28, మార్చి 2012, బుధవారం

ముకుందమాల - 2

సీ.
భయమొందుటేలనో స్వాంతమా కఠినమౌ
యమబాధల దలంచి యనవరతము
పాపమ్ములను శత్రువర్గముల్ మననింక
నేరీతినేని బాధించలేవు
మన స్వామి శ్రీస్వామి మనకు రక్షకుడుగా
నున్నాడు మనలోన నొప్పుమీర
ఆలస్య మికయేల నా భక్తసులభుని
ధ్యానమ్మొనర్పుమా యాదరమున
తే.గీ.
నెల్ల లోకుల వ్యసనముల్ డుల్లజేయు
నా ముకుందుడు తన భక్తులైన యట్టి
వారలను బ్రోవజాలడే? వమ్ము కాదు
స్వామియెడ భక్తి సర్వార్థ సాధకమ్ము (12)

సీ.
సంసారమను మహా సాగరమ్మున ముంగి
ద్వంద మారుతముల బాధలొంది
ఆలిని బిడ్డల నందర బోషించు
నట్టి భారమ్ముతో నణగువాని
విషయ సౌఖ్యములను విషమతోయములలో
మునుగుచు నిక్కట్లు పొందు వాని
తీరమ్ము నెట్లేని జేరు నుపాయమ్ము
తెలియక యార్తితో నలగువాని
తే.గీ.
నాదుకొని తీరమును జేర్చునట్టి నౌక
యొక్కటే సుమ్ము నమ్ముమా యో మనమ్మ
శ్రీమహావిష్ణు పద సరసిజములందు
నిశ్చలంబైన భక్తియే నిత్య రక్ష (13)

చం.
కరము భయంకరమ్ము భవ కంధి కదా యను భీతి యేల? దు
స్తరమది కాదు చిత్తమున శంకలు మానుము దేవదేవు శ్రీ
హరి చరణాంబుజాతముల యందలి నిర్మల భక్తి చేర్చు స
త్వరము భవాబ్ధి తీరమును భక్త శరణ్యుని జేరి గొల్వుమా (14)


సీ.
ఆశలే సంసారమను మహా సాగర
మందు నొప్పారెడు నంబువులుగ
దారాసుతాదులు ధన ధాన్య సంపద
లందు మోహమ్మట నలలు గాగ
భావజు బాణముల్ బలమైన మారుత
మ్ములగుచు కల్లోలములను రేప
ఆలి యావర్తమ్ము నాత్మజు లనుజులు
కలిగింప వ్యథలు నక్రంబులట్లు
తే.గీ.
ఘోర సంసార వార్ధిలో కూలి నేను
పడుచునుంటి నాయాసమ్ము భక్తపాల
నీదు పాదపద్మములందు నిశ్చలమగు
భక్తియను నౌకనిడి కావవా ముకుంద! (15)

సీ.
కాంచకుందును గాక క్షణమేని క్షీణపు
ణ్యులగాని భక్తిహీనులను గాని
వినకుండెదను గాక వీనుల విందయ్యు
హరిచరిత్రము గాని యట్టి కథలు
తలపకుందును గాక కలనేని నీవు లే
వని పల్కువాని నో యాదిదేవ
పొందకుందును గాక భువనేశ నీ సేవ
చేయకుండెడియట్టి జీవితంబు
తే.గీ.
జన్మజన్మములకునేని జగదధీశ
నా మనోరథమీడేర్చుమో ముకుంద
నీదు సేవలొనర్చుచు నెమ్మనమున
అధికతరమైన ఆనందమందువాడ (16)

సీ.
కీర్తించుమా జిహ్వ కేశవలీలలు
మురవైరిని భజింపుము హృదయమ్మ
చేతులారా! సమర్చించుడీ శ్రీధరు
విను డచ్యుతుని కథల్ వీనులార
కన్నులారా సదా కాంచుడీ కృష్ణునే
హరి సన్నిధికి బోవు డంఘ్రులార
ఆఘ్రాణమొనరింపుమా ముకుందుని పాద
తులసినే నాసికా తోషమొదవ
తే.గీ.
శీర్షమా యదోక్షజు పాదసీమ యొద్ద
ప్రణతులొనరింపుమా భక్తిభావ మలర
ఇంద్రియములార విష్ణు సేవించుచుండి
తత్కృపామృత సారమున్ ద్రాగవచ్చు (17)

తే.గీ.
వినుడు నరులార మందు చెప్పెదను యాజ్ఞ
వల్క్య ముఖ్యులు దెల్పిరి భవరుజకిదె
హృది నలరు పరంజ్యోతి శ్రీకృష్ణ రసము
త్రాగు వారికి కలుగు నిర్వాణ సుఖము (18)


తే.గీ.
ఆపదూర్మి మయమగు భవాబ్ధి దాటు
టకునుపాయమిదే మీ యెడందలోన
మరల మరల నారాయణ మంత్రవరము
జపమొనర్చుచు నుండుడీ సంతతమ్ము (19)


తే.గీ.
భూమ రూపాన్వితా భూమి ముఖ్య భూత
చయము లతి సూక్ష్మములు రుద్ర జలజసంభ
వాదులున్ క్షుద్రు లఖిల దేవతలు కీట
కములు నీముందు జయ జయ కమలనేత్ర (20)


చం.
కరములు మోడ్చి వంచి తల గాత్రము పుల్కలనొందుచుండగా
స్వరమున గద్గదంబొదవ చక్షుల బాష్పము లుప్పతిల్ల, నీ
చరణములన్ దలంచుటను సద్రస పానమొనర్చుచున్ సదా
పరగుత నాదు జీవితము భద్రపథాన ముకుంద మాధవా! (21)


శా.
ఓ గోపాలక ఓ కృపాజలనిధీ ఓ సింధుకన్యాపతీ
ఓ గోవింద గజేంద్రరక్షక హరీ ఓ కేశవా మాధవా
ఓ గోవర్ధన ధారి నేనెరుగ నన్యున్ సర్వలోకేశ్వరా
ఓ గోపీజననాథ ప్రోవగదె నన్నో పుండరీకేక్షణా (22)


స్వేచ్ఛానువాదం
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

2 కామెంట్‌లు:

 1. శ్రీవైష్ణవులకు నిత్యానుసంధానపాథేయమై, భక్తకోటికి ఆప్రాతఃస్మరణీయమై భారతీయ స్తోత్రప్రబంధాలలో అనిదంపూర్వమైన ప్రావణ్యాతిశయాన్ని, స్వస్థమైన స్వస్థితిని సంతరించికొన్న మహారచన శ్రీ కులశేఖరాళ్వార్ మహాశయుల ముకుందమాల. వేదమంత్రాల కంటె అనుష్టానరమణీయములైన నామమంత్రాల సముచ్చయసంపుటి. స్వస్పందసుందరమైన భావసౌభాగ్యమూ, సన్నివేశమనోహరమైన పదసంపద కలిగి పారాయణసాహిత్యంలో ప్రథమశ్రేణికమని పఠితృమండలి ప్రకీర్తించే పరిపుష్టకావ్యం. ఎందరో పూర్వాంధ్రమహాకవులను ప్రభావితం చేసిన ఉదాత్తమైన మహారచన. మోక్షప్రదాత అయిన ముకుందుని వక్షఃస్థలాన్ని అలంకరిస్తున్న వైజయంతీ మాలగా సంభావించి నాలుగు పదుల శ్లోకపుష్పాలను నాణెంగా గుదిగ్రుచ్చి ఆ వాఙ్మయనిష్యందమకరందాన్ని భావితరాలకు పంచిపెట్టిన శ్రీ ముకుందమాలను తెలుగువారి కోసం అనువదించి, తాము తరించి భక్తులను తరింపజేయబూనిన పండిత శ్రీ నేమాని గురుచరణులకు హృదయపూర్వకాభినందనలు.

  అనువాదశయ్య సలక్షణంగా, సులక్షితంగా ఉన్నది. వ్యర్థపదాలు లేని పద్యాల అపూర్వమైన ధారాకౌశలి మెచ్చదగినది. ఆసాంతం ప్రసన్నసరస్వతీకమైన పదగుంఫనతో హాయిగా సాగిపోతున్నది. నిండైన భక్తిరసం వెల్లివిరిసి ఆపాతరమణీయంగా అలరారుతున్నది.
  అచిరకాలంలో ముద్రితప్రకాశితమై అవిరళప్రచారానికి నోచుకోగలదని ఆకాంక్షిస్తున్నాను.

  విధేయుడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 2. అవును నేమాని పండితార్యా త్వరలోనే మీ ముకున్దమాలను పుస్తక రూపంలో చూడ గలగాలని మా ఆకాంక్ష. అద్భుతమైన అనువాదం. నమస్సులు.

  రిప్లయితొలగించండి