12, జూన్ 2015, శుక్రవారం

పద్య రచన - 930

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

 1. అల్లరి కృష్ణుని చేష్టలు
  నెల్లప్పుడు వెన్న కొఱకు నెవ్విధి నైనన్
  మెల్లగ తలుపుల చాటున
  గొల్లల యిండ్లందు నక్కి కొంటె తనంబున్

  రిప్లయితొలగించండి
 2. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘ఇండ్లయందు’ అని యడాగమం వస్తుంది. అక్కడ ‘గొల్లల గృహములను...’ అనండి.

  రిప్లయితొలగించండి
 3. ఆ.వె: నంద బాలు డచట నవనీతముకొరకు
  వాడ లోని గొల్ల భామ లింట
  నక్కి నక్కి జూడ నవ్వుచూ నలుదెసల్
  పట్ట నెంచ భామ పరుగు దీసె

  రిప్లయితొలగించండి
 4. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  ‘నవ్వుచూ’ అన్నదాన్ని ‘నవ్వుచు’ అనండి.

  రిప్లయితొలగించండి
 5. ఆ.వె: నంద బాలు డచట నవనీతముకొరకు
  వాడ లోని గొల్ల భామ లింట
  నక్కి నక్కి జూడ నవ్వుచు నలుదెసల్
  పట్ట నెంచ భామ పరుగు దీసె

  రిప్లయితొలగించండి
 6. చిన్ని కృష్ణయ్య నిలుచుండె చెన్నుగాను
  తోడికోడళ్ళ బంధముఁ ద్రుంగజేయ
  నత్తకోడళ్ళ మధ్యలో నగ్గిపెట్టి
  వెన్నమీగడలను దోచు వేడ్కతోడ

  రిప్లయితొలగించండి
 7. తలుపు చాటున నుండియు దైవ మచట
  చూచు చుండెను వెన్నకై చోద్య మరయ
  జగము గాపాడు పోషించు శక్తి యుతుడు
  దొంగ వోలెను నుండుట రంగ ! కంటె ?

  రిప్లయితొలగించండి
 8. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. వెన్న కాజేతువో కన్నెల జూతువో
  ....మరుగేలరా నీకు మదనతాత!
  పూతన వచ్చెనో మాత రావచ్చునో
  ....నక్కితి వేలరా నళిన నయన!
  బండి కన్పట్టెనో పాము పైకొట్టెనో
  ....దాగితి వేలరా దనుజవైరి!
  ద్రౌపది పిలచెనో రాధమ్మ వలచెనో
  ....చాటుమాటేలరా చతురవచన!

  మధుర కేగెడి వేళాయె మాధవ యని
  వచ్చెనా యేమి యక్రూరు డిచ్చటకును!
  చాలు దొంగాట లికచాలు నీలవర్ణ!
  నీవె దొర వేలరా మమ్ము నెమ్మది గని !

  రిప్లయితొలగించండి
 10. ఒకకంట భక్తుల నొకకంట శక్తుల
  ---------బంచగ నెంచిన బాల కృష్ణ|
  నెమలిపింఛపు చూపు సమతల భావాన
  -------చింతలు మాన్పేటి చిన్ని కృష్ణ|
  కాలి అందియ లుంచు తేలిక సవ్వడి
  ------ముచ్చట గొల్పులే ముద్దు కృష్ణ|
  నవ్వెడి మోమున రవ్వల కాంతియు
  ------కొసరుచు మముజేరు కొంటె కృష్ణ|
  దొంగ చూపులు ఎన్నున్న?దొరవు నీవె|
  పగలు,రేయిగ నీరూపు దిగులు మాన్పు
  జీవకోటికి రక్షగా భావనొసగ
  నిలిచి యున్నట్టి –శ్రీకృష్ణ నిన్ను దలతు.
  2మానసమందు దాగి ననుమానము గల్గిన?అర్ధ రూపుచే
  జ్ఞానుల భక్తి, శక్తులకు చక్కటి రూపున బాల కృష్ణ్డుడే
  దానవ దండనల్ జరుప?దాగియు గానక శిక్ష వేయుచున్
  దీనజనాలి రక్షణకు దీక్ష వహించిన కృష్ణ|వందనాల్

  రిప్లయితొలగించండి
 11. మిస్సన్న గారూ,
  మీ పద్యం మనోజ్ఞం. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  చక్కని భావసంపదతో మంచి పద్యాలను రచించారు. అభినందనలు.
  ‘భావన నిడ’, ‘దాగు ననుమానము’ అనండి.

  రిప్లయితొలగించండి
 12. పాలను వెన్నను దోచగ
  తాలిమితో తలుపు వెనుక దాగిన కృష్ణా!
  లీలా వినోద మేలనొ?
  కోలుగ నిను గొలుచు మమ్ము కొంచెము గనుమా!!!


  రిప్లయితొలగించండి
 13. శైలజ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. నక్కి నక్కి జూచె నదివొ నంద బాలుడింపుగన్
  చక్కగాను వచ్చి పాలు సరజమంత ద్రాగునే
  చిక్కు ముడులు వేయు గాని చిన్ని కన్న చిక్కడే
  మ్రొక్కు కున్న వదల డమ్మ ముద్దు లొలుకు కృష్ణుడే!!!

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారూ శభాష్ ! సొగసైన పద్యం ! రసవంతమైన భావం ! అభినందనలు !

  ( " వెన్న కాజేసెదో కన్నెలఁ జూసెదో " , ద్రౌపది పిలిచెనో ( పిలుచు ---> పిలిచెనో ) అనే చిన్నపాటి వ్యాకరణానుకూలమైన సవరణలతో )

  రిప్లయితొలగించండి
 16. శైలజ గారూ,
  మీ తాజా పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  మిస్సన్న గారూ,
  డా. విష్ణునందన్ గారి ప్రశంసలందుకున్న మీరు కృతార్థులు. మీకు నా ప్రత్యేక అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. జాతీయ పక్షి ఈకలు
  ప్రీతిగతలఫైన నుంచి-?ప్రేమను నిడు మా
  నేతవు|దాగుడు మూతల
  దాతవు|శ్రీ కృష్ణయను-విధాతవుబాలా|

  రిప్లయితొలగించండి
 18. తలపుల తెలియనిదున్నదె?
  తలుపది చాటేల ధర్మి! తగవులు చాలున్!
  తెలిపెడు వాడవు నీవని
  దెలియగ నే వేడు చుంటి తెరువర తలుపుల్!

  రిప్లయితొలగించండి
 19. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. పాలను వెన్నను దోచెడు
  లీలలు తోచంగ 'బాపు' రేఖలు దిద్దెన్!
  నాలుగు గీతల జిక్కిన
  కాళియ మర్ధను పటమ్ము కళ్ళకు గట్టన్!

  గీతను జెప్పిన వానిని,
  గీతలు మార్చెడు ప్రభువును,గిరిధారినిలన్
  గీతలతో నిల్పె నెదుట
  గీతమ్ముల పాడ రండు కృష్ణున్! విష్ణున్!

  రిప్లయితొలగించండి
 21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ తాజా చాలా పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. విష్ణునందనులకు కృతజ్ఞతాభి వందనములు.

  రిప్లయితొలగించండి
 23. డా. విష్ణునందనుల సూచనల మేరకు సవరించిన పద్యం:

  వెన్న కాజేసెదో కన్నెల జూసెదో
  ....మరుగేలరా నీకు మదనతాత!
  పూతన వచ్చెనో మాత రావచ్చునో
  ....నక్కితి వేలరా నళిన నయన!
  బండి కన్పట్టెనో పాము పైకొట్టెనో
  ....దాగితి వేలరా దనుజవైరి!
  ద్రౌపది పిలిచెనో రాధమ్మ వలచెనో
  ....చాటుమాటేలరా చతురవచన!

  మధుర కేగెడి వేళాయె మాధవ యని
  వచ్చెనా యేమి యక్రూరు డిచ్చటకును!
  చాలు దొంగాట లికచాలు నీలవర్ణ!
  నీవె దొర వేలరా మమ్ము నెమ్మది గని !

  రిప్లయితొలగించండి