3, సెప్టెంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం -447 (ఓడ నేల పయిన్)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
ఓడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె.
ఈ సమస్యను సూచించిన
కోడీహళ్ళి మురళీమోహన్ గారికి
ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _________________________________

    మోహ రించిరి జూదరుల్ - గేహ మునను
    మోహనుండంత చేతిలో - ముడుపు లేక
    మోహ మెక్కువై ,యా ,పందె - మునను, కారు
    నోడ ! నేల పయి న్నడ - యాడ దొడగె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  2. బాలుడటఁ జేసె చిన్నదౌ పడవ నొకటి,
    త్రాడు గట్టెను దానికి నాడఁ దొడగె.
    ఓడ నేల పయిన్ నడయాడఁ దొడగె
    నంచు సంతసించె నపుడు నాట లందు.

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ ! మీ కాగితప్పడవ పరుగులు బావున్నాయ్ నేలమీద !

    02)
    _________________________________

    పాడు జూదము , సర్వంబు - పాండు తనయు
    డోడ ! నేల పయి న్నడ - యాడ దొడగె
    పంచ భర్తృక , తమ్ముల - పాటు గలసి
    కాననములకు బోవగా - కలత తోడ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  4. కిశోర్జీ ! మందాకిని గారూ ! మీ మీ ఓడలు పదెం లో, పిల్లవాని చేతి లో.. బాగా నడిచాయండీ...


    ఊరి లోనికి సర్కస్ వారు వచ్చె,
    వారు త్రిప్పుచు నుండిరి వరుసగాను
    జనము ముందర పులి, యేన్గు , చిరుతె, డారి
    ఓడ, నేల పయిన్ నడయాడఁ దొడఁగె !

    రిప్లయితొలగించండి
  5. చిన్న టైపాటు సవరణ,
    ఊరి లోనికి సర్కసు వారు వచ్చె,
    వారు త్రిప్పుచు నుండిరి వరుసగాను
    జనము ముందర పులి, యేన్గు , చిరుతె, డారి
    ఓడ, నేల పయిన్ నడయాడఁ దొడఁగె !

    రిప్లయితొలగించండి
  6. కిశోర్జీ ! ఓడను 'ఓడ' జేసి పూరించారు బాగుంది....
    నేనూ మీ బాటలో వస్తా..

    కారు లోననె దిరుగును కాలు క్రింద
    పెట్ట డాతడు, యొరులకు పెట్టు గుణము,
    నేడు చూడగ జీవన క్రీడ లోన
    నోడ, నేల పయిన్ నడయాడఁ దొడఁగె !

    రిప్లయితొలగించండి
  7. చిన్న సవరణ "యొరులకు" బదులుగా "పరులకు" అని చదువగా మనవి.

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రీజీ ! మీ సర్కస్ బావుంది !ఎడారి ఓడను పట్టారు !
    జీవన క్రీడలో నోడ - ఇంకా బావుంది !

    03)
    _________________________________

    వరము విరమించ,బ్రతిమాలి - భంగ మవగ
    చపల భార్య నొప్పించ,ద - శరథు డంత
    ఓడ ! నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె
    సీతతో గూడి రాముండు - చేను బోవ !
    _________________________________
    చేను = అడవి

    రిప్లయితొలగించండి
  9. 04)
    _________________________________

    ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె
    జలము లోనికి జొరపడు - బిలము మూయ
    ఇసుక మీదకు లాగంగ - విసురు గాను !
    బిలము మూయగ పరువెత్తె - జలము లోన !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్:
    పేకాటలో ఓడిపోయినా, పాపారావులు, పాపరాజులు ఇంకా అక్కడే వేలాడుతునే వుంటారు, ఏమిటో ఇంకా మోజు. ఇది సర్వత్రా వున్నదే, ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆముదాలవలస అనే తేడా లేకుండా.
    పగలు రాత్రి పేకాటన పందె మొడ్డి
    ఖర్చు మరచి చివరి పుడికాసు గూడ
    నోడ నేల పయిన్ నడయాడఁ దొడఁగె
    "పాపరాజు" నచ్చోటును వదల లేక!

    రిప్లయితొలగించండి
  11. చంద్రశేఖరా ! చివరికి మీరు కూడా ఓడిపోయారు ! బావుంది !

    05)
    _________________________________


    వేగముగ వాయు మార్గాన - నేగు నదియె
    తిరిగి , వక్రము నేలకు - దిగెడు , గాలి
    యోడ , నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె
    వేగ మది తగ్గి పూర్తిగా - నాగు వరకు !
    _________________________________

    రిప్లయితొలగించండి
  12. ఏం చేస్తాం, వసంత మహోదయా! ఇంట గెలవటం (అంటే ఇష్టంగా ఓడటం), బయట ఓడటం (అంటే అయిష్టంగా గెలవటం), రెండూ అలవాటై పోయాయి. ఈ రోజు కాళ్ళకూరి నారాయణ రావు గారి చింతామణి నాటకం (1923) చదివి, భానుమతి "చింతామణి" సినిమా కూడా చూశాను. అద్భుతమైన సాహిత్యం. మూడంతా మారిపోయింది. దేనికి మీదకి మళ్ళింది, అని అడక్కండి :-)

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖరా ! అన్నగారి సినిమా చూశారా ! అదృష్టవంతులు !
    ఆ ఒక్కటీ అడగను లెండి !

    రిప్లయితొలగించండి
  14. 06)
    _________________________________

    " ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె "
    చిత్ర మిందేమి గలదయ్య - మిత్రు లార !
    నేల యిసుకైన గరుకైన - నిజము గనుడు
    మీఱి పరువెత్తు గాదె ! యె - డారి యోడ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  15. 07)
    _________________________________

    తోడి బాలుర తోగూడి - నాడు నపుడు
    ఓడ రూపంబు నున్నట్టి - కారు నడిపె !
    తోడి బాలురు , యీర్ష్యతో - వేడు చుండ
    ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  16. నదుల లోనూ సముద్రంలోనూ ముఖ్యంగా నౌకాశ్రయాలలో
    పూడిక తీయుటకు ఉపయోగిస్తారు "DREDGER"
    "తవ్వోడ" అంటారు దానిని ! అది నేలపై కూడా నడుస్తుంది !


    08)
    _________________________________

    పూడికను దీసి లోతు ,పెం - పొంద జేసి
    వేరు చోటుకు పనిమీద - వెడలు నపుడు
    చిత్ర చిత్రముగ నడచు - చైను తోడ
    ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె !
    _________________________________
    ఓడ = తవ్వోడ

    రిప్లయితొలగించండి
  17. 07అ )
    _________________________________

    తోడి బాలుర తోగూడి - నాడు నపుడు
    ఓడ రూపంబు కారును - వాడు నడిపె !
    తోడి బాలురు , యీర్ష్యతో - వేడు చుండ
    ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  18. భరత మాతకు బిడ్డలై పరవశింప
    దేవ లోకము విడనాడి దివ్యు లెల్ల
    కదిలి వచ్చితిరేకమై. కనుమ చక్క
    నోడ! నేల పయిన్ నడయాడఁ దొడఁగె.

    రిప్లయితొలగించండి
  19. రాబోతున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రామృతంలో ఈ క్రింది టపా ఉంచాను.
    http://andhraamrutham.blogspot.com/2011/09/blog-post_03.html
    మీ అందరూ తప్పక స్పందించి, ఉపాధ్యాయుడు అనే పదానికి నిర్వచన ప్రాయంగా మీ అభిప్రాయాలను పద్య రూపంలో గాని, వచన రూపంలో గాని వ్రాసి పంపగలరని ఆశిస్తున్నాను.
    శంకరయ్య గారి అభిప్రాయంకూడా ఉపాధ్యాయ లోకానికి శిరోధార్యంగా భావిస్తున్నాను.
    శంకరాభరణం ద్వారా ఈ విషయం తెలియ జేస్తున్నందుకు ఆనందంగా ఉంది.ఇందు నిమిత్తము శంకరయ్య గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    ( గనులను తిన్న వారు నేడు పడుతున్న భాదలను ఈ విధముగా)
    గనుల దిన్న ఘనులనెల్ల కటిక నేల
    పై పరుండ బెట్టగ, వారి పుత్తడి గల
    చిద్ర మై నిద్ర రహితులై చీకటిన ద
    నోడ నేల పయిన్ నడయాడ దొడగె|

    రిప్లయితొలగించండి
  21. వివిథ రకాలుగా "ఓడ"గొట్టిన కవి మిత్రులకు అభినందనలు.
    హనుమచ్ఛాస్త్రి గారి ఎడారి ఓడ, వసంత కిశోర్ గారి గాలి ఓడ ప్రయోగాలు బాగున్నాయి.
    చింతా వారి పూరణ బాగుంది. "చక్కనోడ" అంటే "చక్కని వాడు" కు వ్యవహారీక రూపమా?

    రిప్లయితొలగించండి
  22. చూడఁగ "డ"కారమె శివుఁడు, శుభములిడగ
    కాశికా పట్టణమ్మున వాశిఁ గాంచె
    వీడి వచ్చె కైలాసము, చూడరె యది
    వో! "డ" నేల పయిన్ నడయాడఁ దొడఁగె!!

    డ = శివుఁడు

    రిప్లయితొలగించండి
  23. పెండ్లి కూతురు రుక్మిణి ప్రియుని రాక
    కెదురు జూచుచు నగజాత యెదుట నిల్చి
    కొల్చె - నుద్విగ్నహృదయానుకూలతల - న
    వోఢ నేలపయిన్ నడయాడ దొడగె

    రిప్లయితొలగించండి
  24. నా పూరణలు ....
    (1)
    వనధిలోన ప్రయాణసాధన మదేది?
    పైకి విసరిన వస్తువుల్ పడు నెచటను?
    తిరుగసాగె నన నేది మరొక పదము?
    ఓడ; నేలపయిన్; నడయాడసాగె.
    (2)
    తా నదృష్టవంతుఁడ నని తలఁచి యొక్కఁ
    డందమైన యూహాలోక మందు తిరిగి
    మోద మొప్పఁగ నాడిన జూదమందు
    నోడ, నేలపయిన్ నడయాడసాగె.

    రిప్లయితొలగించండి
  25. విశ్వ కప్పును గెలిచిన వీరు లకట
    ఓడనేల? పయిన్ నడయాడ దొడగె
    నేమొ గతజయ గర్వమ్ము,టీముకిపుడు
    జబ్బుతొలగి ,నేడువిజయ మబ్బునేమొ !!!

    రిప్లయితొలగించండి
  26. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. ఎందుకు తొలగించారు?

    రిప్లయితొలగించండి
  27. మంద పీతాంబర్ గారూ,
    ఓహో ... పట్టిన జబ్బును తొలగించారా? బాగుంది.

    రిప్లయితొలగించండి
  28. కవిమిత్రులారా,
    ఉదయం ఈ సమస్యను ఇస్తున్నప్పుడు ఇన్ని వైవిధ్యభరిత పూరణలు వస్తాయని ఊహించలేదు. అందరూ తమతమ మేధస్సులకు పదును పెట్టి ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా చక్కని పూరణలు పంపారు. మహదానందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ ఎనిమిది పూరణలు (ఇప్పటికి వచ్చినవి!) దేనికదే వైవిధ్యంగా అద్భుతంగా ఉన్నాయి.
    మొదటి పూరణలో ‘కారు నోడ’ జేసారు.
    రెండవ పూరణలో ‘ధర్మరాజు నోడించారు’.
    మూడవ పూరణలో ‘దశరథుని ఓడించారు’
    నాల్గవ పూరణలో జలప్రవేశం చేయని ఓడ గురించి చెప్పారు. బాగుంది. చివరి పాదంలో ‘బిలము తెరువగ’ అంటే బాగుంటుందేమో?
    ఐదవ పూరణలో నేలవ్రాలుతున్న గాలియోడను వర్ణించారు. బాగుంది. ‘తిరిగి , వక్రము నేలకు - దిగెడు’ అన్నదాన్ని ‘తిరిగి వక్రగతిని నేల దిగెడు’ అంటే ఎలా ఉంటుంది?
    ఆరవ పూరణలో ‘ఎడారి యోడ’ను వర్ణించారు.
    ఏడవ పూరణలో ‘ఓడ వంటి కారు’ను వర్ణించారు. బాగుంది. ‘బాలుర తోగూడి + ఆడు నపుడు’ అన్నప్పుడు నుగాగమం రాదు, యడాగమం వస్తుంది. ‘బాలుర తోగూడి - యాడు నపుడు’ అందాం!
    ఎనిమిదవ పూరణలో తవ్వోడ ప్రస్తావన బాగుంది. కాని పద్యంలో ‘తవ్వోడ’ శబ్దం ప్రయోగిస్తే బాగుండేది. ‘పూడికను దీయునట్టి తవ్వోడ యొకటి’ అని మొదటి పాదాన్ని చెప్తే ఎలా ఉంటుంది?
    మొత్తానికి మీ పూరణలన్నీ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. అకట! జూదమిది తెలిసి యాడనేల?
    ఓడనేల? పయిన్ నడయాడ దొడగె,
    నెల్లవేళల ధర్మము నెఱుగుదునని-
    పత్ని,తమ్ముల నడవుల పాలుఁజేసె.

    రిప్లయితొలగించండి
  30. ' చీరలిచ్చెద నికనైన సిగ్గు విడిచి
    దాయు'-డనె కృష్ణు -'డదిగొ ! నాదరికి నడువ
    నోడనేల ? పయిన్ నడయాడ దొడగె
    నోముఫలమైన మోక్షమ్ము భామలార !'

    రిప్లయితొలగించండి
  31. మందాకిని గారూ,
    మీ కాగితపు ఓడ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    రెండవ పూరణలో ధర్మజుని దూతవ్యసనాన్ని చక్కగా వర్ణించారు.
    **********
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ ‘ఎడారియోడ’ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘చిరుత + ఎడారి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది కదా? ‘... పులు యేనుగును నెడారి’ అందామా?
    జీవనక్రీడలో ఓడినవాని పూరణ చాలా బాగుంది.
    **********
    చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఒక్కరోజులోనే ‘చింతామణి’ నాటకం చదవడం, సినిమా చూడడం అయిపోయిందా? సంతోషం. ఆ సినిమా సి.డి. నా దగ్గరా ఉంది. మా అబ్బాయి ఏదో సైట్ నుండి డౌన్ లోడ్ చేసాడు.
    **********
    చింతా రామకృష్ణారావు గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    ‘చక్కనోడ’ గ్రామ్యపద ప్రయోగంపై ‘జిగురు’ వారి వ్యాఖ్యను చూసారా?
    **********
    వరప్రసాద్ గారూ,
    చక్కని భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో ‘నిద్రా రహితులై’ అని సమాసం. ‘పుత్తడి గల’ అన్నచోట ‘పసిడి కలలు’ ‘నిద్రలేకుండ’ అందాం.
    **********
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఎందుకైనా మంచిదని ఒకసారి ‘ఏకాక్షరనిఘంటువు’ చూసి రూఢి చేసుకున్నాను.
    అద్భుతమైన పూరణ. అభినందనలు. ‘అదివో’ కంటె ‘అయయో’ అంటే సమస్య పాదానికి న్యాయం చేకూరుతుందని నా భావన. ఏమంటారు?
    **********
    రాజారావు గారూ,
    సుందరమైన భావం. చక్కని ధార. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    కాని ‘నవోఢ’ అనడం వల్ల సమస్య పాదానికి న్యాయం జరిగిందంటారా? అది ‘నవ + ఊఢ = క్రొత్తగా పెండ్లి అయిన స్త్రీ’ కదా. అందులోను ‘డ - ఢ’ ల భేదం ...?
    మీ రెండవ పూరణ అత్యద్భుతమూ, సర్వోత్తమమై అలరారు తున్నది. ధన్యవాదాలు.
    **********
    మంద పీతాంబర్ గారూ,
    విభిన్నమైన విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. మిత్రుల పూరణలను ముందే చదివి ఉంటే నా రెండవ పూరణను పోస్ట్ చేసేవాడిని కాను. సరె .. ఏం చేద్దాం? .. ఉండనిద్దాం.

    రిప్లయితొలగించండి
  33. గురువుగారూ, ధన్యవాదములు. ఊహాలోకాలు వదిలి నేలమీదికి వచ్చినవానిగురించి మీపూరణ, మిగిలిన అందరి పూరణలూ అలరించాయి. . వసంతకిశోర్ గారూ, గాలియోడ బాగుందండి.హనుమచ్ఛాస్త్రిగారు, జీవనక్రీడ లో ఓడిన వాని గురించి బాగాచెప్పారు
    అందరికీ పేరుపేరునా అభినందనలు.

    రిప్లయితొలగించండి
  34. పీతాంబరధరా మీ పూరణలోని విరుపు నాకు తట్టింది.
    పద్య రూపంలో పెట్టే లోపునే మీరు చక్కని పద్యాన్నిచ్చారు.
    అయినా నా ప్రయత్నం కొన సాగించాను. అభినందనలు.

    ఇక రకరకాల ఓడలు కనువిందు చేసాయి.
    జిగురువారి పూరణ ఈ నాటి హైలైట్.

    " కోతి నెదిరింప లేకను యాతుధాను
    లోడనేల? " పయిన్ నడయాడఁ దొడఁగె
    నిట్లు యోచింపుచున్ వీరు డింద్ర జిత్తు,
    తట్టె బ్రహ్మాస్త్ర మంత్రము ధైర్య మాయె.

    రిప్లయితొలగించండి
  35. పెద్దలు శ్రీ చింతా వారి పూరణ, గురువుగారి పూరణ మనోజ్ఞంగా ఉన్నాయి.
    మిగిలిన మిత్రుల పూరణ లన్నీ భేషుగ్గా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  36. మాస్టారూ, "చింతామణి" అలాంటిది సార్, పట్టుకొంటే వదలదు. ఒక్క రోజులోనే అయిపోయింది. నేను పుస్తకం, సినిమా గురించి చెబుతున్నాను సార్.మీరేమనుకొంటున్నారో (సరదాగా)!

    రిప్లయితొలగించండి
  37. తురగ మరువది నాలిగిండ్లు దూరి నడిపె
    తోసిరాజాటకట్టను; తొందఱపడి
    వీనితో నిప్పుడీయెత్తు నేను వేసి
    యోడ నేల? పయిన్ నడ యాడదొడఁగె

    తోసిరాజాటకట్టను తోసిరాజు + ఆటకట్టు + అను అనును
    పయిన్ నడ = next step

    రిప్లయితొలగించండి
  38. మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    * * * * * *
    కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
    పూరణలో చదరంగాన్ని దింపిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    ‘తురగ మరువది ..’ ? అక్కడ ‘నాల్గిండ్లు’ అంటే గణదోషం ఉండదు.

    రిప్లయితొలగించండి
  39. సత్యనారాయణ గారూ! మీరూహించినట్టే.చక్కనివాఁడా! అన్నదానినే చక్కనోడ! అని ప్రయోగించడం జరిగింది.

    రిప్లయితొలగించండి
  40. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
    నాలుగవ పూరణను మరియొకసారి గమనింపుడు !

    04)
    ఓడ నేల పయిన్ నడ - యాడఁ దొడఁగె
    జలము లోనికి జొరపడు - బిలము మూయ
    ఇసుక మీదకు లాగంగ - విసురు గాను !

    బిలము మూయగ పరువెత్తె - జలము లోన !

    అది జలప్రవేశం చెయ్యనిది గాదు !
    నీటిలో తిరిగేదాన్నే కన్నం పడితే బాగు చెయ్యడానికి
    బయటకు తీసుకొచ్చారు !
    కన్నం మూసివేసి నీటిలోకి పంపారు !

    రిప్లయితొలగించండి
  41. దక్షిణాఫ్రికా నుండి - గాంధీ రాక:

    ఎటులనేతలఁగలుపుదు,నేనెటుల స్వ
    రాజ్యమున్ దెత్తుఁ,స్వజనులురంజిల నను-
    దీర్ఘయోచనలఁబడిగాంధీజి దిగియె
    ఓడ, నేల పయిన్ నడయాడఁ దొడఁగె.

    రిప్లయితొలగించండి
  42. వసంత కిశోర్ గారూ,
    మన్నించాలి! నేనే మీ భావాన్ని అవగాహన చేసికొనడంలో పొరబడ్డాను.
    * * * * * * *
    ఊకదంపుడు గారూ,
    గాంధీజీని ఓడ దింపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  43. మిత్రులు బ్రహ్మాండ మైన పూరణలు చేసారు. మా విశాఖపట్టణములో ఓ జలాంతర్గామి బయటకు కొట్టుకొచ్చి ప్రదర్శించ బడుతున్నది.

    గాలి వాటము తప్పగ కాళ్ళ నీడ్చి
    యోడ నేల పయిన్ నడయాడ దొడగె
    చేరి నిలిచె విశాఖలో తీర మందు
    చనరె యొకసారి మా యూరు గనగ దాని !

    రిప్లయితొలగించండి
  44. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ఒకసారి విశాఖ వెళ్ళాను కాని ఆ ‘జలాంతర్గామి’ని చూడలేక పోయాను. ఈ సారి వెళ్ళినప్పుడు తప్పక చూస్తాను. ‘చనరె యొకసారి మా యూరు గనగ దాని’ అన్నారు. దానిని కనడానికే మీ ఊరు వెళ్ళడం కుదరదు కాని, మీ ఊరుకు వెళ్ళినప్పుడు దానిని కంటాను. :-)

    రిప్లయితొలగించండి
  45. శంకరార్యా ! ధన్యవాదములు !
    మీరు "కనడ "మంటే గుర్తొచ్చింది ! ఎక్కడో చదివాను !

    ఒకసారి విశ్వనాథవారూ, శ్రీశ్రీగారూ ఒక హొటల్లో పక్క పక్క గదుల్లో దిగారట !
    మరునాటి ఉదయం ఇద్దరూ కలసి ఒకే కారులో ఏదో సభకు వెళ్ళాలి !
    ఉదయాన్నే తయారైన శ్రీశ్రీగారు విశ్వనాథవారి గదికి వెళ్ళారట !
    అప్పుడే స్నానం ముగించి స్నానాలగది నుండి అంగవస్త్రం ధరించి బయటికొస్తున్న

    విశ్వనాథవారిని చూసి " నీళ్ళోసుకున్నట్టున్నారే " అని పలకరించారట శ్రీశ్రీగారు !
    కొంచెం పొట్ట ఎత్తుగా ఉన్న విశ్వనాథవారికి అందులో(గర్భం ధరించినట్టున్నారే) శ్లేష అర్థమై

    "ఔను ! నేనిప్పుడే నీళ్ళోసుకున్నా ! మీరు "కంటున్నారుగా" !
    అని (ప్రసవిస్తున్నారుగా ) చమత్కరించారట విశ్వనాథవారు !

    రిప్లయితొలగించండి