21, మార్చి 2012, బుధవారం

గురు సన్నుతి



ఆ వచోనిచయమ్ము! ఆ తపోవిభవమ్ము!
ఆ కృపావర్షమ్ము! ఆ మహత్త్వ!
మా శుభోదర్కమ్ము! ఆ సభావిజయమ్ము!
ఆ విభాసత్వమ్ము! ఆ కవిత్వ!
మా శాంతతేజమ్ము! ఆశాంతసుయశమ్ము!
ఆసాంతసత్త్వమ్ము! ఆ పటుత్వ!
మా మహాభావమ్ము! ఆ మహౌదార్యమ్ము!
ఆ మహీదేవత్వ! మా గుణిత్వ!
మేను మన్నన న న్నోము మాననమున
నాను మునినాము నామమ్ము నూనినాను
నా మనమ్మున మౌనమ్ము నాన మాని
నేన నేమాని గురుదేవు నేమ మూని!

(మునినాము = శ్రీ పండిత రామజోగి సన్యాసి రావు నామధేయులు)

విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు

7 కామెంట్‌లు:

  1. కవివతంసులు చి. ఏల్చూరి మురళీధర రావు గారికి శుభాశీస్సులు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ మునినాము లైన నేమాని వారిని మనమున మన్నన జేయుచు పద్యము వ్రాసిన ఏల్చూరి వారి రచనా ప్రావీణ్యమునకు జేజేలు.

    రిప్లయితొలగించండి
  3. మురళీధర రావు గారూ,
    మీ గురుసన్నుతి శబ్దాలంకారశోభితమై మనోహరంగా ఉంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు .
    అవధాన సరస్వతులు , శ్రీ పండిత నేమాని వారిపై మురళీధర రావుగారి గురు సన్నుతి మనోహరముగా నున్నది. దేవీ పుత్రు లైన ఇరువురికీ ప్రణామములు

    రిప్లయితొలగించండి
  5. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారిని తమ కవితా విభవమ్ముతో స్తుతించిన శ్రీ మురళీధర రావు గారికి కృతజ్ఞతాభినందనలు.

    గురువు గారికి, అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని గారికి మిత్రు లందఱికీ బ్లాగు వీక్షకులకు నందనాఖ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. చిద్రుప పలుకులకే దీవెన లిచ్చిన శ్రీ గురుచరణులకు నమోవాకములు.

    సద్విద్యాకంధి శ్రీ కంది శంకరయ్య గారి సహృన్మౌళితకు, సుహృన్మోహనతకు జేజేలు.

    శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారి సాహిత్యమునకు, సౌహిత్యమునకు,

    స్వాదుసరస్వతి శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారి నయాన్వితికి, దయాన్వితికి,

    శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి ఆత్మీయతకు, ఔదార్యమునకు,

    శ్రీ శంకరాభరణ సంధానకరణి మూలాన సుపరిచితులైన సన్మాన్యులందరికి పేరు పేరున - పునస్తే నమస్తే!

    అందరికి శ్రీ నందన నామ సంవత్సర సర్వ శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి