15, సెప్టెంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం -460 (భీమసేనుఁడు గాంధారి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు.
జాలపత్రిక ‘ఈమాట’ వారికి ధన్యవాదాలతో...

26 కామెంట్‌లు:

  1. భీమసేనుఁడు గాంధారి పెద్ద కొడుక
    ని తెలిపిరి శంకరార్యులు.నిజము నిజము.
    భీమసేనుడు గాంధారి పెద్ద కొడుక
    నతగు ధర్మజు సోదరుఁడతులితుండు.

    రిప్లయితొలగించండి
  2. బలముఁ గలిగియున్నను ధర్మ పరుడు కాడె,
    భీమసేనుడు; గాంధారి పెద్దకొడుకు-
    ఈసు తోడ మదాంధత యెల్ల మీఱఁ,
    రణము నందునఁ జంపెను రాచబిడ్డ.

    రిప్లయితొలగించండి
  3. ఈరోజు అమెరికా (న్యూజెర్సీ) వెళ్తున్న మిత్రునికి సెండాఫ్ ఇవ్వడానికి హైదరాబాదు వెళ్తున్నాను. ఏ రాత్రికి తిరిగివస్తానో. అందుకని మిత్రులు పరస్పరం తమతమ పూరణల గుణదోషాలను చర్చించుకోండి. పునర్దర్శనం రేపు!

    రిప్లయితొలగించండి
  4. మాస్టారూ, మీరు కూడా న్యూ జెర్సీ బండెక్కి వచ్చేయండి (నవ్వుతూ). మిగతాది తరువాత చూసుకోవచ్చు:-)

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! బాధలందు కూడా 'శంకరాభరణాన్ని' వదలక బాధ్యతా గా భావించు చున్న మీకు నమోవాకములు. శంకర కృపచే మీకు అనుకూలమైన పరిస్థితులు కలిగి మనసు ప్రశాంతతను పొందాలని మా ఆకాంక్ష.

    భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
    ఇర్వు రొక్కటె బలమున నెంచి జూడ
    ధర్మమొక్కరు దలచును, తక్కిడొకరు
    గెలుపు నోటమి తేడాలు గలిగె నిటుల.

    రిప్లయితొలగించండి
  6. చూడ వరుసకు నిర్వురు సోదరులెగ,
    గదల యుద్ధమునందున ఘటికు లెంచ
    బద్ధ వైరులు ! పొసగదు ! భళిర ! వారు
    భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు.

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, సెప్టెంబర్ 15, 2011 9:16:00 AM

    అతి బలాఢ్యుడు, పవమాన సుతుడు, కీచ
    కాది రాక్షస సంహారుడజుని సఖుడు,
    భీమసేనుడు, గాంధారి పెద్ద కొడుకు
    ను రణమందున దునిమె వినూత్నముగను.

    రిప్లయితొలగించండి
  8. భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
    లతుల బలశాలురిర్వురు, గతులు వేరు
    ధర్మ బద్దుడీతడు, మానధనుడతండు,
    ధర్మ మేగెల్చెచివరకధర్మమోడె!!!

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శ్రీకృష్ణపాండవీయము సినిమాలో భీమ ,బకుల యుద్ధ
    ప్రారంభ సమయాన రుక్మిణితో శ్రీకృష్ణుడు :

    01)
    _________________________________

    ఐదు గురు బలశాలు,రి - య్యవని యందు
    ఏక నక్షత్ర జాతులు - ఇందువదన !
    భీమ సేనుడు , గాంధారి - పెద్ద కొడుకు
    బక,జరాసంధ, కీచకుల్ - బలిమి సములు !

    భీమ బకుల సమరమున - వీరు డెవడు ?
    వాని చేతను మిగిలిన - వారు మడియు !
    భావి భారత యుద్ధపు - ఫలిత మిలను
    తేల్చ గలిగెడు పోరిదె - తెలుసు కొనుమ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. వాయుపుత్రుడు, వలలుడు - వాడె వీడు !
    కౌరవుల మాత పేరైన యూరు యేది ?
    కర్ణు డేమౌను కుంతికి గతము నరయ ?
    భీమసేనుడు, గాంధారి, పెద్దకొడుకు

    ( "గాంధారి" నిజామాబాద్ జిల్లాలో వుంది )

    రిప్లయితొలగించండి
  11. పవన పుత్రుండు ఘనభుజబలయుతుండు
    వాసుదేవ సంకల్ప సంవర్తి యగుచు
    భీమసేనుండు - గాంధారి పెద్ద కొడుకు ,
    గీచకు , బకు , జరాసంధు బీచ మణచె

    రిప్లయితొలగించండి
  12. రాజ కవియగు, శూద్రక రాజ రచిత
    మృచ్ఛకటిక ప్రకరణాన తుచ్ఛుడైన
    వాడ గు, ’శకారు’ డవివేకి పలికెనిటుల
    "భీమసేనుఁడు గాంధారి పెద్దకొడుకు"

    రిప్లయితొలగించండి
  13. ఆహా అష్టావధాని శర్మ గారూ, ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి మృచ్చకటికం పేరు విన్నాము. మీ పూరణం బహు బాగు. చాలా ఆనందించాను.

    రిప్లయితొలగించండి
  14. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి

    వీరు లిర్వురు బలయుతు లౌర వీరు
    భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకు
    కర్మయోగమె,కృష్ణుఁడు,ధర్మరాజు
    కళ్ళె మేయుట సామీరి కంఠమందు !

    బలవంతులను అదుపులో ఉంచడము మంచిదని నా అభిప్రాయము.

    రిప్లయితొలగించండి
  15. భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకుఁ
    తొడలు విరుగగొట్టి దునిమి పొడవడచిన
    జెట్టి,వాని మోచేతి గంజి కుడిచితివి
    విధి బలీయము ధృతరాష్ట్ర! వగచు టేల?

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖర్ చెప్పారు...

    భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకుఁ
    తొడలు విరుగగొట్టి దునిమి పొడవడచిన
    జెట్టి,వాని మోచేతి గంజి కుడిచితివి
    విధి బలీయము ధృతరాష్ట్ర! వెంగ మయితె !

    రిప్లయితొలగించండి
  17. ఏకవస్త్రను కులసతి నీడ్చుకొచ్చి
    అతడు చేసిన యవమాన మాత్మ తలచి
    భీమసేనుడు, గాంధారి పెద్దకొడుకు
    నూరుభంగమ్ము గావించె నుగ్రతముడు

    రిప్లయితొలగించండి
  18. చంద్రశేఖర్ చెప్పారు...
    నాల్గో పాదం చివరలో పోస్టింగ్ చేసేటప్పుడు scramble అయినట్లు ఇప్పుడే చూశాను. సరిచేసిన పద్యం క్రింద చూడండి:

    భీమసేనుఁడు, గాంధారి పెద్దకొడుకుఁ
    తొడలు విరుగగొట్టి దునిమి పొడవడచిన
    జెట్టి,వాని మోచేతి గంజి కుడిచితివి
    విధి బలీయము ధృతరాష్ట్ర! వింత గాదు!

    రిప్లయితొలగించండి
  19. చింతా రామకృష్ణారావు గారూ,
    మన్నించాలి. మీ పూరణలో భావం ఎంత ఆలోచించినా నాకు అవగతం కావడం లేదు. మీరు వ్రాసారంటే ఏదో విశేషం తప్పక ఉంటుంది. చెప్పాను కదా! స్తిమితం లేని మనస్సు... మీ పూరణలోని చమత్కారాన్ని గ్రహించడంలో విఫలమౌతున్నది. దయచేసి వివరణ ఇస్తారా?
    *
    మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    కాని ‘అజుని సఖుడు" ...? అజుడు శబ్దానికి ‘భగవంతుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు, చంద్రుడు, కాముడు, జీవుడు, దశరథుని తండ్రి, ఒకానొక ఋషి’ అనే అర్థాలున్నాయి. ఇందులో ఎవరి సఖుడు? విష్ణువు అనే అర్థం తీసుకున్నా కృష్ణునకు సఖుడుగా అర్జునుడు ప్రసిద్ధుడు కాని భీముడు కాదు కదా!
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. వసంత కిశోర్ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘నక్షత్రజాతులు + ఇందువదన’ అని విసంధిగా వ్రాయకుండా ‘నక్షత్రజాతులై రిందువదన’ అంటే ఎలా ఉంటుంది?
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    బహుకాలదర్శనం! సంతోషం!
    ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘ఊరు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఊరదేది" అంటే సరి. అయితే ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం ‘గాంధారం’! గాంధారి కాదు. అది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ లో ఉంది. అదే కాందహార్. గాంధార దేశపు రాకుమారిని గాంధారి అన్నారు. మీ ప్రశ్నను ‘కౌరవుల మాత కున్నట్టి పేరదేది?’ అంటే సరి!
    *
    రాజారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    ధన్యోऽస్మి! చంద్రశేఖర్ గారు అన్నట్లు మృచ్ఛకటిక ప్రస్తావనతో సర్వోత్తమమైన పూరణ నందించారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    ‘కళ్ళెము + వేయుట’ను ‘కళ్ళెము నిడుట’ అందాం. ‘సామారి’ శబ్దప్రయోగం ప్రశంసనీయం!
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘సంజయ ఉవాచ’ అన్నట్టు చక్కగా చెప్పారు పూరణను. బాగుంది. అభినందనలు.
    *
    పింగళి శశిధర్ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఈడ్చుకొచ్చి’ ... ? అక్కడ ‘ఈడ్చి తెచ్చి" అందామా?

    రిప్లయితొలగించండి
  21. గురువుగారు, ధన్యవాదములు. అందరి పూరణలూ వైవిధ్యభరితంగా చక్కగా ఉన్నాయి.
    వరసకు కొడుకవుతాడులెమ్మని చెపుతున్నారనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  22. చింతా వారూ,
    ఓహో .. మందాకిని గారి మాటతో చిక్కుముడి వీడింది. గాంధారికి (వరుసకు) పెద్దకొడుకు అనదగిన ధర్మరాజుకు భీముడు సోదరుడా? బాగుంది. ఈ మందబుద్ధిని మన్నించాలి.

    రిప్లయితొలగించండి
  23. పూరణము చేయ సగమిచ్చి పూజ్యులైన
    శంకరార్యులు విడువగ, చదివి,నేను
    నిజమునెఱిగి పూరించితి సుజనులలర.
    భీమసేనుడు గాంధారి పెద్ద కొడుక
    నతగు ధర్మజు సోదరుఁడతులితుండ
    నుచును.తప్పుగా తలపకుఁడార్య! మీరు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  25. గురువు గారూ ! నమస్కారములు. ఈ మధ్య ఇల్లు మారడంతో తిరిగి ఇంటర్నెట్ ఏర్పాటుచేసుకోవడంలో కొంచెం జాప్యం జరిగింది. సార్ ! గాంధారి నిజామాబాద్ జిల్లాలోని ఒక గ్రామం అని చెప్పడానికి నిదర్శనం తెలుగు వికిపీడియా లోని సమాచారం . ఇది చదవండి :

    ఉట్నూర్ (గాంధారి)

    ఉట్నూర్, నిజామాబాదు జిల్లా, గాంధారి మండలానికి చెందిన గ్రామము
    [దాచు]
    చూ • చ • మా
    గాంధారి (నిజామాబాద్ జిల్లా మండలం) మండలంలోని గ్రామాలు
    బంగర్‌వాడి (నిర్జన గ్రామము) · బొప్పాజీవాడి · బ్రాహ్మన్‌పల్లె · బూర్గుల్ · చద్మల్ · చిన్నాపూర్ · దుర్గం · గాంధారి · గండివాటే · గుజ్జుల్ · గుర్జల్ · జువ్వాది · కారక్‌వాడి · కాటేవాడి · కోనాయిపల్లె (నిర్జన గ్రామము) · మత్తుసంగం · మేడ్‌పల్లె · ముధోలి · నాగ్లూర్ · నర్సాపుర్ (ముధోలి) · నెరల్ · పెద్ద గౌరారం · పేట్‌సంగం · పోతంగల్ (కలాన్) · పోతంగల్ (ఖుర్ద్) · రామలక్ష్మనపల్లె · సర్వాపూర్ · సీతాయిపల్లె · సోమారం · తిమ్మాపూర్ · తిప్పారం · ఉట్నూర్ · వజ్జెపల్లె (కలాన్) (నిర్జన గ్రామము) · వజ్జెపల్లె (ఖుర్ద్) · వెండ్రికల్ · వెంకటాపూర్ · యాచారం

    రిప్లయితొలగించండి