30, మార్చి 2012, శుక్రవారం

ముకుందమాల - 3


సీ.
భక్త బృందముల యాపత్సమూహములను
కాద్రవేయులయెడ గారుడమణి
అఖిల లోకములకు నత్యంత భద్రము
లను గూర్చు రక్షాకరాంచిత మణి
గోపికా స్త్రీల చక్షువులను చాతక
పక్షుల నలరించు వారిదమణి
అఖిల లోకైక మోహనకరంబగు దివ్య
సౌందర్యశ్రీ విలాస కలితమణి
తే.గీ.
ముదిత రుక్మిణీ చేతోవిభూషణమణి
యాదవాన్వయ సమ్మానితాద్భుత మణి
ఎల్ల మణులకు కాంతుల నిచ్చెడు మణి
జయము శ్రీకృష్ణ మణి నీకు జయము జయము .. (23)

తే.గీ.
అరిహరమగు మంత్రంబు త్రయ్యంత పూజ్య
మంత్రము భవాబ్ధి తారక మంత్ర మఖిల
సంపదల నిడు మంత్రమున్ జపమొనర్తు
సర్వదా కృష్ణ మంత్రమున్ సాదరమున .. (24)

సీ.
వ్యామోహ నామక ప్రబల రోగమ్మును
హరియింప జేయు మహౌషధమ్ము
మునిబృంద చిత్త వృత్తిని తత్త్వమందు ప్ర
వర్తింపజేయు భవ్యౌషధమ్ము
అసుర సంఘార్తి కరౌషధమ్మును జగత్
సంజీవన ప్రశస్తౌషధమ్ము
భక్తహితము గూర్చు పరమౌషధమ్ము భ
వామయమ్మును బాపు నౌషధమ్ము
తే.గీ.
అఖిల శ్రేయములను గూర్చు నౌషధమ్ము
సకల వేదాంత విజ్ఞాన సారమైన
ఔషదంబిది తత్త్వ పీయూషమయము
స్వాంతమా కొమ్ము కృష్ణ దివ్యౌషధమ్ము ... (25)

సీ.
ఏ దేవ దేవుని పాదముల్ తలపక
సలుపు కార్యములు నిష్ఫలములగునొ
వేదమ్ములను వల్లెవేయుటయే మహా
వనమందు జేయు రోదనమె యగునొ
ఆగమ విహిత కర్మాచరణము క్రొవ్వు
కరగించుటకు జేయు కర్మమగునొ
పూర్త విధులనేని పూనుట లెల్లను
భస్మమ్ములో పోయు పగిది యగునొ
ఆ.వె.
పుణ్యతీర్థములను మునుగుట యేనియు
సామజమ్మొనర్చు స్నానమగునొ
అట్టి పరమపురుషుడైన నారాయణు
డతుల జయములొంది యలరు గాక! .. (26)

తే.గీ.
వాంఛితములొందెదరు కడు పాపులేని
తలచుచో స్వామి నామమున్, దలపనైతి
నేమొ పూర్వ జన్మములందు నిట్టి గర్భ
వాసముఖ దుఃఖ చయముల పాల బడితి .. (27)
తే.గీ.
ఈ భవమ్మున చాలు నాకీ ఫలమ్ము
వేడుచుంటిని స్వామి నీ భృత్యులకును
భృత్యులకు భృత్యులకునేని భృత్యునట్లు
నన్ను భావింపుమా జగన్నాథ శౌరి .. (28)


సీ.
పురుషోత్తముడు హరి ముల్లోకములపతి
స్వాంతాన సేవింపబడెడి వాడు
భక్త బృందంబుల వాంచితమ్ముల దీర్చి
యిహ పర సుఖముల నిచ్చువాడు
తన పదమ్మును నేని తగు ప్రేమతోనిచ్చి
రక్షించు విభుడు నారాయణుండు
అండగా నుండగా నాతని దలపక
పురుషాధముండొక్క నరుడు కొన్ని
తే.గీ.
గ్రామముల కధిపతియగు వాడు కర్కశుండు
నడుగ నల్పార్థములనిడు నతని సేవ
కొరకు వెదకుచు నుంటిమా మొరకులమయి
మూగవారము నీచులము ననునట్లు .. (29)

కం.
మదనా నా మదిలో హరి
పదములు గల వటకు జేరవలదు హరునిచే
బొదవెను నీకు విపత్తులు
గద యెరుగవె విష్ణు చక్ర ఘన విక్రమమున్ .. (30)


తే.గీ.
నాలుకా నీకు మ్రొక్కెద నాలకింపు
మా పరాత్పరు తత్త్వమ్ము నభినుతించు
తీయని రసమ్ములూరు నారాయణాది
నామములు మాటిమాటికి న్బలుకు మమ్మ .. (31)


తే.గీ.
ఈ శరీరమ్ము పరిణామ పేశలమ్ము
సంధులెల్లను జారి వశమ్ము తప్పు
కష్టపడనేల మందులకై నిరామ
యమగు కృష్ణ నామ రసాయనమును గొనుము .. (32)


స్వేచ్ఛానువాదం

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి