31, మార్చి 2012, శనివారం

ముకుందమాల - 4



చం.
వనధిజ భార్య నీ సుతుడు వారిరుహాసను డాగమమ్ములే
నిను వినుతించు స్తోతలును నిర్జరబృందము సేవకుల్ జనా
ర్దన జనయిత్రి దేవకియు తావక మాయ జగత్తు మోక్షమే
ఘనమగు నీ ప్రసాద మెరుగన్ జుమి యన్యము లెవ్వియేనియున్ .. (33)


సీ.
కృష్ణుండు సకల లోకేశుండు మన త్రాత
కృష్ణునిజేరిమ్రొక్కెదనునేను
కృష్ణునిచే సురరిపులెల్ల హతులైరి
కృష్ణునికొరకంజలింతునెపుడు
కృష్ణుని వలననే యీ సృష్టి యొప్పారె
కృష్ణునిదాసుడనేనులెస్స
కృష్ణుని యందు వర్తిల్లు నీ జగమెల్ల
నోకృష్ణమముబ్రోవుమోముకుంద
కృష్ణుడే తల్లి తండ్రియు నీశ్వరుండు
కృష్ణుడే తోడు నీడయు హితుడు నెపుడు
కృష్ణుడే సర్వమనుచు నర్చించు నెడల
కృష్ణుడే యిచ్చు యోగముల్ క్షేమములును .. (34)


తే.గీ.
నన్ను దయగను మీశ అనాథనాథ
అతిదయాళుడ వీవు భవాబ్ధి యందు
మునుగు నను నతిదీనుని బ్రోవుమయ్య
దేవ పురుషోత్తమా హరీ దీనపాల ... (35)


శా.
శ్రీనారాయణ పాదపంకజయుగ శ్రీసన్నిధిన్ మ్రొక్కెదన్
శ్రీనారాయణ పూజలన్ సతతమున్ జిత్తంబులో జేయుదున్
శ్రీనారాయణ దివ్యనామములు వల్లింతున్ సముత్సాహినై
శ్రీనారాయణ తత్త్వవైభవము నే చింతింతు సద్భక్తితో .. (36)


శా.
శ్రీనాథా పురుషోత్తమా మురహరా శ్రీవాసుదేవా హరీ
శ్రీనారాయణ చక్రపాణి వరదా శ్రీకృష్ణ భక్తప్రియా
శ్రీ నందాత్మజ రామ రామ భువన శ్రేయోనుసంధాయకా
దీన త్రాణ పరాయణా యదువరా దేవా జగన్నాయకా .. (37)


శా.
శ్రీ వైకుంఠ ముకుంద మాధవ కృపాసింధూ యశోదాసుతా
గోవిందా మధుసూదనా సురనుతా గోపాలకృష్ణా విభూ
దేవా యంచును బల్క గల్గియును పృథ్విన్ బల్క రారీతిగా
నే వేళన్ వ్యసనార్తులై జనులు స్వామీ బాపు మీ దుస్థితిన్ ... (38)


చం.
అనవరతమ్ము మానస సమంచిత సారసమందు నొప్పుచున్
వినయము మీర విష్ణుపదపీఠి సమాశ్రయ మొందువారికిన్
మనమున భీతి పోనడచు మాధవు ధ్యాన మొనర్చుచో జనా
ర్దను గృపచేత వైష్ణవపదమ్ము లభించును సత్ఫలమ్ముగా ... (39)


తే.గీ.
క్షీరసాగర వీచికా శీకరతతి
తారలునుబోల నభమట్లు తనరు మూర్తి
కాదిశేషుడు తల్పమై తనరు హరికి
మాధవున కాదరమున నమస్కరింతు ... (40)


తే.గీ.
శృతిధరులు కవిలోక వీరులు ద్విజవర
పద్మశరులు స్నేహితులుగ పరగు నతడు
సారసాక్ష పదాంభోజ షట్పదుడగు
నృపతి కులశేఖరాఖ్యు డీ కృతినొనర్చె ... (41)


చం
తలపులలోన నీ మధుర తత్త్వరసమ్ము సుధాస్రవంతియై
యలరుచు సాగుచుండ పరమార్థ సమన్విత భావరత్న సం
కలన మొనర్చి నీదు పదకంజ సమీపమునందు జేర్చి యం
జలిని ఘటించుచుంటి కృతి సత్కృపతో గొనుమా జనార్దనా.


స్వేచ్ఛానువాదము

శ్రీపండితనేమానిరామజోగిసన్యాసిరావుగారు

సమస్యాపూరణం - 663 (మంచుఁ గని తరించిరి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

మంచుఁ గని తరించి రెల్ల రాపర్వంబున్.

(యతిని గమనించండి)

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

30, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 662 (పరులకు రామచంద్రుని వివాహము)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పరులకు రామచంద్రుని వివాహము పుణ్య ఫలప్రదంబగున్.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

ముకుందమాల - 3


సీ.
భక్త బృందముల యాపత్సమూహములను
కాద్రవేయులయెడ గారుడమణి
అఖిల లోకములకు నత్యంత భద్రము
లను గూర్చు రక్షాకరాంచిత మణి
గోపికా స్త్రీల చక్షువులను చాతక
పక్షుల నలరించు వారిదమణి
అఖిల లోకైక మోహనకరంబగు దివ్య
సౌందర్యశ్రీ విలాస కలితమణి
తే.గీ.
ముదిత రుక్మిణీ చేతోవిభూషణమణి
యాదవాన్వయ సమ్మానితాద్భుత మణి
ఎల్ల మణులకు కాంతుల నిచ్చెడు మణి
జయము శ్రీకృష్ణ మణి నీకు జయము జయము .. (23)

తే.గీ.
అరిహరమగు మంత్రంబు త్రయ్యంత పూజ్య
మంత్రము భవాబ్ధి తారక మంత్ర మఖిల
సంపదల నిడు మంత్రమున్ జపమొనర్తు
సర్వదా కృష్ణ మంత్రమున్ సాదరమున .. (24)

సీ.
వ్యామోహ నామక ప్రబల రోగమ్మును
హరియింప జేయు మహౌషధమ్ము
మునిబృంద చిత్త వృత్తిని తత్త్వమందు ప్ర
వర్తింపజేయు భవ్యౌషధమ్ము
అసుర సంఘార్తి కరౌషధమ్మును జగత్
సంజీవన ప్రశస్తౌషధమ్ము
భక్తహితము గూర్చు పరమౌషధమ్ము భ
వామయమ్మును బాపు నౌషధమ్ము
తే.గీ.
అఖిల శ్రేయములను గూర్చు నౌషధమ్ము
సకల వేదాంత విజ్ఞాన సారమైన
ఔషదంబిది తత్త్వ పీయూషమయము
స్వాంతమా కొమ్ము కృష్ణ దివ్యౌషధమ్ము ... (25)

సీ.
ఏ దేవ దేవుని పాదముల్ తలపక
సలుపు కార్యములు నిష్ఫలములగునొ
వేదమ్ములను వల్లెవేయుటయే మహా
వనమందు జేయు రోదనమె యగునొ
ఆగమ విహిత కర్మాచరణము క్రొవ్వు
కరగించుటకు జేయు కర్మమగునొ
పూర్త విధులనేని పూనుట లెల్లను
భస్మమ్ములో పోయు పగిది యగునొ
ఆ.వె.
పుణ్యతీర్థములను మునుగుట యేనియు
సామజమ్మొనర్చు స్నానమగునొ
అట్టి పరమపురుషుడైన నారాయణు
డతుల జయములొంది యలరు గాక! .. (26)

తే.గీ.
వాంఛితములొందెదరు కడు పాపులేని
తలచుచో స్వామి నామమున్, దలపనైతి
నేమొ పూర్వ జన్మములందు నిట్టి గర్భ
వాసముఖ దుఃఖ చయముల పాల బడితి .. (27)
తే.గీ.
ఈ భవమ్మున చాలు నాకీ ఫలమ్ము
వేడుచుంటిని స్వామి నీ భృత్యులకును
భృత్యులకు భృత్యులకునేని భృత్యునట్లు
నన్ను భావింపుమా జగన్నాథ శౌరి .. (28)


సీ.
పురుషోత్తముడు హరి ముల్లోకములపతి
స్వాంతాన సేవింపబడెడి వాడు
భక్త బృందంబుల వాంచితమ్ముల దీర్చి
యిహ పర సుఖముల నిచ్చువాడు
తన పదమ్మును నేని తగు ప్రేమతోనిచ్చి
రక్షించు విభుడు నారాయణుండు
అండగా నుండగా నాతని దలపక
పురుషాధముండొక్క నరుడు కొన్ని
తే.గీ.
గ్రామముల కధిపతియగు వాడు కర్కశుండు
నడుగ నల్పార్థములనిడు నతని సేవ
కొరకు వెదకుచు నుంటిమా మొరకులమయి
మూగవారము నీచులము ననునట్లు .. (29)

కం.
మదనా నా మదిలో హరి
పదములు గల వటకు జేరవలదు హరునిచే
బొదవెను నీకు విపత్తులు
గద యెరుగవె విష్ణు చక్ర ఘన విక్రమమున్ .. (30)


తే.గీ.
నాలుకా నీకు మ్రొక్కెద నాలకింపు
మా పరాత్పరు తత్త్వమ్ము నభినుతించు
తీయని రసమ్ములూరు నారాయణాది
నామములు మాటిమాటికి న్బలుకు మమ్మ .. (31)


తే.గీ.
ఈ శరీరమ్ము పరిణామ పేశలమ్ము
సంధులెల్లను జారి వశమ్ము తప్పు
కష్టపడనేల మందులకై నిరామ
యమగు కృష్ణ నామ రసాయనమును గొనుము .. (32)


స్వేచ్ఛానువాదం

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

29, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 661 (సిరులు పెరిగె సీతతో)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘుపతికిన్.
(ఈ సమస్యను కందంలోనే కాక ఉత్సాహ తదితర ఛందాలలోను ప్రయత్నించవచ్చు)

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

28, మార్చి 2012, బుధవారం

ముకుందమాల - 2

సీ.
భయమొందుటేలనో స్వాంతమా కఠినమౌ
యమబాధల దలంచి యనవరతము
పాపమ్ములను శత్రువర్గముల్ మననింక
నేరీతినేని బాధించలేవు
మన స్వామి శ్రీస్వామి మనకు రక్షకుడుగా
నున్నాడు మనలోన నొప్పుమీర
ఆలస్య మికయేల నా భక్తసులభుని
ధ్యానమ్మొనర్పుమా యాదరమున
తే.గీ.
నెల్ల లోకుల వ్యసనముల్ డుల్లజేయు
నా ముకుందుడు తన భక్తులైన యట్టి
వారలను బ్రోవజాలడే? వమ్ము కాదు
స్వామియెడ భక్తి సర్వార్థ సాధకమ్ము (12)

సీ.
సంసారమను మహా సాగరమ్మున ముంగి
ద్వంద మారుతముల బాధలొంది
ఆలిని బిడ్డల నందర బోషించు
నట్టి భారమ్ముతో నణగువాని
విషయ సౌఖ్యములను విషమతోయములలో
మునుగుచు నిక్కట్లు పొందు వాని
తీరమ్ము నెట్లేని జేరు నుపాయమ్ము
తెలియక యార్తితో నలగువాని
తే.గీ.
నాదుకొని తీరమును జేర్చునట్టి నౌక
యొక్కటే సుమ్ము నమ్ముమా యో మనమ్మ
శ్రీమహావిష్ణు పద సరసిజములందు
నిశ్చలంబైన భక్తియే నిత్య రక్ష (13)

చం.
కరము భయంకరమ్ము భవ కంధి కదా యను భీతి యేల? దు
స్తరమది కాదు చిత్తమున శంకలు మానుము దేవదేవు శ్రీ
హరి చరణాంబుజాతముల యందలి నిర్మల భక్తి చేర్చు స
త్వరము భవాబ్ధి తీరమును భక్త శరణ్యుని జేరి గొల్వుమా (14)


సీ.
ఆశలే సంసారమను మహా సాగర
మందు నొప్పారెడు నంబువులుగ
దారాసుతాదులు ధన ధాన్య సంపద
లందు మోహమ్మట నలలు గాగ
భావజు బాణముల్ బలమైన మారుత
మ్ములగుచు కల్లోలములను రేప
ఆలి యావర్తమ్ము నాత్మజు లనుజులు
కలిగింప వ్యథలు నక్రంబులట్లు
తే.గీ.
ఘోర సంసార వార్ధిలో కూలి నేను
పడుచునుంటి నాయాసమ్ము భక్తపాల
నీదు పాదపద్మములందు నిశ్చలమగు
భక్తియను నౌకనిడి కావవా ముకుంద! (15)

సీ.
కాంచకుందును గాక క్షణమేని క్షీణపు
ణ్యులగాని భక్తిహీనులను గాని
వినకుండెదను గాక వీనుల విందయ్యు
హరిచరిత్రము గాని యట్టి కథలు
తలపకుందును గాక కలనేని నీవు లే
వని పల్కువాని నో యాదిదేవ
పొందకుందును గాక భువనేశ నీ సేవ
చేయకుండెడియట్టి జీవితంబు
తే.గీ.
జన్మజన్మములకునేని జగదధీశ
నా మనోరథమీడేర్చుమో ముకుంద
నీదు సేవలొనర్చుచు నెమ్మనమున
అధికతరమైన ఆనందమందువాడ (16)

సీ.
కీర్తించుమా జిహ్వ కేశవలీలలు
మురవైరిని భజింపుము హృదయమ్మ
చేతులారా! సమర్చించుడీ శ్రీధరు
విను డచ్యుతుని కథల్ వీనులార
కన్నులారా సదా కాంచుడీ కృష్ణునే
హరి సన్నిధికి బోవు డంఘ్రులార
ఆఘ్రాణమొనరింపుమా ముకుందుని పాద
తులసినే నాసికా తోషమొదవ
తే.గీ.
శీర్షమా యదోక్షజు పాదసీమ యొద్ద
ప్రణతులొనరింపుమా భక్తిభావ మలర
ఇంద్రియములార విష్ణు సేవించుచుండి
తత్కృపామృత సారమున్ ద్రాగవచ్చు (17)

తే.గీ.
వినుడు నరులార మందు చెప్పెదను యాజ్ఞ
వల్క్య ముఖ్యులు దెల్పిరి భవరుజకిదె
హృది నలరు పరంజ్యోతి శ్రీకృష్ణ రసము
త్రాగు వారికి కలుగు నిర్వాణ సుఖము (18)


తే.గీ.
ఆపదూర్మి మయమగు భవాబ్ధి దాటు
టకునుపాయమిదే మీ యెడందలోన
మరల మరల నారాయణ మంత్రవరము
జపమొనర్చుచు నుండుడీ సంతతమ్ము (19)


తే.గీ.
భూమ రూపాన్వితా భూమి ముఖ్య భూత
చయము లతి సూక్ష్మములు రుద్ర జలజసంభ
వాదులున్ క్షుద్రు లఖిల దేవతలు కీట
కములు నీముందు జయ జయ కమలనేత్ర (20)


చం.
కరములు మోడ్చి వంచి తల గాత్రము పుల్కలనొందుచుండగా
స్వరమున గద్గదంబొదవ చక్షుల బాష్పము లుప్పతిల్ల, నీ
చరణములన్ దలంచుటను సద్రస పానమొనర్చుచున్ సదా
పరగుత నాదు జీవితము భద్రపథాన ముకుంద మాధవా! (21)


శా.
ఓ గోపాలక ఓ కృపాజలనిధీ ఓ సింధుకన్యాపతీ
ఓ గోవింద గజేంద్రరక్షక హరీ ఓ కేశవా మాధవా
ఓ గోవర్ధన ధారి నేనెరుగ నన్యున్ సర్వలోకేశ్వరా
ఓ గోపీజననాథ ప్రోవగదె నన్నో పుండరీకేక్షణా (22)


స్వేచ్ఛానువాదం
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 660 (రమణికి సీతతో)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

27, మార్చి 2012, మంగళవారం

ముకుందమాల - 1

చం.
అనుదినమే మహీపతి ప్రయాణము గూర్చి పురాన ఘోషణ
మ్మును బొనరింతురో విభుని పుష్కరలోచను రంగనాథునిన్
గనుటకునంచు నా నృపశిఖామణియౌ కులశేఖరాఖ్యు నె
మ్మనమున నే దలంచుచు నమస్కృతి చేయుదు సాదరమ్ముగన్ (1)


సీ.
శ్రీవల్లభాయంచు దేవదేవా యంచు
వరదాయకాయంచు హరియటంచు
సత్కృపాపరయంచు జలజేక్షణాయంచు
భక్తప్రియా జగత్పతియటంచు
భవమోచనాయంచు భద్రరూపాయంచు
నఖిలలోకైక నాథా యటంచు
నాగరాజశయన నారాయణాయంచు
సకలలోకనివాసి శౌరి యంచు
తే.గీ.
పలుకు పలుకున భక్తి భావమ్ము జిలుక
నీదు నామ మంత్రములనే నిర్మలమతి
పలుకవలె గాక నా జిహ్వ సలలితముగ
స్వామి గోవింద గోవింద శ్రీముకుంద! (2)

ఉత్సాహ.
జయము దేవ దేవ నీకు జయము దేవకీసుతా
జయము వృష్ణివంశ దీప జయము కృష్ణ శ్రీధరా
జయము మేఘ నీలగాత్ర జయము కోమలా హరీ
జయము సుందరా ముకుంద జయము భూభరాపహా (3)


చం.
శిరమును నీ పదాబ్జముల చెంతను నిల్పుచు నేను వేడుదున్
స్థిరమతి నొక్క కోరికనిదే వినుమయ్య త్రిలోకపాలకా
మరపును జెందరాదు సుమి మానసమందున జన్మజన్మలన్
నిరతము నిన్ స్మరించుట వినీల శరీర ముకుంద మాధవా (4)


సీ.
నీ పాదపద్మ సన్నిధి నేను మ్రొక్కుదు
నిశ్చల భక్తితో నిగమ వేద్య
అద్వంద్వ హేతువే యదియంచు నాత్మలో
భావమేదియు లేదు దేవ దేవ
ఘోర కుంభీపాక నారక బాధలు
తప్పింపుమనెడు ప్రార్థనము కాదు
రమణీమణుల కూడి సుమవనమ్ములలోన
జెలగుట కోరనో చిత్స్వరూప
తే.గీ.
జన్మ జన్మములందు నా స్వాంతమనెడు
స్వర్ణసౌధమునందు భావనమొనర్చు
చుందు నీ తత్త్వ మొక్కటే యొప్పు మీర
స్వామి గోవింద గోవింద శ్రీ ముకుంద (5)

తే.గీ.
లేదు కోరిక ధర్మ కామాదులందు
భాగ్యములనేని నా పూర్వ భవములందు
కర్మములబట్టి ఫలితముల్ కలుగనిమ్ము
గుండె నిండుగా భక్తియే యుండు గాక (6)


తే.గీ.
నా నివాసమ్ము భువినేని నాకమందు
నేని నరకమందైన నో దానవారి
నేను కోరెడి దొక్కటే నీ పదమ్ము
లందు నిశ్చల భక్తి నిమ్మా ముకుంద (7)


తే.గీ.
స్వామి నీ పాద పద్మ పంజరమునందు
నిప్పుడే చేరుగాక నా హృదయ హంస
ప్రాణముల్ పోవు వేళ కఫాదులెల్ల
కలుగు గొంతుతో నే బల్క గలనె దేవ (8)


చం.
అనవరతమ్ము నే దలతు నాదరమొప్ప జనార్దనున్ హరిన్
వనరుహనేత్రు చిర్నగవు భాసిలు ఫుల్ల సరోరుహాననున్
ఘనరుచిమంతు నంద సుతు కామిత దాయకు నిన్ బరాత్పరున్
వినుత గుణాభిరాము మునిబృంద సమర్చిత పాద పంకజున్ (9)


తరలము.
కరము లంఘ్రులు వారిజమ్ములు కన్నులొప్పగు మీనముల్
విరివిగాగల స్కంధముల్ బహువీచులై తనరారు నీ
హరి సరస్సున నేమునింగిన యంత నాశనమొందు దు
ర్భర భవార్తి ముకుంద చేకురు భద్రముల్ సుఖ శాంతులున్ (10)


తే.గీ.
సరసిరుహ లోచనుని శంఖ చక్ర ధరుని
మురహరుని భక్తి నెన్నడు మరువ వలదు
హరిపదాంబురుహ స్మృతి యమృతసమము
దాని కంటెను సౌఖ్య మేదేని లేదు (11)



స్వేచ్ఛానువాదం

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 659 (కాలుని పెండ్లియాడె నఁట)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

కాలుని పెండ్లియాడె నఁట కామిని సీత మహోత్సవమ్ముగన్.

(లేదా)

కాలుని పెండ్లాడె సీత కడు మోదమునన్.


ఈ సమస్యను పంపిన శ్రీ గుండా సహదేవుడు గారికి ధన్యవాదాలు.

26, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 658 (అల్లుడనయ్యెదన్ మగడ నయ్యెద)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.

ఈ సమస్యను సూచించిన శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదాలు.

25, మార్చి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 657 (మోహపాశమ్మె మేలు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.


24, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 656 (చిరు లతయె రావి చెట్టును)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

చిరు లతయె రావి చెట్టును చీరి యణచె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

ఉగాది కవితలు

కవిమిత్రుల ఉగాది కవితలు
*********

నేమాని రామజోగి సన్యాసి రావు


రారమ్ము నందనా రావమ్మ నందనా
స్వాగతమ్మిదె యనురాగమూర్తి
ఆహ్లాదమునుగూర్చు నట్టి వాసంతమ్ము
వైభవమ్ములతోడ వచ్చె నేడు
మామంచి మిత్రమ్ము మా ప్రేమపాత్రమ్ము
మత్తకోకిల పాడె మధురగీతి
బంభరములు చేసె బలె సంబరములు
ఝంకారములతోడ సంతసమున
మల్లెపూవులు తెచ్చి మాలకూర్చితి నీకు
పరిమళంబులలోన పరవశింప
సంపెంగ పూవులు చాల తెచ్చితి నీకు
ప్రేమతోడ నలంకరించుకొమ్మ
శ్రేయముల్ కూర్చుమా చింతలన్ దీర్చుమా
సౌభాగ్యములనిమ్మ శోభలిమ్మ
ఆనందమీయుమా ఆహ్లాదమీయుమా
విందువినోదాల వేడ్కలిమ్మ
వర్షమ్ములీయుమా హర్షమ్ము నీయుమా
పాడిపంటలనిమ్మ పండువిమ్మ
భోగభాగ్యములిమ్మ యోగరాసులనిమ్మ
సరదాలు మాకిమ్మ శాంతినిమ్మ

అక్రమముల గూల్చి అన్యాయముల ద్రోసి
ధాత్రిపైని నిలిపి ధర్మ సరణి
అస్థిరత్వమణచి సుస్థిరత్వము గూర్చి
అమిత వృద్ధి గూర్చు మన్ని దిశల
**********

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ
ఉ.
నందన నామ వత్సర సనాతన సంస్కృత సంప్రదాయ సా
నంద మరంద తుందిల మనః పరితోషితప్రేక్షణేషణా
మంద హృదంతర స్థిర శమంకర కారిక! చైత్ర కన్యకా!
వందన చందనాంజలి నవాగమ వేళల నందుకొమ్మిదే..!
***********

డా .యస్వీ రాఘవేంద్ర రావు
తే.గీ.
తియ్యనౌ పల్కు మొల్కల నెయ్యమలర
సమత మమతయు ననెడి సస్యములు పండ
మీదు జీవిత కేదార వీధులందు
క్రొత్త వర్షమ్ము శుభములు కురియుగాక!

***************

మిస్సన్న
ఉ.
లోకుల నెల్లరన్ తలచి లోకువగా విహరించుచుంటివా ?
పోకిరి శైత్యమా ! తిరిగి పొమ్మిక చాలు బడాయి! మ్రోడులై
ఆకులు రాల్చి భూరుహము లామనికై తపియించె దాల్మితో,
కోకిల పాటలన్ ప్రకృతి కోరెడు తాళగ లేక నీ వగల్!
కం.
విచ్చెను మల్లెలు బొండుగ
నిచ్చెను నవ పల్లవముల నింపుగ మావుల్
మెచ్చెను కోయిల పాటల
వచ్చెను నవనందనంపు వాసంతాభల్.
కం.
రెచ్చెను వేములు పూతల
నిచ్చెను మలయానిలమ్ము లింపుగ హాయిన్
తెచ్చెను మల్లెల మొల్లల
నెచ్చెలి సిగలోన తురుమ నేటి యుగాదిన్.
కం.
గ్రుచ్చెను విరి శరములతో
త్రచ్చెను హృదిభాండ వలపుదధి నెమ్మదిగన్
రచ్చంజేయుచు యువతను
మ్రుచ్చా మదనుండు చిలిపి ముడులను వేయన్.
తే.గీ.
నంద నందను రాకకా నంద మొంద
తపన జెందెడి గోపికా తతుల రీతి
వేచి యుంటిమి నీకయి వేడ్క మీర
నందనా! రమ్ము నీకివే వందనములు.
*****************

కమనీయం
ఉ.
నందన నామ వత్సర మమంద మనోజ్ఞ మహానుభూతులన్
అందరు బంధుమిత్రులకు నందగ జేయుత యంచు గోరుచున్
అందము లొల్కు జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
డెందము పుల్కరింపగ స్వదేశ విదేశ బుధాళి కంతకున్.
తే.గీ.
నవయుగాదికి నాంది గా నందనాఖ్య
వత్సరమ్మిదే అరుదెంచె పల్లవ సుమ
శోభిత దుకూలమును దాల్చి ,శుభము లీయ
నెల్లవారికి స్వాగత మ్మీయ రండు.
*************

సంపత్ కుమార్ శాస్త్రి
ఉ.
వందనమాచరింతు కవిభాసురలెల్లరకున్ వినమ్రుడై,
సుందరభావజాలపరిశోభితమైచనుపద్యపాదముల్
పొందుగవ్రాయునట్టి కవిపుంగవజాతికి, నూత్నమర్గమౌ
నందననామవత్సరమనంతశుభంబులనిచ్చు గావుతన్.
******************

గోలి హనుమచ్ఛాస్త్రి
కం.
ఆ నందుని నందను దయ
ఈ నందన వత్సరమ్ము నేకాలమ్మున్
ఆనంద మందెడందను
ఆ నందీశ్వర గమనుడు హాయిగ బ్రోచున్.

****************

వరప్రసాదు
ఉత్సాహ.
కోనసీమనారికేళ కుళ్ళిపోయె,ఖరము నం
దున సునామివచ్చి చిగురు ద్రుంచె మిత్రునింట, నం
దనమునకు నమస్కరింతు ధరణి జనుల నెమ్మదిన్
గనిమ గట్టి గావుమని విఘాతములు వలదు సుమా|
(గనిమ = కట్ట)
తే.గీ.
కోనసీమ కొబ్బరి పైరు కుళ్ళిపోయె
ఖరమునందు క్రాప్ట్ హాలిడే కర్షకులకు
కరువు నాట్యము జేసెలె బరువుతోడ,
తెలుగు వారిస్నేహమునకు దెగులుబట్టి
రాళ్ళు రువ్వగ రహదారి రక్తమయ్యె,
పాలకులు పాడిపంటల పాడిగట్టి
వేలకోట్లతో వ్యాపార వేళ్ళుబెంచ
కుంభకోణములవినీతి కుంభవృష్ఠి
గురిసె భారతావనిపైన, మెరిసె మూర్ఖ
జాతి,కవిపండితులకేది ఖ్యాతి?విఘ్న
ములు వలదులె నందనమా! ముముక్షువులకు
శాంతి సుఖ కనకములిచ్చి కాంతినింపు!
***************

రాజేశ్వరి నేదునూరి
నందనకు ......వందనం
----------------------------
నందనా నువ్వొస్తావని ముందే తెలిసినా
ఖరీదు లేని కైమోడ్పులు తప్ప ఏమివ్వగలను ?
కరువు నిండిన బరువు బ్రతుకుల్లో
కసి తెలియని పసివారు ఆశల అంచులపై
వేసవి విడిది చేస్తుంటే బరువెక్కిన గుండెలతో
బలవంతపు వందనాలు తప్ప ఎం చేయగలను ?
కాలుష్యపు కోరల వలయంలో చిక్కి
మేరువు నధిష్టిం చాలను కోవడం మిధ్యే గా మరి !
అందుకే పేద గుండెకు పిడికెడు ప్రేమ నిమ్మని
నందనా నీకు వందనం నీనీయగల ప్రేమాభి
వం................ద..............నం

శ్రీపతి శాస్త్రి

నందననామ వత్సరము నందననందుని దివ్యతేజమై
సుందర రూపమున్ తొడగి శోభలు గూర్చుచు దాను వచ్చె నీ
హైందవజాతి పర్వముగ హాలికులెల్లరు సంతసిల్లి గో
విందుని నామ సంస్మరణ వీనుల విందుగ జేయుచుండగన్

మత్తకోకిల గానమందలి మాధురీరస ధారలున్
చిత్తమందున విస్తరించగ చిత్రమౌ యనుభూతులన్
క్రొత్తకాంతుల యామణీ తరు కోటి యాశల శాఖలై
మెత్తమెత్తని లేచిగుళ్ళతొ మేదినీ పులకించనీ





23, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 655 (నందనా! నీకు వేవేల)

కవిమిత్రులారా,
అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు.

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

నందనా! నీకు వేవేల నతు లొనర్తు.
(నందన నామ సంవత్సరాన్ని సంబోధించరాదని నిషేధం)

22, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 654 (మారె నతండు సుందరిగ)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21, మార్చి 2012, బుధవారం

గురు సన్నుతి



ఆ వచోనిచయమ్ము! ఆ తపోవిభవమ్ము!
ఆ కృపావర్షమ్ము! ఆ మహత్త్వ!
మా శుభోదర్కమ్ము! ఆ సభావిజయమ్ము!
ఆ విభాసత్వమ్ము! ఆ కవిత్వ!
మా శాంతతేజమ్ము! ఆశాంతసుయశమ్ము!
ఆసాంతసత్త్వమ్ము! ఆ పటుత్వ!
మా మహాభావమ్ము! ఆ మహౌదార్యమ్ము!
ఆ మహీదేవత్వ! మా గుణిత్వ!
మేను మన్నన న న్నోము మాననమున
నాను మునినాము నామమ్ము నూనినాను
నా మనమ్మున మౌనమ్ము నాన మాని
నేన నేమాని గురుదేవు నేమ మూని!

(మునినాము = శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు నామధేయులు)

విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు

ముకుందమాల


ముకుందమాలలోని ఒక శ్లోకమునకు స్వేఛ్ఛానువాదము


శ్రీవల్లభా యంచు దేవ దేవా యంచు
వరదాయకా యంచు హరి యటంచు
సత్కృపాపర యంచు జలజేక్షణా యంచు
భక్తప్రియా జగత్పతి యటంచు
భవమోచనా యంచు భద్రరూపా యంచు
నఖిల లోకైక నాథా యటంచు
నాగరాజ శయన నారాయణా యంచు
సకల లోక నివాస శౌరి యంచు
పలుకు పలుకున భక్తి భావమ్ము జిలుక
నీదు నామ మంత్రములనే నిర్మలమతి
పలుకవలె గాక నా జిహ్వ సలలితముగ
స్వామి గోవింద గోవింద శ్రీముకుంద!

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 653 (తారా రమ్మని పిల్చె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20, మార్చి 2012, మంగళవారం

నందనానందం

కవిమిత్రులకు స్వాగతాంజలి.

నందన నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కవితా ఖండికలను పంపవలసిందిగా ఆహ్వానం.
మీ కవితలను నాకు మెయిల్ చేస్తే ఉగాది నాడు అన్నీ ఒక పోస్ట్‌గా ప్రకటిస్తాను.


నా మెయిల్ చిరునామా
shankarkandi@gmail.com

భారతీ స్తుతి



స్మరియింతు నిరతంబు జలజాతభవు రాణి
పదపద్మ యుగళంబు భక్తి మెరయ
నొనరింతు వరివస్య మనసార రసరమ్య
మయ పావన వచస్సుమముల గూర్చి
కొనియాడుదును వాణి గుణవైభవములొప్ప
బహు లీలలను దివ్య పర్వ సరణి
విరచించెదను తల్లి కరుణా విభవమొంది
పరమార్థ మయ కావ్యవర తతులను
నాదు హృదయాంబురుహమందు మోదమలర
వాసమొనరించుచును వాగ్విభవము కరము
నలరెడు విధానమును గూర్చు నట్టి దేవి
భారతికి నంజలిని గూర్తు భవ్య కరణి

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 652 (పండువెన్నెల లివె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పండువెన్నెల లివె యమావాస్యఁ గురిసె.


19, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 651 (కలను దలచి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

కలను దలచి హృదయకమల మలరె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

18, మార్చి 2012, ఆదివారం

భారతీ స్తుతి



వరవీణా మృదుపాణి, పద్మభవు జిహ్వన్ బొల్చు గీర్వాణి, బం
భర వేణీ, శుకపాణి, సమ్ముదిత విద్వఛ్ఛ్రేణి, కళ్యాణి, భా
సుర విజ్ఞాన పవిత్ర వాణి, బహుధా శుద్ధాంతరంగమ్మునన్
వరివస్యన్ బొనరింతు నీ విభవమున్ భావించుచున్ భారతీ!


రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 650 (పుండు సతిని గాంచి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పుండు సతిని గాంచి మోదమొందె.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

17, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 649 (పాడు లోకము రాముని)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పాడు లోకము రాముని ప్రస్తుతించు.

16, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 648(అర్ధనారీశ్వరుం డయ్యె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

15, మార్చి 2012, గురువారం

ఆహ్వానం


ప్రార్థన

భావమునందు తావక కృపారస తత్త్వ విభూతియొప్పగా
పావన వాగ్విశేష రసబంధుర సుందర పద్యరత్న శో
భా విభవాభిరామమగు ప్రార్థనమున్ బొనరింతునమ్మ! వాగ్
దేవత! జ్ఞానయోగమయ దీప్తుల నన్ను ననుగ్రహింపుమా!



రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 647 (భారతంబును బొంకని)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

భారతంబును బొంకని పలుకఁ దగును.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

14, మార్చి 2012, బుధవారం

ఆహ్వానం


ఆహ్వానం

సమస్యాపూరణం - 646 (వనితలకు భూషణంబు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

వనితలకు భూషణంబు వయ్యంది యగున్.
(సమస్యలో గణదోషం లేదు. పాదాదిని ఒక అక్షరాన్ని చేర్చుకోవాలి. అదికూడా యతిమైత్రిని దృష్టిలో పెట్టుకోవాలి)
(వయ్యంది = కుంపటి)

ఈ సమస్యను పంపిన ఏల్చూరి మురళీధరరావు గారికి ధన్యవాదాలు.

13, మార్చి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 645 (దివియె భువిపైన గిరగిర)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

దివియె భువిపైన గిరగిర తిరుగుచుండు.

ఈ సమస్యను సూచించిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

12, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 644 (ధార్తరాష్ట్రులు నడచిరి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

10, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 643 (రాముడిచ్చెను సీతను)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -


రాముడిచ్చెను సీతను రావణునకు.


ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

9, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 642 (హీనునకు నమస్కరింతు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

హీనునకు నమస్కరింతు నెపుడు.

8, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 641 (వనితకు వందనము సేయ)

కవిమిత్రులారా,

హోళీ శుభాకాంక్షలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.


ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

వనితకు వందనము సేయవలె సద్భక్తిన్.

7, మార్చి 2012, బుధవారం

సమస్యాపూరణం - 640 (నీతి లేనివారె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

నీతి లేనివారె నేతలైరి.

ఈ సమస్యను సూచించిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.


6, మార్చి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 639 (నడకలు తడబడు బుడతడు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -


నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

5, మార్చి 2012, సోమవారం

వేడుకోలు


వేడుకోలు

శ్రీవిశ్వేశ్వర! రాజతాచల మహాశృంగాధివాసా! మహా
దేవా! హైమవతీశ్వరా! పశుపతీ! దీవ్యత్ కృపాశేవధీ!
భావాతీత విశిష్ట తత్త్వవిభవా! బాలేందుచూడామణీ!
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


శ్రీవిద్యానిధులైన నీదు పద రాజీవమ్ములన్ గొల్చెదన్
దేవా! సర్వజగన్మయా! సుజన హృత్సీమాలయా! చిన్మయా!
నా విజ్ఞాపన మాలకింపుము సదానందస్వరూపా! శివా!
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


వేదాంత వనీ విహారనిరతా! సర్వలోకేశ్వరా!
వేదస్తవనీయ తత్త్వవిభవా! సర్వయోగప్రదా!
విశ్వంభర! వామదేవ! గిరిశా! పార్వతీవల్లభా!
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


విశ్వంబు మహాంధకారమయ మందిచ్చోట నే చిక్కితిన్
త్రోవన్ గానక చిక్కులం బడితి చిద్రూపా! భవత్పాద రా
జీవంబే శరణంచు నమ్మి గొలుతున్ చిన్మార్గమున్ జూపుమా
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


కావేవీ సుఖదాయకంబు లవనిన్ గౌరీశ! శబ్దాదులం
దో విశ్వేశ్వర! భక్తి యించుకయు నందొప్పారకున్నన్ కృపా
భావా! పావన నామ! యాదరమునన్ భావింతు నీ తత్త్వమున్
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!


రచన

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

సమస్యాపూరణం - 638 (కమలబాంధవుఁ డేతేర)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కమలబాంధవుఁ డేతేరఁ గలువ విచ్చె

4, మార్చి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 637 (కోఁతి కూఁత కూసె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

కోఁతి కూఁత కూసెఁ గోడి వలెనె.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

3, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 636 (తల్లి మాట వినుట)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

తల్లి మాట వినుట తప్పు గాదె.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

2, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 635 (పార్థసారథి రణమున)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

పార్థసారథి రణమున పరుగు లిడెను.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

1, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 634 (భార్యను విడిచిన గలుగును)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

భార్యను విడిచిన గలుగును భాగ్యము లెన్నో.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.