7, మార్చి 2012, బుధవారం

సమస్యాపూరణం - 640 (నీతి లేనివారె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది -

నీతి లేనివారె నేతలైరి.

ఈ సమస్యను సూచించిన వసంత కిశోర్ గారికి ధన్యవాదాలు.


22 కామెంట్‌లు:

 1. నిష్కపటులు ధర్మ నిష్ఠాగరిష్ఠులు
  జ్ఞానధనులు వీర్య శౌర్యనిధులు
  రాఘవాన్వయమున రాజుల గనిన దు
  ర్నీతి లేని వారె నేతలైరి

  రిప్లయితొలగించండి
 2. శ్రీపతిశాస్త్రిబుధవారం, మార్చి 07, 2012 8:00:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  త్యాగధనులు నాడు ధారవోసిరి ధనము
  ప్రజల క్షేమమెంచి పాటుపడిరి
  సహనగుణము జూడ సమసిపోయెను నేడు
  నీతి లేనివారె నేతలైరి

  రిప్లయితొలగించండి
 3. ఎన్ను కొనెడు వార లెన్నుకో బడు వారు
  ఎన్న వలయు నీతి నన్ని విధము
  లెన్నొ' కొనగ' వారు లన్ని'యమ్మగ' వీరు
  నీతి లేని వారె నేత లైరి.

  రిప్లయితొలగించండి
 4. భీతి లేని ఘనులు గోతులు దీయుచు
  మోస గించి జనుల కాశ జూపి
  రాజ కీయ మందు రాబందు లనబడు
  నీతి లేని వారె నేత లైరి

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________________

  నీటి మీద పన్ను - నిప్పు మీదయు పన్ను
  నిజము జెప్పు డన్న - నీరు గారు !
  నీరు , నింగి , నేల - చోరులై నేడిల
  నీతి లేని వారె - నేత లైరి !
  _____________________________________________
  నిప్పు = వంటగాసు మరియు విద్యుత్తు

  రిప్లయితొలగించండి
 6. మిత్రులంతా ఈ " కుక్కపిల్లలు "కథ చదివి
  అంతు లేని ఆనందం సొంతం చేసు కొందురు గాక !

  http://www.eemaata.com/em/library/tana-2011/1797.html

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా!
  రేపు మహిళా దినోత్సవము - ఆ సందర్భముగా స్త్రీల ప్రాముఖ్యమును వర్ణిస్తూ పద్య రచన గావించుదాము:
  మచ్చుకి: మహిళయే దీపకళిక సంసారమునకు
  క్షమకు రూప విశేషము నమృతమూర్తి

  రిప్లయితొలగించండి
 8. నీతి లేని వారె నేత లైరి యనుట
  మంచి గాదు నెపుడు మనకు నరయ
  నీతి మంతు లైన నేతలుం గలరయా
  వల్ల భాయి నేత వంటి వారు

  రిప్లయితొలగించండి
 9. గోతు లెన్నొ త్రవ్వు రోత గుణమ్ములఁ
  బ్రీతి గలిగి, రాజనీతి యనుచు
  నిరతిఁ దోడ ప్రజల నిరతము దోచెడి
  నీతి లేని వారె నేత లైరి

  నిరతి = ఆసక్తి ; నిరతము = ఎల్లప్పుడు

  రిప్లయితొలగించండి
 10. నీతి లేని వారె నేతలైరి
  ప్రస్తుతమ్ము కాని;ప్రజలెల్ల కాలమ్ము
  అట్టి నాయకులను ఆదరింపరనుచు
  ఎరుగ జేసిరిప్పు డెన్నికలను.
  ---------------

  రిప్లయితొలగించండి
 11. కవిమిత్రులారా,
  పతంజలిమహర్షికృత చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రమును ఒక్ బ్లాగులో చూచినాను.
  అక్కడ అచ్చులోను, గానరూపంలోనూ ఈ స్త్రోత్రం లభిస్తున్నది. లింక్
  http://andam.blogspot.in/2012/03/blog-post.html?showComment=1331022033196#c8448695873550711967

  రిప్లయితొలగించండి
 12. ఆ.వె. తొల్లి నీతిపరులు చల్లగా నేలిన
  గాథ లెల్ల పుస్తకముల కెక్కె
  కష్టకాల మయిన కలియుగం బిది గాన
  నీతి లేనివారె నేతలైరి

  రిప్లయితొలగించండి
 13. మిత్రులారా!
  శ్రీ శ్యామల రావు గారు మనకొక క్రొత్త వృత్తమును ఈ రోజు పరిచయము చేసేరు. పర చిదంబర నటం హృది భజ అనే మకుటముతో నుండే ఈ శివ తాండవ స్తోత్రము నేను పూర్వము చదివినదే కాని దాని ఛందస్సు గురించి పట్టించుకొన లేదు అప్పట్లో. దాని ఛందస్సు:
  జ స న భ జ స న భ వ గణములు ఉంటాయి, ప్రాస నియమము కలదు, వీలైనన్ని అనుప్రాసలు వేసుకొంటే పద్యానికి మంచి అందము వస్తుంది. 2 యతులు కూడ వేస్తే బాగుంటుంది. నేను శివ స్తోత్ర పరంగా మచ్చుకు ఇప్పుడే వ్రాసిన పద్యము ఇదిగో - తిలకించండి.

  శుభగతి (అనే పేరు బాగుంటుందేమో):

  ధరాధర వరాలయ! సుధాకర ధరా! ఘన ధరాధర ధరా! హర! హరా!
  ధరాధర సుతావర! సదాశివకరా! మృగధరా! స్మరహరా! లయకరా!
  పరాత్పర! నిరంతర శుభంకర! శివా! మునివరార్చిత పదా! హితకరా!
  హరా! పురహరా! భవహరా! భయహరా! నిను స్మరించెద వరాభయకరా!

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శ్యామలీయంగారూ,

  శతథా ధన్యవాదములు. స్తోత్రము వింటూంటే మరల మరల వినాలనిపించేలా ఉంది. ఇది వరకు పతంజలి మహర్షి వ్రాసిన స్తోత్రమేది కూడ విన్నట్టు లేదు. ఒక అద్భుతమైన శ్లోకాన్ని పరిచయం చేసారు.

  పర చిదంబర నటం హృది భజ.

  నమస్సుమాంజలులండీ.

  శ్రీ నేమాని గారూ,

  వెంటనే వ్రాసినా కూడా మంచి లయానుప్రాసములతో పద్యమలరారుచున్నది. ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 15. మంచి విద్యనేర్చి, మానుషత్వముగల్గి
  దేశసేవకొఱకె దేహమనుచు
  తేకువలను జూపులోకసత్తాన దు
  ర్నీతిలేనివారె నేతలైరి.

  ( లోక్ సత్తా పార్టీలో అందరు విద్యధికులనీ, సచ్చరిత్ర కలవారనీ ప్రతీతి కదా......... నేను మాత్రము లోక్ సత్తా పార్టీ కాదండోయ్ )

  రిప్లయితొలగించండి
 16. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  నేటి పూరణలను గూర్చి ముచ్చటిద్దాము
  ఎక్కువ పూరణలలో నేటి రాజకీయాలలోని అవాంఛనీయ స్థితి గతులను పేర్కొనినారు.
  శ్రీ శ్రీపతి శాస్త్రి గారు నేటి నేతల రూపమును వర్ణించేరు;
  శ్రీ గోలి హనుమ్నఛ్ఛాస్త్రి గారు ఎన్నికల వ్యాపారములను అభివర్ణించేరు
  శ్రీమతి రాజేశ్వరి గారు రాజకీయ రాబందులను గుర్తు చేసేరు
  శ్రీ వసంత కిశోర్ గారు పన్ను దెబ్బలు, కబ్జాలు, దోపిడీలను వర్ణించేరు
  శ్రీ సుబ్బా రావుగారు సఛ్ఛీలురైన నేతలు కొందరు శ్రీ వల్లభాయి పటేల్ వంటి వారిని గుర్తు చేసేరు
  తమ్ముడు డా.నరసింహమూర్తి నేతల దోపిడీలను దుయ్య బట్టారు
  శ్రీ కమనీయం గారు వ్యత్యస్తపాద ఆటవెలదిని రచించేరు
  శ్రీ శ్యామలరావు గారు కలియుగ కష్టకాలమును తలచుకొన్నారు
  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు లోక్ సత్తా పార్టీని ప్రస్తావించేరు.
  పద్యాలన్నీ బాగుగ ఉన్నవి. అందరికి అభినందనలు.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. నేమానివారూ, ఈ పతంజలిస్తోత్రం ఉన్న వృత్తం యొక్క ఛందమును
  IUII IUII IUII IUII IUII IUII IU గానుండుట చేత
  "జల" షట్కము పైన "లగ"ముగా భావించుట మరింత సమంజసమని నా అభిప్రాయము. అలాగే మత్తకోకిల ఛందమును "సలల" త్రికము పైన "ర" గణముగా భావించుట యుక్తము. ఇట్లు భావించుట వలన గతి సుబొధకముగా సహజముగా నుండును.

  రిప్లయితొలగించండి
 18. అయ్యా! శ్రీ శ్యామల రావు గారూ! అభినందనలు.
  పద్యములో లయ ఏ విధముగా నున్నా గణములను 3 అక్షరముల గణములతో గుర్తించుటే పరిపాటి. ఛందశ్శాస్త్రములో అలాగే ఇస్తారు. లక్షణ గ్రంథాలను మీరు ఒక్క మారు చూడండి. సౌలభ్యము కొరకు 4 అక్షర గణాలుగా గాని 2 అక్షర గణాలుగా గాని చూపించుట అరుదు. మనము జ్ఞాపకము ఉంచుకొనుట కొరకు లయనే జ్ఞాపకము ఉంచుకోవచ్చును. మీ వీలు కొరకు మీరు 6 జలలను లగను గుర్తు పెట్టుకొనండి. అలాగే మత్తకోకిలకు గల భలు 3 + రగణము గుర్తు పెట్టుకొనండి. లయను యతి స్థానములను గుర్తు పెట్టుకొని మా పెద్ద అబ్బాయి 9వ తరగతి చదువుతూ మహా స్రగ్ధరను రచించేడు. అప్పటిలోనే గర్భ కవిత్వము మొదలు పెట్టేడు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతి శాస్త్రి గారూ
  "త్యాగధనులు నాడు ధారవోసిరి ధనము" -
  అంటే గణములు సరిపోవటంలేదనుకుంటానండీ
  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 20. కొత్త వృత్తమును పరిచయము చేసిన శ్యామలీయము గారికి , అందులో చక్కని అనుప్రాసలతో అందమైన పద్యము నందించిన అన్నయ్య గారికి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 21. నీతి లేని నృపుడు నిలువు దోపిడి సేయ
  మంత్రి కేల కలుగు మంచి గుణము ?
  భటులె చోరు లైన భద్రత యేడరా
  రాజు నడచు రీతి ప్రజల నీతి.

  ఏడ = ఎక్కడ

  అవినీతి లేకుండా అంతా నీతివంతులై ప్రజలు ఒండొకరులకు సహకరించుకొంటే సమాజము ఎంత బాగుంటుందో !

  రిప్లయితొలగించండి
 22. నీతి యన్న మాట నేటి కాలమునందు
  నేతి బీరకాయ నేయ్యి యయ్యె
  తెలివి జూపి ప్రజల తెగదోచుకొనెడి
  నీతి లేని వారె నేత లైరె

  రిప్లయితొలగించండి