చం.
వనధిజ భార్య నీ సుతుడు వారిరుహాసను డాగమమ్ములే
నిను వినుతించు స్తోతలును నిర్జరబృందము సేవకుల్ జనా
ర్దన జనయిత్రి దేవకియు తావక మాయ జగత్తు మోక్షమే
ఘనమగు నీ ప్రసాద మెరుగన్ జుమి యన్యము లెవ్వియేనియున్ .. (33)
సీ.
కృష్ణుండు సకల లోకేశుండు మన త్రాత
కృష్ణునిజేరిమ్రొక్కెదనునేను
కృష్ణునిచే సురరిపులెల్ల హతులైరికృష్ణునికొరకంజలింతునెపుడు
కృష్ణుని వలననే యీ సృష్టి యొప్పారెకృష్ణునిదాసుడనేనులెస్స
కృష్ణుని యందు వర్తిల్లు నీ జగమెల్లనోకృష్ణమముబ్రోవుమోముకుంద
కృష్ణుడే తల్లి తండ్రియు నీశ్వరుండుకృష్ణుడే తోడు నీడయు హితుడు నెపుడు
కృష్ణుడే సర్వమనుచు నర్చించు నెడల
కృష్ణుడే యిచ్చు యోగముల్ క్షేమములును .. (34)
తే.గీ.
నన్ను దయగను మీశ అనాథనాథ
అతిదయాళుడ వీవు భవాబ్ధి యందు
మునుగు నను నతిదీనుని బ్రోవుమయ్య
దేవ పురుషోత్తమా హరీ దీనపాల ... (35)
శా.
శ్రీనారాయణ పాదపంకజయుగ శ్రీసన్నిధిన్ మ్రొక్కెదన్
శ్రీనారాయణ పూజలన్ సతతమున్ జిత్తంబులో జేయుదున్
శ్రీనారాయణ దివ్యనామములు వల్లింతున్ సముత్సాహినై
శ్రీనారాయణ తత్త్వవైభవము నే చింతింతు సద్భక్తితో .. (36)
శా.
శ్రీనాథా పురుషోత్తమా మురహరా శ్రీవాసుదేవా హరీ
శ్రీనారాయణ చక్రపాణి వరదా శ్రీకృష్ణ భక్తప్రియా
శ్రీ నందాత్మజ రామ రామ భువన శ్రేయోనుసంధాయకా
దీన త్రాణ పరాయణా యదువరా దేవా జగన్నాయకా .. (37)
శా.
శ్రీ వైకుంఠ ముకుంద మాధవ కృపాసింధూ యశోదాసుతా
గోవిందా మధుసూదనా సురనుతా గోపాలకృష్ణా విభూ
దేవా యంచును బల్క గల్గియును పృథ్విన్ బల్క రారీతిగా
నే వేళన్ వ్యసనార్తులై జనులు స్వామీ బాపు మీ దుస్థితిన్ ... (38)
చం.
అనవరతమ్ము మానస సమంచిత సారసమందు నొప్పుచున్
వినయము మీర విష్ణుపదపీఠి సమాశ్రయ మొందువారికిన్
మనమున భీతి పోనడచు మాధవు ధ్యాన మొనర్చుచో జనా
ర్దను గృపచేత వైష్ణవపదమ్ము లభించును సత్ఫలమ్ముగా ... (39)
తే.గీ.
క్షీరసాగర వీచికా శీకరతతి
తారలునుబోల నభమట్లు తనరు మూర్తి
కాదిశేషుడు తల్పమై తనరు హరికి
మాధవున కాదరమున నమస్కరింతు ... (40)
తే.గీ.
శృతిధరులు కవిలోక వీరులు ద్విజవర
పద్మశరులు స్నేహితులుగ పరగు నతడు
సారసాక్ష పదాంభోజ షట్పదుడగు
నృపతి కులశేఖరాఖ్యు డీ కృతినొనర్చె ... (41)
చం
తలపులలోన నీ మధుర తత్త్వరసమ్ము సుధాస్రవంతియై
యలరుచు సాగుచుండ పరమార్థ సమన్విత భావరత్న సం
కలన మొనర్చి నీదు పదకంజ సమీపమునందు జేర్చి యం
జలిని ఘటించుచుంటి కృతి సత్కృపతో గొనుమా జనార్దనా.
స్వేచ్ఛానువాదము
శ్రీపండితనేమానిరామజోగిసన్యాసిరావుగారు
శ్రీపండితనేమానిరామజోగిసన్యాసిరావుగారు
మిత్రులారా!
రిప్లయితొలగించండిముకుందమాలలోని 41 శ్లోకములను స్వేఛ్ఛగా అనువాదమొనర్చితిని. ఆ పద్యములను 4 భాగములగా ఈ బ్లాగులో ప్రకటించుట జరిగినది. మన బ్లాగులోని మిత్రులగు మీరందరు చూచియుంటిరి. ఇట్లు ప్రకటించుటలో సహకరించిన శ్రీ కంది శంకరయ్య గారికి బహుధా కృతజ్ఞ తాభివందనములు. స్వస్తి. నేమాని రామజోగి సన్యాసి రావు
నమస్కారములు.
రిప్లయితొలగించండినేనింత వరకు ముకుంద మాల పేరు వినడమే కానీ ఎప్పుడు చదవలేదు. ఇప్పుడు
అవధాన సరస్వతులు శ్రీ పండితుల వారి దయ వలన చదవ గలుగు తున్నాను . వారికి వేవేల వందనములు.