28, మార్చి 2012, బుధవారం

సమస్యాపూరణం - 660 (రమణికి సీతతో)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. రమణి వివాహ మాడ ఘన రాజస మొప్పగ వచ్చి వేల భూ
    రమణులు చేత గాక నట లజ్జితులై తల వాల్చ పార్వతీ
    రమణుని విల్లు ద్రుంచ గనె రాఘవుకున్ రవితేజ శూర వీ
    ర మణికి, సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    రిప్లయితొలగించండి
  2. రాఘవుకున్ బదులుగా రామునకున్ అని మార్చితే....

    రమణి వివాహ మాడ ఘన రాజస మొప్పగ వచ్చి వేల భూ
    రమణులు చేత గాక నట లజ్జితులై తల వాల్చ పార్వతీ
    రమణుని విల్లు ద్రుంచ గనె రామునకున్ రవితేజ శూర వీ
    ర మణికి, సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    రిప్లయితొలగించండి
  3. ఆకసం తో భువి కి దేవరాజొనరించెను పెండ్లి వేడ్క తో
    విశ్వకళ్యాణము వైభవమ్ము చూతము రారే
    విశ్వామిత్రుని అనుంగు రామునికి, రవికుల శూ
    రమణికి, సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మిథిలా నగరం ప్రవేశించిన మన్మథాకారుని, రాముని మోహించిన
    ఎందరో సుందరీమణులలో మేటియైన యొక రమణి
    అసూయ జెందునట్లుగా :


    01)
    ________________________________________________


    సుమధుర రూపమున్ మరియు - శోభయు , భానుని తేజ సంపదల్
    సుమధుర భాషనన్ మిగుల - శుద్ధత గల్గిన వాక్సుధీరుకున్
    సుమధుర చేష్టలన్ ప్రజల - శోభన మెప్పుడు గోరు వానికిన్
    అమలిన చేష్టితా వరుని - నాదరమొప్పగ; కళ్ళు కుట్టగా
    రమణికి; సీతతో జనక - రా జొనరించెను పెండ్లి వేడ్కతో !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిబుధవారం, మార్చి 28, 2012 2:06:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    విమల యశోవిభూషణుడు వీరుడు రాముడు నేగుదెంచగా
    సుమముల బాటనేర్పరచి శోభన మూర్తికి స్వాగతించుచున్
    మమతల కోవెలన్నిలపి మాధవుడేయగు సూర్య వంశ ధీ
    రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో

    రిప్లయితొలగించండి
  6. పెద్దలకు ప్రణామములు.

    అమరతరంగిణీలహరు లందలి శీతలఫేనఖండముల్
    తెమలిచి దందశూకజగతీసముదీర్ణఫణామణిప్రభా
    సమితికి సౌమ్యతాప్రణయచందనలేప ముపస్కరించి యు
    త్తము లని పేరుఁగొన్న మహితప్రభు లర్యమవంశదీపకుల్
    విమలమతుల్ దిలీప రఘువీరుల యన్వయమందు దేవతా
    సముదయరక్షకై యవని జన్నము నిల్పుటకై మహీసుర
    ప్రమథగణాభిరక్షకయి రాక్షససంహృతికై మనుష్యరూ
    పముఁ గొనినట్టి పావనుఁడు పంకజనాభుఁ డుపేంద్రుఁ డిందిరా
    రమణుఁడు పచ్చవిల్తునయ రక్కసిదాయ పరాత్పరుం డురు
    క్రముఁడు పురందరుండు త్రిజగద్విభుఁ డక్షరుఁ డవ్యయుండు సం
    యమిగురుమౌళి గాధిసుతు యాగముఁ గాచి, దురాసురీ నికృం
    త మొనరఁగా; స్వయంవరవిధానమునన్ హరు విల్లు నెత్తి, శౌ
    ర్యమున నజేయ్యుఁడై పరశురాముని కార్ముకమున్ ధరించి తే
    జము హరియించినట్టి జలజాయతనేత్రునికిన్ విలాసికిన్
    గమలకరంబునన్ గరముఁ గైకొన నిల్పి సమంత్రకమ్ముగాఁ
    "బ్రవిమలరూప! భాస్కరశుభాన్వయదీప! మదీయపుత్త్రికన్
    దమిఁ గొనుమయ్య! దేవ! సహధర్మచరీ తవ" యంచు రామవ
    జ్రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  7. హిమకరు బోలు నెన్నగవు హృద్యత నెల్లర కట్టివేయగా,
    సుమశరు కాల్చినట్టి శివ సుందరు విల్లును మ్రొక్కి, ఫెళ్ళనన్,
    రమణుడు, మోహనాంగుడగు రాముడు భంగమొనర్చె; మోదమా
    రమణికి; సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    రిప్లయితొలగించండి
  8. అమ్మా!లక్ష్మీ దేవి గారు!
    మీ పద్యము బాగున్నది. కాని సుమశరు కాల్చినట్టి అనే పదమునకు బదులుగా సుమశరు గెల్చినట్టి అని మార్చండి. కళ్యాణ ఘట్టములో అపశ్రుతులు ఎందుకు? స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. కమలదళాయతాక్షునకు, కార్ముకభంగమొనర్చినట్టి యా
    సమధికశౌర్యయుక్తునకు, సాధుజనావనకార్యదక్షుకున్
    విమలయశోవిశాలునకు, విస్ఫురతన్ వెలుగొందు రామధీ
    రమణికి, సీతతో జనకరాజొనరించెను పెండ్లి వేడ్కతో

    రిప్లయితొలగించండి
  10. పండితుల వారికి అనేక ధన్యవాదములు.
    చక్కని సూచన.
    మీ వంటి పెద్దల సత్సంగం లభించటం మా అదృష్టం.

    హిమకరు బోలు నెన్నగవు హృద్యత నెల్లర కట్టివేయగా,
    సుమశరు గెల్చినట్టి శివ సుందరు విల్లును మ్రొక్కి, ఫెళ్ళనన్,
    రమణుడు, మోహనాంగుడగు రాముడు భంగమొనర్చె; మోదమా
    రమణికి; సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    రిప్లయితొలగించండి
  11. అమరగణావనుండు భువనైక శరణ్యుడు ధర్మమూర్తి హ
    స్తమున గిరీశు చాపమును దాల్చిన యంతనె భగ్నమౌట సం
    భ్రమము జెలంగ గాంచె మిథిలాపతి యా రఘువంశ దివ్యహా
    రమణికి సీతతో జనక రాజు వివాహము చేసె వేడ్కతో

    రిప్లయితొలగించండి
  12. అద్భుతమైన పూరణ చేసేరు లక్ష్మీదేవి గారూ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా శ్రీ మురళీధర్ గారూ! శుభాభినందనలు.
    పొరపాట్లు ఎవరికైనా వస్తాయి. మీ పద్యము 16 పాదములో అలాగే జరిగినది. ప్రాసను మీరు గమనించ లేదు. ఆ పాదము తొలి భాగమును ఇలా మార్చుదామా?

    "అమృతస్వరూప! భాస్కర వరాన్వ్య దీప!"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. ఈరోజు పూరణలను చూచేను. చాలా మంచి విషయము. పద్యాలన్నీ చాల బాగుగనున్నవి. పంపిన వారందరికీ శుభాభినందనలు.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: రవితేజ శూర వీరమణి అని పూరించేరు. బాగున్నది. కానీ రామాయణ కథ ప్రకారము స్వయంవరము, వేనవేల రాజకుమారులు వచ్చుట అని ఎక్కడనూ లేదు. అదంతా సినీమా వాళ్ళ కల్పన.

    2. శ్రీ వసంత కిశోర్ గారు: చూపరులలోని ఒక రమణి యొక్క అసూయను ప్రస్తావించేరు. బాగున్నది.

    3. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు: సూర్య వంశ ధీరమణి అని స్తుతించేరు. బాగున్నది.

    4. శ్రీ ఏల్చూరి వారు: 18 పాదముల చంపకమాలికను ఆ పురాణ దంపతులకి సమర్పించుకొన్న ధన్యులు. రామావతార ప్రయోజనమును వివరిస్తూ, ఆ కళ్యాణ ఘట్టమును కనులముందు కట్టినట్లు చూపించేరు. చాల బాగున్నది.

    5. శ్రీమతి లక్ష్మీదేవి గారు: భక్తి భావమును సుందరముగా వర్ణించుటలో చేయి తిరిగిన వారు. చాల బాగున్నది.

    6, శ్రీ ఎచ్. వి. ఎస్. ఎన్. మూర్తి గారు: మీ రామ ధీర మణి ప్రశంస చాల బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. పండితుల వారికి, కామేశ్వరశర్మ గారికి
    ధన్యవాదములు.
    అన్ని పూరణలు మన బ్లాగుకు కళ్యాణ శోభను తీసుకువచ్చాయి. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అవును అందరి పూరణలతో బ్లాగుకు కళ్యాణ శోభ చేకూరింది.
    ముఖ్యంగా నేమాని పండితార్యుని, మురళీ ధరుని పూరణలు
    కళ్యాణ తోరణాలే.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా శ్రీ మురళీధర్ గారూ! శుభాశీస్సులు.
    నేను మీకు సూచించిన సవరణలో కూడ తప్పు దొరలినది. ఇలా సవరిస్తే బాగుంటుందేమో:
    (1) అమృత సురూప లేక (2) అమిత ప్రతాప అని
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. భ్రమ యిది యేమొ లేక మరి వైష్ణవ మాయయొ రామమూర్తి యా
    ప్రమధ గణాధి నాథు విలు భంగము చేసె త్రుటిన్నయారె! వి-
    భ్రమమొదవెన్ హృదబ్జమున భావన జేయు కొలంది జానకీ
    రమణికి! సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ గురువులకు ప్రణామములు.

    అక్షరం వెనుదిరిగి చూడకుండా ఆశువు అభ్యాసం చేయాలని సాధన చేస్తున్నాను. ఎంత కష్టమో తెలిసివస్తున్నది. తోచినది తోచినట్లుగా టైపుచేస్తుంటే అవాంఛనీయ దోషం దొర్లనే దొర్లింది. ఇకపై మఱింత జాగరూకుడనై పద్యరచన కావించే యత్నం చేస్తాను. ఎంతో సహృదయంతో సవరణ చేసినందుకు శతకోటిధన్యవాద వినతులు.

    మొదట "ప్రముదితలోక! లోకహితపావనధీక! మదీయపుత్త్రికన్ - అని సరిచేయా లనుకొన్నాను కాని, గురువుల సూచననే స్వీకరించాను, కృతజ్ఞతతో.


    అమరతరంగిణీలహరు లందలి శీతలఫేనఖండముల్
    తెమలిచి దందశూకజగతీసముదీర్ణఫణామణిప్రభా
    సమితికి సౌమ్యతాప్రణయచందనలేప ముపస్కరించి యు
    త్తము లని పేరుఁగొన్న మహితప్రభు లర్యమవంశదీపకుల్
    విమలమతుల్ దిలీప రఘువీరుల యన్వయమందు దేవతా
    సముదయరక్షకై యవని జన్నము నిల్పుటకై మహీసుర
    ప్రమథగణాభిరక్షకయి రాక్షససంహృతికై మనుష్యరూ
    పముఁ గొనినట్టి పావనుఁడు పంకజనాభుఁ డుపేంద్రుఁ డిందిరా
    రమణుఁడు పచ్చవిల్తునయ రక్కసిదాయ పరాత్పరుం డురు
    క్రముఁడు పురందరుండు త్రిజగద్విభుఁ డక్షరుఁ డవ్యయుండు సం
    యమిగురుమౌళి గాధిసుతు యాగముఁ గాచి, దురాసురీ నికృం
    త మొనరఁగా; స్వయంవరవిధానమునన్ హరు విల్లు నెత్తి, శౌ
    ర్యమున నజేయ్యుఁడై పరశురాముని కార్ముకమున్ ధరించి తే
    జము హరియించినట్టి జలజాయతనేత్రునికిన్ విలాసికిన్
    గమలకరంబునన్ గరముఁ గైకొన నిల్పి సమంత్రకమ్ముగా
    "నమృతసురూప! భాస్కరశుభాన్వయదీప! మదీయపుత్త్రికన్
    దమిఁ గొనుమయ్య! దేవ! సహధర్మచరీ తవ" యంచు రామవ
    జ్రమణికి సీతతో జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు
    గాఁ

    రిప్లయితొలగించండి
  20. సుమధుర భాష ణుండనుచు సుందర రూపుడు రామునిం గనన్
    తమకము జెంది సీతమది తన్మయ మందుచు పొంగి పోవగా
    శమన ధనుండు రాముడని సాదర మంది ప్రశాంత చిత్తుడై
    రమణికి సీతతో జనక రాజొనరిం చెను పెండ్లి వేడ్కతో !

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్న గారూ మీ పూరణ పద్యం
    "భ్రమ యిది యేమొ లేక మరి వైష్ణవ మాయయొ రామమూర్తి యా" బాగుంది.

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరి గారూ మీ పద్యంలో
    "సుమధుర భాష ణుండనుచు సుందర రూపుడు రామునిం గనన్
    తమకము జెంది సీతమది తన్మయ మందుచు పొంగి పోవగా"

    కన్నులకు కట్టినట్లు వర్ణించారు. పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  23. అమ్మా! రాజేశ్వరి గారూ!
    మీ ప్రయత్నము బాగున్నది. అభినందనలు. శమనధనుండు అని వాడేరు. నాకు అర్థము కాలేదు. శమనుడు అంటే యముడు. "శమ" అంటే మనోనిగ్రహము. శమవిభవుండు రాముడని సాదృతి నా రఘురామమూర్తి వీరమణికి ... ... అని పూర్తి చేస్తే బాగుంటుంది అనుకొనుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! మిస్సన్న గారూ మీ పద్యము భ్రమ విభ్రమములతో సమస్యను పూరించినది - బాగున్నది.స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. ఆనందవర్ధనుడు చెప్పినట్లు - పొంగనున్న పాలకుండలా సన్నద్ధమై ఉండి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి వద్ద ఏ కొద్దిపాటి గుణలేశం కనిపించినా సంస్పందించే శ్రీ మిస్సన్న గారి సహృదయానికి ఎన్నని జేజేలు పలికినా తక్కువే!

    శ్రీ గురుచరణుల స్వస్తివాచనం తత్ శిష్యులందరి గుండెలలో వెలుగుబాటలను పరుస్తూనే ఉండాలి!

    రిప్లయితొలగించండి
  26. కమలమువంటి కన్నులును, కాయము వజ్రసమాన తేజమున్,
    సుమధురభావనాచతురసూనుడు, శూరుడు,ధర్మమూర్తి, స
    ద్విమలమనస్సరోజ పరివేష్ఠితశోభితసూర్యవంశధీ
    రమణికి, సీతతో జనకరాజొనరించెను పెండ్లి వేడ్కతోన్.

    రిప్లయితొలగించండి
  27. కమలమువంటి కన్నులును, కాయము వజ్రసమాన తేజమున్,
    సుమధురభావనాచతురసూనుడు, శూరుడు,ధర్మమూర్తి, స
    ద్విమలమనస్సరోజ పరివేష్ఠితశోభితసూర్యవంశధీ
    రమణికి, సీతతో జనకరాజొనరించెను పెండ్లి వేడ్కతోన్.

    రిప్లయితొలగించండి
  28. అయ్యా! సంపత్ కుమార శాస్త్రి గారూ!
    నిన్నటి సమస్యకు మీ పూరణ పద్యము చాల బాగుగా నున్నది - మంచి మంచి సమాసములు ఉన్నవి. అందులోని 2వ పాదములో -- సుమధుర భావనా చతుర సూనుడు -- అని వేసేరు. సూనుడు అంటే కొడుకు అని అర్థము. మీరు ఏ భావముతో వేసేరో
    గ్రహింప లేకున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. పూజ్య గురువులకు నమస్కారములు.
    " శమనము , శమము , అంటే = కాంతి , ఇంద్రియ నిగ్రహము , అని నిఘంటువులో చూసాను . అందుకని అలా కుదురు తుందేమో అని వ్రాసాను. పొరబాటును తెలిపి నందులకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  30. శ్రీ నేమాని పండితవర్యులకు ధన్యవాదములు.

    దశరథ రాజపుత్రుడు అనే అర్థములో వ్రాయదలచితిని. కానీ అది స్ఫురించలేదు. జాగ్రత్త పడవలసియున్నది. ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  31. తమకిక పెండ్లియైనదని తారక రాముని కంటగట్టుచున్
    కొమరిత జానకమ్మనట కొండొక తీరున వైభవమ్మునన్...
    కొమరుడు లక్ష్మణున్ పిలిచి కోరిక తీరగ నూర్మిళమ్మయన్
    రమణికి, సీతతో, జనకరా జొనరించెను పెండ్లి వేడ్కతో :)

    రిప్లయితొలగించండి