9, మార్చి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 642 (హీనునకు నమస్కరింతు)

కవిమిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది -

హీనునకు నమస్కరింతు నెపుడు.

22 కామెంట్‌లు:

  1. కర్మయోగియగుచు గర్వమన్న గుణము
    నసలు లేక మనెద నంచు, నెట్టి
    కామరోషములను కననట్టి దుర్గుణ
    హీనునకు నమస్కరింతు నెపుడు.

    రిప్లయితొలగించండి
  2. సంపదిచ్చు నడుగ సౌభాగ్య హీనుడు
    పరమ శివుని గొల్చి భక్తి తోడ
    గుణము నిచ్చు గాదె కోరినచో గుణ
    హీనునకు, నమస్కరింతు నెపుడు

    రిప్లయితొలగించండి
  3. ఊ త నిత్తు నెపుడు చేత నైనంత లో
    హీ నునకు , నమస్క రింతు నెపుడు
    పారి జాత ప్రభుని పాద పద్మములకు
    మలిన రహిత మైన మనసు తోడ .

    రిప్లయితొలగించండి
  4. శివుడు మంగళచయ శేవధియే యయ్యు
    నటుల గోచరింప డా విభునకు
    పరమ పూరుషునకు భౌతిక సంపద్వి
    హీనునకు నమస్కరింతు నెపుడు

    రిప్లయితొలగించండి
  5. చిన్న సవరణతో...

    కర్మయోగియగుచు గర్వమ్ము కఠినత
    లసలు లేక మనెద నంచు, నెట్టి
    కామరోషములను కననట్టి దుర్గుణ
    హీనునకు నమస్కరింతు నెపుడు.

    రిప్లయితొలగించండి
  6. ఆర్యులకు విన్నపము.

    "హీ" "రిన్" లకు యతి మైత్రి కుదురుతుందా?? అక్కడ నమస్కరింతు లోని యి కారానికి యతి చెల్లుతుందా?? చెల్లితే అది అఖండయతి అవుతుందా లేక సర్వప్రధాన యతి అవుతుందా??

    నా ఉద్దేశ్యములో యతి చెల్లదనుకుంటాను. విజ్ఞులు వివరించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  7. దుష్ట శిక్షకునకు శిష్ట రక్షకునకు
    బోధకునకు సత్య శోధకునకు
    జనుల సేవకునకు జనకునకుశతృవి
    హీనునకు నమస్కరింతు నెపుడు!!!

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారి పూరణ.....
    శంకరార్యా ! ఈ నాటి వ్యాఖ్యల పెట్టె కనుపించుట లేదు !
    అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి !
    జీవకోటి కాధార భూతుడైన శివునకు :
    01)
    సృష్టి కంతకు మూలము సృజన మూర్తి
    రుద్రుడనుపేర, విలయ,కారుణ్య మూర్తి
    రుజయు, మరణంబు, పుట్టుక,రూప గుణ, వి
    హీనునకు నమస్కరింతు నెపుడు !
    ___________________________________
    రుజ = రోగము = చెఱుపు

    రిప్లయితొలగించండి
  9. నా పూరణలో మూడవ పాదంలో పొరపాటు దొర్లింది దానిని సవరిస్తున్నాను
    "జనుల సేవకునకు జనకునకు శత్రువి"

    రిప్లయితొలగించండి
  10. మిత్రులారా! అందరికి శుభాశీస్సులు. ఈనాటి పూరణలు కొద్దిగనే ఉన్నా మంచి భావముతో దనరారుచున్నవి.
    1. శ్రీమతి మందాకిని గారు దుర్గుణ విహీనుడైన కర్మయోగిని పేర్కొనినారు.
    2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు "గుణమునిచ్చు గాదె కోరినచో గుణవిహీనునకు" అని పూరించేరు.
    3. శ్రీ సుబ్బారావు గారు ఊతనిత్తు నని మొదలిడి మంచి విరుపుతో పూరించేరు.
    4. శ్రీ మంద పీతాంబర్ గారు శత్రు విహీనుడు, శిష్ట రక్షకుడైన దైవమును స్తుతించేరు.
    5. శ్రీ కంది శంకరయ్య గారు ఆది మధ్యాంత రహితుని వర్ణించేరు.
    ఇలా వైవిధ్యముతో పూరించిన వారందరికి పేరు పేరునా అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. మిత్రులారా! శ్రీ వసంత కిశోర్ గారి పూరణను పొరపాటున శ్రీ శంకరయ్య గారి పూరణగా పేర్కొనినాను. శ్రీ వసంత కిశోర్ గారికి కూడా అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. అమ్మ మీద గరికిపాటి వారి కమ్మనైన పద్యాన్ని పరిచయం చేసిన మనతెలుగు వారికి ధన్యవాదాలు.
    వారిదే మరొక అందమైన "అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద " అనే పద్యం ఉంటే దాన్ని కూడా ప్రచురిస్తే సంతోషిస్తాం.

    రిప్లయితొలగించండి
  13. నేమాని పండితార్యా అగ్జ్నాత గారి సందేహాన్ని కూడా తీరిస్తే బాగుంటుందేమో.

    రిప్లయితొలగించండి
  14. డి.నిరంజన్ కుమార్శుక్రవారం, మార్చి 09, 2012 11:43:00 PM

    కోప తాప డంబ క్రూరత్వమిత్యాది
    గుణము లన్ని గలుగు కుటిల చిత్తు
    డయిన వాని విడిచి యవిలేని మద వి
    హీనునకు నమస్కరింతు నెపుడు.

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న మహాశయా !

    ఈ బ్లాగు లోనే చందస్సు విభాగంలో సమాధానము గలదు !
    దీనిని "సరస యతి " యందురు
    http://kandishankaraiah.blogspot.in/2011/09/2.html

    రిప్లయితొలగించండి
  16. గురువుగారూ,

    ఇ-హి లకు యతి కుదర్చడము సరసయతి. కానీ మన నిన్నటి సమస్యలో హి-రింతు లకు యతి కుదర్చడము జరిగినది. ఇది సబబేనా?? నాకు కూడా అజ్ఞాత గారి అనుమానమే వచ్చుచున్నది. ఒక సహస్రావధానములో శ్రీ మాడుగుల నాగఫణిశర్మ గారు వర్ణనాంశములో............

    యిఱ్ఱిదె మాధవుండు శయనించెనుమాకరపత్రమందునన్

    అని చెప్పారు. అందులో యి - నించు లకు యతి మైత్రి పడింది. కానీ శయనించు ను శయనయించు అనీన్నూను, అందువలన యి - యి లకు యతి కుదిరిందని విన్నాను. ఇలాంటిదే వసించు - వసియించు కూడా.

    పైవిధంగా నమస్కరింతు ను విడదీయలేము కదా.

    ప్రాజ్ఞులు వివరించవలసిందదిగా విన్నపము.

    రిప్లయితొలగించండి
  17. అందువలన పూరణలో దుర్హీనులకు అని వస్తేనే యతి కుదురుతుందని నా అభిప్రాయము. మరి దుర్హీనులు వ్రాయవచ్చా లేదా తెలియదు. "ర" కారసంయుక్త "హ" వర్ణమే యతి కుదురుతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! నిరంజంకుమార్ గారూ!
    నిన్నటి మీ పూరణ బాగున్నది. అభినందనలు. అందులో మొదటి పాదములో కొన్ని మార్పులు అవసరము. డంబము అనే పదము సంస్కృతము కాదు, వైకృతికము (అంటే సంస్కృత ప్రాకృత భవము). దంభము అనేది దాని ప్రకృతి రూపము. సమాసము మధ్యలో వైకృతికమును వాడరాదు. అందుచేత మీ పద్యములో మొదటి పాదమును ఈ విధముగా మారుద్దాము:
    "కోప తాప దంభ క్రూరత్వ ప్రభుతులౌ"
    స్వస్తి:

    రిప్లయితొలగించండి
  19. ఈనాటి సమస్యకు పూరణలు పంపిన
    మందాకిని గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    పండిత నేమాని వారికి,
    మంద పీతాంబర్ గారికి,
    వసంత కిశోర్ గారికి,
    నిరంజన్ కుమార్ గారికి
    ............. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    అజ్ఞత గారూ,
    యతి దోషం లేదు. ప్రస్తుతం వివరంగా సమాధానం ఇవ్వడానికి సమయానుకూలత లేదు.
    తరువాత వివరిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. జవము కలుగబోదు, సద్బుద్ధిపొడసూప
    దారితేరడెందునైనగాని,
    హేయగతులు గల్గు హీనునకు - నమస్క
    రింతునెపుడు దానవాంతకునకు.

    రిప్లయితొలగించండి
  21. యతి గురించి వచ్చిన సందేహము గురించి:
    హీ కి నమస్కరించు లో ఇంచు తో యతి వాడేరు. బాగుగనే ఉన్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నిరంజన్ గారి పద్యమునకు సూచించిన సవరణలో చిన్న టైపు తప్పు దొరలినది:
    మార్పు ఈ విధముగా ఉంటే బాగుంటుంది:
    "కోప తాప దంభ క్రూరత్వ ప్రభ్రుతులౌ"

    రిప్లయితొలగించండి