6, సెప్టెంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -450 (గాలికబురు లిపుడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గాలికబురు లిపుడు గణన కెక్కె.

34 కామెంట్‌లు:

 1. గనుల కొల్ల గొట్టు ఘనులరే 'ఈనాడు'
  గాలి దెబ్బ కేమొ సోలి పోయె
  'గాలి' కొచ్చిన సిరి గాలికే ; యివి కావు
  గాలికబురు, లిపుడు గణన కెక్కె.

  రిప్లయితొలగించండి
 2. అందమైన ఋతువు ఆమని వచ్చెను
  మదిని హాయి నిండె, మమత విరిసె
  సుందరాంగునకును సొగసైన వనితకు
  గాలికబురులిపుడు గణనకెక్కె

  గాలి కబురులు- స్వీట్ నథింగ్స్.

  రిప్లయితొలగించండి
 3. చాలినంత ధనము గాలి జనార్దను
  డార్జనంబు చేసె నసదృశముగ.
  నేర శోధకు లతనిని దోషిగా నిల్ప
  గాలికబురు లిపుడు గణన కెక్కె.

  రిప్లయితొలగించండి
 4. జాలి కరుణ లేని జాగిలమ్ములు కొన్ని
  కట్టు తప్పి మెదల పట్టు బడెను
  గ్రామసింహము లవి ,గాదు సింహములను
  గాలి కబురు లిపుడు గణన కెక్కె

  రిప్లయితొలగించండి
 5. మేత మేయు టందు గీత దాటిన వట
  కాసరమ్ములెన్నొ, కాసి, కట్టి
  బందు లందు జేర్చి బంధించి నారను
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !!!


  పొర్లి పొర్లి పొర్లి పొర్లాడి పొర్లాడి
  నొల్లుకొనదె పేడ పుల్లు పురుగు
  మానవునిగ బుట్టి హీన జీవిత మేల
  నీతి పథము నడువ నెమ్మి గాదె !!!

  రిప్లయితొలగించండి
 6. ' రాజు ' కథలు నాడు రాజ్య మేలెను, ' యువ-
  రాణి ' గతము పిదప రచ్చ జేసె,
  ' జగము ' బిక్క చచ్చి మొగము వ్రేలాడగ
  ' గాలి ' కబురు లిపుడు గణన కెక్కె.

  రిప్లయితొలగించండి
 7. సవరణ అవసరమో కాదో గురువు గారు చెప్పాలని కోరుతూ ,

  మేత మేయు టందు గీత దాటె వెసను
  కాసరమ్ము లెన్నొ ,కాసి కట్టి
  బందు లందు జేర్చి బంధించి నారను
  గాలి కబురు లిపుడు గణన కెక్కె

  రిప్లయితొలగించండి
 8. గాలి గాలి జేసి గనులన్ని కాజేసి
  కోట్లు కొల్ల గొట్టి కోట గట్ట
  బీట వారె రాచకోట,వీచెనెదురు
  గాలి,కబురు లిపుడు గణన కెక్కె!!!

  రిప్లయితొలగించండి
 9. శాస్త్రి గారూ ,సమీరుని సాయము మీకే ! అందఱి కంటె ముందుగా పూరణ చేసారు. మందాకిని గారు యింకా వసంత ఋతువు లోనే ఉన్నా మంచి కబుర్లు తెచ్చారు.శ్రీ చింతా రామకృష్ణారావు గారి పూరణలో సందిగ్ధము లేదు,బాగుంది. మిస్సన్న గారు మీ రాజు కధ బ్రహ్మాండము. శ్రీ పీతాంబర్ వారి పూరణ అదిరింది !

  రిప్లయితొలగించండి
 10. కూర్చి చెప్ప వోయి కొన్నైనఁ జల్లని
  గాలి కబురులిపుడు; గణనకెక్కె
  నీదు తలపు మదిని నీరజాక్షుడ ! నన్ను
  కట్టి వేయుమింక కదలనీక!  మూర్తి గారూ, ఏం చేయమంటారో చెప్పండి. ఈ గాలికి కొట్టుకొని పోయే వాళ్ళగురించి ఏం పాడతాం లెమ్మని, వసంతుని వదలవద్దని మనసు చెపుతుంది. :-)

  రిప్లయితొలగించండి
 11. మీలాగా వ్యాఖ్యానించగలనా? అందరూ తమతమ శైలిలో చక్కగా పూరణలు చేశారు. అందరికీ అభినందనలని చెప్పగలను. :-)

  రిప్లయితొలగించండి
 12. మందాకిని గారూ నా మనస్సులో నిజమైన మాట, మీ మార్గమే ఉత్తమము.

  రిప్లయితొలగించండి
 13. గురువు గారి పాదపద్మములకు నమస్కారిస్తూ
  గాలి సోదరులపై
  గాలివారు దినెను గనులన్ని, వేగంగ
  గాలిలోన దిరిగె ఘనముగాను,
  ఎదురుగాలి వీచి వెతలుజెందగ నేడు
  గాలి కబురు లిపుడు గణన కెక్కె|

  రిప్లయితొలగించండి
 14. స్నేహ భాషణముల చెలిమి విరియ - పెర
  గాలి కబురు లిపుడు - గణన కెక్కె
  నరువ దేండ్ల పైన నావయస్సికనెంత
  కాలమిలను బతుకు గ్రాల వలెనొ !

  రిప్లయితొలగించండి
 15. ఫేసుబుక్కునందు పిసరంత రాసిన
  తిరిగి తిరిగి పలికె దేశమంత
  ముఖము లెరుగనేల ముచ్చట్ల కోసమై
  గాలికబురు లిపుడు గణన కెక్కె!

  రిప్లయితొలగించండి
 16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ఘనులు అన్నారు కనుక ‘సోలి పడిరి’ అందాం. ‘గాలికి + వచ్చిన’ అనడానికి ‘గాలి కబ్బిన సిరి’ అంటే ఎలా ఉంటుంది?
  *
  మందాకిని గారూ
  మీ రెండు పూరణలూ మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు, కొసరు పద్యము చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  మీ ఎదురుగాలి పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవపాదంలో యతి తప్పింది. ‘ఎదురుగాలి వీచి యిడుము లందగ నేడు’ అంటే సరి!
  *
  రాజారావు గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  *
  హరి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. సుగ్రీవుడు శ్రీరామునితో :

  మధువనమ్మునందు మధుర రసాన్విత
  ఫలములన్నొ గ్రోలి వనచరములు
  కోతి గెంతు లేయ 'సీతను గాంచిరో '
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !!!

  రిప్లయితొలగించండి
 18. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _________________________________

  పచ్చగడ్డి మేయ - పసరముల కిపుడు
  గాలికుంటు జబ్బు - గలుగు గాన
  పచ్చగడ్డి మేత - వలదంచు పసలేని
  గాలికబురు లిపుడు - గణన కెక్కె !
  _________________________________

  రిప్లయితొలగించండి
 19. 02)
  _________________________________

  పట్ట పగలె యైన - మిట్ట మద్యాహ్నంబు
  చింత చెట్టు వద్ద - చేర వలదు
  గాలిసోకు మీకు - కాదని జేరిన !
  గాలికబురు లిపుడు - గణన కెక్కె !
  _________________________________

  రిప్లయితొలగించండి
 20. 03)
  _________________________________

  గట్టు మీద నున్న - గ్రామ దేవత కేమొ
  బలుల నివ్వ కున్న - పసరములను
  గాలిపోయు నిజము - గ్రామస్థులకు నని
  గాలికబురు లిపుడు - గణన కెక్కె !
  _________________________________
  గాలి కుంటు = పశువులకు వచ్చు వ్యాధి
  గాలిసోకు = దెయ్య మావహించు
  గాలిపోయు = అమ్మవారు పోయు

  రిప్లయితొలగించండి
 21. చల్ల గాలి కెపుడు మెల్లగా వెంటబడి
  ఉల్ల మందు హాయి ఝల్లు మనగ
  కొల్ల గొనకు మదిని కల్లలాడుతు చెలికి
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !

  రిప్లయితొలగించండి
 22. జాలి పడకు యెపుడు నీలివార్తలు వినుచు
  గేలి చేతు రంత బేల వనుచు
  రాలు గాయి జనులు రాజిల్ల నీయరు
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !

  రిప్లయితొలగించండి
 23. పిల్లదాని ప్రేమ గొల్లవాఁడు నెఱిగె
  బ్రాహ్మణుండు దెలుప, 'పయన మయ్యి
  'రుక్మిణమ్మ గొనుట రూఢియౌ'జనులాడు
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !

  రిప్లయితొలగించండి
 24. చిన్న సవరణ,

  సుగ్రీవుడు శ్రీరామునితో :

  మధువనమ్మునందు మధుర రసాన్విత
  ఫలములారగించి వనచరములు
  కోతి గెంతు లేయ 'సీతను గాంచిరో '
  గాలి కబురు లిపుడు గణన కెక్కె !!!

  రిప్లయితొలగించండి
 25. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, సెప్టెంబర్ 06, 2011 8:30:00 PM

  ప్రపంచ కప్పు ( క్రికెట్ ) గెలిచిన భారత జట్టు గురించి ప్రజల అభిలాష...........

  ఓడినట్టి చోట నోడించిరే భార
  తీయ జట్టు నాట కీయముగను,
  "ఇందుమొదలు నెపుడునీ జైత్రయాత్ర సా
  గాలి"- కబురు లిపుడు గణన కెక్కె.

  రిప్లయితొలగించండి
 26. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  కాని ‘వనచరములు కోతిగంతులేయడం’ ... డేంజ రపాయం కదా! :-) అక్కడ ‘చెలగి గంతు లేయ’ అంటే ఎలా ఉంటుంది?
  *
  వసంత కిశోర్ గారూ,
  ముచ్చటైన మీ మూడు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో 1,3 పాదాలలో గణదోషం. ‘వెంటపడి’ని ‘వెంటాడి’ అనీ, ‘కల్లలాడుతు’ను ‘కల్లలాడి’ అని మార్చితే సరి!
  రెండవపూరణలో ‘పడకు యెపుడు’ అన్నచోట ‘పడకు మెపుడు’ అందాం.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ‘సాగాలి’ అంటున్న మీ పూరణ మంచి ఆలోచన. బాగుంది. అభినందనలు.
  మరి ‘సాగాలి’ వ్యావహారిక శబ్దం కదా!

  రిప్లయితొలగించండి
 27. శంకరార్యా !ధన్యవాదములు. చక్కని సవరణలు చేశారు.
  మూర్తి గారూ! మందాకిని గారూ!ధన్యవాదములు.
  'గాలి కబురులు' గణనీయముగా చెప్పిన కవి మిత్రులకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, సెప్టెంబర్ 06, 2011 11:16:00 PM

  ధన్యవాదములు గురువు గారూ,

  ఇక మీదట వ్యావహారిక శబ్దప్రయోగము లేకుండ జాగ్రత్త పడుతాను. కాని ఒక్కో సారి తెలియకుండా పడుతుంటాయి. మన్నిస్తూ సవరించవలసినదిగా కోరిక.

  రిప్లయితొలగించండి
 29. ఈ రోజు వార్తలు :

  04)
  _________________________________

  రాజశేఖరుండు - రాసిచ్చె వానికి !
  దోచుకొనుము బిడ్డ - దొరికి నంత
  జనుల ధనము దోచి - జగను కిచ్చితి నంత
  ప్రజల సొమ్ము దొబ్బి - భాగ మిమ్ము !
  అనిన విన్న యతడు - అటులె చేసెను నాడు
  అంత కంత కంత- అధిక మవగ !

  గొడ్ల నెన్ని తిన్న - కూలును రాబందు
  వాన , గాలి కలసి - వచ్చెనేని !
  అడ్డదారి లోన - ఆస్తి సంపాదించ
  ఆదు కొనగ లేదు - ఆపదందు !

  గనుల నన్ని దోచి - ఘనత వహించిన
  గాలి గాడు నేడు - ఖైదు చేరె !
  పేజి పేజి లోన - పేపరంతయు నేడు
  గాలి కబురు లిపుడు - గణన కెక్కె !
  _________________________________

  రిప్లయితొలగించండి
 30. వసంత మహోదయా! చివరి పద్యంలో "గాలిగాడు" పదప్రయోగం బాగుంది.

  రిప్లయితొలగించండి
 31. గురువు గారూ ధన్యవాదములు. మీ సూచన చాలా బాగుంది. వనచరములు అంటే బుద్ధిగా అడవిలో నడుస్తారని భావించాను. చంద్రశేఖరులు నారసిమ్హుడు హనుమంతుడు ఒకరే నని సెలవిస్తే ఆ కోతి బుద్ధితో ....

  కిశోర్ జీ గాలిగాడు అని బొత్తిగా గాలి తీసేసారు ?

  రిప్లయితొలగించండి
 32. వసంత కిశోర్ గారూ,
  మూడు పద్యాల్లో చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
  మొదటి పద్యంలో ఆరు పాదాలు వ్రాసారు. ఆటవెలదిని ఆ విధంగా వ్రాసే సంప్రదాయం లేదు. మీ మూడు పద్యాలను కలిపి ఒకే సీసపద్యంగా మార్చవచ్చు. (సీసపాదాలు ఎన్నైనా వ్రాయవచ్చు) . ఇలా ....
  సీ.
  రాజశేఖరుఁ (డదె) - రాసిచ్చె వానికి !
  దోచుకొనుము బిడ్డ - దొరికి నంత
  జనుల ధనము దోచి - జగను కిచ్చితి నంత
  ప్రజల సొమ్ము(ను) దొబ్బి - భాగ మిమ్ము !
  అనిన విన్న యతడు - అటులె చేసెను నాడు
  అంత కంత(కు నం)త- అధిక మవగ !
  గొడ్ల నెన్ని(యొ) తిన్న - కూలును రాబందు
  వాన , గాలి కలసి - వచ్చెనేని !
  అడ్డదా(రుల) లోన - ఆస్తి సంపాదించ
  ఆదు కొనగ లేదు - ఆపదందు !
  ఆ. వె.
  గనుల నన్ని దోచి - ఘనత వహించిన
  గాలి గాడు నేడు - ఖైదు చేరె !
  పేజి పేజి లోన - పేపరంతయు నేడు
  గాలి కబురు లిపుడు - గణన కెక్కె !

  రిప్లయితొలగించండి
 33. చంద్రశేఖరా ! ధన్యవాదములు !
  మూర్తీజీ ! ధన్యవాదములు !
  శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !

  రిప్లయితొలగించండి