10, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -454 (పండితుని జూచి నవ్వెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పండితుని జూచి నవ్వెను పామరుండు.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

 1. పడవ మీదను ప్రశ్నించె పడవ వాని
  పద్య మన్నది తెలియునె విద్యలనగ
  ఈత వచ్చునె మీకని ఎదురడుగుచు
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 2. భాషలెన్నోదెలుసు నేను పండితుడిని,
  కావ్యపఠనముఁ జేసిన ఘనుడననెను.
  నీట మునిగెడి వేళల నీఁద రాని
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 3. వాణి కరుణనుఁ జూపెను పండితునికి.
  లక్ష్మి దయలేక కలుగునె లాభమిలను?
  ధనము లేకున్న కష్టము ధరణియందు,
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  పట్టు పంచెను గట్టిన - పండితుండు
  ప్రజల కెల్ల, పంచాంగము - పలుకు వేళ!
  ప్రఖర గర్జనకు బెదరి - పరువువాఱ
  పండితుని జూచి నవ్వెను - పామరుండు!
  _________________________________

  రిప్లయితొలగించండి
 5. తేట తెల్లమౌ పద్యాల తెన్గు నందు
  చదివి యధ్యాత్మ రాముని చరిత దుహిత,
  వ్రాసె నేమాని యనిన సేబాసనుచును
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 6. మొదటిది అపహాసమైతే , ఇది దరహాసం :

  02)
  _________________________________

  పల్లె లందున సంక్రాంతి - పండుగొచ్చె !
  పలుకు పలుకున తేనియ - లొలుకు చుండ
  పరమ శివునిపై పాడిన - పరవశించి
  పండితుని జూచి నవ్వెను - పామరుండు!
  _________________________________

  రిప్లయితొలగించండి
 7. ఇది చిరుహాసం :

  03)
  _________________________________

  పయన మగువేళ గోదారి - పడవ మీద
  పడవ వానితో పలుకుల - పలికె నిటుల
  "సకల తంత్రంబు జనులెల్ల - జదువ వలయు
  పంచ తంత్రంబు రాకున్న - బ్రతుకు టెటుల"?

  *****

  ప్రబల మాయెను జలములు - వరద పెరిగె !
  "వరద వేళను యీదగ - వలయు గాని
  పంచ తంత్రమ్ము పనిలేదు - కొంచెమైన" !
  పండితుని జూచి నవ్వెను - పామరుండు!
  _________________________________

  రిప్లయితొలగించండి
 8. అట నజాగళస్తనము తా నాశ తోడ
  పిండ దొడగెను పాలకు పండితుండు.
  లోక విజ్ఞాహీన ప్రలోభి యైన
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీగురుభ్యోనమ:

  పాదయాత్రలు జేయుచు పండితుండు
  నీడ గాంచుచు శ్రమదీర నిలచి తాను
  పలకరింపుగ ప్రశ్నింప, పరవశమున
  పండితుని జూచి నవ్వెను పామరుండు.

  రిప్లయితొలగించండి
 10. ఇది స్మితము(అప్పుడే పుడుతున్న నవ్వు) :

  04)
  _________________________________

  పేరు గాంచిన సంస్థలో - జేరు కొఱకు
  పుల్ల రావదె స్టూడియో - నల్ల జేరె
  పాసు పోర్టు ఫొటోలను - దీసు కొనగ
  పండితుని జూచి నవ్వెను(smile) - పామరుండు!
  _________________________________
  పండితుడు = ఫొటోలు తీయుట యందు నిష్ణాతుడు

  రిప్లయితొలగించండి
 11. శంకరవిజయం లోని ఒక కథ ఆధారంగా:
  జిడ్డుమైన మిడక నిక చెప్పు కుట్ట
  మనియె కంటాణి తోడ, కళ్ళప్పగించి
  పండితుని జూచి నవ్వెను పామరుండు!
  ముక్కుదూలంబు నట జిడ్డు చక్కజేసి

  చెప్పుఁ గుట్టి, తోటికి నచ్చజెప్పె శంక
  రుండు, నిజమగు జ్ఞానంబు నండనిచ్చి
  కీలకముఁ దెల్పు నేకష్ట కాల మందు
  కార్యసాధనమార్గంబు కలుగ జేయు!

  మనవి: ఈ కథ నన్ను చాలా ప్రభావితం చేసింది. చెప్పుకుట్టటానికి కంటాణి జిడ్డు చేయటం ముఖ్యం గానీ, తోటి ఇవ్వకుండా దాచిన జిడ్డుమైనం ముఖ్యం కాదని, తెలివి వుంటే కార్య సాధన మార్గం కనిపెట్టగలమని, శంకరులు యెంత చక్కగా సెలవిచ్చారో చూడండి. ముఖ్యం గా ఈనాటి యువత తెలుసుకోవలసిన సత్యమిది.

  రిప్లయితొలగించండి
 12. ప్రజల భాష రుచించదు - గ్రామ్య మనుచు
  బరిహసించును - గ్రాంధికమ్మరసి- జీవ
  నదిని వీడి నీటికి గుంట వెదుకు నట్టి
  పండితుని జూచి నవ్వెను పామరుండు

  రిప్లయితొలగించండి
 13. ధరల దించెడు మంత్రపు దండమేది
  లేదు, వృద్ది రేటును బెంచు లెక్క లన్ని
  రోజు గణియింతు మనిజెప్పు రాజకీయ
  పండితునిజూచి నవ్వెను పామరుండు !!!

  రిప్లయితొలగించండి
 14. పండిత నేమాని గారి పూరణ ...

  బళిర హంసను గని నవ్వె బక చయమ్ము
  కరి వెనుక గ్రామ సింహముల్ మొరగు నకట!
  జగతి మూర్ఖుల కియ్యది సహజ గుణము
  పండితుని జూచి నవ్వెను పామరుండు

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, సెప్టెంబర్ 10, 2011 2:59:00 PM

  గడిచె మండనమిశ్ర శంకరుల చర్చ,
  తత్వసర్వార్థసారమేకత్వమనుచు
  శంకరులు మిశ్రు నోడించ సార్థముగను,
  పండితునిజూచి నవ్వెను పామరుండు.

  పండితుడు = మండనమిశ్రుడు,
  మిశ్రు = మండనమిశ్రుడు,

  రిప్లయితొలగించండి
 16. సీమ చదువులు చదివిన సోము డొకడు
  కోన సీమకు జేరెను కోర్కె మీర
  గౌతమిని దాట తెలియని గొప్ప వాని
  పండితుని జూచి నవ్వెను పామరుండు

  రిప్లయితొలగించండి
 17. ఇది అతిహసితం (వికటాట్టహాసము) :

  05)
  _________________________________

  జానపద సినిమాలలో - జరుగు నెపుడు !
  రామ రావును బంధించి - రాజనాల
  పెద్ద శబ్దంబు జేయుచు - క్రుద్ధు డగుచు
  పండితుని జూచి నవ్వెను - పామరుండు!
  _________________________________

  రిప్లయితొలగించండి
 18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లోకవ్యవహారంలో ఉన్న పడవవాని కథను చక్కగా పూరణలో బంధించారు. బాగుంది. అభినందనలు.
  నిజానికి ఈ సమస్యను ఇస్తున్నప్పుడే ఈ అంశంపై పూరణ వస్తుందని ఊహించాను. మొదటి రెండు పూరణలలో (రెండవది మందాకిని గారిది) ఇదే ఆంశం ఉంది. రెండు కాదు ... మూడు! వసంత కిశోర్ గారు కూడా ఒక పూరణలో మీతోనే ముందుకు సాగారు.
  *
  మందాకిని గారూ,
  మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో మీరు గోలి వారి బాట పట్టడం కాకతాళీయమే!
  ఇక రెండవ పూరణలో ‘లక్ష్మీకటాక్షం పొందిన పామరుడు వాణీకటాక్షం పొందిన పండితుణ్ణి చూసి నవ్విన’ పూరణ చాలా బాగుంది.
  *
  వసంత కిశోర్ గారూ,
  ‘విద్యార్థి కల్పతరువు’లో హాస్యరస రీతులు అని ‘స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితము’ అని ఆరింటిని పేర్కొన్నారు. మీరు ఐదింటికి లక్ష్యాలుగా అందమైన ఐదు పూరణ లిచ్చారు. అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు. ఆరవది కూడా వస్తుందనే నమ్ముతున్నాను.
  రెండవ పూరణలో ‘పండుగ + వచ్చె’ కదా! మరిచిపోయిన క్రియారూపం మళ్ళీ ‘ఒచ్చింది’ :-) ‘పండుగయ్యె’ అందామా?
  మూడవ పూరణలో ‘వేళను + ఈదగ’ అన్నచో యడాగమం రాదు. ‘వేళలో నీదగ’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  మీ ‘మెచ్చుకోలు నవ్వు’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  టైపాటులో ‘విజ్ఞానహీన’లో ‘న’ జారిపోయింది.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  స్వభావోక్తి భాసిస్తున్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  ప్రబోధాత్మకమైన కథతో ఉత్తమమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
  *
  రాజారావు గారూ,
  గిడుగు వారి ఆదర్శంతో శ్రేష్ఠమైన పూరణ చేసారు. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణలో ‘రాజకీయ పండితుణ్ణి’ నిరసించిన విధానం బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని గారూ,
  మూర్ఖుల సహజ గుణాన్ని మీ పూరణలో విశ్లేషించారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  మీ పూరణ ప్రశంసనీయం. అభినందనలు.
  మూడవపాదంలో యతి తప్పింది. ‘గౌతమిని దాటు విధమును గాననట్టి’ అందామా?

  రిప్లయితొలగించండి
 20. మా అబ్బాయి ప్రయాణం చేస్తున్న బస్సుకు ప్రమాదం జరిగి కొద్దిగా గాయపడ్డాడు. ఆందోళన పడవలసినంత గాయాలు కావనుకోండి. ఆ హడావుడిలో మీ పూరణలను చదివి, వ్యాఖ్యానించడం ఆలస్యమయింది.
  అందువల్ల ఈ రోజు ‘నా పూరణ’ లేదు.

  రిప్లయితొలగించండి
 21. అయ్యో ! అలాగా ? ముందు అబ్బాయి సంగతి చూడాలి తమ్ముడూ ! సమస్యలకి తొందరేముంది ? మరేం భయం లేదు .మనకి ఎప్పుడూ ఆ దైవ కృప తప్పకుండా ఉంటుంది. " god is good ,and he dose only good always "

  రిప్లయితొలగించండి
 22. గురువుగారూ, మీ అబ్బాయి ఇప్పుడు కులాసాగా ఉన్నారనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 23. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  మీఅబ్బాయికి జరిగిన ప్రమాదం ఆందోళన కలిగించింది. దేవుని దయ వల్ల పెద్దగా ఇబ్బంది కలగనందుకు సంతోషం.త్వరగా గాయాలు మాని స్వస్థత చేకూరు గాక.

  రిప్లయితొలగించండి
 24. గురువుగారూ మీ కుమారుడు త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 25. గురువుగారూ,
  మీ కుమారునకు అధైర్యపడవద్దని చెప్పండి.
  అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా ! ధన్యవాదములు !
  మీ అబ్బాయి గాయాలనుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా !

  రిప్లయితొలగించండి
 27. గురువుగారూ, మీ అబ్బాయి గాయాలనుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 28. శంకరార్యా ! మీరడిగిన మందస్మితము ( విహసితము ) :

  పాండురంగ మహత్మ్యం సినిమాలో పాండురంగని సాక్షాత్కారం
  పొందిన పుండరీకుడు :

  06)
  _________________________________

  మొగము నందున వెలుగులు - మొనయు చుండ
  మధుర మధురమౌ భావన - హృదిని నిండ
  మొదట పెదవుల నుండియు - పిదప,జాలు
  వారగ కనుల , తోడుగా - బాష్పధార
  పండితుని జూచి నవ్వెను - పామరుండు!
  _________________________________
  పండితుడు = పాండురంగడు

  రిప్లయితొలగించండి