12, జూన్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1701 (పసులఁ గొల్చు జనుల భద్ర మమరు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పసులఁ గొల్చు జనుల భద్ర మమరు.

32 కామెంట్‌లు:

  1. భక్తితోడనెపుడు భగవంతు పూజించి
    దివ్యమౌ మహిమల తేజరిల్లు
    పుడమి సంచరించు పుణ్యాత్ములైన తా
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు

    రిప్లయితొలగించండి
  2. దాన ధర్మ ములను తనితీరగ జేసి
    పరుష వాక్కు వీడి సరస ముగను
    మూగ జీవు లందు భూత దయనుజూపి
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు

    రిప్లయితొలగించండి
  3. క్షమించాలి
    మొదటి పాదంలో టైపాటు " తనివితీరగ జేసి " అనిఉండాలి

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. ఆ.వె: స్వార్థ బుద్ధి వీడి సాధుస్వభావాన
    పరుల హితము కొరకు పాటు పడుచు
    సర్వ జీవులందు సమబుద్ది జూపుచు
    పసుల గొల్చు జనుల భద్రమమరు.

    రిప్లయితొలగించండి
  6. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారికి , మిత్రులకు వందనములు !

    ధరణి నెడ్ల దున్ని , ధాన్యరాశులుఁ బేర్చి
    ఆలమంద యొసగు పాలుఁ దెచ్చి ,
    ప్రజలఁ బ్రోది గూర్చి , పరవశత్వము తోడ
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు !

    రిప్లయితొలగించండి
  8. శ్రీ చంద్రమౌళి సూర్యనారాయణ గారి బాటలో .

    కామ క్రోధ మోహ కండకావర లోభ
    మత్సరములు వీడి , మదిని పరము ,
    ధరణి లోన విమల ధర్మంబు నిలుపు తా
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు !

    రిప్లయితొలగించండి
  9. పసుల గొల్చు జనుల భద్రమమరు నిల
    పసులు శివుని కిమరి వాహనములు
    మనకు పూజ నీయ మనుటలో సందియ
    మువల దులలి త ! నిజ ముగను నమ్ము

    రిప్లయితొలగించండి
  10. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘కామ...మత్సరములు’ అన్న దీర్ఘసమాసంలో ‘కండకావర’మన్న ఆచ్ఛికపదాన్ని చేర్చారు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. మహిని బుట్టె సుమ్మ మనుజులఁగావగ
    కర్మయుగము నందు కామ దుహము
    యధికనిష్టతోడ ననవరతమ్మును
    పసుల గొల్చు జనుల భద్రమమరు

    రిప్లయితొలగించండి
  12. మదిని దోచి తీవు మాలిని! నీ పతుల్
    హాని చేయ గలరె? హవ్వ! సింహ-
    బలుని మించ నెవ్వ రిలను? నీబోటి రూ-
    పసుల గొల్చు జనుల భద్రమమరు.

    రిప్లయితొలగించండి
  13. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దుహము+అధిక’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కామధేవు| వధిక..’ అనవచ్చు. కాని అక్కడ ‘దుహము’ అన్నపదమే అర్థవంతం, యుక్తం. ‘కామదుహమె| యధిక...’ అనండి.
    *****
    మిస్సన్న గారూ,
    వైవిధ్యమైన పూరణతో అలరింపజేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. కామధేను వనుచు సామాన్య మానవుల్
    ఆవుపుజ జేయ?నాదుకొనుచు
    పాలు,పెరుగు,వెన్న జాలిగ నొసగెడి
    పసుల గొల్చు జనుల భద్ర మమరు|
    2.ప్రకృతన్నదే?పరమాత్మ|వసుధ కెపుడు
    జీవు లన్నియు సృష్టిలో-భావనెంచ
    గా?”పరాన్న జీవన శైలి”గనుక?విధిగ
    బ్రతుక “పసుల గొల్చు జనుల భద్ర మమరు|
    ---------తేటగీత---------------------

    రిప్లయితొలగించండి
  15. రైతు తాను బ్రతుక బ్రతికించ ప్రజలను
    పంట పొలము దున్న పసుల గట్టి
    యన్న దాతల కవి యరాద్య దైవముల్
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు.

    రిప్లయితొలగించండి

  16. పూరణ:పసుల గొల్చు జనుల, భద్ర మమరు రీతి
    నందసుతుడు హ్రదము నందు నున్న
    ఐదు పడగలుగల అహిని కాళీయుని
    తలల నటనమాడి జలధికనిపె

    రిప్లయితొలగించండి
  17. రెండవ పాదములో దున్న దున్ను అని గ్రహించ మనవి

    రిప్లయితొలగించండి
  18. రెండవ పాదములో దున్న దున్ను అని గ్రహించ మనవి

    రిప్లయితొలగించండి
  19. నీలి మేఘ ఛాయ బోలు శ్రీరాముని
    మూడు కన్ను లున్న పురరిపువును
    నల్ల దేవరయిన నందకి వంటి రూ
    పసుల గొల్చు జనుల భద్ర మమరు!!!


    రిప్లయితొలగించండి
  20. స్వార్థ పరత లేని సాధుజీవులయిన
    పసుల గొల్చు జనుల భద్ర మమరు
    వాసుదేవు డయిన వసుదేవ తనయుడు
    పసుల గాపరయ్యె పరవశమున!!!

    రిప్లయితొలగించండి
  21. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణలో ‘పూజ’కు ‘పుజ’ అని టైపాటు.
    రెండవపూరణలో ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చిన నైపుణ్యం పశంసనీయం. కాని ‘ప్రకృతి+అన్నది’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    అది ‘నీలి’ కాదు, ‘నీల’. ‘మేఘ+ఛాయ= మేఘచ్ఛాయ’ అవుతుంది.

    రిప్లయితొలగించండి

  22. 2. దుక్కి టెద్దు పోయె దున్నెను ట్రాక్టర్లు
    బాడబములు బదులు వచ్చె కార్లు
    పసుల గొల్చు జనుల భద్ర మమరు ననెడి
    నెటి జనుల మాట నీటి మూట

    రిప్లయితొలగించండి
  23. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. భిక్షమొసగి నంత విశ్వాసమును జూపి
    పరులు గడపఁ జేర మొరుగు కుక్క!
    బయటకేగి నపుడు భటునిగన్ దోడుండు
    పసుల గొల్చు జనుల భద్రమమరు.

    రిప్లయితొలగించండి
  25. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వేదమంత్ర విధిని విశ్వశాంతిని గోరి
    యాగములను చేయు యోగివరులు
    నిక్కమైన దీక్ష నిరతము సలుపు తా
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు.

    రిప్లయితొలగించండి
  27. ఆవుగేదె లన్న నాదర భావము
    కలిగి యుండి యెంతొ కరుణ తోడ
    బచ్చిగడ్డి వేసి మచ్చిక జేయుచు
    పసుల గొల్చు జనుల భద్ర మమరు!

    రిప్లయితొలగించండి
  28. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. పసులు పాలనిచ్చు,పంటకు నెరువిచ్చు
    పంటచేలుదున్ను,బండిలాగు
    పసులు లేకయున్న బ్రతుకదే లేదుగా
    పసుల గొల్చు జనుల భద్రమమరు

    పసులె ధనమునాడు భారత కాలాన
    పసులకొరకు పోరు బాగజరిగె
    పసుల రక్షణాన'పశుపతి'యయ్యెగా
    పసుల గొల్చు జనుల భద్రమమరు

    పశువుగోవు,పూజ పావన మందురా
    గోవుతల్లి వోలె కురియు పాలు
    చర్మమెముక లవ్వి చాల నుపకరించు
    పశులగొల్చు జనుల భద్రమమరు

    పసులు మాంసమిచ్చి భవ్యము కనియెడు
    ఉన్నివస్త్రమిచ్చి యొసగువేడి
    పసుల పాలనంబు పావన వృత్తియౌ
    పసుల గొల్చుజనుల భద్రమమరు

    రిప్లయితొలగించండి
  30. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. సుకవి మిత్రులకు నమస్సులతో...

    దైవ చింతనమునఁ దరియింపఁ దపమొన
    ర్చియును ఫలము ప్రజల శ్రేయమునకు
    వెచ్చపెట్టునట్టి విగత సంసృతులఁ దా
    పసులఁ గొల్చు జనుల భద్ర మమరు!

    రిప్లయితొలగించండి
  32. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి