16, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 648(అర్ధనారీశ్వరుం డయ్యె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

  1. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు. అందులోను నెట్ కనెక్షన్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అందువల్ల వెంట వెంటనే నా స్పందనలను తెలియజేయడానికి అవకాశం లేకుండా పోయింది.
    చక్కని పూరణలు, అభ్యంతరాలు, సమర్థనలు, చర్చలు, శాస్త్రీయమైన విశ్లేషణలు, పరస్పర ప్రశంసలను చూసి ఎంతో సంతోషిస్తున్నాను.
    ఏదో సమస్యను పోస్ట్ చేసి చేతులు దులుపుకున్నట్లు అవుతున్నది నా పరిస్థితి. మీ మధ్య లేను అనే అపరాధ భావం కలుగుతున్నది.
    త్వరగా స్వస్థతను చేకూర్చి పూర్వంలా మిత్రుల మధ్యకు వచ్చే అవకాశాన్ని కల్గించవలసిందిగా ఆ అర్ధనారీశ్వరుణ్ణి యాచిస్తున్నాను.
    అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా ! మీరు తొందరగా కోలుకోవాలని మా ఆకాంక్ష !
    దాదాపు పదిరోజులనుండీ జ్వరం తగ్గకపోవడానికి కారణమేమిటో
    అవసరమైన పరీక్షలు చేయించండి !

    రిప్లయితొలగించండి
  3. బిక్షు వొక్కడు వేషముల్ వేయుచుండి
    యనుదినము తిర్గుచుండు బిక్షాటనకయి
    ఆ ప్రకారాన నొక్కనా డతనిని గన
    అర్థనారీశ్వరుండయ్యె యాచకుండు

    (ఇందులో ఈశ్వరుడు యాచకుడు కాలేదు; ఒక యాచకుడే అర్థనారీశ్వరుని వేషము వేసెను;
    ఈ సమస్యను ఎలాగయినా పూరించ వచ్చును)

    రిప్లయితొలగించండి
  4. గౌరి మేనున నర్ధమై ఘనకపర్ది
    అర్ధనారీశ్వరుండయ్యె; యాచకుండు
    వేడు భక్తుడది యెపుడు వింతగాదు,
    పరము నిహముల వేడును భాగవతుఁడు

    రిప్లయితొలగించండి
  5. గౌరి మేనున నర్ధమై ఘనకపర్ది
    అర్ధనారీశ్వరుండయ్యె; యాచకుండు
    వేడు భక్తుడది యెపుడు వింతగాదు,
    దైవమిచ్చునదియెల్ల దయను గాదె!

    పై పూరణలో నేను పరము, ఇహము అన్నాను. పరము వేడిన పిదప ఇహముతో పని యేమి? ఇహము , పరము అనాలి.
    అందుకే పూరణ కొద్దిగా మార్చాను.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    బ్రహ్మ శిరసును ఖండించి - పాతకమును
    బాపుకొనుటకు కాశిలో - పరమ శివుడు
    విష్ణుదేవుడు జెప్పిన - వినతి బరుప
    అన్నపూర్ణకు పెనిమిటి - యైన గాని
    ఆది భిక్షువు గామారి - యష్టమూర్తి
    బూది నొంటికి పట్టించి - బొచ్చె బట్టి
    అర్ధనారీశ్వరుం డయ్యె - యాచకుండు !
    _____________________________________________

    *****

    రిప్లయితొలగించండి
  7. అర్ధ భాగంబు నందున నాలి యుంట
    అర్ధ నారీ శ్వ రుండ య్యె , యాచ కుండు
    దినము దినమును బలు మార్లు దిరుగు చుండి
    భిక్ష మెత్తుకు బోషించు బిడ్డ నవని .

    రిప్లయితొలగించండి
  8. అమ్మా! మందాకినీ గారూ!
    మీ పద్యము 4వ పాదములో గణభంగమును సవరించాలి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గురుదేవులకు,

    పర్వతగేహంబు పార్వతీదేహంబు భక్తాళి కద్వైతభావ మెనయ
    శార్దూలచర్మంబు మార్దవచేలంబు భూతియుఁ గస్తూరి పొలుపుమీఱ
    చంద్రావతంసంబు చంద్రికాహాసంబు కరుణాకటాక్షంబు కాంతి దేఱ
    వ్యాళతాటంకంబు లీలారవిందంబు సీమంతరేఖయుఁ జెలువ మొప్ప
    యాచకాభీష్ట దాతృత్వరోచకుండు
    ముక్తికాముక బంధవిమోచకుండు
    తోడు లేకున్న క్షణమేని తోఁచకుండు
    నర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

    “యా రమా మాతృ యాతృషు” అన్న విశ్వశంభు మహర్షి “ఏకాక్షర నామమాలిక” ప్రకారం “యా” అంటే పార్వతి. యాం = పార్వతీ మాతను, అచతి = వలచినవాడు "యాచకుడు" పరమశివుడే.

    భక్తులకు అద్వైతసిద్ధిని కూర్పగోరి తానే అర్ధనారీశ్వరత్వాన్ని భజించాడు స్వామి.

    గీత పద్యంలోని అంత్యప్రాస అయ్యవారి కరుణకు అనుప్రాస కావాలని ఈ సమర్పణ.

    రిప్లయితొలగించండి
  10. మఱొకటి:

    యాత్రిక దయార్థియై శివరాత్రి నాఁడు
    ప్రభలు గట్టుక వచ్చిన భక్తగణము
    మ్రోలఁ గొలువున్న ప్రత్యక్షశూలివోలె
    నర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. గణభంగము జరిగినది గమనించలేదు.
    మన్నించండి.

    గౌరి మేనున నర్ధమై ఘనకపర్ది
    అర్ధనారీశ్వరుండయ్యె; యాచకుండు
    వేడు భక్తుడది యెపుడు వింతగాదు,
    దైవమిచ్చునట్టిదియెల్ల దయను గాదె!

    విశ్వమంతట నిండిన వేల్పుయగుచు
    అర్ధనారీశ్వరుండయ్యె యాచకుండు,
    ప్రభువు, నారి, నరుడుగను పరిఢవిల్లె
    నెల్లయెడలను దానుగ నిచ్ఛతోడ.

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. పెద్దవా డొడల్ కదపని బద్ధకిష్టి
    చిన్నకొడుకేమొ పెద్ద పేచీలకోరు
    అందరిని బిల్చి పెట్టేటి దాలియగుచే
    అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు

    రిప్లయితొలగించండి
  13. శ్రీఏల్చూరి మురళీధరరావుగారి సీసపద్యం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  14. మాన్యులు శ్రీ శ్యామలరావు గారికి, శ్రీ సంపత్ కుమార్ శాస్త్రివర్యులకు
    నమస్సులతో,

    ఆర్యా! పెద్దమనసుతో దీవించినందుకు మీ ఉభయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  15. ఏల్చూరి మురళీధర్ రావు గారి పద్యం చాలా బాగుంది . " వ్యాళతాటంకంబు లీలారవిందంబు సీమంతరేఖయుఁ జెలువ మొప్ప " అంటే అర్థం కాలేదు .కాస్త వివరింప ప్రార్థన - భవదీయుడు వి.సుబ్బారావు

    రిప్లయితొలగించండి
  16. విశ్వ మంతను పాలించు యీశ్వ రుండు
    ఆది మధ్యాంత రహితుడు యతడె విష్ణు
    అతడు బిక్షువు కాడది శాంతి బిక్ష
    అర్ధ నారీశ్వరుం డయ్యె యాచకుండు !

    రిప్లయితొలగించండి
  17. నిర్వికారుని గెలువంగ నెపము నెంచి
    తాటంకముల మెరుపున తాను నిగిడి
    మారు డేతెంచి మన్మధ మహిమ జూప
    అర్ధ నారీశ్వరుం డయ్యె యాచ కుండు
    --------------------------------------------
    తాటంకములు = అమ్మ వారి చెవి కుండలములు

    రిప్లయితొలగించండి
  18. ఆర్యా! మీ ఆదరవాక్యాళికి ధన్యవాదాలు.

    ఆయన అర్ధనారీశ్వరుడు కనుక తాను 1. వ్యాళము (పాము) తాటంకంబు (కర్ణాభరణము) గా కలవాడు; ఆమె చేతిలో 2. లీలాకమలముతో, సీమంతరేఖతో (చూడాభోగముతో – పాపట చెందిరతో) - ఇరువురు చెలువమొప్పారగా ఉన్నారు.

    దురన్వయము కాదు కాని, దూరాన్వయముగా చెప్పినచో సీమంతరేఖను శ్లిష్టముగా ఇరువురకు వర్తింపజేయవచ్చును. అప్పుడు సీమంత = పార్యంతికమైన, రేఖతో = (రేఖాయతి – శ్లాఘాం ఆసాదయతి) పొగడ్తలను అందుకొనుచున్నవాడు శివుడు; సీమంతమున చెందిర బొట్టుతో ఉన్నది అమ్మవారు.

    ఏవంవిధ రూపశోభ కలిమిని ఇరువురును చెలువమొప్పారగా భాసమానులని భావము.

    ఏదో అలవోకగా సద్యఃస్ఫురితమును కూర్చికొన్నాను. విమర్శాదర్శముగా ఉన్నదో లేదో.

    ఈ వ్యామోహమునే “నేరక తన యపకీర్తి జగతి నిల్పుట కాదే” అని పెద్దలన్నారు.

    తత్తథాస్తామ్.

    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  19. అమ్మా! రాజేశ్వరి గారూ! మీ పద్యము 2వ పాదములో గణ భంగము ఉన్నది. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  20. ఈనాడు వచ్చిన కొద్ది పాటి పూరణలను చూచుటకు తీరిక దొరకలేదు. పూరించిన వారందరికి అభినందనలు. శ్రీ మురళీధర రావు గారికి ప్రత్యేక ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  21. " ఆది యంతము లేనట్టి యతడె విష్ణు "
    ----------------------------------------------
    బహుశా ఈ పాదమే అనుకుంటున్నాను.తెలియ జేసిన గురువులకు ధన్య వాదములు-----------

    రిప్లయితొలగించండి
  22. అర్థనారీశ్వరుని మీద అందమైన పద్యం
    ఏల్చూరి వారిది !

    రిప్లయితొలగించండి
  23. ఏల్చూరి వారి పద్య మద్భుతము.అర్ధనారీశ్వరుని అద్దములో చూచినట్లుంది.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ వసంత కవివతంసులకు వందనం.

    నిజానికి నిన్న మీ పద్యం వద్దనే నా చూపు నిలిచిపోయింది. పౌరాణికకల్పనతో అష్టమూర్తికి సప్తపాదిని సమర్పించారు.

    భద్రాస్తే పన్థానః!

    అందరమూ శ్రీయుత నేమాని గురువుల ఆశీస్సుకు నోచుకోవటం సంతోషదాయకం.

    రిప్లయితొలగించండి
  25. ఆర్యశ్రీ నరసింహమూర్తి గారి ఆదృతికి అభివాదం.

    అయ్యా! నిండు మనస్సుతో శిరసుపై దీవెనలుంచి నన్ను ఋణగ్రస్తుని కావించారు.

    ధన్యోఽస్మి.

    రిప్లయితొలగించండి
  26. అయ్యా మురళీ ధర రావుగారూ నమస్సులు.
    విద్య యొసగును వినయంబు అన్న నానుడి మీపట్ల నూరు శాతం నిజం.

    మోహినీ రూపుడై వచ్చె భువన ధరుడు
    సుధను పంచగ నయ్యెడ సుందరాంగి
    వెంటబడె ప్రేమ సుధగోరి విశ్వహరుడు
    అర్ధ నారీశ్వరుం డయ్యె యాచ కుండు

    రిప్లయితొలగించండి
  27. అయ్యా మిస్సన్న గారూ!
    నిన్నటి మీ పూరణను చూచేను. శివుడు మోహిని వెంట బడినప్పుడు అర్థ నారీశ్వరూపముతో లేడు. సంపూర్ణ శివ స్వరూపముతోనే యున్నాడు. కాకుంటే ఎంతో ఇబ్బంది కదా!.

    రిప్లయితొలగించండి
  28. మాన్యులు శ్రీ మిస్సన్న గారికి అభివందనాలు.

    మీ శుభాకాంక్షితాన్ని ఇప్పుడే చూడగలిగాను. ఈ సమస్యాపూరణం నిమిత్తంగా మీ ఆత్మీయతకు నోచుకోగలిగినందుకు సంతోషం!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  29. వేడ్క మీరగ దసరాకు వేషములను
    వేసి తిరుగును వీధుల భిక్ష కొరకు
    ఆతడానాడు శివునిగా నగుప డగను
    అర్ధనారీశ్వరుం డయ్యె యాచకుండు.

    రిప్లయితొలగించండి
  30. నేమాని పండితార్యా! మీ సూచనకు ధన్యవాదాలు. కానీ, కొంచెం పరీక్ష పేపరు లూజు గా యివ్వకపోతే మాలాటి వెనక బెంచీ వాళ్ళు ఉత్తీర్ణు లవడం
    కష్టం గదండీ. నేను అర్థనారీశ్వర పదాన్ని శివునికి పర్యాయపదంగా మాత్రమే వాడేను గానీ అంత దూరం ఆలోచించలేదు.

    రిప్లయితొలగించండి