12, మార్చి 2012, సోమవారం

సమస్యాపూరణం - 644 (ధార్తరాష్ట్రులు నడచిరి)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

 1. కవి మిత్రులకు నమస్కృతులు.
  నా ఆరోగ్య పరిస్థితిని గురించి ప్రశ్నించిన అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతం పరవాలేదు.
  మొన్న మా వియ్యపురాలి అక్క కొడుకు మరణిస్తే మిర్యాలగూడకు వెళ్ళాను. రాత్రి అక్కడే ఉన్నాను. నిన్న ఉదయమే వరంగల్‌లో మా షడ్డకుని కొడుకు చనిపోయాడాని తెలిసి అక్కడినుండి నేరుగా అటే వెళ్ళాను. అంతిమ సంస్కారం అయ్యేసరికి సాయంత్రం అయింది. అందువల్ల నిన్న సమస్య ఇచ్చే అవకాశం లేక పోయింది. మన్నించాలి.

  రిప్లయితొలగించండి
 2. గురువు గారూ,

  ముందుగా మీ ఆరోగ్యము జాగ్రత్త. మీరు 10 రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. పాఠశాలకు 10 రోజులు శలవులిచ్చారనుకోండి.

  పలలమునువీడి కాకి తా వ్రతముజేయు
  టడిదమందున పందిపొర్లాడదనుట,
  ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మపథము
  ననుటయును వింతకాదె యీ యవనియందు.

  రిప్లయితొలగించండి
 3. మిత్రులారా!
  ధార్తరాష్ట్రులును + అడచిరి = ధార్తరాష్ట్రులునడచిరి అనే భావముతో పూరించుచున్నాను.

  పాండవుల కీర్తి చంద్రికల్ వ్యాప్తమగుచు
  ప్రజల ఆదరణయు చాల ప్రబలుచుండ
  వారిపై యీర్ష్యతో వైరి వర్గములును
  ధార్తరాష్ట్రులునడచిరి ధర్మపథము

  రిప్లయితొలగించండి
 4. గురువు గారు,
  మీ ఆరోగ్యం మెఱుగయినందుకు సంతోషము.
  ఒక్కొక్కసారి వరుసగా ఇలాంటి దుర్వార్తలు వినవలసివస్తుంది. ఏం చేయగలము? జాతస్యహిమరణం ధృవమ్

  ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము
  విడిచి, కడకు ఫలితముల పేర రణము
  నందు మరణము నంది వారందరు భువి
  వీడి జనిరి యపయశము వెంట రాగ/ వెనుక విడిచి.

  రిప్లయితొలగించండి
 5. ధర్మ సూక్ష్మము తెలియగా ధరణి యంద్రు
  ధార్తరాష్ట్రులు నడచి రధర్మ పథము
  ధార్తరాష్ట్రుల వారసుల్ తలచు చుంద్రు
  ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మ పథము

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా !
  దీన్నే కామోసు "గోరుచుట్టుపై రోకటి పోటు" అంటారు !
  అసలే మీరు అనారోగ్యంతో ఉంటే ఈ వరుస విషాద సంఘటన లొకటీ !
  ఏ చేస్తాం ! ఒకసారి నా కిలాగే రెండు నెలల సమయంలో 12 మంది దగ్గరి బంధువులు వరుసగా !
  విధి విపరీతం !

  మీ ఆరోగ్యం జాగ్రత్త !

  అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________________

  ధర్మ మెరుగరు , మించిన - దర్ప యుతులు
  ధార్తరాష్ట్రులు ! నడచిరి - ధర్మ పథము
  దారి జూపగ ధర్మ నం - దనుడు తమకు
  ధరణి నేలిన సద్ధర్మ - తతులు వారు
  పరమ ధార్మిక వర్తనన్ - బాండు సుతులు !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 7. ధర్మ హీనులు నయ్యిరి ధరణి లోన
  ధార్త రాష్త్రులు , నడచిరి ధర్మ పధము
  పాండు సూనులు తమకెన్ని బాధ లొదవ
  నంద నందను ననిశంబు నమ్ము కొనిరి .

  రిప్లయితొలగించండి
 8. గురువు గారికి వందనములు, మీ ఆరోగ్యము జాగ్రత్త, మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోండి.ఈ పాఠశాలకు కొన్ని రోజులు శలవులిచ్చారనుకోండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావలెనని ఆ భగవంతుని పార్థిస్తూ
  --------
  కలుపు మొక్కల వల్లనే గలుగు సుఖము
  గట్టిదని నమ్మిన, కలియుగంబునందు
  ధార్తరాష్ట్రులు నడచిరి ధర్మపథము
  వీడి, నడయాడు త్రోవయే వేరులయ్యె

  రిప్లయితొలగించండి
 9. పాండు భూవరు కోడలి వలువ లొలిచి
  నిండు పేరోలగంబున నీచు లైరి
  దార్త రాష్ట్రులు !!! నడచిరి ధర్మ పథము
  న సతతము పాండు సుతులు బడసిరి జయము !!!

  రిప్లయితొలగించండి
 10. గురువుగారూ నమస్కారం .మీ ఆరోగ్యం మెరుగు పడి మీకు త్వరగా స్వస్థత చేకూరాలని భగవంతుని కోరుచున్నాను.

  రిప్లయితొలగించండి
 11. మాయ జూదము నోడించి మహిమ యనుచు
  పణము నెపమున నడవికి పంపి రకట !
  ధార్త రాష్ట్రులు నడచిరి ధర్మ పధము
  వినుట కెంతైన చోద్యము వీరి ప్రతిభ !

  రిప్లయితొలగించండి
 12. మిత్రులారా ఈనాటి పూరణలను గూర్చి ముచ్చటిద్దాము:
  పూరణలు ఎక్కువగా లేకపోయినా, ఇంకా మరికొన్ని వచ్చే సూచనలు ఉన్నవి. అన్నీ బాగుగానున్నవి. అందరికి అభినందనలు.
  1. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు వింతలతో నింపేరు.
  2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు ధార్తరాష్ట్రుల వారసులను పేర్కొనినారు.
  3. శ్రీమతి మందాకిని గారు ధర్మపథమును విడిచి అని సవరించుతూ నింపేరు.
  4. శ్రీ వసంత కిశోర్ గారు మంచి విరుపు నెంచుకొనినారు.
  5. శ్రీ సుబ్బా రావు గారు మంచి విరుపును చూపించేరు. "నయ్యిరి" అనే ప్రయోగము బాగులేదు. ధర్మ హీనులై యుండిరి అంటే బాగుంటుంది.
  6. వరప్రసాద్ గారు కలుపు మొక్కల సామ్యమును పేర్కొనినారు.
  7. శ్రీ మంద పీతాంబర్ గారు ధర్మమే జయించును అని వక్కాణించేరు.
  8. శ్రీమతి రాజేశ్వరి గారు సమస్యను చోద్యముగా అభివర్ణించేరు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. ఎందుకో నాకీ సమస్యలో అన్వయ క్లేశం ద్యోతకమౌతోంది. దయచేసి సవరింపనభ్యర్థన

  రిప్లయితొలగించండి