
 39. శ్రీపతి శాస్త్రి గారూ,
  ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీరు ఇప్పుడు పంపిన ఆరు పూరణలూ వైవిధ్యంగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
  ఏడవ పూరణ కోసం ప్రత్యేక ధన్యవాదాలు.
  ఐదవ పూరణలో ‘దిక్కు + అనగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘దిక్కనంగ’ అంటే సరి!
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  చక్కని పూరణ. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
  అద్భుతమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి