20, మార్చి 2012, మంగళవారం

భారతీ స్తుతి



స్మరియింతు నిరతంబు జలజాతభవు రాణి
పదపద్మ యుగళంబు భక్తి మెరయ
నొనరింతు వరివస్య మనసార రసరమ్య
మయ పావన వచస్సుమముల గూర్చి
కొనియాడుదును వాణి గుణవైభవములొప్ప
బహు లీలలను దివ్య పర్వ సరణి
విరచించెదను తల్లి కరుణా విభవమొంది
పరమార్థ మయ కావ్యవర తతులను
నాదు హృదయాంబురుహమందు మోదమలర
వాసమొనరించుచును వాగ్విభవము కరము
నలరెడు విధానమును గూర్చు నట్టి దేవి
భారతికి నంజలిని గూర్తు భవ్య కరణి

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

16 కామెంట్‌లు:

  1. స్మరియించిరి మీరమ్మను
    నిరతము మీహృదయ పీఠి నెలవై యుండన్
    పరమార్థ కావ్యతతులను
    విరచింతురు భారతాంబ వేడుక నలరన్.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారికి నమస్సులు..

    రాముని డాగురించి నిను రావణుడెత్తుకవచ్చువేళనీ
    హేమవిభూషణావదులనేర్పడఋష్యమహద్రివైచితివి

    అంటూ కొనసాగే పద్యం,ఎందులోనిదో తెలియచేయగలరు.

    -యడవల్లి.

    రిప్లయితొలగించండి
  3. నమస్కారములు .శర్మ గారూ !
    మీరడిగిన పద్యము " మొల్ల రామాయణం , సుందరకాండ " లోనిది ౯౮ వ పద్యము
    " ఆంధ్రభారతి " శ్రీ రామ ముద్రికా ప్రదానము " లో దొరుకుతుంది .

    రిప్లయితొలగించండి
  4. పూజ్య గురువులు శ్రీ పండితుల వారి సీసము శ్లాఘ నీయము . సరస్వతీ పుత్రులకు నమస్కారములు

    రిప్లయితొలగించండి
  5. యడవల్లి శర్మ గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
    నేదునూరి రాజేశ్వరి గారు మీ సందేహాన్ని తీర్చారు కదా!
    ఇదీ ఆ పద్యం నాకు గుర్తున్నంతవరకు....

    రాముని డాగురించి నిను రావణుఁ డెత్తుకవచ్చు వేళ నీ
    హేమవిభూషణావళుల నేర్పడ ఋష్యమహాద్రి వైచినన్
    మేమవి తీసి దాచితిమి మీ పతి యచ్చటి కేగుదేరఁగా
    తామరసాప్త నందనుఁడు తానవి చూపినఁ జూచి మెచ్చుచున్.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!
    ఈనాటి నా భారతీ స్తుతి సీసములోని ఒక ప్రత్యేకతను గమనించారా? అందులో ఇంద్రగణములన్నీ "సల"లే కదా. అలా వ్రాస్తే నడకలో ఒక విశిష్ఠిత కనిపిస్తుంది. మీరూ ప్రయత్నించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమాని వారికి నమస్కారములు.

    'సల' లితముగ నిట జెప్పిన
    నలువకు రసనంబు నందు నాట్యము జేసే
    కల హంస నెక్కి తిరిగెడు
    అల వాణీ స్తుతి జదువగ హాయిని గొలిపెన్.

    రిప్లయితొలగించండి
  8. పండితుల వారు సూచించినట్లు
    అన్నీ నగణాలతో ప్రయత్నించాను. రెండు చోట్ల మాత్రం హగణం వేయాల్సి వచ్చింది.
    పరిశీలించగలరు.

    మధువొలుకగ పదముపలుక మధురవాణి నొసగుమా!
    యధరములను చిరునగవుల ననవరతము నిలుపుమా!
    విధినిదలచి నడచుకొనుచు వెతలగెలువ జేయుమా!
    బుధవరులగు ఘనులుపెరుగ పురమునెపుడు నిలుపుమా!

    రిప్లయితొలగించండి
  9. అమ్మా మందాకినీ గారూ!
    మీ పద్యము బాగున్నది. 7 న గణములు 1 గురువుతో ఉన్న ఛందముగా చేయుటకు నేను తగిన మార్పు చేసేను. ఈ వృత్తము పేరు నాకు గుర్తు లేదు.

    మధువు లొలుకు పదము లొసగి మది నలరుము కరుణతో
    నధరములను చిరునగవుల ననవరతము నిలుపుమా
    విధిని దలచి నడచు కొనుచు వివిధ రిపుల గెలువగా
    బుధవరులగు ఘనులు పెరుగ పురము నెపుడు నిలుపుమా

    రిప్లయితొలగించండి
  10. మందాకినిగారి వృత్తము
    దానికి నేమానివారి సవరణ బహు చక్కగా నున్నవి !

    అయ్యా !
    7 న-గణములు+గురువు-యతి-13- గలిగిన వృత్తమును "తరళము " అందురు !

    రిప్లయితొలగించండి
  11. ఉత్సాహము ఇది. ౭ సూర్యగణములు, ఒక గురువు.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. మందాకినిగారూ మీరువ్రాసిన దానిలో
    1 మరియు 3 వ పాదములు "ఉత్సాహ" వృత్తము
    2 మరియు 4 వ పాదములు "తరళము "
    నేమానివారు సవరించినది పూర్తిగా తరళమే !
    ఉత్సాహకు పాదానికి కనీసం ఒక్కటైనా "హ" గణము ఉండవలెను !

    7-హ-గణములు+గురువు-యతి-9- గలిగిన " సుగంధి" యగును !(వృత్తము)
    7-న-గణములు+గురువు- యతి 13-గలిగిన "తరళము" యగును !(వృత్తము)
    7- సూర్య(న+హ)గణములు+గురువు గలిగిన "ఉత్సాహ" యగును !(జాతి)

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! రాముని డాగురించి -అంటే అర్థమూ , భావమూ చెబుతారా !

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! దొరికినది !
    డాగురించి - అంటే మోసగించి యని అర్థము !
    ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  15. వసంతకిశోర్ గారు,
    ఆలస్యంగా స్పందిస్తున్నాను, విద్యుత్తు సమస్య వలన. మన్నించండి.
    అయితే నేనింకా అధ్యయనం చేయాల్సి ఉన్నది.
    ఏడు సూర్యగణములు అని చదివి ఉండుట తో అన్నీ నగణములతో చేయాలని అనుకున్నాను. కానీ ఈ భేదాలతో వేరే రీతులున్నాయని తెలియలేదు.
    మీ వలన కొన్ని వివరములు తెలిసినవి.అనేక ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గారికి,నేదునూరి వారికి,శతసహస్ర వందనములు...

    మా నాన్నగారు,స్వర్గీయ యడవల్లి వేంకటేశ్వర శర్మ గారు,మాకు తరగతి గదిలో చెప్పిన పద్యాన్ని,పూర్తిగా తెలియజేసినందులకు,
    మరొక్క మారు..ధన్యవాదములు....

    హితైషి,
    -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

    రిప్లయితొలగించండి