4, జూన్ 2015, గురువారం

సమస్యా పూరణము - 1693 (కవులు గాంచని వెల్లను రవియె కాంచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కవులు గాంచని వెల్లను రవియె కాంచు.

18 కామెంట్‌లు:

 1. కవులిల గ్రీష్మ తాపము గాంచ లేమి
  గృహములకు బరిమితు లైరి యహములందు
  దాన మృగ్యమాయె గనగ ధవళ కాంతి
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు

  వెల్ల : తెలుపుదనము

  రిప్లయితొలగించండి
 2. గగన సీమల నేలెడు జగతి విందు
  కవులు గాంచని వెల్లను రవియె కాంచు
  మదిని మధియించి యూహల పదము లల్లి
  కవన మందున తేలించు కవుల నంగ

  రిప్లయితొలగించండి
 3. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమోవాకములతో...

  లోకమంతయుఁ దిరిగి తల్లోకకృతము
  లన్నియు నఱయు నట్టి సల్లక్షణమ్ము
  ప్రతిదినమ్మునుఁ గవులకు వలను పడదు!
  కవులు గాంచని వెల్లను రవియె కాంచు!!

  రిప్లయితొలగించండి
 4. నడుమ నుండు నవగ్రహ నాథుఁ గూర్చి
  శాస్త్రవేత్తలుఁ దెల్సిన సత్య మెంత?
  వేయి జెప్పగ నేల? నీ విశ్వమందు
  కవులు గాంచని వెల్లను రవియె కాంచు!

  రిప్లయితొలగించండి
 5. గగన మంతయు దిరుగాడు జగము కన్ను
  గాంచ లేనిది యున్నదే కాంతితోడ
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు
  సందియమ్మేల నిందులో సత్యమిదియె !!!

  రిప్లయితొలగించండి
 6. నీతి తోడ కవితలల్ల నిశ్చలమది
  కమలధరుడు కాంచనివియు కవియెగాంచు
  స్వార్థ పర నాయకుల మెచ్చు వ్యర్థులైన
  కవులు గాంచనివెల్లను రవియె గాంచు

  రిప్లయితొలగించండి
 7. కవులు గాంచని వెల్లను రవియె కాంచు
  నిజము ముమ్మాటి కీ మాట విజయ ! నమ్ము
  రవికి కాంచలే నటువంటి యవని గలదె ?
  యన్ని చోటుల వ్యాపించు నతని కాంతి

  రిప్లయితొలగించండి
 8. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఇల గ్రీష్మ’ అన్నప్పుడు ‘ల’ గురువు కాదు. దానివల్ల గణదోషం. ‘కవు లిలను గ్రీష్మ...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. రవియు గాంచని వెల్లను కవులు కాంచు
  ననుట లొకోక్తి యైయున్నదనుటమరచి
  కవులు గాంచనివెల్లను రవియె కాంచు
  ననుట భావ్యమా పరికించుడార్య మీరు

  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. కవులు గాంచని వెల్లను రవియె కాంచు
  ననుటయు రసజ్ఞత నెఱుగనట్టి జనుల
  పలుకె గాని వేరొండె? లోపలి తలపుల
  నైనఁ గాంచువాడె కవియు ననుట నిజము.

  రిప్లయితొలగించండి
 13. నింగి,నేలకు నుంచు నిరతంబు వెలుగును
  -----------రవియు ప్రకృతి గాంచు|కవియుగాదు
  జీవుల హృదయాల భావన లెన్నియో
  ----------కవియుగాంచునునింగి రవియుగాదు
  వృక్ష జాతులవృద్ధి,పక్షి జాతులనడక
  ---------రవియు గాంచును గాని కవియుగాదు
  నీతి,నియమమెల్ల నిత్యము నిలుపగ
  ---------కవియు గాంచును గాని రవియుగాదు
  చూచి చూడక నింగిలో వేచియుండి
  నిత్య నియమాను సారాన నిశిని మాన్పి
  కవులు గాంచని వెల్లను రవియు కాంచు
  అనుట నిజమను మాటలు వినుట వరకె

  రిప్లయితొలగించండి
 14. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  సవివరమైన మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 15. వాయు వగ్నియు,జలములు, ప్రాణములును
  కాంతి,ఋతుకర్త,యగు దివాకరుడతండు
  అతని సృష్టిలొ జనియించు అల్పులైన
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు

  రిప్లయితొలగించండి
 16. కవులు గ్రీష్మపు తాపము గాంచ లేమి
  గృహములకు బరిమితు లైరి యహములందు
  దాన మృగ్యమాయె గనగ ధవళ కాంతి
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు

  వెల్ల : తెలుపుదనము
  గురువు గారూ కృతజ్ఞతలు, మార్పు చేశాను. చిత్తగించవలెను

  రిప్లయితొలగించండి
 17. ప్రకటితంబైన వానినే కవియు పలుకు
  మనసు లోనున్న భావాలు మహితరీతి
  నెరుగడు,రవియ కర్మల నెమ్మిగనును
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు

  రవియె కాంచని యందాలు రయము దెలుపు
  కవుల టంచును తెల్పగ గాదు నిజము
  కర్మసాక్షిగ లోనున్న మర్మమెరిగి
  కవులు గాంచని వెల్లను రవియె గాంచు

  కాంతి నెల్లెడ నింపుచు,గాల్చుతప్పు
  మనసులోనున్న తప్పులు,మాయలెరిగి,
  కవులు కనపడు నవె దెల్పి ఘనులమనగ
  కవులు గాంచని వెల్లను రవియెగాంచు

  రవికి సుతులైన యముడల రాజసమున
  నెవరుచేసిన తప్పొప్పులెరిగి శిక్ష
  లిడును,రవికాంచనవి జూచి యింపుగాను
  కవులు గాంచనివెల్లను రవియెగాంచు

  రిప్లయితొలగించండి
 18. కవులు గాంచని దేదియు గలదె జగతి
  రవియు గాంచును పైపైన రశ్మి నిచ్చి
  కవివలె రవి కనగలేడు కాన నెట్లు
  కవులు గాంచని వెల్లను రవియె కాంచు?

  రిప్లయితొలగించండి