9, ఆగస్టు 2010, సోమవారం

చమత్కార పద్యాలు - 12

దత్తపది - ఉత్తర, భరణి, మఖ, పునర్వసు ( రామాయణార్థంలో )
నరాల రామా రెడ్డి ప్రొద్దుటూరు ప్రాచ్య కళాశాలలో అధ్యకులు. ఎన్నోసార్లు అష్టావధాన విద్యను సమర్థవంతంగా ప్రదర్శించి పండితుల మెప్పు పొందారు. 4-11-1974 న పిన్నాలూరి పేటలో జరిగిన అవధానంలో ఒక పృచ్ఛకుడు ఉత్తర, భరణి, మఖ, పునర్వసు పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో ఉత్పలమాల చెప్పమని దత్తపదిని ఇచ్చాడు. దానికి నరాల రామా రెడ్డి గారి పద్యం .....
ఉల్లము చీలిపోవునటు లుత్తరవాదులు రాక్షసాధముల్
తల్లయ గార్ధభాభ రణితంబులఁ జేయుచు యాగశాలలో
నల్లరిఁ జేసి రక్తమున నా మఖ శోభను పాడు చేసి రా
నల్లని రాక్షసేశుల పునర్వసు హీనుల రామ! చేయుమా.

4 కామెంట్‌లు:

 1. ఉత్తర రామ సచ్చరిత మొప్పెను గొప్పగ. రామ చంద్రు లో
  కోత్తర పాలనన్ భరణి కూర్మిని సత్ఫలమందఁ జేసె. నా
  డత్తరి బ్రాహ్మణోత్తములు హాయిగ సన్ మఖముల్ యొనర్చె.యు
  న్మత్తులఁ బాపు రాఘవుఁడె మాన్య పునర్వసుఁడంచు నెంచిరే.

  రిప్లయితొలగించండి
 2. చింతా రామకృష్ణారావు గారూ,
  మీ దత్తపది పూరణ అద్భుతం. ధన్యవాదాలు.
  మూడవ పాదంలో "బ్రాహ్మణోత్తములు హాయిగ సన్మఖముల్ యొనర్చె" అన్నారు. మఖముల్ + ఒనర్చె అన్న చోట యడాగమం పానకంలో పుడకలా ఇబ్బంది పెట్టింది. అలాగే బ్రాహ్మణోత్తములు ఒనర్చిరి కావాలి. ఒనర్చె కాదు కదా!

  రిప్లయితొలగించండి
 3. శంకరయ్య గారూ! నిజమే. టకా టకా కంప్యూటర్లో ఆశువుగా వ్రాసి వెన్వెంటనే ముగించెయ్యడం లాంటి తొందర పాటు తెచ్చే అనర్థాలను సూచించిన మీకు ధన్యవాదాలు. ఈ క్రింది విధంగా సరిపోతుందేమో చూడ గలరు.

  ఉత్తర రామ సచ్చరిత మొప్పెను గొప్పగ. రామ చంద్రు లో
  కోత్తర పాలనన్ భరణి కూర్మిని సత్ఫలమందఁ జేసె. నా
  డత్తరి బ్రాహ్మణోత్తములు హాయిగ సన్ మఖమాచరించి రు
  న్మత్తులఁ బాపు రాఘవుఁడె మాన్య పునర్వసుఁడంచు నెంచిరే.

  రిప్లయితొలగించండి
 4. చింతా రామకృష్ణారావు గారూ,
  "ప్రమాదో ధీమతామపి" అని ఊరికే అన్నారా? తొందరపాటు వల్ల నేనూ ఎన్నో సార్లు గణ యతి దోషాలతో పద్యాలు వ్రాసి పోస్ట్ చేశాను.
  సవరించిన తర్వాత మీ పద్యం ఆణిముత్యమయింది. నా వ్యాఖ్యను సహృదయంతో మన్నించినందులు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి