24, ఆగస్టు 2010, మంగళవారం

సమస్యా పూరణం - 75

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....
పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని.

11 కామెంట్‌లు:

  1. కాల గతిని చూడ కలుగు నెన్నొ తిథులు -
    తిథుల యందు పుణ్య తిథులు వేరు!
    ఇటు లొకొకపరి శుభమిడ నెల్లరకు, కాల
    పురుషుఁడు ప్రసవించెఁ బుణ్యతిథిని.

    రిప్లయితొలగించండి
  2. కాల మన్న నేమి కలికాలమేయిది
    మంచి యన్న నేమి మించి లేదు
    మనిషి నెంచి చూడ మనుగడయే కలి
    పురుషుడు ప్రసవించె బుణ్య తిధిని

    రిప్లయితొలగించండి
  3. కాని పనుల జేసి కష్టపడుట ఏల
    దారి కాచి ఋషుల దూరనేల?
    అగడి రోకలకట ఆనాడు యాదవ
    పురుషుడు ప్రసవించె పుణ్యతిధిని!

    రిప్లయితొలగించండి
  4. మరొక పూరణ, చిత్తగించండి. ఇది ఈనాటి పోకడ:

    కనుట యాడవారి కలిమి గాదంచును
    తానుగూడ శస్త్ర ధార పెనగి
    గర్భమొంది, దాని గాపాడి, యొక్కొండు
    పురుషుడు ప్రసవించె బుణ్యతిధిని!

    రిప్లయితొలగించండి
  5. సొదరు లందరికి రాఖీ పున్నమి సందర్భముగా హృదయ పూర్వక శుభా కాంక్షలు

    రిప్లయితొలగించండి
  6. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ పూరణ నిర్దోషంగా, చక్కగా ఉంది. అభినందనలు.

    నారాయణ గారూ,
    మీ మొదటి పూరణ ప్రశస్తంగాను, రెండవ పూరణ చమత్కారవంతంగాను ఉన్నాయి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. సోదరి రాజేశ్వరి గారూ,
    రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు.
    ఇంతకీ మిమ్మల్ని అక్కా అనాలా, చెల్లీ అనాలా? నా వయస్సు 60. మీరు చింతా రామకృష్ణారావు గారిని "తమ్ముడూ" అని సంబోధించడం గమనించాను.

    రిప్లయితొలగించండి
  8. నా పూరణ -

    ప్రసవ వేదన పడు భార్య సేమముఁ గోరె
    పురుషుఁడు; ప్రసవించెఁ బుణ్యతిథిని
    ముద్దులొల్కు సుతుని ముదిత మోదంబున
    సతిని సుతుని గాంచి పతియు మురిసె.

    రిప్లయితొలగించండి
  9. శంఖ చక్ర ములతొ చక్కగా కనిపించి
    దేవ కికి మరి వసు దేవు నకును
    పుత్రు నౌదు ననియె పుడమి బాధలు దీర్చ
    పురుషుఁడు ; ప్రసవించెఁ బుణ్యతిథిని.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చక్రములతొ’ ? ‘తో’ను హ్రస్వం చేయరాదు.
    ‘శంఖచక్రధారి చక్కగా కనిపించి ...’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! చక్కని సవరణ చేసినందులకు ధన్యవాదములు...
    సవరణతో...

    శంఖచక్రధారి చక్కగా కనిపించి
    దేవకికి మరి వసుదేవు నకును
    పుత్రు నౌదు ననియె పుడమి బాధలు దీర్చ
    పురుషుఁడు ; ప్రసవించెఁ బుణ్యతిథిని.

    రిప్లయితొలగించండి