21, మార్చి 2012, బుధవారం

సమస్యాపూరణం - 653 (తారా రమ్మని పిల్చె)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

27 కామెంట్‌లు:

  1. శ్రీరమ్యంబగు సాహితీ సభకు రాశీభూత వాగ్వైభవుల్
    సారోదార కవిత్వ తత్త్వమయ భాస్వత్ స్వాంతు లేతేర న
    వ్వారిం జీరుచు స్వాగతించి గురునిన్ ప్రాజ్ఞున్ సమీపించి నే
    తా! రా రమ్మని పిల్చె శంకరుడు సంధ్యా వేళ నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా ! స్వస్తులయి పూర్తి ఉత్సాహముతో మాకు శార్దూలముతో పోరాడు అవకాశము నిచ్చిన మీకు ధన్యవాదములు.

    వారంబుల్ మరి రెండు మూడు గడిచెన్ వారుజ్వరంబున్ బడెన్
    ఈరోజే మరి తాను స్వస్తుడయెగా నిప్పట్టు శార్దూలమున్
    పూరించంగ సమస్య నిచ్చెసరిగా పోరాడి మీరే గెలు
    స్తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పద్యము 1వ పాదములో "వారు జ్వరంబున్ బడెన్" లో రు గురువు కాదు. ఇలా సవరించుదాము:
    "వారొంది రస్వస్థతన్"
    ఆ విధముగా గణ భంగ దోషము ఉండదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ రామరాజ్యం హిట్టాయే సాయి బాబా తలబోసే
    మరో చిత్రం సహ నటులతో చెయ్యాలని కలగనే
    ఈ మారు బాలకృష్ణ దర్శకుడు శంకరుని కోరంగ, నయన
    తారా, రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  5. గౌరీనాథుడు, దివ్యగాత్రుడు, మహాకైలాస సంవాసుడున్
    మారారాతి, హిమాంశుశేఖరుడు సంరంభంబు దీపింపగా
    ప్రారంభింతుము లాస్య తాండవములన్ ప్రాలేయ శైలాత్మజా
    తా! రా రమ్మని పిల్చె శంకరుడు సంధ్యా వేళ నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  6. శ్రీయుతులకు ప్రణామములు.

    "తారల్ కాంతులు చౌకళించె; మును, లంతర్వాణులున్, వేల్పులున్
    దా రేతెంచిరి గౌరి! నాట్యగరిమన్ నందింపఁ, బ్రేమాదర
    స్మేరాలోకననిఃసృతామృతఝరీసిక్తాఖిలాజాండవి
    స్తారా! ర!" మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  7. చేరున్నీ ఖర వత్సరంపు కథ కంచి న్నేటితో, పల్కగా
    నారంభంబగు నందనాఖ్య కిలకు న్నానందమై స్వాగతం-
    బీరేయిన్ మన శంకరా భరణ మందింపారు పద్యాలు వ్రా-
    స్తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై

    రిప్లయితొలగించండి
  8. దేవి సౌందర్యాన్ని పరమేశ్వరుడు వర్ణించాలంటే ఆమె కన్నా అందమైనవి, పోల్చదగినవి లేవని, సాధారణ సౌందర్యాన్ని వర్ణించినట్టే వర్ణించాడని ఊహించాను.
    పెద్దల సూచనలు శిరోధార్యములు.
    విద్యుత్ సమస్య వలన ఇప్పటికి కుదిరినది.

    నీరంబందున పూచినట్టి విరివై, నృత్యంబు వయ్యారమై,
    కీరమ్మట్టుల పల్కుచుంటివన సిగ్గే నీకు సింగారమౌ!
    నా రాణీ! నిను చూడ సంతసముతో నాడెన్ మనంబద్రిజా
    తా!రా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  9. ఔరా! యియ్యది భారమా?యనుచు తానత్యంతసంరంభియై
    శూరత్వంబున కార్తికేయుడఖిల స్రోతస్వినుల్ చేరినన్
    హేరంబుండవగాహియై నిలువగా హ్రీయుక్తు నోశక్తివం
    తా! రా, రమ్మని బిల్చె శంకరుడు సంధ్యావేళనుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  10. అయ్యా మూర్తి గారూ! శక్తి అనే పదము ఇకారాంతము. ఇకార ఉకార అంతములైన పదములతో సమాసములు చేసినప్పుడు శక్తిమంత, హనుమంత మొదలగు రూపములు ఏర్పడుతాయి. శక్తివంత అన రాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. దోష సవరణ సూచించిన శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    సవరణ తో..

    వారంబుల్ మరి రెండు మూడు గడిచెన్ వారొంది రస్వస్థతన్
    ఈరోజే మరి తాను స్వస్తుడవగా నిప్పట్టు శార్దూలమున్
    పూరించంగ సమస్య నిచ్చె సరిగా పోరాడి మీరే గెలు
    స్తారా రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  12. ఈ నాడు ఇప్పటి దాక పూరణలు ఎక్కువగా రాలేదు.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు శ్రీ శంకరయ్య గారు కోలుకొనుటను హర్షిస్తూ స్వాగతించేరు.

    2. డా. మురళీధర రావు గారు తనదైన శైలిలో పూరించేరు - శంకరుడు పార్వతీ దేవిని నాట్యం కొరకు ఆహ్వానించుచూ చెప్పేరు.

    3. శ్రీ మిస్సన్న గారు శంకరయ్య గారు నందనానందం గురించిన ఇచ్చిన ఆహ్వానాన్ని ప్రస్తావించేరు.

    4. శ్రీమతి మందాకిని గారు శార్దూలము అనే సరికి కాస్త తడబడ్డారు. పార్వతీ దేవిని పరమేశ్వరుడు ఆహ్వానించుచున్న విధానమును వర్ణించేరు.

    5. శ్రీ మూర్తి గారు శివ తనయులైన గజముఖ షణ్ముఖుల సంరంభ విజయ లీలలను వర్ణించేరు.

    పూరించిన వారందరికి పేరు పేరునా శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా,
    తడబడ్డానంటే అర్థం కాలేదు. శ్రమనుకోకుండా కొంచెం వివరించగలరు.

    రిప్లయితొలగించండి
  14. క్షమించాలి చాలా తప్పులు ఉండ వచ్చును.ఊరికె ఒక ప్రయత్నం

    కైలాసంబున జేరిభక్త గణముల్ కైమోడ్చి కీర్తింప గన్
    సంధ్యా రంభ విజృంభి తంబగు శరత్ జ్యొత్స్నంపు రాత్రందు లన్
    గౌరీనాధుడు సంతసించి సతితో కాంతా వినోదుండు నై
    తారా రమ్మని పిల్చె శంకరుడు సంధ్యా వేళ్ నుత్సాహి యై

    రిప్లయితొలగించండి
  15. పండిత నేమాని వారూ,
    "నేత"ను స్వాగతించిన మీ పూరణ రమ్యంగా ఉంది.
    మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    శార్దూలాన్ని నాపైకే ఉసిగొల్పారు మీ చమత్కారమైన పూరణతో. బాగుంది. అభినందనలు.
    గురువుగారి సవరణను గమనించారు కదా!
    సరదా పూరణ కనుక "గెలుస్తారా" అన్న వ్యావహారిక రూపం సర్వజనామోదం పొందుతుందనుకుంటాను.
    *
    జిలేబీ గారూ,
    మంచి ఆలోచన... అభినందనలు.
    "నయన్ / తారా రమ్మని...." అని పూరించే అవకాశం ఉంది. సమయాభావం వల్ల మీ భావాన్ని ఛందోబద్ధం చేయలేక పోతున్నాను. చూద్దాం... మిత్రు లెవరైనా ప్రయత్నిస్తారేమో!
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    ఆహా! మధురమైన పూరణ. ప్రశంసార్హమైన పదసంపద, శైలి. ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    అలవోకగా, సరదాగా చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "వ్రాస్తారా' వ్యావహారికమని సమ్మతిస్తారా? ఇస్తారు లెండి!
    *
    మందాకిని గారూ,
    అద్రిజాతను సంబోధించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    నరసింహ మూర్తి గారూ,
    వృత్త రచనలోను దూసుకుపోతున్నారు. సంతోషం. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అమ్మా! మందాకినీ గారూ! మన్నించాలి.
    మీ పద్యము ఎత్తుగడ "నీరంబందున పూచినట్టి విరివై" అనే ప్రయోగము చాల తేలికగా నున్నది. మంచి పదబంధముతో దానిని మరి కొంచెము అందముగా వ్రాస్తే బాగుంటుంది అని నా ఉద్దేశము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. అమ్మా రాజేశ్వరి గారూ!
    మీ ప్రయత్నము అన్నారు. ప్రాస వేయ లేదు. పదములు కూడ అతుకులతో కలగాపులగముగా నున్నాయి కానీ పద్యమునకు అన్వయము అందము రాలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  18. శ్రీమతి జిలేబి గారి ఊహకు నా సరదా పూరణ....

    శ్రీ రామ్ రాజ్యమ్ము హిట్టయెన్ అనెనిటున్ శ్రీ సాయి బాబా వరుల్
    ఈ రోజో మరి రేపొ క్రొత్త సినిమా కీ దర్శకుల్ శంకరే
    హీరో బాలయ శంకరా ఎవరికన్ హీరోయినన్నన్, నయన్
    తారా, రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా గోలీ వారు,

    అదురహో !

    అద్భుతం.

    జిలేబి.

    రిప్లయితొలగించండి
  20. నమస్కారములు
    గురువు గారి సహనమునకు ధన్య వాదములు { అసలు ప్రాస విషయమే మర్చి పోయాను ] ఇంక...... స......రే........సరి .
    అందుకే తమ్మునికి నీరసం వచ్చి వదిలేసి ఉంటారు.

    రిప్లయితొలగించండి
  21. జిలేబి గారి చిత్రోక్తికి మఱొక ఛీర్సోక్తి -

    శ్రీ రామరాజ్యం హిట్టాయే సాయి బాబా తలబోసే
    మరో చిత్రం సహ నటులతో చెయ్యాలని కలగనే
    ఈ మారు బాలకృష్ణ దర్శకుడు శంకరుని కోరంగ, నయన
    తారా, ర మ్మని పిల్చె శంకరుడు సంధ్యావేళ నుత్సాహియై.

    శ్రీ రంజిల్లఁగ; నెల్ల “హి”ట్టనఁగ నా శ్రీరామరాజ్యంబు న
    వ్వారిన్ నిర్మితి సేయఁగోరి, మఱి సాయ్ బాబా తలం బోసి; తా
    హీరోగా సవి బాలకృష్ణ యడుగన్, “హే! మా సితారా! నయన్
    తారా! ర” మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.

    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  22. అయ్యా , తప్పు తెలుసుకోవాలన్న ఆత్రుతయే కాని మరో ఉద్దేశ్యము లేదు. దయచేసి మీరు మన్నింపు అను మాట వాడవలదు.

    తారాపంక్తులు తోరణమ్ములగు నందమ్మంత వీక్షించుచున్
    క్షీరాబ్ధిన్ జనియించు బాలుడు గృహశృంగారమున్ పెంచ, నా
    ధారిత్రిన్ గను, సంచరించెదమిదే, దాక్షాయణీ! శైలజా
    తా! రా! ర మ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై.


    చంద్రుడు వెన్నెలలతో వెల్లవేయగా, తారలు తమ గృహమునకు తోరణంబుగా, నిఖిల భువనము తమ గృహంగా నెలకొన్న ఆదిదంపతులు సంధ్యావేళ ధాత్రిని సంచరించు సంరంభము.

    రెండో పాదములో హ గురువు అవుతుంది కాబట్టి గణములు సరిగ్గాఉన్నాయనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  23. "ఏ రోజోకద తీరికా! యమునకున్నీడేరు నీరోజునన్
    సారంబైన యభీష్టముల్, పద పదా స్వాదింపగన్" - దున్నపో
    తా! రా ర మ్మని పిల్చె; శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై
    తారావీధిన నృత్యమున్ సలుపగా దర్శింప నుత్కంఠతోన్.

    రిప్లయితొలగించండి
  24. మిస్సన్న గారు సామన్యంగా వాడుక పదాలు పద్యం లో ప్రయోగించరండీ.. సరిగ్గా పూరణకుపక్రమించిన వేళే .. సారోస్తారొస్తారొస్తారా అనే పాట చెవిసోకి ఉంటుందని నా అనుమానం :)

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  25. తెలంగాణ జంపింగు:

    పోరాటమ్ములు మాని స్నేహితులుగా పొంకమ్ము జేకూర్చుడీ!
    వీరాగ్రేసరులందరిచ్చటను భల్ విన్యాసమున్ జేయగా
    పారావారము బోలు నట్టిదిర..మా పార్టీకి కాంగ్రేసులం
    తా! రా! రమ్మని పిల్చె శంకరుఁడు సంధ్యావేళ నుత్సాహియై!

    రిప్లయితొలగించండి