6, మార్చి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 639 (నడకలు తడబడు బుడతడు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -


నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. నాట్యము చక్కగా నేర్చుకొని వచ్చిన కొడుకును మెచ్చుకుంటూ భర్త భార్య తో..

    కడు కోరిక నాట్యముపై
    విడువక గురు సేవ జేసి పెద్డై నాడే
    కొడుకన వీడే ! చూడవె!
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

    రిప్లయితొలగించండి
  2. బుడుతని కృష్ణుని గాంచుచు
    పడతులు మోహమున జేయ పద నృత్య గతుల్
    కడు ముదమున పరమపదుడు
    నడకలు తడబడు బుడతడు నాట్యము చేసెన్

    రిప్లయితొలగించండి
  3. 4వ పాదమును మరల వ్రాయుచూ:

    బుడుతని కృష్ణుని గాంచుచు
    పడతులు మోహమున జేయ పద నృత్య గతుల్
    కడు ముదమున పరమపదుడు
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  4. బుడి బుడి యడుగుల బాలుడు
    వడివడిగా పరుగులిడుచు వేడుక మీరన్ !
    పడిపడి కిలకిల నవ్వుచు
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ !

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిమంగళవారం, మార్చి 06, 2012 8:11:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    మడుగున దాగిన కాళియు
    పడగలపై నెక్కి త్రొక్కి పలువురు గనగన్
    బుడిబుడి యడుగుల కృష్ణుడు,
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  6. మిత్రుల పోరణలు బాగున్నవి
    నాట్యము నేర్చెన్ అని ఉంది కనుక కృష్ణుని పరంగా అన్వయం సరి పోతుందా....

    రిప్లయితొలగించండి
  7. కడు మోదమొసగు పుత్రుడు,
    విడువక తానేర్చి సకల విద్యలనెల్లన్
    సడలని యుత్సాహంబున
    నడకలు తడబడు బుడతడు,నాట్యము నేర్చెన్.

    రిప్లయితొలగించండి
  8. హనుమచ్చాస్త్రి గారూ,

    నాకు కూడా అదే అనుమానమండీ. అందుకే మీ పంథాలోనే వ్రాసినాను.

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా!
    చిన్న సూచనలు:
    కాళీయ మర్దనము వేళలో కృష్ణుడు పసుల కాపరిగా ఎదిగిన బాలుడే గాని తడబడే అడుగుల శిశువు కాడు.
    అమ్మా! రాజేశ్వరి గారూ మీరు యతి సమముగా వేయలేదు. సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  10. తడబడు నడకలు గలిగిన
    బుడతడు వేవేగ నడువ బోర్లా పడగన్
    గడు సంతస మొప్పారగ
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ .

    రిప్లయితొలగించండి
  11. బుడుతడొకదు శంకర భ
    క్తుడు తాండవ హేల గనుచు తోషముతో సం
    దడిచేయుచు పరవశమున
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  12. బుడతడు పడుతూ లేస్తూ
    పడి' కొలవరి ' పాటకేమొ పాడుచు గెంతన్
    పడి నవ్వుచు తల్లనెలే
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

    రిప్లయితొలగించండి
  13. జడి వాన వెల్లి గురియగ
    బుడి బుడిగా నడుగు లిడుచు బోసి నగవులన్
    తడిసి హృది వెల్లి విరియగ
    నడకలు తడపడు బుడతడు నాట్యము జేసెన్ !

    రిప్లయితొలగించండి
  14. తల్లి నవమాసాలు టీవీసీరియళ్ళు చూసె
    తండ్రి క్రమం తప్పక సినీ సాంగ్స్ చూసె
    బుడతడు పుట్టి కెవ్వు కెవ్వు మనె అమ్మకడుపునే
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  15. వడివడి మెసవిన కతమున
    కుడుములు తన బొజ్జలోన గోళీల వలెన్
    దడదడ గడబిడ సేయగ
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

    రిప్లయితొలగించండి
  16. శ్రీనేమాని వారికి,
    కొద్దిరోజుల క్రిందట శూర్పనఖ అనే పదం శూర్పణఖగా రూపాంతరం చెందటం గురించి ప్రసక్తి వచ్చింది కదా. ఈ విషయంలో చాలా మంచి వ్యాసం ఒకటి "పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి" అనేది 'ఈ మాట'లో వచ్చింది. దాని లింక్:
    http://www.eemaata.com/em/issues/201203/1933.html?allinonepage=1

    రిప్లయితొలగించండి
  17. అయ్యా శ్రీ శ్యామలరావు గారూ! శుభాశీస్సులు. మీరు సూచించిన లింకు చదివేను. చాల బాగున్నది. మీకు వచ్చిన సంశయముతో ఒక క్రొత్త పాఠము చదువుకొనినాము. సంతోషము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. బుడిబుడి యడుగుల బాలుడు
    వడివడిగా పరుగులిడుచు బాలక్రీ డన్ !
    పడిపడి కిలకిల నవ్వుచు
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ !
    --------------------------------------------------
    గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  19. చిన్న సవరణ తో...

    బుడతడు పడుతూ లేస్తూ
    పడి' కొలవరి ' పాటకేమొ పాడుచు గెంతన్
    పడి నవ్వుచు తల్లిటులనె
    "నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్"

    రిప్లయితొలగించండి
  20. శ్రీమతి జిలేబీ గారి భావమునకు ఒక పద్య రూపము:

    విడువక టీవీ చూచుచు
    గడపుచు కాలమ్ము నొక్క కవ కన సుతు నా
    బుడుతని కాసక్తి పెరిగె
    నడకలు తడబడు బుడుతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారికి మీ రెండో పద్యంలో పద్యం అంతా ఒకటే అసమాపకక్రియలో ఉండడం వల్ల ,బుడతడు అనే పదము , దానివల్ల భావం కూడా పునరుక్తిదోషం చెందుతున్నది సరిచేయగలరు.

    రిప్లయితొలగించండి
  22. మిత్రులారా!
    ఈనాటి పూరణల గూర్చి ముచ్చటించుకొందాము:

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు 2 విధాలుగా పూరించేరు. ఒక నాట్యాచార్యుడు తన కుమారుని గురించి పొంగి పోవుచు చెప్పిన వైనము ఒకటి; ఒక తల్లి తన తనయుని గూర్చి మురిసిపోవు విధానము మరొకటి -- బాగున్నాయి. గెంతు కు బదులుగా గంతు అని వాడాలి.

    శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము కూడా బాగున్నది.

    శ్రీ శ్రీపతి శాస్త్రి గారు కాళీయ మర్దనమును ఉదహరించేరు.

    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు సకల విద్యలను నేర్చిన బుడుతని గూర్చి ప్రస్తావించేరు.

    శ్రీ సుబ్బా రావు గారు బోర్లా పడుతున్న శిశువు గూర్చి వర్ణించేరు.

    మా తమ్ముడు డా. నరసింహమూర్తి జడి వాన లో తడిసిన బుడుతని గూర్చి వ్రాసెను.

    శ్రీమతి జిలేబీ గారి భావము కూడా బాగున్నది.

    శ్రీ మిస్సన్న గారు భోజనము తరువాత అవస్థలు పడుచున్న గణపతిని స్తుతించేరు.

    అందరి పూరణలు బాగున్నవి.

    ఎవరో ఒక అజ్ఞాత గారు కూడ ప్రతి రోజూ ఉత్సాహముగా పాల్గొనుట ముదావహము.

    అందరికి పేరు పేరునా ప్రత్యేక అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. డి.నిరంజన్ కుమార్మంగళవారం, మార్చి 06, 2012 11:20:00 PM

    కడు యిడుముల బడి పడిపడి
    బుడిబుడి యడుగుల నిడుచును పుడమిని వడిగా
    నడుగున నడుగిడి నెడనెడ
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్.

    రిప్లయితొలగించండి
  24. శ్రీపతిశాస్త్రిబుధవారం, మార్చి 07, 2012 7:45:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    శ్రీపండిత నేమాని వారకి, కవిమిత్రులకు ధన్యవాదములు. సవరణ పద్యము.
    నేటి కాలమున టివి ల కారణముగా తమబిడ్డలు అన్ని రకాల విద్యలు నేర్చుకొనవలెనను అత్యాశతో పసిపిల్లల బాల్యమును హరిస్తున్నారు. అటువంటి సందర్భములో

    వడివడిగా నెదగాలని
    బడిలో జేర్పించినారు పసిబాలకులన్
    గడబిడ జేసెడి వయసున
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  25. ఇక్కడ రోజూ క్రొత్త క్రొత్త పద్యాలు వ్రాస్తున్న వారికీ, సమస్యలు ఇచ్చి, సరిదిద్ది, పద్య రచనని ప్రోత్సహిస్తున్న గురువు గారికీ నమస్కారాలు. పిల్లలకి సంబంధించి తెలుగులో ఏమన్నా కనిపిస్తే నేను పరిగెత్తుకు వస్తాను. ఈ సమస్య చూసి ఆత్రంగా పద్యాలు ఏమి వ్రాస్తారా అని ఎదురు చూశాను. అన్నిట్లోకీ జడివానలో తడిసిన బుడతడి ఊహ నన్ను ఎక్కువ ఆకర్షించింది. నాదో విన్నపం. అప్పుడప్పుడైనా ప్రత్యేకంగా పిల్లల కోసం, పిల్లల చేష్టలని సరళంగా వర్ణిస్తూ పద్యాలు వ్రాస్తే సరదాగా ఉంటుంది,ఈ తరం పిల్లలకి పద్యాలంటే ఇష్టం కలిగే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేస్తారని ఆశించవచ్చా? ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________________

    గడబిడ పడి యడుగడు గున
    కడు వడి జని బహుమతి గొని - కడబడు నెడదన్
    గొడగొడ లాడుచు బాడుచు
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్ !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  27. కడలికి దరిగా వెలసియు
    చెడుగుడు లాడుచు పెరుగుచు
    శ్రీహరి కోటన్
    పుడమిని చుట్టిన "ఇస్రో"
    నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్

    రిప్లయితొలగించండి
  28. వడకుచు కందమ్మనగనె
    పిడకలు పేర్చెడి తెరగున వృత్తములల్లన్
    భడవలు నన్నిట పొగడరె:
    "నడకలు తడబడు బుడతడు నాట్యము నేర్చెన్"

    రిప్లయితొలగించండి