22, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 654 (మారె నతండు సుందరిగ)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. అయ్యా , తప్పు తెలుసుకోవాలన్న ఆత్రుతయే కాని మరో ఉద్దేశ్యము లేదు. దయచేసి మీరు మన్నింపు అను మాట వాడవలదు.

    తారాపంక్తులు తోరణమ్ములగు నందమ్మంత వీక్షించుచున్
    క్షీరాబ్ధిన్ జనియించు బాలుడు గృహశృంగారమున్ పెంచ, నా
    ధారిత్రిన్ గను, సంచరించెదమిదే, దాక్షాయణీ! శైలజా
    తా! రా! ర మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.


    చంద్రుడు వెన్నెలలతో వెల్లవేయగా, తారలు తమ గృహమునకు తోరణంబుగా, నిఖిల భువనము తమ గృహంగా నెలకొన్న ఆదిదంపతులు సంధ్యావేళ ధాత్రిని సంచరించు సంరంభము.

    రెండో పాదములో హ గురువు అవుతుంది కాబట్టి గణములు సరిగ్గాఉన్నాయనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! మందాకినీ గారూ! గృహ శృంగారము అనే పదములలో వట్రువసుడి అచ్చునకే సంకేతము కాని హల్లునకు కాదు. ఋ అచ్చే కదా. అందుకే దాని ముందున్న పదము హ లఘువే అగుతుంది. గురువు కాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. చేరిరి దేవ రాక్షసులు చిల్కిరి క్షీర సముద్ర మంతటన్
    కోరిన దందగా సుధను కోరుచు పోరును సల్ప నెంచగా
    వైరుల మోసగింఛి తన వారికి మేలును జేయ శ్రీ హరే
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    భస్మాసురుని బారినుండి శంకరుని రక్షించుటకు మహా విష్ణువు :

    01)
    ________________________________________________

    దారుణ భక్తియోగమున - ధ్యానము జేయుట వల్ల బొంది యా
    మారణ కారకమ్మునట - మచ్చును జూడగ నెంచినట్టియా
    ఘోరము నాపగా దలచి - గోముగ నాట్యము సేయబూనుటన్
    మారె నతండు సుందరిగ - మంజులవాణిగ నద్భుతంబుగా !________________________________________________

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుతులకు ప్రణామములు!

    నటరత్న అక్కినేని నాగేశ్వరరావు గారి నానారసపోషణం:

    చేరి ప్రసిద్ధికై చలనచిత్రపు రంగము నక్కినేని నా
    నా రస పాత్రధారుఁ డయి, నాయకుఁడై మురిపింపఁజేసె భూ
    దారునిగా, మహాత్మునిగఁ, దాతగఁ, బ్రేమికుగాఁ, దఱిన్ మఱిన్
    మారె నతండు సుందరిగ, మంజులవాణిగ నద్భుతంబుగా.

    శ్రాద్ధదేవ మనువు కొడుకు సుద్యుమ్నునికి దారుకావనంలో సతీపతుల ఏకాంతాన్ని భంజించినందుకు శాపం కలిగి స్త్రీగా మాఱిన భాగవత కథ:

    కోరికమై సతీపతులు గుబ్బలిపట్టియు, కృత్తివాసుఁడున్
    జేరిక దారుకోపవనసీమల మారుని కేళిమీఱ దై
    వారఁగఁ జూచి భూమిపతి వారల శాపవచఃఫలంబునన్
    మారె నతండు సుందరిగ, మంజులవాణిగ నద్భుతంబుగా.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  6. ఆ రమణీయ ప్రాంతమున నంగనలే యధినేత్రులంట, యే
    పూరుషుడేని చొచ్చునెడ ముప్పులు తప్పవు వాని కౌట నా
    తీరు నెరుంగకే యొకడు దివ్య శరీరుడు పోయె స్వేఛ్ఛమై
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా

    రిప్లయితొలగించండి
  7. ఔర! భుజంగమున్ గనరె యజ్ఞులు రజ్జువునందు నట్టులే
    కూరిచే మాయగాడొకడు కొండొక దర్పణ మందు జూచుచో
    మారును రూపముల్ క్షణము మాత్రము, నొక్కడు పోయి నిల్వగా
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతమ్ముగా

    రిప్లయితొలగించండి
  8. చిన్న సవరణ : నా 2వ పద్యములో 2వ పాదములో "కూరిచే" అని టైపు తప్పు దొరలినది -- దానిని కూరిచె అని చదువుకొనవలెను.

    రిప్లయితొలగించండి
  9. రామక్రిష్ణుండు మగవానిగ పుట్టిన వాడై
    భామామణీ మానసంబును తెలియ గోరినవాడై,
    పరమహంస అయి జనుల లలరారింప
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా

    జిలెబీ

    రిప్లయితొలగించండి
  10. పై పూరణ సరిచేయుటకు ప్రయత్నిస్తాను.
    అంతవరకూ,

    క్షీరపు సాగరమ్మదియె; శ్రీకరుడై సిరి వల్లభుండదో,
    చేరెను కూర్మరూపమున; శ్రీరమ తా వరియించిచేరగా,
    నీరజ నేత్రుడై నిలిచె; నిక్కము ధర్మపు పక్షపాతియై
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

    రిప్లయితొలగించండి
  11. ఏదో సినిమాలో ,ద్వారపాలకులు లోనికి వెళ్ళకుండా అడ్డుకుంటే
    రాజమందిరంలో ప్రవేశించుటకు నాయకుడు :

    2)
    ________________________________________________

    కోరిక తీరగా మిగుల - గుర్వుగ లోనికి వెళ్ళబూనగన్
    సారెకు సారెకున్నతని- ఛాయను సైతము యడ్డుచుండగన్
    దూరగ రాజమందిరము- దూఱుచు ద్వారపు రక్షకుల్మదిన్
    మారె నతండు సుందరిగ - మంజులవాణిగ నద్భుతంబుగా !
    ________________________________________________
    గుర్వు = గొప్ప(గౌరవము)

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులకు నమస్కారములతో
    చిన్న హాస్య సన్నివేశ్యము యువరాణిని ప్రేమించుటకు పోవు యువకునపై
    -----
    మారె నతండు సుందరిగ, మంజులవాణిగ నద్భుతంబుగా
    చీరెను గట్టి, కాటుకను చెక్కిలి జుక్కగబెట్టి, లోనికిన్
    దూరగ రాజమందిరపు త్రోవన రాణియెజిక్కె, చేరగా
    కోరిన రాణివాసమును కూరిమిజెందెను నాతడిమ్ముగా|

    రిప్లయితొలగించండి
  13. పాతాళ భైరవి సినిమాలో రేలంగిని యశస్వి (ఎస్.వి.ఆర్) మంత్రిస్తే :

    3)
    ________________________________________________

    దూరిన మాంత్రికుణ్ణతని - ధూర్తపు వర్తన నాగ్రహమ్ముచే
    తీరుగ మంత్రదండమును - త్రిప్పుచు మంత్రము నుచ్ఛరింపగన్
    కూరిమి యాపె నంత నల- కూబరుడే గని మెచ్చునట్లుగా
    మారె నతండు సుందరిగ - మంజులవాణిగ నద్భుతంబుగా !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  14. సువర్ణసుందరి సినిమాలో నాగేశ్వరరావు :

    4)
    ________________________________________________

    ప్రేరణ ణింద్రుడే యొసగ - ప్రేమికు లైనను వీడి యొండొరుల్
    దారులె వేరులైన తరి - దారుణ కానన మందు తిర్వుచున్
    సార విహీన జీవితము - సర్పపు శాపము మార్చ నయ్యెడన్
    మారె నతండు సుందరిగ - మంజులవాణిగ నద్భుతంబుగా !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  15. మారునిగన్నతండ్రి, పలుమారులు రూపము మార్చు దిట్ట,దై
    త్యారి, రమాధవుండు, సకలామరభాగ్యవిధాయకుండు, బృం
    దారకకోటి రక్షణకు తన్మయభావముతోడ నప్పుడున్
    మారె నతండు సుందరిగ, మంజులవాణిగ నద్భుతంబుగన్.

    రిప్లయితొలగించండి
  16. సుందరమైన, మధుర మంజులమైన పూరణ లిచ్చిన మిత్రులకూ, పెద్దలకూ అభినందనలు, అభివాదములు.

    నా సరదా పూరణ :

    చేరెను మెల్లగా వెనుక, జేర్చెను నాతిని కౌగిటింట, రె-
    ప్పారెడు లోన చెళ్ళుమనె పాపము చెంప! మఱంద లామె! యా
    చీరను గాంచి యెఱ్ఱనని శ్రీమతి నూహల జేసె భర్త! యే-
    మారెనతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా

    రిప్లయితొలగించండి
  17. క్షీరసముద్ర మధ్యమున జిత్రముగా సుధ పాత్ర వెల్వడన్
    ఆ రజనీచరుల్ బలిమి నా కలశమ్మును గొంచు బారగన్
    వారిజనేత్రు డాపద నివారణచేయ నిలింప పాళికిన్
    మారె నతండు సుందరిగ ,మంజుల వాణిగ నద్భుతంబుగన్ .
    -----------

    ఆర్యా,నా ఉగాది పద్యములు ,నిన్న వ్రాసినవి కూడా ప్రచురించ గోరెదను.

    రిప్లయితొలగించండి
  18. కోరిన భార్య లభ్యమయి కోరికలన్నియు తీరుచుండినన్
    మారెను జీవితంబు మరి మారని జీతము నేడిపించగా
    చారెడు తిండిగింజలకు చేతులు జాపెడి దుస్థితిం బడన్
    మారెనతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా

    రిప్లయితొలగించండి
  19. వామనకుమారా !
    సమస్య పాదాన్ని మీరే ఊహతో అన్వయించారో ఒక వ్యాఖ్య పెడితే
    అందరికీ అర్థమవుతుంది !
    అంతా మీలాగే ఆలోచించ లేరుగదా !

    రిప్లయితొలగించండి
  20. ఉ. భూరిపరాక్రమాన్వితుడు భూపతి డస్సి హ్రదంబు గాంచి త
    న్నీరములన్ వెసన్ మునుగ నెంచుట దోసము కాకపోయినన్
    దారుణ మంబ శాప మది దాకక మానదు తక్షణంబ తా
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా.

    రిప్లయితొలగించండి
  21. మాన్యశ్రీ శ్యామలరావు గారికి ప్రణామం!

    మీరు తక్షణంబ = తత్ క్షణమునందే అని సంధిని అందరి వలె వ్యావహారికంగా ప్రయోగించినట్లు కనబడుతున్నా, శాపమది తాకక మానదు, తక్షణంబ = తత్ శాపవాక్యకృత శిల్పకర్మవిశేషమే! అన్నట్లు "అద్భుతంబుగా తా మారె నతండు" అన్న సమంజసమైన అన్వయం స్ఫురిస్తున్నది.

    అస్తు!

    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురువుల పద్యంలో దృగ్దృశ్యవివేకానికి శ్రీమదాదిశంకరుల వారు ప్రవేశపెట్టిన రజ్జుసర్పభ్రాంతిని పరికరించుకోవటం కల్పనకు ఎంతో గాంభీర్యాన్ని సంతరించిపెట్టింది.

    అదే భ్రాంతిమత్త్వం మఱదలి పుణ్యమా అని చెంపదెబ్బకు దారితీసిన దృశ్యాన్ని శ్రీ మిస్సన్న గారు రసాభాస చమత్కారంగా కన్నులకు కట్టారు!

    సమస్యలో "మాఱు" అన్న ఒక్క దళం మూలాన నేటి పూరణలలో ఇన్ని పరివర్తనలు, పరావర్తనలు పర్యావర్తన లేకుండా ప్రవర్తిల్లాయి.

    ప్రతి శుభోదయాన ఇంతమంది ఇన్నిన్ని సొగసైన ఆలోచనాలోచనాలకు వెలుగునిస్తున్న మాన్యశ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాదాలు.

    అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  23. క్షమించాలి
    ఒక పద్యమే తప్పులు తడకలతో రాయగల నా ఫేసుకి రెండోది కుడాను ? ? ?
    ------------------------------------------------

    గారడి చేయ నేరిమిగ గాత్రము జెప్పుచు మంత్ర దండమున్
    జోరుగ ద్రిప్పగా కొడుకు జూపును నాటల పాటలన్ వినన్
    మీరిన మాయచే నతని మేనిని గాంచిన నాక్షణంబు నన్
    మారె నతండు సుందరిగ మంజుల వాణిగ నద్భుతంబు గా !
    --------------------------------------------------------------------

    సోదర సోదరీ మణు లందరికీ " నందన నామ సంవత్సర " ఉగాది శుభ కాంక్షలు

    రిప్లయితొలగించండి
  24. కోరెను శ్రీహరుం డసుర కోటిని మోదము చెంద నీయగా
    వారడి నెంచకుండ తను వేషము పూనిన మోహనాంగి యై
    మారెనతండు సుందరిగ మంజుల వాణిగ నద్భుతంబు గా !
    జేరెను దానవుల్ సురలు చేకొన గోరుచు పీయుషంబు కై
    ---------------------------------------------------------------
    వారడి= తేడా , బేధము .

    రిప్లయితొలగించండి
  25. శ్రీ వసంత కిశోర్ గారికి
    నమస్కారములు.
    సమన్వయ లోపం వల్ల పద్యం సరిగా కుదరలేదని కొంచెం ఆలస్యంగా అర్ధం అయింది. మరలా ప్రయత్నిస్తాను.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  26. అందరికీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  27. నందనానికందరికీ హృదయ పూర్వక వందనాలు మరియూ శుభాకాంక్షలు :
    మురళీధరరావుగారి స్ఫూర్తితో :

    దేవాంతకుడు మొదలైన సినిమాలలో ఆడవేషం వేసిన
    అన్నగారు(ఎన్.టి.ఆర్) :

    5)
    ________________________________________________

    కోరిక లీరిక ల్మొలవ - కూరిమి నాతడు చిత్రరంగమున్
    చేరెను ! కీర్తి గాంచె నట - చేవను దెల్పెడి పాత్ర లెన్నియో
    ధారణ జేసి , సొంపిలగ - ధన్యత గాంచెను ! తత్‌క్రమాగతిన్
    మారె నతండు సుందరిగ - మంజులవాణిగ నద్భుతంబుగా !
    ________________________________________________

    రిప్లయితొలగించండి
  28. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, మార్చి 23, 2012 1:36:00 PM

    అందరికీ శ్రీ నందన ఉగాది శుభాకాంక్షలు.

    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం (బెంగళూరు)

    రిప్లయితొలగించండి
  29. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, మార్చి 23, 2012 2:09:00 PM

    శ్రీ గురుభ్యోనమ:

    సరస్వతీ స్వరూపులైన గురువర్యులు శ్రీ శంకరయ్యగారికి,శ్రీ పండిత నేమానిగారికి, శ్రీ చింతా రామకృష్ణారావుగారికి, కవిమిత్రులు అందరికి నా నమస్కారములు. శ్రీ నందన నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  30. గురువర్యులకు, కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులు అందరికీ శ్రీ నందన నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  31. ఏల్చూరి వారూ మీరు భూరిపరాక్రమాన్వితుడు... పద్యం యొక్క అన్వయాన్ని చాలా చక్కగా వ్యాఖ్యానించారు.

    రిప్లయితొలగించండి
  32. భారపు కోతి చేష్టలను వందల నిందలు మోపి మోడిపై
    దూరుచు దొంగవంచు భళి తుంటరి పల్కుల రాళ్ళు రువ్వుచున్
    పోరున నోడ రాహులుడు పొంకము మీరగ సిగ్గులొల్కుచున్
    మారె నతండు సుందరిగ మంజులవాణిగ నద్భుతంబుగా

    రిప్లయితొలగించండి