16, జులై 2016, శనివారం

పద్మావతీ శ్రీనివాసము - 3

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ప్రధమాశ్వాసము (41-60)

అవిధేయ మునిఁ గని యాగ్రహ మొందె
ను విరించి తనయు డనుచు శాంతుడయ్యె               41

ధాత నిజ జనకు తాపము జూచి
వీత సంభావన వెడలె భూసురుడు                 42

హిమగిరి తదుపరి యేగెను ధృతిని
ప్రమథాధిపతిఁ జూడ పౌరుష మొప్ప               43

కనియెం భృగు మహర్షి గరళోగ్ర కంఠు
ననలాంబకు గిరీశు నంగజ హరుని                44

భృగుగని సోదరప్రేమ మూర్కొనగ
దగ నెదురేగె నథర్వుడు నంత                      45

అల సత్వ గుణము దా నరయ దలంచి
యలసత్వమున నుండె నంత భూసురుడు         47

ద్విజు వర్తనముఁ గని తీవ్ర రోషమున
నజుడు శూలం బేయ నడర నాపె నుమ           48

రోషాకలిత వేషు రుద్రునిఁ జూచి
భాషా విహీనుడై పఱగె ద్విజుండు                   49

శీఘ్ర కోపోద్రిక్త చేతస్కుఁ గాంచి
శీఘ్రమ మరలెను శీతాద్రి నతడు                   50

కలియుగ కళ్యాణ కాంక్షిత మతులు
నలిననాభసుతు పినాకి లీల లవి                   51

శ్రాంతాపగతుడును సంయమి వరుడు
చింతాకులిత తప్త చేతస్కు డయ్యె                  52

చనిచని కాంచెను సంయ మీద్రుండు
వనజాక్ష విలసిత వైకుంఠ మునను                53

వైకుంఠ పురవాసు వందిత శక్రు
లోకైక రక్షకు రుచి రాంతరంగు                     54

ఘన నీల వర్ణుని కౌస్తుభాభరణు
ఘన చక్ర హస్తుని కౌశేయ వస్త్రు                    55

హర్యక్ష నిభమధ్యు నఖిలాండ నాథు
పర్యంక ఫణిరాజు పద్మాయతాక్షు                   56

సురగణ సేవితు సుంద రాకారు
హరిని రమా వినో ద్యచ్యు తానంతు                 57

కని గుణ శోధన కాంక్ష మీరంగ
ఘనవామ పాద విఘాతోరు జేసె                   58

లక్ష్మీ నివాసస్థలం బది నేడు
సూక్ష్మీ కృతం బయ్యె చోద్యముగఁ దృటి            59

పరమాత్మ గుణగణ పరిశోధన ముని
వరునకు తగునెట్లు వర గర్వ మకట               60

4 కామెంట్‌లు:

  1. శ్రీని వాసుని జరితము వీనులకును
    నింపు గానుండె జదువఁగ నెంతయోను
    పద్మ యుతుడగు వెంకన్న బరఁగ నిచ్చు
    నాయు రారోగ్య సంపద లధిక ముగను

    రిప్లయితొలగించండి
  2. శంభుని కోపాన్నిజూచి పాఱిన బృగుముని శాంత స్వభావంతో ఉన్న హరిని వామపాదంతో తన్ని లక్ష్మీనారాయణులను భూలోకంలోని రావటానికి నాంది పలికాడు. కామేశ్వర రావు గారూ మీ ద్విపద చక్కని పదముల కూర్పుతో సాగుతుంది.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి