17, మార్చి 2012, శనివారం

సమస్యాపూరణం - 649 (పాడు లోకము రాముని)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

పాడు లోకము రాముని ప్రస్తుతించు.

30 కామెంట్‌లు:

  1. ఆడుదురు భక్తి వెలుగ శోభాకరముగ
    వేడుదురు తత్కృపామయ వీక్షణముల
    వీడుదురు మోహశోకాలు విభుచరిత్ర
    పాడు లోకము రాముని ప్రస్తుతించు

    రిప్లయితొలగించండి
  2. కరువు కాటకములులేక కావు మనుచు
    రామ కీర్తన జేయగ రాత్రి పగలు
    భక్తి మీరగ ప్రజలంత పరవ శించి
    పాడు లోకము రాముని ప్రస్తు తించు

    రిప్లయితొలగించండి
  3. స్వరము లేడును రవళింప శబరి భక్తి
    హృదయ వల్లకి మీటుచు ముదము సీత
    నృత్య మాడుచు హనుమయు నిరతి రక్తి
    పాడు లోకము రాముని ప్రస్తుతించు

    రిప్లయితొలగించండి
  4. సోదరి శ్రీమతి రాజేశ్వరిగారి పూరణ మరియు తమ్ముడు డా. నరసింహమూర్తి పూరణ చాల రమ్యముగ అలరారుచున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మహితగుణములనొప్పారు మాన్యు చరితు,
    డనఘసంఘంబు పూజించు ఘనునియందు
    భక్తి భావంబు పెంపొంద పరవశించి
    పాడు లోకము రాముని ప్రస్తుతించు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ ఏల్చూరి వారికి ప్రశంస:

    తోటకము:
    మురళీధర పండిత భూషణ! ఏ
    ల్చురి వంశ సుధాకర! శుద్ధమతీ!
    పరితోషము నొందితి భవ్య గుణా
    కర! నీ విభవమ్మును గాంచి సుధీ!

    రిప్లయితొలగించండి
  7. అయ్యవారు రామాయణము టపాకరింప
    బ్లాగ్లోకము ఆనందమున ఓలలాడంగ
    ఆఖరున జిలేబీ మంగళ హారతి
    పాడు, లోకము రాముని ప్రస్తుతించు !

    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  8. శ్రీమతి జిలేబీ గారి భావమునకు పద్య రూపము:

    శంకరాభరణాద్భుత సరణి గాంచి
    సభ్యులానంద పారవశ్యంబు నొంద
    ఆదృతి జిలేబి మంగళ హారతి నిడ
    పాడు లోకము రాముని ప్రస్తుతించు

    రిప్లయితొలగించండి
  9. అయ్యా మిస్సన్న గారూ!
    నిన్నటి మీ పూరణను చూచేను. శివుడు మోహిని వెంట బడినప్పుడు అర్థ నారీశ్వరూపముతో లేడు. సంపూర్ణ శివ స్వరూపముతోనే యున్నాడు. కాకుంటే ఎంతో ఇబ్బంది కదా!.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారికి వందనములు, శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు తెలుపుతూ
    గురువుగారు తొందరగా కోలుకోవాలని మా ఆకాంక్ష !
    దాదాపు పదిహేనురోజులనుండీ జ్వరం తగ్గకపోవడానికి కారణమేమిటో
    అవసరమైన పరీక్షలు చేయించండి,మాయందికోసమైనా|
    --------
    స్వార్ధ బుద్ధితొ నిండిన సర్పమంటి
    పాడు లోకము, రాముని ప్రస్తుతించు
    నేడు పదవులు బొందగ నెంచి, మఱచి
    దిరుగు ముమ్మాటికి పదవి దెనియలందు

    రిప్లయితొలగించండి
  11. రామ నామము రమ్యము రక్తి యుతము
    నామనంబున నుండుమా రామ యనుచు
    భక్తి మీరగ నొడలెల్ల పరవశించి
    పాడు లోకము రాముని ప్రస్తు తించు

    రిప్లయితొలగించండి
  12. ఎవడు శోకము తొలగించు భువన మందు
    యెవని దలువంగ పులకించునెదలు యట్టి
    రవికులాగ్రణి గుణమునే పవన సుతుడు
    పాడు !!! లోకము రాముని ప్రస్తుతించు !!!

    రిప్లయితొలగించండి
  13. అయ్యా! శ్రీ పీతాంబర్ గారి పద్యము భక్తి భావముతో బాగున్నది. దాని 2వ పాదములో "యెవడు" మరియు "యట్టి" అనే 2 చోటులలో యడాగమమునకు బదులుగా నుగామమును వాడవలసి యున్నది. సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    పావనైనట్టి సాధ్విని - ప్రల్లదనము
    పాడువఱచగ సీతను - పట్టి గొనిన
    పారధారికు డైనట్టి - పచ్చెగాని
    పాడు రావణు ప్రాణము - పాడుపడగ
    పాడె నెక్కించి నట్టి యా - ప్రబల శూరు
    పాడి యావల్లె పాలించు - ప్రభువు కథల
    పాటలుగ మార్చి వ్రాయగ - పండితాళి
    పాట కత్తెలు మరియును - పాటగాండ్రు
    పారవశ్యము జెందుచూ - పామరులును
    పారమార్థిక చింతనన్ - భావమలర
    పాడు లోకము రాముని - ప్రస్తుతించు
    పదము పదమున మితిమీరి - భక్తి గలుగ !
    _____________________________________________
    పావని = పవిత్రురాలు
    ప్రల్లదనము = గర్వము
    పాడువఱచు = చెఱచు
    పారధారికుడు = వేశ్యాలోలుడు
    పచ్చెగాడు = దొంగ
    పాడు = చెడు
    పాడుపడు = నశించు

    రిప్లయితొలగించండి
  15. వెల్గు వేల్పింటి బిడ్డడు వీర వరుఁడు
    వెల్గులగమి చివరనుండు వేదమయుఁడు
    అట్టి వాని నామంబును పట్టుబట్టి
    పాడు, లోకము రాముని ప్రస్తుతించు!!

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవుల శుభాశీర్వామునకు సాష్టాంగప్రణిహితముగా నమోఽస్తు !

    అమృతవాహిని మీ కవిత్వము నితాంత
    భక్తిపూర్ణము; లోకపావనము మనము;
    మీ దయాంభోధి నోలాడి నాదు జన్మ
    ధన్యతను గాంచె, చరితార్థతముఁడ నైతి.

    విధేయశిష్యుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  17. ఈ నాటి సమస్యకు నా పూరణ:

    చేసిన పాపమునకు త్రిశంకుని శిక్షింపక – తనతో వైరశుద్ధికై సృష్టికి ప్రతిసృష్టి చేయ సాహసించిన విశ్వామిత్రుని చూసి విభ్రాంతి చెందిన వసిష్ఠ మహర్షి యొక్క మనోగతం –

    త్రైశంకవం బైన ధారుణీతలమును భూనభంబుల మధ్యఁ బూన్చినాఁడు
    దర్భాంగుళుల నుండి ధారవోయు పవిత్ర మంత్రజలంబును మాపినాఁడు
    వితథవర్తనునకు విహితంబు గానట్టి ధర్మపథంబును దార్చినాఁడు
    గోహంతకునిఁ దెచ్చి గోలోకభోగంబు కల్పించి కల్పంబుఁ గాల్చినాఁడు
    గాధిసూను నంత తపోధనుండు
    నిహమునకుఁ గాని, పరము గాన్పింపరాని
    కర్మఫలమును లేని యేకాంతమైన
    పాడు లోకమురా! ముని ప్రస్తుతించు!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  18. పెద్దలందరూ మన్నించాలి.

    ఇందాక స్ఫురించిన మాట స్ఫురించినట్లుగా వ్రాస్తుంటే గీతిపాదంలో అక్షరదోషం దొర్లింది. పద్యం ఇలా ఉండాలి:

    చేసిన పాపమునకు త్రిశంకుని శిక్షింపక – తనతో వైరశుద్ధికై సృష్టికి ప్రతిసృష్టి చేయ సాహసించిన విశ్వామిత్రుని చూసి విభ్రాంతి చెందిన వసిష్ఠ మహర్షి యొక్క మనోగతం –

    త్రైశంకవం బైన ధారుణీతలమును భూనభంబుల మధ్యఁ బూన్చినాఁడు
    దర్భాంగుళుల నుండి ధారవోయు పవిత్ర మంత్రజలంబును మాపినాఁడు
    వితథవర్తనునకు విహితంబు గానట్టి ధర్మపథంబును దార్చినాఁడు
    గోహంతకునిఁ దెచ్చి గోలోకభోగంబు కల్పించి కల్పంబుఁ గాల్చినాఁడు

    గాధిసూనుని యంత తపోధనుండు
    నిహమునకుఁ గాని, పరము గాన్పింపరాని
    కర్మఫలమును లేని యేకాంతమైన
    పాడు లోకమురా! ముని ప్రస్తుతించు!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  19. చిలిపి కోయిలలివి యేమి చేయు వనిని?
    లోకులని పిలువగ వారలుందురెచట?
    రామదాసుని గానపు రమ్యతేమి?
    పాడు; లోకము; రాముని ప్రస్తుతించు.

    రిప్లయితొలగించండి
  20. చిలిపి కోయిలలివి యేమి చేయు వనిని?
    లోకులుండు చోటు గనుక లోకమనుము.
    రామదాసుని గానపు రమ్యతేమి?
    పాడు; లోకము; రాముని ప్రస్తుతించు.

    రిప్లయితొలగించండి
  21. సహృదయులకోసం ఇది మఱొక సరణి పూరణ: భక్తి నివేదన. పద్యరచనకు ప్రేరయిత్రీశక్తి అయిన శ్రీమద్గురువుల సద్భావ భావనాఫలం.

    ఏ మంత్రరాజంబు శ్రీ మానినీ చిత్తరాజీవపంజర రాజహంసి
    ఏ మంత్రరాజంబు వామదేవమునీంద్రహృద్ధ్యానగమ్యమౌ నిద్ధపదవి
    ఏ మంత్రరాజంబు కామసందోహనిర్మూలకాలానలకీల రీతి
    ఏ మంత్రరాజంబు శ్రీమత్ప్రభాసచ్చిదానందకందైకతానఫణితి

    తారకబ్రహ్మరాజీయతత్త్వచింత
    నా రహస్యశ్రుతిశిరోధిసారమైన
    ముక్తిమంత్ర మే యది - దాని, మోద మలరఁ
    బాడు లోకము రామునిఁ బ్రస్తుతించు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా!
    ప్రాస యతి గురించి ఇదివరలో శ్రీ శంకరయ్య గారు ఒక పాఠమును చెప్పేరు. అయినా కొందరికి అనుమానములు ఉన్నవి. యతి స్థానములో ప్రాసవలె 2 అక్షరములను (ప్రాస నియమములను పాటించుచూ) ఉపయోగించుటే ప్రాస యతి అనబడును. ఉదా:

    రామచంద్రుడు సర్వ సుత్రామనుతుడు

    అంతరంగమునన్ జాల సంతసించె

    ప్రాస అక్షరములో హల్లు హల్లు ఒకటే అయి యుండవలెను. ఆ హల్లుతో నుండు అచ్చు గూర్చి యెట్టి ప్రస్తావనయు నుండదు. ప్రాస యతిలో అదే విధముగా నుండదగును.

    సాధారణముగా ప్రాస నియమము ఉండే పద్యములలో ప్రాస యతి వేయ రాదు.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. పూజ్య శ్రీ పండిత నేమాని గారికి ప్రణామములు. మీ సూచనకు ధన్య వాదములు
    నా పూరణ లోని 2 వ పాదాన్ని ఈ విధంగా సవరిస్తున్నాను
    "నెవని గొలువంగ మది పొంగు నెపుడు నట్టి "

    శ్రీ ఏల్చూరి మురళీధర్ రావు గారి పద్యాలు చాలా గొప్పగా ఉంటున్నాయి వారికి నమస్కారాలు ,అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గురువులు శ్రీ పండిత నేమాని వారికి పాదాభి వందనములు + ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  25. మిత్రులారా!
    ఈనాటి పూరణలను అన్నీ రామ భక్తి రసాయనమును వర్షించుచున్నవి. భక్తితో సమ్మిళితములైన పద్యములకు విలువ కట్ట గలమా? దేనికదే ఒక మంచి పండు. దేని రుచి దానిదే. అందుకే సమస్యలోని "పాడు" అనే పదమును "పండు" అని చదువుకొందాము. పూరణలను గావించిన వారందరికీ పేరు పేరునా అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. రామ భద్రుడు సుగుణాల రాసి గాన
    సూర్య చంద్రులు గిరులు వసుధను ఝరులు
    నిలచి యున్నంత కాలమ్ము నిత్య మాడి
    పాడు, లోకము రాముని ప్రస్తుతించు

    రిప్లయితొలగించండి
  27. ఏల్చూరి వారూ మీ రెండు పూరణలు ఆణిముత్యాలు. రెండవది మరీను.

    కన్నుమిన్నును గానని కావరమున
    దురితముల్ జేసి కూడియు దుష్ట మతుల
    ఫలిత మనుభవించెడు వేళ భయము తోడ
    పాడు లోకము రాముని ప్రస్తుతించు.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ సరస్వతీ నవీనవ్యక్తమూర్తులైన సహృదయులు
    శ్రీ మంద పీతాంబర్ గారికి; సౌజన్యరూపులు శ్రీ మిస్సన్న గారికి నమస్సులు.

    మీ అభినందితానికి ధన్యవాదములు. మీ శుభాకాంక్షితాలతో సాధనను కొనసాగింపగలుగుతాను.

    భవతు!

    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి