14, మార్చి 2012, బుధవారం

సమస్యాపూరణం - 646 (వనితలకు భూషణంబు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

వనితలకు భూషణంబు వయ్యంది యగున్.
(సమస్యలో గణదోషం లేదు. పాదాదిని ఒక అక్షరాన్ని చేర్చుకోవాలి. అదికూడా యతిమైత్రిని దృష్టిలో పెట్టుకోవాలి)
(వయ్యంది = కుంపటి)

ఈ సమస్యను పంపిన ఏల్చూరి మురళీధరరావు గారికి ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. జ్వరం వస్తూ పోతున్నది. నిన్న రాత్రి విపరీతమైన జ్వరం వచ్చింది. నీరసంగా ఉంది. కీళ్ళు, కండరాల నొప్పులు. మందులు వాడుతున్నాను.
    పూరణలు చేస్తున్న మిత్రులకు అభినందనలు.
    పూరణల గుణదోషాలను వివరిస్తున్న పండిత నేమాని వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !

    ఇంతకన్నా తోచడం లేదు మరి !

    01)
    _____________________________________________

    పవనుని , వరుణుని , పావక
    ప్రవరుల సేవించు మేటి - ప్రమదల కెపుడున్
    ప్రవిమల హృదయము గలిగిన
    ప్రవనితలకు భూషణంబు - వయ్యంది యగున్ !
    _____________________________________________
    ప్రవనిత = సువనిత

    రిప్లయితొలగించండి
  3. సమస్య పూరయిత లందఱికీ వందనం. శ్రీ వసంత కిశోర్ గారి పద్యం హృద్యంగా ఉన్నది.

    మహాకవి ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో “చలిం జడిసి కుంపట్లెత్తికోఁ జూచు” అని వర్ణించిన దళం ఈ సమస్యకు ప్రేరణ.

    భవితప్రావృణ్మిహికా
    వివర్తితవిభాతశీతవేళా నయనో
    త్సవ కాశ్మీరోద్భవనై
    స్స్వవనితలకు భూషణంబు వయ్యంది యగున్.

    (వర్షాకాలం మంచు కురిసిన వేళ తెల్లవాఱు జామున చలికి తట్టుకొనలేక కాశ్మీర దేశపు పల్లెపడుచులు చిన్ని రాగి కుంపటిలో బొగ్గులు రాజేసి దానిని మెడలో అందమైన అలంకారంగా ధరిస్తారు.)

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు, న్యూఢిల్లీ

    రిప్లయితొలగించండి
  4. పూజ్యులు శ్రీ శంకరయ్య గురుదేవులకు,

    పూర్ణారోగ్యం కొఱకు మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్యులు గారు భక్తుల కిచ్చిన బీజాక్షరయుతమైన ఈ సుందర హనుమన్మంత్రపద్యాన్ని నెమరువేసికొనవలసినదిగా విన్నపం.

    క్షారపయోధి దాఁటి, క్షణకాలములో ధరణీతనూజనుం
    జేరి, యొసంగి ముద్రికను, చింతను బాపి, వనమ్ము విక్రమో
    దారతఁ గాల్చి, రాక్షసగణమ్ములఁ దేఱిచి, లంకఁ గాల్చి, సీ
    తా రమణీమణిన్ రఘువతంసున కిచ్చిన హన్మఁ గొల్చెదన్.

    అశేషాంధ్రవిద్యార్థులను, విద్యాధికులను పద్యవిద్యాధరులనుగా తీర్చిదిద్దిన పుణ్యఫలం మీకు పూర్ణారోగ్యాన్ని సిద్ధింపజేస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. మురళీధర రావుగారూ, నమస్కారం.
    ఇలా గణభంగం చేస్తూ పద్యపాదం ఇచ్చి దానిని పూరించమని అడిగే ప్రక్రియ ఇంతకు ముందు జరిగిందంటారా. నేనైతే ఎప్పుడూ చూడలేదు. నేను చూడనంత మాత్రాన లేదు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు అని మనవి.
    ఈ విషయంపై మిగతా కవిమిత్రులు కాస్త చర్చిస్తారా?

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!
    ఏదో ఒకచో నుండే విశేషమును సమస్యగా నిస్తే ఎందరు బాగుగా నింప గలరో ఆలోచించండి. నాకు తోచినంతలో నేను ఈ క్రింది విధముగా నింపేను. తిలకించండి.

    వివిధాగ్ని సమాన స్థితు
    ల వేడిమిని మది భరించి రాజిలు నోర్మిన్
    భువి నన్నపూర్ణలని తల
    ప వనితలకు భూషణంబు వయ్యంది యగున్.

    రిప్లయితొలగించండి
  7. అయ్యా శ్రీ ఆదిభట్ల వారూ!
    సంపూర్ణ పాదము నీయకుండగా గాని, ఒక పాదమును మించి ఇచ్చుట గాని చేయవచ్చును. అవధానములలో ఇట్టి పద్ధతి అనుసరణీయమే.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ ఏల్చూరి వారూ!

    సుందర కాండను సంపూర్ణముగా ఒక పద్యములో నేను కూడా చెప్పేను(అయితే ఇందులో బీజాక్షరమలు, మహిమలు ఉండకపోవచ్చును) తిలకించండి.

    వనధి దరించి లంక నలువంకలు జుట్టి సమీరసూతి సీ
    తను గని బాపి శోకమును ధైర్యము గూర్చి వనమ్ము డుల్చి య
    క్షుని బరిమార్చి రావణుడు కుందుచునుండగ లంక గాల్చి వే
    జని రఘు రామచంద్రునికి జానకి సేమము దెల్పె నొప్పుగా

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ మురళీధర్ గారూ!
    మీ పూరణ పదగుంఫనముతో, సుదీర్ఘ సమాసయుతముగా (మూడు పాదాలను ఒకే ఒక సమాసములో చూపేరు) అలరారుచున్నది. మీ ప్రయత్నమునకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మాన్యులు శ్రీ కామేశ్వరరావు గారికి,
    ప్రత్యభివాదం.

    అఘటనఘటనార్థమే సమస్య కదా! సమస్యాకల్పనమూ, దాని చతురపరిష్కారమూ గోష్ఠీవినోదంకరణ వాగ్విభూతులు. కవిజనప్రతివచనీయంగా పృచ్ఛకుడు చతుర్థచరణ పూర్తిరూపాన్నే ఇవ్వాలన్న నియమమెక్కడా లేదు.

    లక్షణానుసారం అష్టాదశవిధాలైన సమస్యలలో ఇది “ఏకసూత్రాంత్యపాద”మనే పాదైకదేశ సమస్య. “రవి గాంచనిచోఁ గవి గాంచునే కదా” అని అడిగినప్పుడు ఉత్పలమాలలో పాదంలో మొదటి ఏడు అక్షరాలను విడిచి అడిగినప్పటి స్వాతంత్ర్యమే ఇందులో మొదటి ఒక్క అక్షరాన్ని విడిచినప్పుడూ ఉన్నది.

    కందపద్యం చివఱి పాదంలో మొదటి ఒక అక్షరాన్ని వదలి సమస్య ఇవ్వబడింది. గణభంగం జరగలేదు. ప్రాసస్థానం నుంచి సమస్యను అడగటం జరిగిందన్నమాట. “వనితలకు భూషణంబు వయ్యంది యగున్” అన్నప్పుడు “వ”కార సామ్యం వల్ల యతి ఉన్నదని, గణం తప్పిందని భ్రమప్రమాదం కలుగుతుంది. ప్రథమదృష్టికి “వనితలకున్ భూషణంబు వయ్యంది యగున్” అని సరిదిద్దాలనిపిస్తుంది కాబట్టి – గణభంగం జరగలేదని ప్రత్యేకంగా శ్రీ గురువు గారు శీర్షికలోనే నిర్దేశించారు.

    ఛందోగతి మూలాన సమస్యలో ఈ మాత్రపు క్లిష్టత మాత్రమే ఉన్నది. అర్థావబోధ సుకరమే. శ్రీ వసంత కిశోర్ గారు ప్రాదిగా నియమించి, ప్రకృష్టలైన వనితలు అని సరిగానే అన్వయించుకొన్నారు.

    ఇది సలక్షణమైన సమస్యే. విజ్ఞులైన మీకు విన్నవించటమని కాదు కాని, పెక్కుమంది పెక్కు చోట్ల సంస్కృతాంధ్రాలలో పూరించిన సంవిధానమే.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా!
    ఈనాడు వయ్యంది అనే క్రొత్త పదము మనకు తెలిసినది. ఒకే పదమునకు అనేక పర్యాయ పదములు ఉంటాయి. అలాగే నానార్థములు ఉంటాయి. ఒకమాటు నేను విన్న ఒక పదము గూర్చి వివరిస్తున్నాను. ఆ పదము నాకు గుర్తులేదు. దానికి నానార్థములు: కుంపటి, దుప్పటి, కౌగిలి అని. ఇవి యన్నియునూ చలిని పోగొట్టునవే. ఒక శ్లోకములో యీ అర్థములు గలిగిన ఒకే పదమును వాడి ఒక కవి శృంగార రస సమన్వితముగా చమత్కరించి పారితోషికమును పొందెనట. ఈ శ్లోకము ఎవరికైనా వస్తే అందరమూ విని ఆనందించుదాము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. భువినన్నపూర్ణ యని పే
    ర వెలసిన మగువరొ, డొక్క రమణీ సీత
    మ్మ, మరిక నింటను సతతం
    బవని తలకు భూషణంబు వయ్యంది యగున్.

    డొక్కా సీతమ్మ గారింట ఎల్లప్పుడూ భూమి తలకు కిరీటం లా ఆభరణంగా కుంపటి వెలుగుతుందని నా భావన.

    రిప్లయితొలగించండి
  13. పూజ్యులు, సిద్ధపురుషులు, వశ్యవాక్కులు
    శ్రీ నేమాని పండిత గురుదేవులకు సప్రశ్రయ సాధువాదములు.

    అమోఘమైన మీ ఆశీర్వాదమునకు ధన్యుడిని.

    అరువది యెనిమిది సర్గల మహర్షిప్రోక్తమును ఎనుబది నాలుగు అక్షరములలోకి కుదించిన మీ ఏకపద్య సుందర కాండము సర్వాధ్యాయాంతర్వర్తనీయమై భక్తిరసాపూర్ణముగా, అపూర్వమైన మీ ఆశుధారకు నిదర్శకముగా, మనోహరముగా విలసిల్లుచున్నదని నివేదించికొనుచున్నాను.

    మీరు కావించిన పూరణము అర్థాన్వయస్ఫోరకమై, విరోధాభాసమును తొలగించి భారతీయ సంప్రదాయమును శిరసావహింపజేయుచున్నది.

    మీకు జేత లగుగాత.

    భవన్నిరంతరాశీరభిలాషి,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. అమ్మా! మందాకినీ గారూ!
    మీరు తొందరలో గమనించలేదు - మీ పద్యము 3వ పాదములో ప్రాసను మరిచేరు. మీ పద్య్మును ఈ విధముగా సవరించేను.

    భువి నన్నపూర్ణ యను పే
    ర వెలసిన వదాన్య డొక్క రాజత్ సీత
    మ్మ వరలు నింట సతతం
    బవని తలకు భూషణంబు వయ్యంది యగున్

    రిప్లయితొలగించండి
  15. పండితుల వారికి ధన్యవాదాలు, వారింట అని వ్రాసి మార్చినాను. అప్పుడు గమనించలేదు.

    రిప్లయితొలగించండి
  16. సిగ్గు వినయంబు నడకువ చిలిపి తనము
    వనితలకు భూష ణంబు , వయ్యంది యగున్
    పెండ్లి వయసులు గలయట్టి బిడ్డ లౌర
    యింటనుండిన నెత్తిన నెంతొ బరువై .

    రిప్లయితొలగించండి
  17. మరొక పూరణ.

    భువనమునందున పతిసే
    వ, వనితలకు భూషణంబు; వయ్యంది యగున్
    నవలకు ప్రియమగు నొకచో
    యవనిని, భర్త మది గెల్వ యత్నంబులలో.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా శ్రీ సుబ్బారావు గారూ!
    మీ పూరణ తేటగీతిలోకి మార్చేరు. మీ ప్రయత్నము బాగున్నది. కాని 2, 4 పాదములలో చివరి అక్షరము గురువు నుంచేరు. ఆ విధముగ గణభంగము జరిగినది. అటులనే 2వ పాదములో యతి మైత్రి లేదు. సరిజేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. ఈ నెల 18 వ తారీఖు , ఆదివారం, ఉదయం 10 గం.ల నుండి, శ్రీ శివ శక్తి మందిర్, సెక్టార్- 1 , ఆర్. కె.పురం, ఢిల్లీ - నందు శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం - దీని నిర్వహణలో నేను కొంచెం హడావిడిగా ఉన్నాను. త్వరలో మరలా పద్య రచన ప్రారంభిస్తాను.
    మురళీధర్ గారికి, ఇతర ఢిల్లీ వాసులకు, అందరికీ ఈ కార్యక్రమానికి ఈ బ్లాగు ద్వారా ఇదే నా ఆహ్వానము.

    రిప్లయితొలగించండి
  20. భువనమునందున పతిసే
    వ, వనితలకు భూషణంబు; వయ్యంది యగున్
    నవలకు ప్రియముగ నొకచో
    యవనిని, భర్త మది గెల్చు యత్నంబులలో.

    రిప్లయితొలగించండి
  21. విషయము విశదపరిచిన శ్రీ పండిత నేమానివారికీ, శ్రీ మురళీధర రావుగారికీ కృతజ్ఞుడను. ఈ విషయం ఇన్నాళ్ళూ నాకు తెలియదు. మీ ద్వారా ఈరోజొక క్రొత్త విషయం తెలుసుకోగలిగేను.
    ధన్యోహం.

    రిప్లయితొలగించండి
  22. భువనము నేలెడి సతియన
    అవిముక్తమున నిలిచి యారడి దీర్చెన్ !
    ప్రవచించెద రన్నపూర్ణలు
    గ వనితలకు భూషణంబు వయ్యంది యగున్ !
    -----------------------------------------------------
    అవిముక్తము = కాశీ క్షేత్రము .

    రిప్లయితొలగించండి
  23. గురువు గారికి, పండితులకు, ప్రాజ్ఞులకు నమస్కారము. గణ భంగము చేస్తూ సమస్యను ఇవ్వవచ్చా అని ఒక సందేహము వచ్చింది కదా. ఒకానొక సహస్రావధానములో......

    1. లాయరులయ్యొ యొక్క యబలన్ రాగాంధులై యుంచిరే
    2. కపిన్ పూజలు చేసె రాముడు కపుల్ కనగా కపిలేని వేళలో

    పై రెండు సమస్యలలో ఒక దానిలో గణము తక్కువగా మరియొక దానిలో (కపిన్) గణము ఎక్కువగా ఇచ్చినారు.

    నమస్సులు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులారా!
    ఈనాటి పూరణలను గూర్చి ముచ్చటించుకొందాము.

    (1) శ్రీ వసంత కిశోర్ గారు శ్రీకారము చుట్టేరు. స్త్రీలకు నిత్యకృత్యాలలో గాలి, నీరు, నిప్పులను సేవించుటను కర్తవ్యముగా చెప్పేరు.

    (2) శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారు కాశ్మీరులోని స్త్రీలు శీతల వాతావరణములో గుండెలపై ఆభరణముగా ఒక కుంపటిని ధరిస్తారని అక్కడి ఆచారమును తెలియజేసేరు. మరి అట్టి వాతావరణములో పురుషులు ధరించ నక్కరలేదా అని నా సంశయము.

    (3) శ్రీమతి మందాకిని గారు 2 పూరణలు చేసేరు:
    -- ప్రాతస్స్మరణీయులు అపర అన్నపూర్ణ తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వాస్తవ్యురాలైన కీ.శే. డొక్కా సీతమ్మ గురించి;
    -- మంచి విరుపును ప్రయోగించి - పతి సేవలలో కొన్నియెడల వచ్చు కుంపటి వంటి ఇబ్బందులను గూర్చి.

    (4) శ్రీ సుబ్బా రావు గారు తేటగీతిలోకి సమస్యను మార్పుచేసే ప్రయత్నము చేసి తడబడ్డారు. మరో ప్రయత్నము చేసి కందపద్యములోనే నింపితే బాగుంటుంది.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. తరువాత చూచేను శ్రీమతి రాజేశ్వరి గారి పూరణ. కాశీలోని అన్నపూర్ణలుగా స్త్రీలను వర్ణించేరు.
    వారి పూరణలో 2, 3 పాదాలలో గణభంగము ఉన్నది. 4వ పాదములో యతి మైత్రి లేదు. పద్యమును సరిజేసికొనవలెను.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. అవిరళముగనథితులకై
    వివిధములగు పాకములనభీష్టతనొప్పన్
    సవరించెదరే, భావిం
    ప వనితలకు భూషణంబు వయ్యందియగున్.

    ఆడవాళ్ళు, ఎంతమది అతిథులు వచ్చినా ఓపికతో కోరినపదార్థములను చేసి వడ్డిస్తారు కదా.

    రిప్లయితొలగించండి
  27. భువనము నేలెడి సతియన
    అవిముక్తమున తాను వెలసి యారడి దీర్చెన్ !
    అవనిని యమిత ప్రీతిగ
    ప్ర వనితలకు భూషణంబు వయ్యంది యగున్ !

    పూజ్యులు , గురువులకు , ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  28. శ్రీమతి రాజేశ్వరి గారు సవరించిన పూరణ 2వ పాదమును ఇలాగ మార్చుదాము:
    "అవిముక్తమునందు వెలసి యారడి తీర్చెన్"
    భావము చాల బాగుగ నున్నది.

    శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి పూరణ బాగున్నది. 3వ పాదము ఇలా మార్చుదాము:
    "చవులూర గూర్తురే తల"

    ఇద్దరికి అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  29. చమత్కారాన్ని మూటగట్టుకొన్న సమస్య, అందమైన విరుపులతో పూరణలు, నేమాని పండితుల, ఏల్చూరి మురళీధరుల సవివరణాత్మకమైన చర్చలూ వెరసి విజ్ఞాన వినోదాలకు పెద్ద పీత వేసింది నేటి సమస్యా పూరణ. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. 'పెద్దపీట' గా పై నా వ్యాఖ్యలోని తప్పుడు పదాన్ని చదువుకోమని మనవి.
    పొరబాటుకు క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  31. పూజ్యశ్రీ నేమాని గురువులకు,
    ప్రణామములు.

    ఆ చలిలో పురుషులకును ఆవశ్యకమే. నేను పురుషులు దాల్చు శిలాహసంతికలను చూచినాను. స్త్రీలు నగిషీలు చెక్కిన అందమైన రాగి వయ్యందిని గొలుసు వలె అలంకరించికొందురు. కాశ్మీర కవులు ఆ వేడిమి వలన వారి వక్షఃస్థలమున ఏర్పడు మచ్చను రూపకశోభతో వర్ణించియున్నారు. వైష్ణోదేవి యాత్రికులు కాంగ్డా లోని లక్ష్మీనారాయణ మందిరము ముందు వీనిని అమ్ముటను చాలమార్లు ఛూచియే యుందురు. ఇవి విదేశములలో కూడ ఉన్నవి. చిన్ని గ్యాస్ పొయ్యిని మెడలో వేసికొందురు.

    నమస్సులతో, ఏల్చూరి

    రిప్లయితొలగించండి
  32. శ్రీ శంకరయ్య గురువు గారికి స్వస్థత చేకూరు గాక. శ్రీ నేమాని సిద్ధగురువులకు నిత్యవిజయోస్తు. శ్రీ మిస్సన్న గారికి, శ్రీ ఆదిభట్ల కామేశ్వరశర్మ గారికి కృతజ్ఞతాయుత నమస్కారములు. పూరయితలకు ధన్యతాపూర్వక శుభాకాంక్షలు.

    మందాకిని గారు రచించి, శ్రీ నేమాని వారు పరిష్కరించిన "భువి నన్నపూర్ణ" పద్యమునకు వేయి వరహాలు తగును.

    శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారి, శ్రీ వసంత కిశోర్ గారి, నేదునూరి రాజేశ్వరి, శ్రీ సుబ్బారావు గారల పూరణలకు ప్రత్యేకాభినందనములు.

    శ్రీ నేమాని వారి పూరణకు విలువ కట్టు తూనికఱాయి నా యొద్ద లేదు. సరస్వతియే "త్వమేవాహం" అనవలె!

    శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  33. " అవిముక్తము నందు " అని మొదట్నుంచీ వ్రాసి కొట్టేశాను . " మునందు " జగణ ' మౌతుం దేమో అనుకున్నాను . వివరించిన గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  34. శ్రీ పండిత నేమాని గారు,

    మీ సవరణకు శతథా ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  35. మురళీ ధరరావు గారికి
    ధన్యవాదములు.
    మీ భాష వీనుల విందుగా నున్నది. ఈ విధముగా వ్రాయుటకు ప్రయత్నించెదను.

    రిప్లయితొలగించండి
  36. మనసున ప్రేముడి వెలయగ
    తన పతికిని ప్రియ తనూజ తనయుల కిల్లా
    లొనరగ పచనము సేయగ
    వనితామణి భూషణమ్ము వయ్యంది యగున్
    -----------

    రిప్లయితొలగించండి
  37. పవరును గ్యాసును గృహమున
    చివరకు గోల్మాలవగను చిక్కడపల్లిన్
    కవిరో! తెమ్ముము బొగ్గులు...
    ప్రవనితలకు భూషణంబు వయ్యంది యగున్

    ప్రవనిత = సువనిత

    రిప్లయితొలగించండి