1, జూన్ 2015, సోమవారం

పద్య రచన - 923

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. యక్షుని వరముల వలనను
    లక్షణముగ సాధించి రంట లౌల్యము లేకన్
    పక్షములు గడచి పోయివి
    లక్షణముగ గెలు పొంది రజ్ఞాత మునన్
    ---------------------------------------
    బోధించగ భగ వానుడు
    వాదించక వినుచు భక్తి పాండు సుతులెల్లర్
    బాధను మరువగ ద్రౌపతి
    సాధించెను విరటు నీడ సైరంద్రి యనన్

    రిప్లయితొలగించండి
  2. సంధిఁజేయుటకై చను సమయమందు
    పార్థసారథి కలసి తా పాండవులను
    తెలిసికొనె వారిభావముల్ తెల్లముగను
    కొలువుకూటమునందనఁదెలియజేయ

    రిప్లయితొలగించండి
  3. ఆ.వె: కుళ్ళు బుద్ధి తోడ కురుపతి కొలువులో
    కపట జూదమాడి కాన కంపె
    పాండు సుతుల నెల్ల పాంచాలితో బాటు
    కష్ట కాల మెల్ల గడిపి రచట.

    రిప్లయితొలగించండి
  4. విధి సేతల దలబోయుచు
    మధుసూధనుచెంతజేరి, మాధవ, కరుణా
    నిధి! మా కీయిడు ములనే
    విధి దప్పింతువొ యటంచు, వేడిరి కృష్ణున్

    రిప్లయితొలగించండి
  5. నిరతము పరమాత్మఁ దలచి
    నెరనమ్మిన పాండుసుతుల నెరవేర్చగఁ దా
    చరియించె కృష్ణ మూర్తియె
    చరమాంకము వరకు ధర్మ స్థాపన జేయన్!

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    కాకుంటే గణదోషాలున్నవి. మీ పద్యాలకు నా సవరణలు....

    యక్షుని వరముల వలనను
    లక్షణముగ పొంది రంట లౌల్యము లేకన్
    పక్షములు గడచి పోయిన
    వక్షయముగ గెలుపు నంది రజ్ఞాతమునన్

    బోధించగ భగవానుడు
    వాదించక వినుచు భక్తి పాండవులెల్లన్
    బాధను మరువగ ద్రౌపది
    సాధించెను విరటు నీడ సైరంధ్రి యనన్.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కష్టకాలమందు గాచె శౌరి’ అంటే బాగుంటుందని నా సూచన.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ధర్మస్థాపన’ అన్నప్పుడు ‘ర్మ’ గురువై గణభంగం. ‘ధర్మసంస్థాపకుడై’ అనండి.

    రిప్లయితొలగించండి
  7. వనమున పాండవుల కలసి
    యొనరించెడు కార్యములకు యోచనలిడుచున్
    వనరుట వలదని వెన్నుడు
    యనునయముగ మాటలాడి యలమట దీర్చెన్!!!

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం :
    నిరతము పరమాత్మఁ దలచి
    నెరనమ్మిన పాండుసుతుల నెరవేర్చగఁ దా
    చరియించె కృష్ణ మూర్తియె
    చరమాంకము వరకు ధర్మ సంస్థాపకుడై!

    రిప్లయితొలగించండి
  10. శైలజ గారి పద్యం బాగుంది. మూడవ పాదం ఉకారాంతమై నాల్గవపాదం యడాగమంతో ఆరంభం అయింది.

    రిప్లయితొలగించండి
  11. వనరుట వలదని వెన్నుం
    డనునయముగ అని ఉంటే బాగుండేదేమో.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    శైలజ గారి పద్యంలో ఆ దోషాన్ని నేను గమనించలేదు. మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. పాండవు లూహలన్నియునుబట్టిన కృష్ణుడు-రాయబారమున్
    మెండుగ జేయనెంచియు సమీక్షగ అందరి తీరు తెన్నులున్
    “వండిన అన్నమున్ మెతుకువక్కటి జూసెడిరీతి-నీతియే
    బండగ?యుద్ధమెంచక సవాలును బెంచెను మధ్య వర్తిగా|
    2.రాయబార మెపుడు రక్షణ కొరకైన?
    మాయ మనసు లందు మంచి జేర?
    కురుల ముడిని వేయ?కురువంశు లంత-పాం
    చాలికోరినట్లు చావు లెట్లు?

    రిప్లయితొలగించండి
  14. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    ‘ఒక్కటి’ని ‘వక్కటి’ అన్నారు. ‘మెతుకు నొక్కటి’ అంటే సరి! అలాగే ‘కురువంశ్యు’లనండి.

    రిప్లయితొలగించండి
  15. ఈశ్వరప్ప గారి పద్యంలో యతికోసం "వక్కటి" అన్నారు.శంకరయ్య గారి సూచనమేరకు"నొక్కటి"అంటే పాదారంభంలోకూడా"యొండిన"అనిమార్చాలి

    రిప్లయితొలగించండి
  16. పరమాత్ముడు తోడున్నను
    నెరవేరదు కార్యమేది నేటికి నేడున్!
    హరిఁగూడిన బాండు సుతుల
    కరణ్యపజ్ఞాత వాస పంకము విడెనే?

    రిప్లయితొలగించండి
  17. తమతమ బాధల గ్రక్కుచు
    చమరించెడి కనుల దుడిచి చక్కగ వేడన్
    తమబంధువు కృష్ణున కిటు
    సమయమునను కావుమనెడి సంగతి గనరే!

    రిప్లయితొలగించండి
  18. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    ఈశ్వరప్ప గారి పద్యంలో మీరు సూచించిన ‘ఒండిన’ అనడమూ దోషమే! అది ‘వండిన’ కదా! ఆ పాదాన్ని ‘వండిన యన్నమున్ మెతుకు పట్టగ నొక్కటె యట్లు నీతిగా’ అంటే బాగుంటుందేమో?
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. గురుదేవులకు ధన్యవాదములు.
    సవరించిన పద్యం :
    పరమాత్ముడు తోడున్నను
    నెరవేరదు కార్యమేది నేటికి నేడున్!
    హరిఁగూడినంతఁ దప్పెనె
    యరణ్య వాసమ్ము, పాండవజ్ఞాతములున్?

    రిప్లయితొలగించండి