22, జూన్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1710 (మద్యము సేవించి నడుపుమా వాహనమున్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మద్యము సేవించి నడుపుమా వాహనమున్.
(నిన్న నేనెక్కిన ఒక ఆటో డ్రైవర్ కాస్త ఎక్కువగానే త్రాగి ఉన్నాడు. మాముందు పోతున్న ఒక వాహనం వెనుక ‘మద్యము సేవించి వాహనమును నడుపరాదు’ అన్న హెచ్చరిక కనిపించింది. అప్పుడు రూపుదిద్దుకున్న సమస్య ఇది...)

28 కామెంట్‌లు:

 1. విద్యా ! యెప్పుడు బలుకకు
  మద్యము సేవించి , నడపుమా వాహన ము
  న్మద్యముద్రాగక నెప్పుడు
  మద్యము మఱి హానిజేయు మదికి న్నెపుడున్

  రిప్లయితొలగించండి
 2. ఉద్యోగిగ చోదకుడవు
  మద్యమిటులఁ ద్రాగ నేల? మజ్జిగయే నై
  వేద్యము! పద! విరుగుడగున్
  మద్యము, సేవించి నడుపుమా వాహనమున్!

  రిప్లయితొలగించండి
 3. అద్యయనముచే|కాఫీ
  మద్యము’సేవించి?నడుపు మావాహనముల్
  ఉద్యమ కారులబొమ్మల
  విద్యను గ్రహియించు నాన్న-వీలుండినచో
  చిన్నపిల్లలబొమ్మలాటలోనాన్నతోదెలిపినపూరణం
  2.}మద్యమ ప్రోత్సాహంబును
  మద్యమ కారులును గాక|మనపాలకులా
  విద్యనునేర్చి యనిరి|లే
  మద్యము సేవించి నడుపుమా వాహనముల్.
  -------------లాభాలలక్ష్యమని---------

  రిప్లయితొలగించండి
 4. చోద్యము చూపకు జనులకు
  మద్యము సేవించి, నడుపుమా వాహనమున్
  విద్యార్థులు నుద్యోగులు
  సేద్యంబులకేగువారి జీవన రథమున్.

  రిప్లయితొలగించండి
 5. మధ్యమ అంగళ్లుంచియు
  మద్యము సేవించి నడుపు-మావాహనముల్
  మధ్యన పాలసి లున్నవి
  అద్యయనంబందు మంచి ఆదాయమదే|

  రిప్లయితొలగించండి
 6. మద్యము దుష్టము, కాదని
  మద్యము సేవించి నడుపు (ము+ఆ )మావాహనమున్
  సద్యంబగును యమున,క
  వద్యంబగునట్టికార్య ఫలితంబులిలన్
  నా భావము
  మద్యము చెడ్డది, అట్లు కాదని త్రాగి నడుపుము, అది యమునకు వెంటనే ఆహ్వానము పలుకును, అట్టి పనుల ఫలితాలు అధమముగా ఉండును

  రిప్లయితొలగించండి
 7. హృద్యము కాదది నడుపుట
  మద్యము సేవించి,-నడుపుమా వాహనమున్
  విద్యుడవై నియమములను
  పద్యము నడకల సొబగున పయనము సాగున్

  చోద్యము నపాయమందెదు
  మద్యము సేవించి,-నడుపుమా వాహనమున్
  వద్యమునౌ పద్ధతినటు
  హృద్యముగానడుపుమయ్య,యేవాహనమున్

  ఛేద్యము నయ్యెడు తెలివది
  మద్యము సేవించినంత,మనుజుల కెందున్
  విద్యుడవై మానుచునా
  మద్యము సేవించి,నడుపుమా వాహనమున్

  మద్యము మత్తిడు,తూలెదు
  మద్యము సేవించి,-నడుపుమా వాహనముల్
  విద్యుడవై,యెరుగుమిదియ
  హృద్యముకాకను నడిపిన నెందును చేటౌ

  రిప్లయితొలగించండి
 8. ఖాద్యమ్ముల భక్షించుచు
  మద్యము సేవించి నడుపుమా వాహనమున్
  సద్యః ఫలితము రక్షక
  యుద్యోగి నిను చెరసాల నుంచును దొసగున్

  రిప్లయితొలగించండి
 9. శ్రీ భాగవతుల కృష్ణారావుగారి పూరణ

  ఆద్యుని శీఘ్రముగ గనగ
  మద్యము సేవించి నడుపు; మావాహనమున్
  హృద్యమముగ నడుపగ మన
  కాద్యంతము సేమమగును గమ్యము చేరన్

  నిన్నటి పూరణకు బదులుగా ఈపూరణమును పరిశీలింప మనవి

  వెన్నప్పాలు జిలేబిలు
  సున్నుండలు చాల తినెను; జున్నును కాజా
  లున్నవి; వక్క తమలములు
  సున్నమిడుము యన్నమేల చుట్టం బునకున్

  రిప్లయితొలగించండి

 10. చోద్యము కాదిది కదలవు
  మద్యము సేవించి నడుప మావాహనముల్
  ఉద్యోగీ నమ్మనిచో
  మద్యము సేవించి నడుపుమా వాహనమున్.

  రిప్లయితొలగించండి
 11. విద్యను మొత్తము జూపుచు
  సద్యో రక్షకుడ వగుచు సమయస్ఫూర్తిన్
  రధ్యల లోపల,ప్రీతియన్
  మద్యము సేవించి నడుపుమా వాహనమున్

  రిప్లయితొలగించండి
 12. సహదేవుడు గారూ ! మజ్జిగ ద్రాగించిన పూరణ బాగుంది...
  మిస్సన్నగారూ ! భళా ...

  రిప్లయితొలగించండి
 13. హనుమచ్ఛాస్త్రి గారూ ! ధన్యవాదాలు. మీ పూరణకోసం చూస్తున్నాను.
  సహదేవుడు గారి పూరణ అద్భుతంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 14. నేనూ మిస్సన్నగారి బాటలోనే.....

  విద్యను సాఫ్ట్ వేర్ మా సన్
  చోద్యమ్మొక ట్రిక్కు జేర్చె జూడుము చెక్ జెయ్ !
  వైద్యా ! ఆగును త్రాగిన
  మద్యము, సేవించి నడుపుమా వాహనమున్.

  రిప్లయితొలగించండి
 15. పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మదికి న్నెపుడున్’ అన్నదానిని ‘మానవుల కిలన్’ అంటే బాగుంటుందేమో?!
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  గోలి వారు ప్రశంసించినట్లు మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనము.
  మొదటిపూరణలో అన్వయం తప్పినట్టుంది. ‘అద్యయనము’ అన్న పదం లేనట్టుంది.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  కాకుంటే అన్నింటా భావసారూప్యం ఉంది. వైవిధ్యం కనిపించడం లేదు.
  *****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. నిన్నటి సమస్యకు మీ తాజా పూరణకూడ బాగున్నది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం. ‘రథ్యలలో ప్రీతియనెడి’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. గురుదేవులకు ధన్యవాదములు.
  మరియు కవిమిత్రులు శ్రీగోలివారికి, శ్రీమిస్సన్నగారికి ధన్యవాదములు.తమరిపూరణలూ అభినందనీయమే.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారు
  కందము లో ప్రాసకు ముందు లఘువు ఉంటే నాలుగు పాదాల్లోనూ లఘువే రావాలని, గురువు ఉంటే, గురువే రావాలనే నియమానికి మినహాయింపు లేమైనా ఉన్నాయా?
  దయచేసి తెలుపగలరు

  రిప్లయితొలగించండి
 18. గురువుగారు
  కందము లో ప్రాసకు ముందు లఘువు ఉంటే నాలుగు పాదాల్లోనూ లఘువే రావాలని, గురువు ఉంటే, గురువే రావాలనే నియమానికి మినహాయింపు లేమైనా ఉన్నాయా?
  దయచేసి తెలుపగలరు

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు... ఇంతకూ ఏవిషయంలో మీరు ప్రశంసించింది?
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  ఆ నియమానికి మినహాయింపు లేదు. అది కచ్చితంగా పాటించవలసిన నియమం. ఈ విషయమై కొన్నిరోజుల క్రితం చిన్న చర్చ జరిగింది. ప్రాసకు ముందున్న అక్షరం గురువు ఉండాలన్నప్పుడు అది తప్పనిసరిగా దీర్ఘమే అయి ఉండవలసిన పని లేదు. అది దీర్ఘం కాకున్నా తర్వాత ద్విత్వ సంయుక్తాక్షరాల వల్ల గురువౌతుంది కదా! ఉదా.. విద్య... పాద్య... ఖ్యాద్య... గద్య... ఇవి ఒక కందంలో నాలుగుపాదాల మొదటి రెండక్షరాలనుకుందాం. వి, పా, ఖా, గ.. రెండు హ్రస్వాక్షరాలు, రెండు దీర్ఘాక్షరాలు... కాని అన్నీ గురువులే..

  రిప్లయితొలగించండి


 20. మనమున నుంచుకొనుము నా
  మనవిని కారును నడుపకు మద్యము సేవిం
  చి - నడుపుమా వాహనమున్
  సునిశితముగ దారిచూసి సొంపుగ నీవున్

  రిప్లయితొలగించండి
 21. గురువుగారూ
  కృతజ్ఞతలు. దీర్ఘమున్నా, లేకున్నా, అది గురువు అవుతుంది కనుక పాద్య, అయినా పద్య అయినా పరవాలేదని దీని అర్థము. కానీ ఒకచోట. గురువు అని కాకుండా, దీర్ఘమయితే దీర్ఘమే ఉండాలని ఉంది. ఇది ఆ పుస్తక దోషమనుకోవచ్చా.
  లఘువు, గురువు లే ముఖ్యమనుకోవచ్చా? క్షమించండి. తెలుసుకోవాలని, అడుగుతున్నాను.

  రిప్లయితొలగించండి
 22. గురువుగారూ
  కృతజ్ఞతలు. దీర్ఘమున్నా, లేకున్నా, అది గురువు అవుతుంది కనుక పాద్య, అయినా పద్య అయినా పరవాలేదని దీని అర్థము. కానీ ఒకచోట. గురువు అని కాకుండా, దీర్ఘమయితే దీర్ఘమే ఉండాలని ఉంది. ఇది ఆ పుస్తక దోషమనుకోవచ్చా.
  లఘువు, గురువు లే ముఖ్యమనుకోవచ్చా? క్షమించండి. తెలుసుకోవాలని, అడుగుతున్నాను.

  రిప్లయితొలగించండి
 23. కవిమిత్రులు అశ్వత్థనారాయణమూర్తిగారూ! అది కచ్చితముగఁ బుస్తక దోషమే! "గుర్వక్షర"మనక, "దీర్ఘాక్షర" మనుట తప్పుకాక మఱేమగును? స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  స్థానాంతరంలో సమస్య పాదాన్ని ఇమిడ్చి చక్కని పూరణ చేశారు. బాగుంది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  గుండు మధుసూదన్ గారు చెప్పినట్లు అది పుస్తక దోషమే! కందం పాదాద్యక్షరాలు గురులఘుసామ్యాన్ని కలిగి ఉండాలి. అంతే కాని దీర్ఘహ్రస్వసామ్యం కాదు. హ్రస్వదీర్ఘప్లుతాలు వ్యాకరణ పారిభాషికాలు. ఛందశ్శాస్త్రం వేరు, వ్యాకరణ శాస్త్రం వేరు. ఛందస్సులో అక్షరాలు లఘువులనీ, గురువులనీ రెండే రకాలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. ​హృద్యంబగు మా కారుకు
  సద్యః స్టీరింగు మొండి​(జాము)​; సత్తువ కలుగన్
  చోద్యమె అయినను కొంచెము
  మద్యము సేవించి నడుపు మా వాహనమున్!

  రిప్లయితొలగించండి
 26. విద్యావంతుడ! వినుమా!
  సద్యశమును వొందువీవు సత్వర రీతిన్
  హృద్యమ్ముగ జేర యముని
  మద్యము సేవించి నడుపుమా వాహనమున్!

  రిప్లయితొలగించండి


 27. పద్యము లన్వ్రాయుమయా
  మద్యము సేవించి, నడుపుమా వాహనమున్
  సేద్యపు రీతి గవనముగ
  వేద్యంబగునీకు దరువు వేగము గానన్ !

  నారదా!

  జిలేబి

  రిప్లయితొలగించండి
 28. విద్యాపతి! మాట వినర!
  ఆద్యంతము ముక్కు చీది హైరన పడకే
  హృద్యమ్మయ్యెడి సిరపున
  మద్యము సేవించి నడుపుమా వాహనమున్

  రిప్లయితొలగించండి