11, సెప్టెంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -456 (వనమును ధ్వంసంబు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.
ఈ సమస్యను సూచించిన
చంద్రశేఖర్ గారికి
ధన్యవాదాలు.

47 కామెంట్‌లు:

 1. మనమున రాముని తలచుచు
  వనధిని దాటగనె సీత వనమున చిక్కెన్.
  కనిన హనుమ మార్గమునను
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.

  రిప్లయితొలగించండి
 2. ఘన శ్రీ రాముని పనుపున
  జని,వీరుడు పవన సుతుడు జానకి మాతన్
  కనుగొని ,రావణ లంకా
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!!!

  రిప్లయితొలగించండి
 3. పండిత నేమాని గారి పూరణ ....

  హనుమంతుడు సీతను గని
  వెనుదిరుగుచు గాంచి వివిధ వృక్షమ్ములతో
  దనరుచు కనువిందుగొలుపు
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతి గనెన్

  రిప్లయితొలగించండి
 4. వనచరముల సాయముతో
  వననిధి నవలీల దాటి పౌలస్త్యున్ రా-
  వణు ద్రుంచి రాము డసురా-
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.

  రిప్లయితొలగించండి
 5. అనలుడు నరనారాయణ
  జన వంద్యుల చలువ చేత సంప్రీతిగ తా
  ననయము గోరెడు ఖాండవ
  వనమును ధ్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్

  రిప్లయితొలగించండి
 6. వన చరుడగు నా బోయకు
  ఘనుడగు నారదుని బోధ కను తెరిపించెన్
  మనమున మారి, దురిత భా
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.

  రిప్లయితొలగించండి
 7. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, సెప్టెంబర్ 11, 2011 1:12:00 PM

  అనయము నీతికి నిల్చుచు
  ఘనుడై ప్రజ మేలు కోరి, కనక సమము చం
  దనవనమున గల గంజా
  వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.

  కనక సమము = బంగారముతో సమానమైన చందనవనము అనే భావనతో........

  రిప్లయితొలగించండి
 8. అనలుడు వేడగ ఖాండవ
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.
  వినయుడు పాండవ తనయుడు
  జనవంద్యుడుతోడుగాగ జయమున్గనియెన్ !!!

  (జనవంద్యుడు= శ్రీకృష్ణుడు)

  రిప్లయితొలగించండి
 9. నా పూరణ ...

  వనజాక్షుఁడు హరి ధర్మం
  బును సాధుజనగణము దయఁ బ్రోవఁగ భువిపై
  జనియించి దుష్కృతుల జీ
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్.

  రిప్లయితొలగించండి
 10. మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  చక్కని పూరణ మీది. అభినందనలు.
  ‘ఘనశ్రీ’ అన్నచోట ‘న’ గురువై యగణం అవుతుంది కదా! అక్కడ ‘ఘనుఁడౌ రాముని’ అందాం.
  ఖాండవవనవిధ్వంసాన్ని చెప్పిన మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని గారూ,
  మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  శ్రేష్ఠమైన పూరణ. అభినందనలు
  ‘అసుర + అవనము’ రాక్షసుని కోరిక అనే అర్థంలో వాడారా? బాగుంది.
  *
  రాజారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  అనలుడు ప్రఖ్యాతు డయ్యాడో లేదో గాని రోగవిముక్తు డయ్యాడు. అయినా ఆ ఘట్టంలో ప్రఖ్యాతి పొందినవాడు అర్జునుడు కదా!
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  వైవిధ్యమైన మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీగురుభ్యోనమ:

  ఘనులౌ నర నారాయణు
  లను కొలచుచు సాహసమున లంఘించుచు నా
  యనలుడు ముదమున ఖాండవ
  వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.

  రిప్లయితొలగించండి
 12. గురువుగారూ ధన్యవాదాలు.
  నేను 'అసురావనము ' అన్న ప్రయోగాన్ని దీనావనము, భక్తావనము
  అనే రీతిలో ప్రయోగించాను. అసురావనము అంటే రావణుడు రాక్షసులకు రక్షకుడు కదా అని.
  అయితే మీరన్నట్లు అసుర వాంఛ అన్న అర్థం కూడా సరిపోతోంది.
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. వినకన్ జనినర్ధాంగియె
  తనతండ్రినిరాకరింప దర్పముతోడన్;
  తనువున్ త్యజింపగ, నట, స
  వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్.

  రిప్లయితొలగించండి
 14. పలురకములుగా "వనమును ద్వంసంబు జేసి" న కవి మిత్రులందరకూ అభినందనలు.


  గనులను త్రవ్వుచు మ్రెక్కుచు
  ఘనముగ వెలుగొందు వారి గర్వము ద్రుంచెన్!
  మన' సీబీయై' ఖల జీ
  వనమును ద్వంసంబు జేసి ప్రఖ్యాతి గనెన్!!

  రిప్లయితొలగించండి
 15. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  అనుపమ శక్తియుతుండగు
  హనుమానుడు దాటి యబ్ధి - నవలీలగ , రా
  వణ ప్రాణ సమాన మయిన
  వనమును ధ్వంసంబు చేసి - ప్రఖ్యాతిఁ గనెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 16. 02)
  _________________________________

  అనలుడు కనలుచు ఖాండవ
  వనమును ధ్వంసంబు చేసి ! - ప్రఖ్యాతిఁ గనెన్
  మనమున కృష్ణు దలంచుచు
  అనయము వర్తించు నట్టి - యర్జును డంతన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 17. కర్ణుని కవచకుండలములు గ్రహించిన దేవేంద్రుడు :

  03)
  _________________________________

  చెనటిని రూపము మార్చెను
  వినయపు విప్రునిగ ,విజయు - విజయము కొఱకై
  దినకర సూనుని ప్రాణా
  వనమును ధ్వంసంబు చేసి - ప్రఖ్యాతిఁ గనెన్ !
  _________________________________
  చెనటిని = కుత్సితముగ
  అవనము = రక్షణము

  రిప్లయితొలగించండి
 18. మందాకినిని మాయం చేసిన జటాజూటుడు :

  04)
  _________________________________

  ఇనకులుడు ,భగీరథు, కా
  మన నెఱవేర్చగ , గదలిన; - మహిమాన్వితమౌ
  వేణిని గొని,పావన ,పా
  వనమును ధ్వంసంబు చేసి - ప్రఖ్యాతిఁ గనెన్ !
  _________________________________
  చెనటిని = కుత్సితముగ
  అవనము = రక్షణము

  రిప్లయితొలగించండి
 19. అనువుగ మేనక ఇంద్రుని
  పనుపున దివికరిగి ఋషి విశ్వామిత్రుని చూ
  పున జేరి ఘనతపో జీ
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!

  రిప్లయితొలగించండి
 20. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ రన్నట్లు ‘రావణుడు’ అనే అర్థం రావాలంటే అక్కడ ‘అసురావనుడు’ అని ఉండాలి. మీ భావంతో ‘అసురావనము’ అనే శబ్దానికి ‘రాక్షసులకు రక్షణ ఇచ్చేది - లంక’ అనుకోవచ్చు. ఇదీ అక్కడ సరిపోతుంది.
  *
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  ‘చనిన + అర్ధాంగి’ అన్నప్పుడు సంధి జరుగదు. ‘వినక పతిమాటఁ జనె సతి’ అంటే ఎలా ఉంటుంది?
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ నాలుగు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘రా/ వణ ప్రాణ’ అన్నప్పుడు ‘ణ’ గురువై గణదోషం వస్తున్నది. అక్కడ ‘రా/ వణు ప్రాణ’ అంటే సరి!
  నాల్గవ పూరణలో ‘ప = జలధార యొక్క, అవనము = రక్షణము’ అనే అర్థాన్ని తీసుకున్నారా? బాగుంది. అక్కడ ‘పావన జీవనమును’ అన్నా ‘పావనమైన గంగా జలాన్ని’ అనే అర్థంలో సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 21. చంద్రశేఖర్ గారూ,
  బాగుంది మీ పూరణ. వైవిధ్యంగానూ ఉంది. అభినందనలు.
  అయితే రెండవపాదంలో ‘విశ్వామిత్రుని‘ అన్నచోట గణదోషం.
  ‘పనుపున భువిఁ జని ఋషి ప్రవరు విశ్వామి
  త్రుని జేరి ....’ అంటే సరి!

  రిప్లయితొలగించండి
 22. సుభద్రామానస చోరుడు :

  05)
  _________________________________

  విని ,విని ,మాయా యతియే
  అనురక్తెగయంగ , నామె - యామోదముతో
  వనితా రత్నపు ,సంసే
  వనమును ధ్వంసంబు చేసి - ప్రఖ్యాతిఁ గనెన్ !
  _________________________________
  సంసేవనము = పరిచర్యచేయడము

  రిప్లయితొలగించండి
 23. వసంత కిశోర్ గారూ,
  మీ ఐదవ పూరణ కూడా మనోహరంగా ఉంది. అభినదనలు.
  కాకుంటె ‘అనురక్తి + ఎగయంగ’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘అనురక్తి చెలంగ’ అందాం.

  రిప్లయితొలగించండి
 24. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి
 25. తన యెన్నిక తీరుగనె జ
  గనతిగ పన్ని మితిమీర కాంగ్రెసు మాయా
  ధనమును గొట్టి ప్రజా సాం
  త్వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!

  రిప్లయితొలగించండి
 26. చంద్రశేఖర్ గారూ,
  కాలోచితమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. చంద్రశేఖర్ గారూ,
  మన మిత్రులు ‘గన్నవరపు’ వారినుండి మూడు రోజులుగా పూరణలు గాని, వ్యాఖ్యలు గాని లేవు. వారి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి.

  రిప్లయితొలగించండి
 28. శంకరార్యా ! ఔను ! చాలా వెలితిగా నున్నది !
  మూర్తీజీ ! మమ్మల్ని మరిచారా ?
  చంద్ర శేఖరా ! గుర్తు చెయ్యండి !

  రిప్లయితొలగించండి
 29. శంకరార్యా !
  రావణ ప్రాణ ---రావణునియొక్క ప్రాణ---షష్ఠీ తత్పురుష
  రావణు ప్రాణ ---రావణుని ప్రాణ ---ద్వితీయా తత్పురుష
  అంతే గదా !
  మరి యీ గురు లఘువుల తేడా యెందుకొస్తోంది ?

  రిప్లయితొలగించండి
 30. వనమున జొరబడి నంతనె
  హనుమకు కనుపించె సీత నతి దైన్యముగన్ !
  మనమున క్రోధము రగులగ
  వనమును ద్వసంబు చేసి ప్రఖ్యాతి గనెన్ !

  రిప్లయితొలగించండి
 31. గురువుగారూ ధన్యవాదాలు. మీరన్నది నిజం.

  రిప్లయితొలగించండి
 32. వసంత కిశోర్ గారూ,
  ‘రావణ ప్రాణ’ అన్నప్పుడు రెండూ సంస్కృతపదాలై సమాసమై ‘ణ’ గురువౌతుంది. ‘రావణు ప్రాణ’ అన్నప్పుడు రావణు తెలుగుపదమై ‘ణు’ పైన ‘ప్రా’ యొక్క ఊనిక ఉండదు. కావున ‘ణు’ లఘువుగానే ఉంటుంది.
  ‘అర్థవత్ సమాసః’ అన్నారు. ‘రావణ ప్రాణ’ సమాసానికి సందర్భాన్ని బట్టి ద్వితీయాది విభక్తులలో ఏ ప్రత్యయమైనా రావచ్చు.

  రిప్లయితొలగించండి
 33. రాజేశ్వరక్కయ్యా,
  ఎన్నాళ్ళకెన్నాళ్ళకు తమ్ముడికి పని కల్పించకుండా ‘నిర్దోషంగా’ పద్యాన్ని వ్రాసారు? ధన్యోऽస్మి!
  మీ పూరణ బ్రహ్మాండంగా ఉంది. అభినందనలు.
  అయ్యయ్యో ... చిన్నలోపం ఉంది. ‘సీత యతిదైన్యముగన్’ అని ఉండాలి.

  రిప్లయితొలగించండి
 34. తమ్ముడూ ! " య " రాస్తే తప్పౌతుం దేమో అని " న " రాసాను .ఈ మధ్య బొత్తిగా అన్నే సందేహాలే . ప్చ్ ! లాభం లేదు. ఏదో గ్రహ దోషం పట్టింది.

  రిప్లయితొలగించండి
 35. అక్కయ్యా,
  ఈ తమ్ముడిపై అనుగ్రహం ఉంచండి. చాలు! ... గ్రహదోషాలను తొలగించడానికి నేను ఉన్నానుగా!

  రిప్లయితొలగించండి
 36. అక్కాయ్ ! ఈరోజు పూరణ అద్భుతం !
  గురువుగారికి బొత్తిగా పనిలేకపోతే యెలా ?

  రిప్లయితొలగించండి
 37. అక్కాయ్ !
  "మనమున క్రోధము రగులగ "

  వనమును ద్వసంబు చేసి ప్రఖ్యాతి గనెన్ !

  నీ పూరణకు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందిక్కడే !
  ఆ క్రోధం మాకెవ్వరికీ కలుగ లేదు !

  నిఝంగా అద్భుతం !

  రిప్లయితొలగించండి
 38. మాస్టారూ, ధన్యవాదాలు.
  ఇప్పుడే డా. మూర్తి గారి తో మాట్లాడాను. ఫ్లోరిడా అని వేరే రాష్ట్రంలో పెళ్ళికి వెళ్లి ఇప్పుడే వచ్చారుట. లాప్ టాప్ లేక పోస్టింగ్స్ చూడలేదుట. రేపటినుంచి కవితా వ్యవసాయం చేయమని మనవి చేశాను. ప్రొద్దున కొంచెం హడావిడిగా వుంటుంది, నిదానంగా సాయకాలం నుంచి వస్తారు. నాకు ఫ్లోరిడా విషయం చెప్పారు. మిత్రుల ఆత్మీయతకి నా తరఫునించి కూడా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 39. May 2014:

  అనఘా! కాంచుము మోడిని!
  చిననాటను చాయినమ్మి చిటపట ధ్వనులన్
  ఘనమౌ కాంగ్రెసు పార్టి భ
  వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్

  రిప్లయితొలగించండి