25, మార్చి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 657 (మోహపాశమ్మె మేలు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.


24 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _____________________________________________


    కాంత కనకమ్ము లందున - కావరమును
    ఆలు బిడ్డల పైనున్న - యాశ నైన
    వదలినను గాని; పరమాత్మ- పాద యుగళి
    మోహ పాశమ్మె మేలు స - న్మునుల కెల్ల !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  2. 02)
    _____________________________________________


    ముద్దరాలిని పెట్టినన్ - పెద్ద యెడము
    ముద్దు బిడ్డల విడచినన్ - సద్దులేక
    మోజులన్నియు వదలినన్ - పుడమి మీద
    మోక్ష ధాముని జేరగా - మోజు పెంచు
    మోహ పాశమ్మె మేలు స - న్మునుల కెల్ల !
    _____________________________________________

    రిప్లయితొలగించండి
  3. ఆర్యులకు ప్రణామం!

    ఈ నాటి సమస్య మునులకే గాక మనందఱికీ మార్గదీపికగా ఉండటం విశేషం. నా పూరణమిది:

    ధర్మంబు పొదిచెడి, దైవంబు గడివోయి, కులము నాచారంబు గోలుపఱచి
    తపములు చెడువడి, ధ్యానంబు పసదప్పి, తగులమి గుచ్చువిచ్చగుచు నుండి
    లౌకికభ్రాంతుల చీకాకు దళమెక్కి, ప్రభునిపై తలఁపులు పాడువాఱి
    వాసిమాయుట కంటె, నాసిరిల్లుట కంటె, మచ్చవడుట కంటె, మలయు కంటె

    నేహి మహితానుభావ! మా మేహి, దేవ!
    పాహి పరమేశ! సన్మతిం దేహి! యనుచు
    నైహికము రోసి శ్రుతిమయదేహు నందు
    మోహపాశమ్ము మేలు సన్మునుల కెపుడు.

    ఆశీరర్థి,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  4. ఆలు బిడ్డల విడనాడి యడవి కేగి
    ఆకు లలముల దినుచును హరిని దలప
    మోక్ష కన్యను గోరుచు నామె పైన
    మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

    రిప్లయితొలగించండి
  5. యతి భంగము సవరణ తో..

    ఆలు బిడ్డల విడనాడి యడవి కేగి
    ఆకు లలముల దినుచును హరిని దలఛి
    మోక్ష కన్యను గోరి నిరీక్ష జేయు
    మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

    రిప్లయితొలగించండి
  6. శ్రద్ధయేమేలు బాల్యాన చదువు మీద,
    భువిని సంసారి కాత్మబంధువులపైన
    మోహపాశమ్మె మేలు, సన్మునుల కెల్ల
    మౌనమే మేలు బ్రహ్మపై ధ్యాన మున్ను.

    రిప్లయితొలగించండి
  7. మోహ బంధము వీడుట, ముక్తి కోరి
    దైవపూజల నుండుట, ధ్యానమందు
    నిరతముండుట మేలది, నిజము! విగత
    మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

    రిప్లయితొలగించండి
  8. మనస్సులో ప్రేమ, ఆలోచనలలో లాలిత్యం
    వచనం లో మాధుర్యం, చేతలలో నేర్పు
    యోగ గతి న పొందవే జిలేబీ,ఈ కవీశ్వరుల
    మోహపాశమ్మె మేలు సన్మనుల కెల్ల !



    ఈ శంకరాభరణం కొలువు లో ఉన్న పెద్దలందరికీ
    ఉగాది శుభాభినందనలతో,
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  9. elchuri vari dhaara amogham . manchi padyam chepparu.abhinandanalu.

    రిప్లయితొలగించండి
  10. జన్మవరుసలకెల్లను, చావుపుటక
    కెల్ల, ప్రాణుల కష్టముకెల్ల, కతము
    మోహపాశమ్మె; మేలు సన్మునుల కెల్ల
    మోహముక్తులయి మనుట ముఖ్యమంద్రు.

    రిప్లయితొలగించండి
  11. విదళితోత్పాద పాప సంవేష్టియగుచు
    యజ్ఞయాగాది క్రతువులననవరతము
    భక్తిఁ సలుపుచు పరిపూర్ణ పరమపురుష
    మోహపాశమ్మె మేలు సన్మునులకెల్ల.

    రిప్లయితొలగించండి
  12. ఆత్మ సంయమమును పరమాత్మ నిచ్చె
    కర్మయోగభక్తి జ్ఞాన మర్మములను
    క్రీడికిన్ జెప్పి శ్రీకృష్ణ గీతపైన
    మోహ పాశమ్మె మేలు సన్మునులకెల్ల!!!

    రిప్లయితొలగించండి
  13. మేనకా వీడి పోకుమా మౌని ననుచు
    మోహ సంద్రాన ముంచి నన్ ముద్దు గుమ్మ
    మోహ పాశమ్మె మేలు సన్మునులకెల్ల
    పడతి పైనేమి పరమాత్ము పైనె నేమి.

    రిప్లయితొలగించండి
  14. ఆలు బిడ్డల మమకార మతిశ యిల్ల
    మోహ పా శ మ్మె , మేలు సన్మునుల కెల్ల
    నియమ నిష్ఠలు, సన్మతి నియతి కలిగి
    లోక కళ్యాణము నకునై మఖము సేయ .

    రిప్లయితొలగించండి
  15. అయా! సుబ్బారావు గారూ!
    మీ పద్యము 4వ పదములో యతి మైత్రిలేదు. ప్రాసయతిగా కూడా సరిపోవుటలేదు. కాస్త మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ మురళీధర రావు గారు! మంచి పురస్కారము, సన్మానము అందుకొనుచున్నందులకు మా శుభాభినందనలు, ఆశీస్సులు.

    తెలుగుల గుండెలందు రసదీప్తులు నింపుచు, క్రొత్త ఢిల్లిలో
    నెలకొనియుండి బోధలను నేర్పుగ జేయుచు విద్యలందు పె
    ద్దల యభిమానమొంది బహుధా వెలుగొందుచు గాంచి సత్కృతుల్
    సలలిత కీర్తి గన్న నిను సన్మతి మెచ్చితి నాత్మ బొంగుచున్

    మురళీధరుడను సభ్యుడు
    వరహృదయుడు సత్కృతులను బడయుచునుండన్
    పరితోషమొదవె నెమ్మది
    విరివిగ దీవెనల గూర్తు ప్రేమ జిలుకున్

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! శ్రీ సుబ్బా రావు గారూ! మీ పద్యమును ఈ విధముగా సవరించుచున్నాను.

    ఆలు బిడ్డల యెడ ప్రేమమధిక మగుట
    మోహ పాశమ్మె; మేలు సన్మునుల కెల్ల
    నియమ నిష్ఠలు, సన్మతి నియతి గలిగి
    మఖమొనర్చుట జనుల క్షేమమును గోరి

    రిప్లయితొలగించండి
  18. గురువులు శ్రీ నేమాని వారికి నమస్కారములు .
    మీ సవరణ చాల బాగున్నది .కృత జ్ఞు డ ను .

    రిప్లయితొలగించండి
  19. మధుర మైనట్టి యనుభూతి మనుజ జన్మ
    తపము లొనరించి వేడిన తిరిగి రాదు
    భోగు లైనట్టి వారలె యోగు లైరి
    మోహ పాశమ్మె మేలు సన్మునుల కెల్ల !

    రిప్లయితొలగించండి
  20. ఏడు దినముల బ్రతుకున కేది ముక్తి ?
    రాజ్య భోజ్యము లనునవి లాల సములు
    శమ దమాదుల నీయగ శుక మునీంద్ర
    మోహ పాశమ్మె మేలు సన్మునుల కెల్ల .!

    రిప్లయితొలగించండి
  21. కర్మఫలములు మెండుగా కాంచి బిదపఁ
    మహిన మాయలు మనసునేమార్చినాక
    కడకు వైరాగ్యమబ్బగా కలుగు మోక్ష
    మోహపాశమ్మె మేలుసన్మునులకెల్ల

    పాలోఆల్తో జంటకవులు
    ఊకదంపుఁడు మఱియు రాకేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిఆదివారం, మార్చి 25, 2012 11:18:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    మాధవునిగూర్చి చింతిచు మనసు కల్గి
    ఆత్మపరమాత్మ బేధములంతరించి
    మోదమందగ కోరెడు మోక్షపథపు
    మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.

    రిప్లయితొలగించండి
  23. వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    ముదుగా ఢిల్లీలో ఉత్తమ విద్యావేత్తగా వార్షిక పురస్కారాన్ని పొందినందుకు అభినందనలు. మీ స్నేహ సహకారాలు లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేమాని వారి అభినందనలను, ఆశీస్సులను పొందిన ధన్యులు మీరు. సంతోషం.
    అందరికీ మార్గ దీపికగా భాసిల్లే ఉత్కృష్టమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మోక్షకన్యా మోహం మేలన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి (మందాకిని) గారూ,
    విగత మోహపాశం మేలన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ కూడా బాగుంది. అయితే "పుటుక కెల్ల, కష్టము కెల్ల" శబ్ద ప్రయోగాలలో దోషం ఉంది. పుటుక సాధు శబ్దం కాదు. కష్టమున కెల్ల లేదా కష్టముల కెల్ల అని ప్రయోగించవలసి ఉంటుంది.
    *
    జిలేబీ గారూ,
    చక్కని భావాన్ని అందించారు. దానికి నా ఛందోరూపం....

    మనమునందున ప్రేమ, యోచనమునందు
    లలితభావమ్ము, మాధురులను గురిసెడి
    వచనములు, జనశ్రేయ కావ్యమ్ములందు
    మోహపాశమ్మె మేలు సన్మునుల కెల్ల.
    *
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పరమ పురుషునిపై మోహం మేలన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    భగవద్గీతామోహ ప్రాశస్త్యాన్ని తెలిపిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఇంతకు ముందెప్పుడో చెప్పాను. మీ కత్తికి (కలానికి) రెండు వైపులా పదునే. మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.
    "పైనె నేమి" అపశబ్దం. పైన నేమి లేదా పైనె యేమి అని ఉండాలనుకుంటా.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పూరణ చెప్పారు. నేమాని వారి సవరణతో యతిదోషం తొలగింది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ఏల్చూరి వారికి అభినందనా పూర్వక ఆశీఃపద్య రత్నాల నిచ్చారు. బ్లాగు పక్షాన మీకు ధన్యవాదాలు.
    సుబ్బారావు గారి పద్యంలో సవరణ సూచించినందుకూ ధన్యవాదాలు.
    కాని ఇంత చక్కని సమస్యకు మీ పూరణ లేని లోటు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో యతిదోషం. "తపము లొనరించినను రాదు తథ్య మిదియె" అందాం.
    *
    రాకేశ్వర రావు గారూ,
    బహుకాలానికి ఈ బ్లాగు పైన దయ కలిగింది. సంతోషం.
    "పాలో ఆల్తో" జంట కవుల గురించి కొద్దిగా వివరించి నా అజ్ఞానాన్ని దూరం చేయవలసిందిగా మనవి.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "మహిన" అనకుండా "మహిని" అనడం మంచిది. "మార్చినాక" అనే వ్యావహారిక రూపం దుష్టమే. అక్కడ "మార్చి వేసి" అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు,
    ఎన్నిరోజులకి మా పూరణలకు మీ వ్యాఖ్యానం!!
    సంతోషమండి.

    సవరించిన పద్యము గమనించగలరు.

    జన్మవరుసలకెల్లను, జర,మరణము
    కెల్ల, జీవుని యాతనకెల్ల; కతము
    మోహపాశమ్మె; మేలు సన్మునుల కెల్ల
    మోహముక్తులయి మనుట ముఖ్యమంద్రు.

    రిప్లయితొలగించండి