27, మార్చి 2012, మంగళవారం

ముకుందమాల - 1

చం.
అనుదినమే మహీపతి ప్రయాణము గూర్చి పురాన ఘోషణ
మ్మును బొనరింతురో విభుని పుష్కరలోచను రంగనాథునిన్
గనుటకునంచు నా నృపశిఖామణియౌ కులశేఖరాఖ్యు నె
మ్మనమున నే దలంచుచు నమస్కృతి చేయుదు సాదరమ్ముగన్ (1)


సీ.
శ్రీవల్లభాయంచు దేవదేవా యంచు
వరదాయకాయంచు హరియటంచు
సత్కృపాపరయంచు జలజేక్షణాయంచు
భక్తప్రియా జగత్పతియటంచు
భవమోచనాయంచు భద్రరూపాయంచు
నఖిలలోకైక నాథా యటంచు
నాగరాజశయన నారాయణాయంచు
సకలలోకనివాసి శౌరి యంచు
తే.గీ.
పలుకు పలుకున భక్తి భావమ్ము జిలుక
నీదు నామ మంత్రములనే నిర్మలమతి
పలుకవలె గాక నా జిహ్వ సలలితముగ
స్వామి గోవింద గోవింద శ్రీముకుంద! (2)

ఉత్సాహ.
జయము దేవ దేవ నీకు జయము దేవకీసుతా
జయము వృష్ణివంశ దీప జయము కృష్ణ శ్రీధరా
జయము మేఘ నీలగాత్ర జయము కోమలా హరీ
జయము సుందరా ముకుంద జయము భూభరాపహా (3)


చం.
శిరమును నీ పదాబ్జముల చెంతను నిల్పుచు నేను వేడుదున్
స్థిరమతి నొక్క కోరికనిదే వినుమయ్య త్రిలోకపాలకా
మరపును జెందరాదు సుమి మానసమందున జన్మజన్మలన్
నిరతము నిన్ స్మరించుట వినీల శరీర ముకుంద మాధవా (4)


సీ.
నీ పాదపద్మ సన్నిధి నేను మ్రొక్కుదు
నిశ్చల భక్తితో నిగమ వేద్య
అద్వంద్వ హేతువే యదియంచు నాత్మలో
భావమేదియు లేదు దేవ దేవ
ఘోర కుంభీపాక నారక బాధలు
తప్పింపుమనెడు ప్రార్థనము కాదు
రమణీమణుల కూడి సుమవనమ్ములలోన
జెలగుట కోరనో చిత్స్వరూప
తే.గీ.
జన్మ జన్మములందు నా స్వాంతమనెడు
స్వర్ణసౌధమునందు భావనమొనర్చు
చుందు నీ తత్త్వ మొక్కటే యొప్పు మీర
స్వామి గోవింద గోవింద శ్రీ ముకుంద (5)

తే.గీ.
లేదు కోరిక ధర్మ కామాదులందు
భాగ్యములనేని నా పూర్వ భవములందు
కర్మములబట్టి ఫలితముల్ కలుగనిమ్ము
గుండె నిండుగా భక్తియే యుండు గాక (6)


తే.గీ.
నా నివాసమ్ము భువినేని నాకమందు
నేని నరకమందైన నో దానవారి
నేను కోరెడి దొక్కటే నీ పదమ్ము
లందు నిశ్చల భక్తి నిమ్మా ముకుంద (7)


తే.గీ.
స్వామి నీ పాద పద్మ పంజరమునందు
నిప్పుడే చేరుగాక నా హృదయ హంస
ప్రాణముల్ పోవు వేళ కఫాదులెల్ల
కలుగు గొంతుతో నే బల్క గలనె దేవ (8)


చం.
అనవరతమ్ము నే దలతు నాదరమొప్ప జనార్దనున్ హరిన్
వనరుహనేత్రు చిర్నగవు భాసిలు ఫుల్ల సరోరుహాననున్
ఘనరుచిమంతు నంద సుతు కామిత దాయకు నిన్ బరాత్పరున్
వినుత గుణాభిరాము మునిబృంద సమర్చిత పాద పంకజున్ (9)


తరలము.
కరము లంఘ్రులు వారిజమ్ములు కన్నులొప్పగు మీనముల్
విరివిగాగల స్కంధముల్ బహువీచులై తనరారు నీ
హరి సరస్సున నేమునింగిన యంత నాశనమొందు దు
ర్భర భవార్తి ముకుంద చేకురు భద్రముల్ సుఖ శాంతులున్ (10)


తే.గీ.
సరసిరుహ లోచనుని శంఖ చక్ర ధరుని
మురహరుని భక్తి నెన్నడు మరువ వలదు
హరిపదాంబురుహ స్మృతి యమృతసమము
దాని కంటెను సౌఖ్య మేదేని లేదు (11)



స్వేచ్ఛానువాదం

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

5 కామెంట్‌లు:

  1. నమస్కారములు
    గురువులు శ్రీ పండితుల వారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. పద్యములు చాలా బాగున్నవి

    రిప్లయితొలగించండి
  3. అన్నయ్య గారికి నమస్కృతులు. పద్యాలు మధురముగా నున్నాయి.

    రిప్లయితొలగించండి