2, జూన్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1691 (గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

30 కామెంట్‌లు:

  1. కరుణించని దాస్య మందున
    యురగమ్ములు మూపు పైన మోయుచు దిరుగన్
    వరమని వింతలు గాంచగ
    గరుడునిఁ గనిసంత సించుఁగద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సురపానీయము దాస్యపు
      తరుణోపాయమని దెల్ప దల్లికి మోదం
      బరయుచు నమృతము దెచ్చెడి
      గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్

      తొలగించండి
  2. మిత్రులందఱకును నమస్సులతో...

    నిరతము మోయుచుఁ దిరిగెడి
    గరుడుని దాస్యము తొలంగఁగాఁ గుమిలియు, శ్రీ
    హరికిని దాస్యముఁ జేసెడి
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్!

    రిప్లయితొలగించండి
  3. చెర విడిపించగ దల్లికి
    యఱకడమున తమను మోయు నక్షుని విధిగా
    నిరతము పరాభవించుచు
    గరుడుని గనిఁ సంతసించు గద భుజగమ్ముల్!!!

    రిప్లయితొలగించండి
  4. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘కరుణించని దాస్యమ్మున| నురగమ్ముల మూపుపైన...’ అనండి.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శరణంచు మ్రొక్క వలసిన
    యురగములా తల్లి వల్ల నుత్సాహముతో
    దిరుగుచు కేరింతలిడుచు
    గరుడుని గనిసంతసించుగద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  6. కరమైన దీక్షతోడుత
    తరుణవయస్సుననుతల్లి దాస్యముఁబాపన్
    నిరతము శ్రమించు ఘనుడు
    గరుడునిఁగని సంతసించుఁగద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  7. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఒకే వాక్యంలో ఉరగములు, భుజగములు అని పునర్తుక్తి ఉంది.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఉరగములు పాఱి పోవును
    గరుడుని గని, సంతసించు గద భుజగమ్ముల్
    కరముం బిల్లన గ్రోవిన
    సరగున బాడంగ నాద స్వర మతి నియతిన్

    రిప్లయితొలగించండి
  9. హరిహరులు నిద్ద రొకచో
    పరిపాలన జూచునపుడు? వాహనమును,ఆ
    శిరమున శివ భూషణముల్
    గరుడుని గని సంత సించుగద?భుజగమ్ముల్|
    2.వరకట్న గరుని పెళ్ళట
    గరుడుని గని సంత సించు గద?”భుజగమ్ముల్
    తరుణులు” తత్వము దెలియక
    వరమని భావించ గలుగ?వనితల తప్పా?

    రిప్లయితొలగించండి
  10. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నాదస్వర’మన్నప్పుడు ‘ద’ గురువై గణభంగం.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండవపూరణలో మొదటి రెండు పాదాలు అర్థం కాలేదు.

    రిప్లయితొలగించండి
  11. తరుమగ తల్లికి దాస్యము
    పరుగున నాకంపు యమృత భాండము తేగా
    తరలెడు యుత్తమ పుత్రుడు
    గరుడునిగని సంతసించుగద భుజగమ్ముల్

    "గరుడా! క్షేమంబా"యని
    సరసంబుగ పాములడుగ సమయస్ఫూర్తిన్
    "హరు వీడనిచో"యనియెడు
    గరుడునిగని సంతసించు గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  12. గరుడుడు భుజగపు శత్రువు
    గరుడుని గని పారిపోవు గదయా పాముల్
    హరుమెడ నాతని మహిమను
    గరుడునిగని సంతసించు గద భుజగమ్ముల్

    గరుడుని కోపానలమున
    తరుగగ సర్పపు కులమది,తలపగ శివునే
    హరువగు వరమున తిరముగ
    గరుడునిగని సంతసించు గద భుజగమ్ముల్

    గరుడుడు వెన్నుని వాహన
    మరయగ తల్పము భుజగము,నాతని చెంతన్
    పొరపొచ్చెమేమి లేకను
    గరుడునిగని సంతసించు గద భుజగమ్ముల్

    హరువౌ మునియాశ్రమముల
    నెరుగక జాతుల యరమర నెయ్యము తోడన్
    గరుడుడు పాములు మెలగవె
    గరుడునిగని సంతసించుగద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురువర్యు లైన కంది శంకరయ్య గారికి వందనాలతోనేను పంపినపూరణంలోని నాభావం
    వరకట్నంతీసికొనేవరుడనేగరుడుడుపెళ్లికివచ్చినతరుణులు భుజగాలవలేఆత్మాభిమానం
    గలవారైనా?వరునిమనస్సులోనితత్వముదెలియకసంతస పడ్డారని ఆభావనవనితలతప్పుగాదని
    నాపురణసారాంశము.తప్పయిన?సరిజేయగలరనివిన్నపము

    రిప్లయితొలగించండి
  14. భాగవతుల కృష్ణారావుగారి పూరణ

    పరుగులు వెట్టుచు సతతము
    సరగున భక్తులను గాచు సంకర్షణునిన్
    నిరతము మోసెడి సోదరు
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  17. సమస్య >గరుడుని గని సంతసించె గద భుజగమ్ముల్
    పూరణ:పరతంత్ర్యము బాపుటకై
    సురలోకమునున్న సుధను శూరత మెరయన్
    సరగున గొని తెచ్చిన యా
    గరుడుని గని సంతసించె గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  18. హరు వీపు పైన కదలుచు
    మరి మోతలు మాకులేవు మంచిదననుచున్
    హరి మూపున నిడి తిరిగెడి
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  19. పరమశివునిమెడలో నా
    భరణము మా జాతి యనెడు భావము తోడన్
    హరి వాహనముగ నుండెడు
    గరుడునిఁ గని సంతసించు గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  20. సరసంబుగ కేరింత లిడుచు
    నిరతము నాడుచు చరించి నెమ్మది తోడన్
    దిరగుచు ఖగమున వచ్చెడి
    గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  21. దరిచేరిన తినబోవదు
    గురుతించక విడచి పెట్టు గూఢమ్మేమో?
    యరయంగ దృష్టి లోపపు
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్!

    రిప్లయితొలగించండి
  22. సరసంబుగ కేరింత లిడుచు
    నిరతము నాడుచు చరించి నెమ్మది తోడన్
    దిరగుచు ఖగమున వచ్చెడి
    గరుడుని గని సంతసించు గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి
  23. సురవాటికకేగి, పురం
    దరుని శుభాశీస్సులంది - తల్లిని కావన్;
    ధరకమృతము గొనివచ్చెడు
    గరుడునిగని సంతసించు గద భుజగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  24. రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘నాకంపు టమృతభాండము...’ అనండి.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ వివరణ సంతృప్తికరంగా ఉంది. సంతోషం!
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పరతంత్రము’ అనండి. పరతంత్రమునకు చెందినది పారతంత్ర్యము. పరతంత్ర్యము అన్న పదం లేదు.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘అని+అనుచున్’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘మంచి దటంచున్’ అనండి.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో గణదోషం. ‘సరసంబుగ కేరింతల| నిరతము....’ అనండి.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. మాస్టరుగారూ..ధన్యవాదములు....
    సవరణతో...

    హరు వీపు పైన కదలుచు
    మరి మోతలు మాకులేవు మంచిదటంచున్
    హరి మూపున నిడి తిరిగెడి
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్.

    రిప్లయితొలగించండి
  26. అరయగ కర్ణాటకమున
    పరుగులతో బుసను గొట్టి పారెడు వారై
    విరిగిన భుజముల మోడీ
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి


  27. పరమ శివుని నాగమడిగె
    గరుడునిఁ గని, సంతసించుఁ గద భుజగమ్ముల్,
    గురుడా బాగుండగ నీ
    వు! రుసరుసనతడనె తమరి పుణ్యంబు సుమా :)

    జిలేబి వారి వేదాంతము :)

    రిప్లయితొలగించండి
  28. మురియుచు నెల్లూరునదిగి
    పరుగిడి నెరజాణ రెడ్ల పంజరమున తా
    గరువము తీరగ చిక్కిన
    గరుడునిఁ గని సంతసించుఁ గద భుజగమ్ముల్

    రిప్లయితొలగించండి