11, ఆగస్టు 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 14

బుద్ధిమంతులు కాలం గడిపే విధానం
ఎవరు, ఏ కాలంలో వ్రాసారో తెలియని సంస్కృత చమత్కార చాటువు ....
ప్రాతః ద్యూతప్రసఙ్గేన
మధాహ్నే స్త్రీప్రసఙ్గతః |
రాత్రౌ చోరప్రసఙ్గేన
కాలౌ గచ్ఛతి ధీమతః ||

బుద్ధిమంతులకు ఉదయం జూదంతో, మధ్యాహ్నం స్త్రీతో, రాత్రి దొంగతనాలతో కాలం గడచిపోతుందని భావం.
కాని ఇందులో చమత్కారంగా ఉదాత్తభావం గర్భితమై ఉంది.
బుద్ధిమంతులకు ఉదయం జూదానికి సంబంధించిన కథ ఉన్న మహా భారతాన్నీ, మధ్యాహ్నం స్త్రీ అయిన సీత కథ ఉన్న రామాయణాన్నీ, రాత్రి వెన్నదొంగ అయిన శ్రీకృష్ణుని లీలలు గల భాగవతాన్నీ పారాయణం చేయడంతో కాలం గడచిపోతుంది.
ఈ శ్లోకానికి నా అనువాదం ...
ఉదయము జూదపు మాటలు
పదపడి మధ్యాహ్నమందు భామాసక్తిన్
తుద రాత్రికి చోరోక్తుల
నెద రంజిల గడుపువారలే ధీమంతుల్.

మరో రకంగా ....
ద్యూతప్రసంగ ముదయము
ఖ్యాతిగ మధ్యాహ్నమందు కాంతాసక్తిన్
రాతిరి చౌర్యఁపు ముచ్చట
లీ తీరుగ ధీమతులు వహింతురు ఘనతన్.

2 కామెంట్‌లు:

  1. "నెద రంజిల గడుపువారలే ధీమంతుల్."
    ఎ- లే లకు యతి కుదురుతుందాండి? లేక వారల్ + ఏ అని సంధి అనుకోవాలా?

    రిప్లయితొలగించండి
  2. రవి గారూ,
    అక్కడ యతిదోషం ఏమత్రం లేదు. వారలు + ఏ అనేదే సరైన రూపం.

    రిప్లయితొలగించండి