29, మార్చి 2012, గురువారం

సమస్యాపూరణం - 661 (సిరులు పెరిగె సీతతో)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘుపతికిన్.
(ఈ సమస్యను కందంలోనే కాక ఉత్సాహ తదితర ఛందాలలోను ప్రయత్నించవచ్చు)

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

 1. శ్రీపతిశాస్త్రిగురువారం, మార్చి 29, 2012 9:42:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  మురిపెము మీరగ జనకుడు
  ధరణిజ నొసగెను ముదమున దశరథు సుతకున్
  మరు రూపమె శ్రీలక్ష్మికి
  సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘుపతికిన్.

  రిప్లయితొలగించండి
 2. అయ్యా! శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
  శుభాశీస్సులు. మీ పూరణను చూచేను. మురిపెము మీరగ మరియు ముదమున అని 2 మారులు సుమారు సమాన అర్థము స్ఫురించే పదములను వాడేరు. మార్చితే బాగుంటుంది. దశరథు సుతకున్ అనే ప్రయోగము తప్పు. దశరథుని కుమార్తెకు అని అర్థము వచ్చును. అందుచేత మరొక ప్రయత్నము చేస్తే బాగుంటుంది అని నా భావము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. గురువర్యులకు నమస్కారములతో
  ------
  పరమేశ్వరునిధనస్సును
  విరచిన వీరునకు సీత వేయగ వరమా
  ల రమణికి జనకుడిచ్చిలె
  సిరులు, పెరిగె సీతవలన శ్రీరఘుపతికిన్|
  ------
  (పెండ్లిలో సీతకు తండ్రి ఇచ్చిన సిరులతో, పెరిగెను శ్రీరాముని సిరులు)
  మీ శిష్యుడు
  వరప్రసాదు

  రిప్లయితొలగించండి
 4. వరుడయ్యెను, రాక్షస సం
  హరుడై మునితతుల సురల కార్తిన్ దీర్చెన్
  నరవరవరు డయ్యెనటుల
  సిరులు కలిగె సీతవలన శ్రీరఘుపతికిన్

  రిప్లయితొలగించండి
 5. హరికా సిరివలనకదా,
  సిరులు కలిగె; సీతవలన శ్రీరఘుపతికిన్
  మరులను కురిపించు దయా
  పరత కలిగె, నాకెపుడిక భక్తి కలుగునో?

  రిప్లయితొలగించండి
 6. వరలక్ష్మీ యవతారము
  వరవర్ణిని భూమిసుతను భాసిల్లు స్వయం
  వరమున వివాహమాడగ
  సిరులు పెరిగె సీత వలన శ్రీరఘుపతికిన్.
  ------------
  పద్యం పూరించాను గాని ఇందులో సమస్య
  ఏమిటో తెలియడం లేదు.

  రిప్లయితొలగించండి
 7. అయ్యా డా. కమనీయం గారూ! నమస్తే.
  ప్రతి దినము సమస్యలే కాకుండా ఒకొక్క నాడు వైవిధ్యము ఉండాలి. అందుకే ఇందులో ఎంతవరకు నవ్య భావములను గాని శబ్ద సౌందర్యము గాని ప్రదర్శిస్తూ పూరించగలమో అనేదే ఉద్దేశము. దీనికి స్ఫూర్తి: మా జానకి చెట్ట పట్టగా మహారాజు అయినావు అనే కీర్తన. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. ధరణిని పాపము బాపగ
  నరుదెంచిన భగవానుడు నార్యసుతునకున్,
  స్థిరముగ నిలిచెడి కీర్తియు,
  సిరులు పెరిగె సీత వలన శ్రీరఘుపతికిన్.

  రిప్లయితొలగించండి
 9. గత కొన్ని రోజులుగా ఇవ్వబడుతున్న వృత్తాలు నాకు కొరుకుడు పడలేదు. ఈ రోజు మళ్ళీ ప్రయత్నించాను.అయితే ఈ రోజు సమస్య, విద్వత్తు గలిగిన వారికి, ఒక సమస్యగా కనుపించకపోవచ్చు. కానీ నా వంటి వారికి ఈ పద్యం రాయగలిగినా అది విశేషమే.

  రిప్లయితొలగించండి
 10. పదవ తరగతి తరువాత తెలుగు ఒక subject గా చదవనే లేదు. కేవలం ఉత్సాహం కొద్దీ ఆ పదవ తరగతిలో నేర్చుకున్న ఛందస్సు ఆధారంతో, తరువాత పండిత ఏల్చూరి గారి బోధనతో పద్యాలు రాస్తూ వచ్చాను. ఈ బ్లాగులో అడుగు పెట్టిన తరువాత, వసంత కిశోరే గారి పాఠాలు, పండిత నేమాని వారి సలహాలు, ఇతరుల ప్రోత్సాహం నా పద్య రచనా ప్రయత్నానికి సహకరిస్తున్నాయి. శ్రీ శంకరయ్య గారికి, ఈ బ్లాగులోని మిగిలిన కవి పుంగవులందరికీ మనఃపూర్వకముగా ధన్యవాదములు, నమస్సులు.

  రిప్లయితొలగించండి
 11. పెద్దలకు ప్రణామములు. ఈ రోజు అందమైన పౌరాణిక సమస్య నిచ్చిన విద్వన్మణికి నమస్సులు.

  1) సీత = ఒక్క నాగేటి చాలు మూలాన దేవతలు ధన్యులయ్యారు. శ్రీలక్ష్మి అయోనిజయై అవతరించింది. జనకరాజుకు కుమార్తె లభించింది. శ్రీరామునికి లక్ష్మీసంపదలు సమకూడాయి.

  సురకోటికిఁ జరితార్థత
  ధరణీగర్భము వెలువడు తఱి యిందిరకున్
  వరసుత సీరధ్వజునకు
  సిరులు గలిగె సీత వలన శ్రీరఘుపతికిన్.

  2) శ్రీరామునికి సీతాదేవి వలన సిరులు కలిగినట్లే, సంస్కృత మహాభారతం వనపర్వం అధ్యాయం. 188; 102-వ శ్లోకంలో ఏకార్ణవంలో వటపత్రశాయి బొజ్జలో మార్కండేయ మహర్షి సప్తసింధు గత సీతానదిని చూసి అమృతానందాన్ని అనుభవించిన ఉదంతం స్ఫురణకు వచ్చింది.

  ఇది విషమసీసం. ఉత్సాహపై ఆటవెలది.

  పరమశివుని విల్లుఁ ద్రుంచి భవ్యశక్తి జగములం
  దిరవు కొలిపి పరశురాము త్రిణతఁ దాల్పఁ దేజమున్,
  గిరణమాలివంశరాజకీర్తి పరిఢవిల్లఁగా
  సిరులు గలిగె సీత వలన శ్రీరఘుపతికిన్; యుగాం

  తరమున న్మృకండుతనయుండు హరిలీల
  నంధతమసమగ్నసింధురాశి
  బాలకృష్ణు గర్భగోళంబు నందునఁ
  గాంచినట్టి సీతఁ గనియె ముక్తి.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 12. నాదేదో సామాన్యప్రయత్నం. ఈ రోజు లక్ష్మీదేవి (మందాకిని) గారి పూరణకు మాత్రం ఇవే సహస్ర వాఙ్మయార్చనలు!

  రిప్లయితొలగించండి
 13. శ్రీ వామనకుమార్ గారూ! శ్రీ గురుచరణులు పండిత నేమాని వర్యులు, ఆర్యుల అమోఘమైన ఆశీర్వాదం మిమ్మల్ని తప్పక అభ్యుయదయపథంలో నడిపిస్తుంది.

  ధరణిని పాపము బాపగ
  నరుదెంచిన దైవమునకు నార్యసుతునకున్

  అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 14. పూజ్యులు ఏల్చూరి వారికి ,
  విషమ సీసము చాలా బాగున్నది . కందములో రెండవ పాదము అన్వయము నాకు కొంచెము
  కష్టముగా కనిపించినది. సురకోటికి చరితార్ధత , సీరధ్వజునకు వరసుత , సిరులు శ్రీరామచంద్రునకు కలిగినవి. ధరణీ గర్భము వెలువడు తరి ఇందిరకు ఏమి ఒనగూడినది ?
  అది కొంచము చేర్చాలేమో ఆలోచించి సవరణ చేయగలరు . పూరణ మాత్రము ఎన్నదగినది.

  రిప్లయితొలగించండి
 15. మిత్రులారా!
  అందరికీ శుభాభినందనలు.
  డా. ఏల్చూరి వారు చెప్పినట్లు ఈరోజు అందమైన పౌరాణిక సమస్య ఈయబడినది. మంచి పూరణలే వచ్చేయి. శ్రీ రామ నవమి, వసంత నవరాత్రుల సందర్భముగా మంగళాస్పదమైన విషయాలు వస్తుంటేనే మంచిది.

  1. శ్రీ శ్రీపతి శాస్త్రి గారు మంచి ప్రయత్నమే చేసేరు. కానీ కొన్ని సవరణలు చేయవలసిన అవసరము ఉన్నది.

  2. శ్రీ వరప్రసాద్ గారి పద్యము 3వ పాదములో ఏదొ ఒక పొరపాటు ఉన్నట్లు ఉంది. సరిచేయగలరు.

  3. శ్రీమతి లక్ష్మీ దేవి గారి పద్యము డా. ఏల్చూరి వారి మన్ననలు అందుకున్నది కదా. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నాను.

  4. డా. కమనీయము గారు ఒక మంచి పద్యమును అందించేరు. చాల బాగున్నది.

  5. శ్రీ వామన కుమార్ గారు పద్యరచనలో ఇంకా అనుభవము కావాలి అని తపించుచున్నారు. తప్పక అచిరకాలములో వారు చక్కగా ముందడుగు వేయగలరు అని ఆశించుదాము. వివిధ కవుల పద్యములను నిత్యము అభ్యసించుతుంటే రచన పట్టువడుతుంది.

  6. డా. ఏల్చూరి వారి పంథాయే వేరు. వారినుండి మనము రోజు కొక మంచి పౌరాణిక విషయమును తెలుసుకొను చున్నాము. ఈ రోజు కూడా మంచి పూరణ మంచి వ్యాఖ్య

  అందరికీ మరొక సారి శుభాభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 16. శ్రీయుత అజ్ఞాత (అజ్ఞేయ?) వర్యులకు,

  నా యందు తమిళ "పూజ్య"మే కానీ తెలుగు "పూజ్యత" లేదని విన్నపం.

  సురకోటికి చరితార్థత, సీరధ్వజునికి కుమార్తె, శ్రీరామచంద్రునికి సిరులు ఒనగూరినట్లే - తన అవతారము బాహిరిల్లేందుకు ధరణీగర్భము నుంచి వెలువడు "తఱి" (యుక్తసమయము) ఇందిరకు "సీత" (నాగేటి చాలు) వలన కలిగిందని - ప్రతిపాదితమైన భావం.

  కల్పనలో దోషం లేదనుకొంటున్నాను. ఉంటే - తప్పక సవరణను సూచింప ప్రార్థన.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 17. పరమేశు సగము పార్వతి
  హరి తోడిదె సిరియన హరి హరుల వలెన్ !
  వర మాలను వేయగనే
  సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘు పతికిన్

  రిప్లయితొలగించండి
 18. మురళీధరరావు గారు,
  భాష, గ్రంథపఠనాదులలో , వ్యక్తీకరణలో మీ లాంటి వారి దృష్టిలో పడటము పూర్వజన్మ సుకృతము, దైవానుగ్రహము తప్ప మరొకటి కాదు.
  ధన్యవాదములు.
  పండితుల వారికి అనేక ధన్యవాదములు. ప్రణామములు.
  మీరన్నట్టు శోభస్కరమైన సమస్యలు, పూరణలతో శ్రీరామ నవమి,వసంత నవరాత్రులు గడిస్తే బాగుంటుంది.
  అన్ని పూరణలూ చాలా బాగున్నవి. మిత్రులందరికీ అభినందనలు.
  గురువు గారి నుంచి ఏ కబురూ లేదు.
  ఇప్పుడు బ్లాగులొ సమస్యలు ఇస్తున్నది వారేనా, లేక ఎవరికైనా బాధ్యత అప్పగించారా అనేది తెలీలేదు.
  గురువుగారు, మీ ఆరోగ్యం కుదుట పడినదని భావిస్తాను.

  రిప్లయితొలగించండి
 19. శ్రీమతి రాజేశ్వరి గారూ! అమ్మా! మీ పద్యము 2వ పాదములో చివరలో ఒక గురువు తక్కువగా నున్నది. హరి హరుల వలెన్ కు బదులుగా హరి హరులకు వోలెన్ అంటే గణములు సరిపోవును. భావము బాగున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 20. క్షమించండి.
  పూర్తి వ్యాఖ్య ప్రచురింప బడలేదు.
  భాష, గ్రంథపఠనాదులలో , రచనల్లోవ్యక్తీకరణలో ఎంతో గొప్పవారైన మీ లాంటి వారెందరో ఈ బ్లాగులో ఉండటం, వారి దృష్టిలో పడటము పూర్వజన్మ సుకృతము, దైవానుగ్రహము తప్ప మరొకటి కాదు.

  రిప్లయితొలగించండి
 21. నమస్కారములు
  సరస్వతీ పుత్రులు శ్రీ పండిత గురువులకు ధన్య వాదములు. తమ వంటి గురువుల వద్ద నేర్చు కోవడం నా పూర్వ జన్మ సుకృతం. కృతజ్ఞతలు

  రిప్లయితొలగించండి
 22. శ్రీపతిశాస్త్రిగురువారం, మార్చి 29, 2012 11:39:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  శ్రీపండిత నేమాని గురువర్యులకు నమస్సులు. మీ సూచనలు నాకు శిరోధార్యములు. మరియొక ప్రయత్నము చేయుచున్నాను. పరిశీలింప ప్రార్థన.

  పరిణయమాడెను సీతను
  సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘుపతికిన్
  చరితార్థుడు శ్రీరాముడు
  పురుషోత్తముడతడు పుణ్య పురుషులలోనన్

  రిప్లయితొలగించండి
 23. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________________

  సిరి తా నేలకు వచ్చెను
  వరు రాముని పెండ్లి యాడి - ప్రబలగ ధరపై
  పరిణయ మాడిన తరుణమె
  సిరులు పెరిగె సీత వలన - శ్రీ రఘుపతికిన్ !
  _____________________________________________

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గారి అధ్వర్యంలో నడుస్తున్న ఈ పద్యరచనతో సమస్యా పూరణం విజయవంతంగా ఉన్నందుకు సంతోషం.పద్యాలు వ్రాయడానికి కొందరికైనా స్ఫూర్తి దాయకంగా ఉన్నది.ముఖ్యంగా పండితకవులు సర్వశ్రీ శంకరయ్యగారు,నేమాని గారు ,ఏల్చూరివారు ఇతరులకు ఇస్తున్న సూచనలు,చేస్తున్న సవరణలు చాలా ఉపయుక్తం గా ఉన్నవి. మరుగున పడుతున్న తెలుగు పద్యరచనను ప్రోత్సహించే ఈ ప్రయత్నం సర్వదా హర్షణీయం.

  రిప్లయితొలగించండి
 25. సరియగు పరీక్ష యనుచున్
  పరువది దక్కంగ నగ్ని పాటున త్రోయన్
  మురియుచు వెలుపల రాగా
  సిరులు పెరిగె సీత వలన శ్రీ రఘుపతికిన్ :)

  సిరి = శోభ (శబ్దరత్నాకరము)

  రిప్లయితొలగించండి