24, మార్చి 2012, శనివారం

ఉగాది కవితలు

కవిమిత్రుల ఉగాది కవితలు
*********

నేమాని రామజోగి సన్యాసి రావు


రారమ్ము నందనా రావమ్మ నందనా
స్వాగతమ్మిదె యనురాగమూర్తి
ఆహ్లాదమునుగూర్చు నట్టి వాసంతమ్ము
వైభవమ్ములతోడ వచ్చె నేడు
మామంచి మిత్రమ్ము మా ప్రేమపాత్రమ్ము
మత్తకోకిల పాడె మధురగీతి
బంభరములు చేసె బలె సంబరములు
ఝంకారములతోడ సంతసమున
మల్లెపూవులు తెచ్చి మాలకూర్చితి నీకు
పరిమళంబులలోన పరవశింప
సంపెంగ పూవులు చాల తెచ్చితి నీకు
ప్రేమతోడ నలంకరించుకొమ్మ
శ్రేయముల్ కూర్చుమా చింతలన్ దీర్చుమా
సౌభాగ్యములనిమ్మ శోభలిమ్మ
ఆనందమీయుమా ఆహ్లాదమీయుమా
విందువినోదాల వేడ్కలిమ్మ
వర్షమ్ములీయుమా హర్షమ్ము నీయుమా
పాడిపంటలనిమ్మ పండువిమ్మ
భోగభాగ్యములిమ్మ యోగరాసులనిమ్మ
సరదాలు మాకిమ్మ శాంతినిమ్మ

అక్రమముల గూల్చి అన్యాయముల ద్రోసి
ధాత్రిపైని నిలిపి ధర్మ సరణి
అస్థిరత్వమణచి సుస్థిరత్వము గూర్చి
అమిత వృద్ధి గూర్చు మన్ని దిశల
**********

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ
ఉ.
నందన నామ వత్సర సనాతన సంస్కృత సంప్రదాయ సా
నంద మరంద తుందిల మనః పరితోషితప్రేక్షణేషణా
మంద హృదంతర స్థిర శమంకర కారిక! చైత్ర కన్యకా!
వందన చందనాంజలి నవాగమ వేళల నందుకొమ్మిదే..!
***********

డా .యస్వీ రాఘవేంద్ర రావు
తే.గీ.
తియ్యనౌ పల్కు మొల్కల నెయ్యమలర
సమత మమతయు ననెడి సస్యములు పండ
మీదు జీవిత కేదార వీధులందు
క్రొత్త వర్షమ్ము శుభములు కురియుగాక!

***************

మిస్సన్న
ఉ.
లోకుల నెల్లరన్ తలచి లోకువగా విహరించుచుంటివా ?
పోకిరి శైత్యమా ! తిరిగి పొమ్మిక చాలు బడాయి! మ్రోడులై
ఆకులు రాల్చి భూరుహము లామనికై తపియించె దాల్మితో,
కోకిల పాటలన్ ప్రకృతి కోరెడు తాళగ లేక నీ వగల్!
కం.
విచ్చెను మల్లెలు బొండుగ
నిచ్చెను నవ పల్లవముల నింపుగ మావుల్
మెచ్చెను కోయిల పాటల
వచ్చెను నవనందనంపు వాసంతాభల్.
కం.
రెచ్చెను వేములు పూతల
నిచ్చెను మలయానిలమ్ము లింపుగ హాయిన్
తెచ్చెను మల్లెల మొల్లల
నెచ్చెలి సిగలోన తురుమ నేటి యుగాదిన్.
కం.
గ్రుచ్చెను విరి శరములతో
త్రచ్చెను హృదిభాండ వలపుదధి నెమ్మదిగన్
రచ్చంజేయుచు యువతను
మ్రుచ్చా మదనుండు చిలిపి ముడులను వేయన్.
తే.గీ.
నంద నందను రాకకా నంద మొంద
తపన జెందెడి గోపికా తతుల రీతి
వేచి యుంటిమి నీకయి వేడ్క మీర
నందనా! రమ్ము నీకివే వందనములు.
*****************

కమనీయం
ఉ.
నందన నామ వత్సర మమంద మనోజ్ఞ మహానుభూతులన్
అందరు బంధుమిత్రులకు నందగ జేయుత యంచు గోరుచున్
అందము లొల్కు జీవన మరందము గ్రోలుడి యంచు దెల్పెదన్
డెందము పుల్కరింపగ స్వదేశ విదేశ బుధాళి కంతకున్.
తే.గీ.
నవయుగాదికి నాంది గా నందనాఖ్య
వత్సరమ్మిదే అరుదెంచె పల్లవ సుమ
శోభిత దుకూలమును దాల్చి ,శుభము లీయ
నెల్లవారికి స్వాగత మ్మీయ రండు.
*************

సంపత్ కుమార్ శాస్త్రి
ఉ.
వందనమాచరింతు కవిభాసురలెల్లరకున్ వినమ్రుడై,
సుందరభావజాలపరిశోభితమైచనుపద్యపాదముల్
పొందుగవ్రాయునట్టి కవిపుంగవజాతికి, నూత్నమర్గమౌ
నందననామవత్సరమనంతశుభంబులనిచ్చు గావుతన్.
******************

గోలి హనుమచ్ఛాస్త్రి
కం.
ఆ నందుని నందను దయ
ఈ నందన వత్సరమ్ము నేకాలమ్మున్
ఆనంద మందెడందను
ఆ నందీశ్వర గమనుడు హాయిగ బ్రోచున్.

****************

వరప్రసాదు
ఉత్సాహ.
కోనసీమనారికేళ కుళ్ళిపోయె,ఖరము నం
దున సునామివచ్చి చిగురు ద్రుంచె మిత్రునింట, నం
దనమునకు నమస్కరింతు ధరణి జనుల నెమ్మదిన్
గనిమ గట్టి గావుమని విఘాతములు వలదు సుమా|
(గనిమ = కట్ట)
తే.గీ.
కోనసీమ కొబ్బరి పైరు కుళ్ళిపోయె
ఖరమునందు క్రాప్ట్ హాలిడే కర్షకులకు
కరువు నాట్యము జేసెలె బరువుతోడ,
తెలుగు వారిస్నేహమునకు దెగులుబట్టి
రాళ్ళు రువ్వగ రహదారి రక్తమయ్యె,
పాలకులు పాడిపంటల పాడిగట్టి
వేలకోట్లతో వ్యాపార వేళ్ళుబెంచ
కుంభకోణములవినీతి కుంభవృష్ఠి
గురిసె భారతావనిపైన, మెరిసె మూర్ఖ
జాతి,కవిపండితులకేది ఖ్యాతి?విఘ్న
ములు వలదులె నందనమా! ముముక్షువులకు
శాంతి సుఖ కనకములిచ్చి కాంతినింపు!
***************

రాజేశ్వరి నేదునూరి
నందనకు ......వందనం
----------------------------
నందనా నువ్వొస్తావని ముందే తెలిసినా
ఖరీదు లేని కైమోడ్పులు తప్ప ఏమివ్వగలను ?
కరువు నిండిన బరువు బ్రతుకుల్లో
కసి తెలియని పసివారు ఆశల అంచులపై
వేసవి విడిది చేస్తుంటే బరువెక్కిన గుండెలతో
బలవంతపు వందనాలు తప్ప ఎం చేయగలను ?
కాలుష్యపు కోరల వలయంలో చిక్కి
మేరువు నధిష్టిం చాలను కోవడం మిధ్యే గా మరి !
అందుకే పేద గుండెకు పిడికెడు ప్రేమ నిమ్మని
నందనా నీకు వందనం నీనీయగల ప్రేమాభి
వం................ద..............నం

శ్రీపతి శాస్త్రి

నందననామ వత్సరము నందననందుని దివ్యతేజమై
సుందర రూపమున్ తొడగి శోభలు గూర్చుచు దాను వచ్చె నీ
హైందవజాతి పర్వముగ హాలికులెల్లరు సంతసిల్లి గో
విందుని నామ సంస్మరణ వీనుల విందుగ జేయుచుండగన్

మత్తకోకిల గానమందలి మాధురీరస ధారలున్
చిత్తమందున విస్తరించగ చిత్రమౌ యనుభూతులన్
క్రొత్తకాంతుల యామణీ తరు కోటి యాశల శాఖలై
మెత్తమెత్తని లేచిగుళ్ళతొ మేదినీ పులకించనీ

12 కామెంట్‌లు:

 1. శోభాయమైన కవితలతో నందనకు స్వాగతం పల్కిన మిత్రులందరికీ అభినందనలు, అభివాదములు .

  రిప్లయితొలగించండి
 2. మిసిమిన్ చూపెడు చిన్నియాకులవి నెమ్మేనన్, విలాసంబుగా
  ముసినవ్వుల్ కురిపించుచున్ నటనలన్ మోహింపజెయ్యున్, నిలన్ .
  కుసుమంబందున హాసముల్ సొగసులై కొంగ్రొత్త గా శోభిలున్,
  హసితమ్మొక్కటి మోమునందు బలు వయ్యారమ్ము నొల్కించుచున్,

  నందనమను వర్షమునను నాయికయ్యె
  నదె గను వసంత భామిని నబ్బురముగ
  సంతసమ్మును పంచుచు సాగిపోవ
  వేడుకొందునిదె యుగాది వేళయందు.

  చిగురాకులలో నూగుచు
  వగలను కురియగ వనమున పాటల నెన్నో
  మిగ మురిపెముగా పాడుచు
  జగములకా కోకిలమ్మ సంతసమొసగున్.

  మల్లెలు మాలల రూపున
  పల్లెత మనముల మరింత వలపుల బెంచున్
  కల్లాకపటములెఱుగని
  సల్లాపములాడ భర్త సరసన జేరున్.

  చల్లలు ద్రావుచున్ జనులు సందెల గాలులు కోరుచుందురే!
  మెల్లగ సాగుచున్న రవి మేఘము గప్పుట చూడనెంతురే!
  పిల్లలు కోరుకున్నటుల ప్రీతిగ వేడుక దేలుచున్ మరే
  యల్లరి చేయబోమనుచు నందర తోడను బొంకనేర్తురే!

  మందాకిని (లక్ష్మీదేవి)
  నిన్న నా బ్లాగ్ లో ప్రచురించినవి కావటం వలన వ్యాఖ్య రూపంలో పెడుతున్నాను.అందరికీ ఉగాది శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 3. goli vaariki -----
  padyam uttamapurushalo modalu pettinaaru kabatti vinamrudanai ani undaali modati paadamlo. ledaa
  vinamrathan ani savarimchukunte saripothundi.

  రిప్లయితొలగించండి
 4. వ్యాహ్యాళికేతెంచ వాసంత రాయుండు
  నుల్లాసముననుర్వి యురకలేసె
  హరితాంబరములూని హరువుల్లనలరారి
  తమితీర తలలూచె తరులు గిరులు
  శుకము శ్రీరస్తంచు శుభవాకములుపల్క
  భావగీతి పికము పాడి మురిసె
  మావి వేములు కూర్మి మధురసమ్ములగూడి
  మనుగడ సారమ్ము మహికిదెచ్చె

  శాంతి శౌక్యమ్ము లీయుర్వి సంతరిల్ల
  స్వాంతముల ధాత్రి జనులెల్ల సంతసిల్ల
  కాల చక్రంపు తేరుపై కదలివచ్చె
  నందముగ వత్సరాది తా నందనముగ

  రిప్లయితొలగించండి
 5. కవితలు ప్రచురించినందుకు శంకరయ్య గారికి ధన్యవాదములు.. ఆరోగ్యం జాగ్రత్త.

  రిప్లయితొలగించండి
 6. ఇంతకీ మందాకిని గారూ లక్ష్మీ దేవిగారూ ఒక్కరేనా?

  రిప్లయితొలగించండి
 7. మిస్సన్న గారు,
  ఔనండీ, అందుకే పేరు వ్రాశాను.
  మందాకిని కలం పేరు.

  రిప్లయితొలగించండి
 8. చాలా సంతోషమండీ లక్ష్మీ దేవి గారూ! చక్కని లక్ష్మీ దేవి లాంటి పవిత్రమైన పేరు! మీ కలం పేరు కూడా చాలా పవిత్రమైనది. మీ కలంలోంచి గంగాలహరి వస్తోందన్న మాట. శుభం.

  రిప్లయితొలగించండి
 9. ధన్యవాదాలు మిస్సన్నగారు,
  మీ మంచి మాటలు ఆనందం కలిగించాయి.

  రిప్లయితొలగించండి
 10. కం.నందనమను వత్సరమిక
  అందముగా ఏతెంచెను అంబర వీధిన్
  డెందమున ముదమునొందగ
  వందనమొనరించ వలెను వందే యనుచున్.

  కం. ఖర వెళ్లి నందనొచ్చెను
  వరుసగనే వచ్చుచుండు వత్సరములు యా
  వరుసను పట్టించుకొనక
  వర దాతృని దూష చేసి వగచుట ఏలా ?

  (పాత సంవత్సరం బాగా లేదు, ఈ సంవత్సరం చాలా బాగుంటుంది - అని జ్యోతిష్యుల చేత చెప్పించుకొని, అలా జరగక పోవటంతో చెప్పిన జ్యోతిష్యుని, ఆ తరువాత, తనకు వరాలివ్వలేదని, దేవుని దూషించుట తప్పని చెప్పటం నా ఉద్దేశ్యం.)

  రిప్లయితొలగించండి
 11. విజయ శుభాకాంక్ష
  గతం నందనం.. ఆనందనం..
  నందన వనాన్ని అందించిన
  నందనానికి ప్రతిస్పందనం
  ప్రస్తుత విజయానికి వందనం..
  ఆ ఆనందన నవ వనంలో
  ఇక నా కవనం నాక వనం కాగా
  విజయ నామ సంవత్సరాది
  విజయంతో మొదలు కాదా ...
  ఏచోట ఉన్నా తెలుగు వారి
  విజయ భేరి మ్రోగుతూనే ఉంటుంది సదా...
  గతానికి పొడిగింపు వర్తమానం
  ఇక భవిష్యత్తు దిన దినప్రవర్ధమానం...
  గతం..స్వగతం..వ్యక్తిగతం..
  సహ జీవనం..సహన జీవనం..
  కష్టం..ఇష్టం..దుఃఖం..సుఖం..
  జీవితంలో భాగం కాగా
  అవి విజయానికి సోపానాలుగా
  మలచి..వలచి..శ్రమించి
  విజయాలని వరించిన
  విజయులకి "విజయ"స్వాగతం..
  ఎల్లలు దాటినా...
  కల్లా కపటం లేక
  ఏ మెరికలు లెకుండా …
  అరమరికలు మరిచి
  అనుక్షణం అప్రమత్తతో
  ప్రతీ క్షణం సమవర్తనతో
  తెలుగు తరం తెలుగు తనం తో
  విజయబావుటా ఎగురవేయాలని
  అందుకు "విజయ"దోహద పడాలని
  విరించి కాంక్ష..ప్రగుణ ఆకాంక్ష..హితైషి శుభాకాంక్ష
  మన ప్రగతి ప్రకృష్టంగా నిలుచుగాక
  సమాజ సద్గతికై తోడ్పడుగాక
  భారత దేశ ఉన్నతికై దోహదపడుగాక
  ప్రపంచ అభ్యున్నతికై కారణభూతమవ్వుగాక
  విశ్వశ్రేయస్సును ప్రతిష్ఠించుగాక
  డా.విరించి
  drmavirinchi@gmail.com

  రిప్లయితొలగించండి