28, సెప్టెంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -475 (నిగమము పఠియించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.
ఈ సమస్యను సూచించిన
నేదునూరి రాజేశ్వరి గారికి
ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. 'నిగమశర్మ' చెడిన విధము....

    వగలను జూపెడు సానికి
    నగలను తానిచ్చి వగను నాన్నకు నిచ్చెన్
    తెగ బాధ పెట్టె అమ్మను
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి పూరణ ....

    వెగటయ్యె ధర్మ సంస్కృతి
    వగకత్తెల మోజులోన భ్రష్ఠుండయ్యెన్
    తగ నిగమశర్మ యకటా!
    నిగమము పఠియించి ధర్మ నిష్ఠత విడిచెన్

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘సానికి నగ, నాన్నకు వగ’ బాగుందండీ మీ పూరణ. అభినందనలు!
    *******************************
    పండిత నేమాని గారూ,
    మీరూ నిగమశర్మనే ఆశ్రయించారు. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

    భగవంతుడైన రాముని
    పగవానిగనెంచి వాని భార్యను చెఱిచెన్
    పగగొని, కంజుని మనుమడు (రావణుడు)
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్

    రిప్లయితొలగించండి
  5. నా పూరణ .....

    తగ దైవచింతనను తొల
    గగ జేసెడి మార్క్సు డాసుకాపిటలను పే
    రగు వామపక్షవాదుల
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    చేతబడులనుచూ చిన్నారులను, పగవారిని కడతేర్చు వారి
    ---------
    జగమందున పన్నగములు
    భగవంతుని నామ జపము పగవానిని క్రిం
    దగుటకు జేయునులే, తగ
    నిగమము పఠియించి, దర్మనిష్ఠత విడిచెన్|

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, సెప్టెంబర్ 28, 2011 12:26:00 PM

    పగలూ రేయని జూడక
    నిగమము పఠియించి ధర్మ నిష్ఠత, విడిచెన్
    పగలరిషడ్వర్గంబుల,
    జగమేలెడి విభుని జేర స్థిరముగ మదిలోన్.

    రిప్లయితొలగించండి
  8. చపలచిత్తుడైన ఓ భక్తుడు:

    వగలాడొక్కతె పూనియె
    వగల,హొయల,మరులజూపి వ్యామోహింపన్
    జగపతిసేవవిడచి, దా
    ని-గమము పఠియించి ధర్మ నిష్ఠత విడిచెన్.

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, సెప్టెంబర్ 28, 2011 1:55:00 PM

    జగదాధారంబగు నా
    జగదాంబను మరచి, కామసామ్రాజ్యముకై
    సొగసులనెరవేసిన సా
    ని, గమము పఠియించి ధర్మ నిష్ఠత విడిచెన్.

    రిప్లయితొలగించండి
  10. భగవంతునిబిడ్డననుచు
    నిగమము పఠియించి, దర్మ నిష్ఠత విడిచెన్ |
    పగటి గలలు గని దిరుగగ
    జగనుకు జుక్కలనుగాంచ, జగతిని మడిచెన్|
    ( జగతి = జగతి పబ్లికేషన్)

    రిప్లయితొలగించండి
  11. అందరికీ అభినందనలు.
    సంపత్ కుమార్ శాస్త్రి గరూ - జగదాంబ కాదు - జగత్ + అంబ = జగదంబ అని వాడాలి కదా.

    ఆదిభట్ల వారూ -- వాని భార్యను చెరిచెన్ "చెరిచెన్" అనే భావము సరిపోదు. మారిస్తే బాగుంతుందేమో.
    అలాగే: కంజుని మనుమడు కాదు - కంజజు మనుమడు.
    నేమాని సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  12. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    పూరణకు మంచి విషయాన్నే ఎన్నుకున్నారు. అభినందనలు.
    ‘చెఱిచెన్, కంజుని’ శబ్దాలను తప్పుగా ప్రయోగించారు. నా సవరణలతో మీ పద్యం ...
    భగవంతుడైన రాముని
    పగవానిగనెంచి వాని భార్యను (బట్టెన్)
    పగగొని, కంజజు మనుమడు
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్
    ***********************************************************
    వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయమే. అయితే మీ వివరణకు, పూరణకు ‘లింక్’ తప్పినట్లుగా తోస్తున్నది. ‘పన్నగములు" ..? మీ ఉద్దేశం ‘పన్నాగములా’?
    మీ రెండవ పూరణ నిర్దోషంగా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ***********************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    సంతోషం!
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పగ లరిషడ్వర్గంబుల’ అన్నారు. ఆరుగురు శత్రువులలో పగ (మాత్సర్యము) ఉంది కదా. ఇలా వ్రాస్తే ‘డేంజరపాయం’ కదా :-) అక్కడ ‘తగ నరిషడ్వర్గంబుల’ అందాం.
    రెండవ పూరణలో నేమాని వారు చెప్పినట్లు అది ‘జగదంబ’. విశాఖపట్నం ‘జగదాంబ సెంటర్’ పుణ్యాన అందరికీ అలవాటై పోయింది.
    ***********************************************************
    ఊకదంపుడు గారూ,
    విప్రనారాయణను గుర్తుకు తెచ్చారు. చక్కని పూరణ. మంచి విరుపు. బాగుంది. అభినందనలు.
    ‘వగలాడి + ఒక్కతె’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘వగలాడి యొకతె’ అందాం.
    **********************************************************
    పండిత నేమాని గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమ: శ్రీలలితాపరమేస్వర్యైనమ:

    గురువర్యులు శ్ర్రీ శంకరయ్యగారికి,శ్రీ నేమానివారికి, శ్రీ చింతా రామకృష్ణగారికి, కవిమిత్రులందరికి దసరా శుభాకాంక్షలు

    సుగతుల్ కలుగగ నుడివెను
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత,విడిచెన్
    వగచక మోహము, వేదము
    సుగుణముల నొసగ సూనృత మిదియే

    సుగతుల్ = సద్గతులు

    రిప్లయితొలగించండి
  14. కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....

    మీరు చేసిన సవరణకు ధన్యవాదం. దయచేసి ఈ వ్యాఖ్యను శంకరాభరణంలో వేయండి

    రిప్లయితొలగించండి
  15. కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....

    నాదో సందేహం. దయచేసి చెప్పండి
    బ్రహ్మను కంజజుడు, కంజుడు అని కూడా అంటారు కదా. మరి కంజుడు అనే మాటను గణనకు తీసికొన్నట్లైన కంజుని అని వ్రాయటం తప్పవుతుందా??
    రాముడు - రాముని, భీముడు - భీముని, తమ్ముడు - తమ్ముని, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అనే పద్యం లో లాగ కంజుని మనుమడు అని వ్రాసేసేను. దయచేసి వివరం తెలియచెయ్యండి.

    రిప్లయితొలగించండి
  16. వెంకట రాజారావు, లక్కాకుల. గారి పూరణ .....

    తగ నీ దినముల దేవీ
    నిగమము పఠియించి, ధర్మ నిష్ఠత , విడి చె
    న్ను గలువ పువ్వుల - లలితా
    భగవతి మనసార గొలుతు - భయ భక్తులతో

    రిప్లయితొలగించండి
  17. నేమాని సన్యాసిరావు గారి వ్యాఖ్య .....

    అయ్యా! శ్రీపతి శస్త్రి గారి ఆఖరి పద్యము ఆఖరి లైనులో గణాలు చాలవు.

    రిప్లయితొలగించండి
  18. *********************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    నేమాని వారు చెప్పినట్లు చివరి పాదంలో గణదోషం. దానిని ‘సుగుణమ్ముల నొసఁగునట్టి సూనృత మిదియే’ అందామా?
    *********************************************************
    కామేశ్వర శర్మ గారూ,
    నా వల్ల పొరపాటు జరిగింది. మన్నించండి. మీరే కరెక్టు!
    ‘కంజుడు’ వ్యుత్పత్త్యర్థం - నీటియందు బుట్టినవాడు - చంద్రుడు, బ్రహ్మ. అని ‘విద్యార్థి కల్పతరువు’ చెప్తున్నది.
    *********************************************************
    రాజారావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *********************************************************
    నేమాని సన్యాసి రావు గారూ,
    ధన్యవాదాలు.
    *********************************************************

    రిప్లయితొలగించండి
  19. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, సెప్టెంబర్ 28, 2011 10:16:00 PM

    చక్కని సవరణ జేసిన గురువు గారికి, పండితవర్యులు శ్రీ నేమాని గారికి నా అభివందనములు.

    గురువర్యులు శ్ర్రీ శంకరయ్యగారికి,శ్రీ నేమానివారికి, శ్రీ చింతా రామకృష్ణగారికి మరియు సాటి కవిమిత్రులందరికి నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ కృతజ్ఞతాభివందనములు. శ్రీ నేమానివారికి ధన్యవాదములు. మీరు సూచించిన విధంగా

    సుగతుల్ కలుగగ నుడివెను
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత,విడిచెన్
    వగచక మోహము, వేదమ
    సుగుణమ్ముల నొసఁగునట్టి సూనృత మిదియే

    రిప్లయితొలగించండి
  21. సుగతుల్ కలుగగ నుడివెను
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత,విడిచెన్
    వగచక మోహము, వేదమ
    సుగుణముల నొసగు,జగతికి శుభములు గూర్చున్

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి, నేదునూరి గారి వ్యాఖ్య ....

    నేనిచ్చిన సమస్యను దయతో ప్రచు రించిన శ్రీ కంది శంకరయ్య గారికి , ధన్య వాదములు . గురువులు , పూజ్యులు , అవధాన సరస్వతీ అయిన శ్రీ పండిత నేమాని వారికి కృతజ్ఞతాభి వందనములు.

    రిప్లయితొలగించండి
  23. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

    ధగధగ మెఱిసెడినగలును
    'భగవంతుడివే !' యని తలపక దోచెనుగా
    సుగమనము నర్చకు డరరె
    నిగమము పఠియించి ధర్మ నిష్ఠత విడిచెన్ !

    రిప్లయితొలగించండి
  24. ******************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ సవరణతో పూరణ సర్వాంగసుందరమయింది. అభినందనలు.
    ******************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ******************************************************************

    రిప్లయితొలగించండి
  25. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వేద వేదాంగవిదుడైన రావణ బ్రహ్మ :

    01)
    _________________________________

    జగమేలెడి పరమాత్ముని
    మగనాలిని మోహమునను - మాయే బట్టెన్ !
    తగదన్నను వినడాయెను
    నిగమము పఠియించి ధర్మ - నిష్ఠత విడిచెన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  26. వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘మాయే బట్టెన్’ అనేచోట ‘మాయను బట్టెన్ = మాయకు లొంగి పట్టాడు, మాయోపాయంతో పట్టాడు’ అంటే ఎలా ఉంటుందంటారు?

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! ధన్యవాదములు !

    మాయే బట్టెన్ = రాక్షసుడే పట్టెనని
    నా ఉద్దేశ్యం

    రిప్లయితొలగించండి
  28. దిగజారగ హిందు నియత
    వగతో మోహనుడు "సతి"ని వారించుటకై
    భగవంతుని నమ్ముచు తా
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్


    మోహనుడు = రాజా రామ మోహన రాయ్ (బ్రహ్మ సమాజ స్థాపకుడు)
    సతి = సతీ సహగమనము
    వారించు = నివారించు

    రిప్లయితొలగించండి
  29. వగచుచు మూఢుల కర్మలు
    సగమగు సద్బుద్ధి తోడ సంబర పడుచున్
    వెగటవ హోమపు ధూమము
    నిగమము పఠియించి ధర్మనిష్ఠత విడిచెన్

    రిప్లయితొలగించండి