8, జూన్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1697 (పగలు ముగిసినంత సెగలు రేగె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పగలు  ముగిసినంత  సెగలు రేగె.
(ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు)

24 కామెంట్‌లు:

  1. విరహతాపమెంత విపరీతమైపోవు
    నిరులు క్రమ్మగానె హెచ్చుచుండె
    గుండెలోననేదొ గుబులు పుట్టుచునుండె
    పగలు ముగిసినంత సెగలు రేగె

    రిప్లయితొలగించండి
  2. వగల మారి యెండ పొగలు గ్రక్కుచు నేగె
    నీలి నీలి మొయిలు నింగి పైన
    విరహ మందు తార విలవిల లాడగ
    పగలు ముగిసి నంత సెగలు రేగె

    రిప్లయితొలగించండి
  3. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...

    ("పగ"లనుఁ దొలఁగించుకొనిన సౌఖ్యము లబ్బునని యిటఁ జమత్కరించనైనది)

    "పగ"లు తీవ్రమైన బ్రతుకు దుర్భరమౌను!
    పగలు ముగిసినంత, "సెగలు రేఁగె"
    ననెడు మాట మఱచి, యానందమునఁ దేలి,
    సౌఖ్య మనుభవింత్రు జనులు సతము!

    రిప్లయితొలగించండి
  5. ఆలు మగల మధ్య నలకలు చెలరేగి
    పోరు పెరిగి పోయి దూరమైరి
    పెద్ద వారు కలుప విరహ జీవులకు నా
    పగలు ముగిసినంత సెగలు రేగె!

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారూ,
    పగలు శబ్దానికి విరోధములన్న అర్థంతొ మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గుండె నిండ నిదుర మెండుగ పోదును
    పగలు ముగిసి నంత, సెగలు రేగె
    గ్రామ మందు పగల గారణం బుగమది
    పగలు గలుగు గృహము భస్మ మగును

    రిప్లయితొలగించండి
  8. పశ్చిమాద్రి పైన బవళించ భానుండు
    తొగలఱేడు వచ్చి తొంగి జూడ
    కొలను లోన విరియు కలువ కన్నె మదిన
    పగలు ముగిసినంత సెగలు రేగె !!!

    రిప్లయితొలగించండి
  9. సమస్య :పగలు ముగిసి నంత సెగలు రేగె
    పూరణ:నెగడి వంటి యెండ యెగసి యెగసి పడ
    పుడమి రగిలె ప్రొద్దు పోవు వరకు
    కంజహితుడు క్రుంక గా పగలు ముగిసి
    నంత సెగలు రేగె నవని పైన

    రిప్లయితొలగించండి
  10. మండుటెండ లోన మలమల మాడుచు
    తిరిగి రెల్ల జనులు దిశల కొకరు
    వానచినుకు కురియ వసుమతి వేడెక్క
    పగలు ముగిసినంత సెగలు రేగె.

    రిప్లయితొలగించండి

  11. విరహతాపమందు వేగిన ప్రియసతి
    చందనంపు చర్చచలువ లేక
    భర్త కౌగిలింత,పగలు ముగిసినంత
    సెగలు రేగె వగలు తగులు దీరె

    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మదిని’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. సమస్య పాదాన్ని స్థానభ్రంశం చేసిన విధానం ప్రశంసనీయం.
    మీ రెండవ పూరణకూడ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****

    రిప్లయితొలగించండి
  13. .ఆలుమగల పగలు తేలిక గాకున్న?
    పగలె రాత్రు లౌను| దిగులు నందు
    పగలు ముగిసి నంత-సెగలురేగె నటన్న?
    మనసు కెవరు రక్ష?మనుగ డెట్లు?
    2.నగల దిగులు దగిలి నగవును దెగడగ?
    “మగువ తెగువ బిగువు తగదటన్న
    పగలు”ముగిసినంత?సెగలు రేగె నపుడు
    రాత్రి సిగన పూలు రక్షలేక|

    రిప్లయితొలగించండి
  14. ఓట్ల ఫలితమెరిగి యోడిపోయినవారు,
    కుట్ర పన్నిరనుచు కుమిలి కుమిలి
    సూర్యుడస్తమించ క్షోభను సృష్టించ
    పగలు ముగిసి నంత రగిలె సెగలు!

    రిప్లయితొలగించండి
  15. మాట మీద మాట మంటలు చెలగంగ
    పగటి వేళ దాని పట్టి యుంచె
    రగిలి రగిలి మనసు పగలను దీర్చంగ
    పగలు ముగిసి నంత సెగలు రేగె
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. కౌరవాళి యనిని కాలధర్మము చెంద
    పగలు తీరెగాని,పాండు సుతుడు
    బంధులెల్ల చావ పాపభీతి పొగిలె
    పగలు ముగిసినంత సెగలురేగె

    పగటి సూర్యుడంత పడమర జారగా
    మల్లెలవియ తావి మత్తునిడగ
    వెన్నెలెంతొ విరిసె విరహమే హెచ్చెగా
    పగలు ముగిసినంత సెగలురేగె

    వేసవందు పగలువేడెక్కి సూర్యుడు
    నిండ్ల కప్పుల నిలనేచగాను
    రాత్రి విడుచు నవియె రాయిడ వేడిని
    పగలు ముగిసినంత సెగలురేగె

    వేసవావకాయ వేడ్కగా తినియుంట
    మెచ్చుకొంద్రు రుచిని మేలుగాను
    రాత్రిగాగ సెగలు రవ్వను బెట్టుగా
    పగలుముగిసినంత సెగలురేగె

    రిప్లయితొలగించండి
  18. తాత తండ్రు లంత తన్నుకు చావగా
    మనవలకును రాజ్యమదియ వచ్చె
    పాతపగల పండ్లు పటపట నూరగా
    పగలు ముగిసినంత సెగలురేగె

    రిప్లయితొలగించండి
  19. కె. ఈశ్వరప్ప గారూ,
    వృత్త్యనుప్రాసతో మీ పూరణలు మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
    ‘వేసవి+అందు, వేసవి+ఆవకాయ’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. కథను ముందు నాయికయు, నాయకుల మధ్య
    పొరలు, పొచ్చములును పొడగుచుండె;
    సగము ముగియువేళ చాల ప్రీతిఁ గలిగి
    పగలు ముగిసినంత సెగలు రేగె.

    రిప్లయితొలగించండి
  21. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పొడగుచుండె’... ‘పొడముచుండె’కు టైపాటా?

    రిప్లయితొలగించండి
  22. అంతమవ్వ గానె యాషాడ మాసమ్ము
    యల్లుడరిగె శీఘ్ర మత్తయిల్లు
    దినపు సమయమందు కనలేక సతినెమ్మి
    పగలు ముగిసినంత సెగలురేగె

    రిప్లయితొలగించండి
  23. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మాసమ్ము+అల్లుడు’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘...యాషాఢమను మాస|మల్లు డరిగె...’ అనండి.

    రిప్లయితొలగించండి
  24. గురువుగారు,
    మీరు చెప్పినదే సహజంగా ఉంది.
    పొడగు= వర్ధిల్లు అని నిఘంటువులో చూశాను.
    పొడుముట మామూలుగా వాడేమాట. బాగుంది.ధన్యవాదాలు.

    కథను ముందు నాయికయు, నాయకుల మధ్య
    పొరలు, పొచ్చములును పొడగుచుండె;
    సగము ముగియువేళ చాల ప్రీతిఁ గలిగి
    పగలు ముగిసినంత సెగలు రేగె.

    రిప్లయితొలగించండి