భ్రష్టుని గతి
భోజమహారాజు ఒకసారి నగరసంచారం చేస్తూ ఒకచోట మాంసం తింటున్న ఒక సన్యాసిని చూసాడు. అప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ శ్లోకం. ఇది సంవాదాత్మక చాటువు.భిక్షో! మాంస నిషేవణం కిముచితం? కిం తేన మద్యం వినా?
మద్యం చాపి తవ ప్రియం? ప్రితమహో వారాంగనాభిస్సహ |
వారస్త్రీ రతయే కుతస్తవ ధనం? ద్యూతేన చౌర్యేణ వా
చౌర్య ద్యూత పరిశ్రమో$స్తి భవతాం? భ్రష్టస్య కా వా గతిః ||ఆ సంభాషణ వివరంగా ఇది ...భోజుడు: ( భిక్షో! మాంస నిషేవణం కిముచితం ) సన్యాసీ! మాంస భక్షణ నీకు తగునా?
సన్యాసి: ( కిం తేన మద్యం వినా ) మద్యం లేకుండ మాంసమెందుకు?
భోజుడు: ( మద్యం చాపి తవ ప్రియం ) నీకు మద్యం కూడా ఇష్టమేనా?
సన్యాసి: ( ప్రియమహో వారాంగనాభిస్సహ ) వేశ్యలతో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది.
భోజుడు: ( వారస్త్రీ రతయే కుత స్తవ ధనం ) వేశ్యల కివ్వడానికి నీకు ధనమెక్కడిది?
సన్యాసి: ( ద్యూతేన చౌర్యేన వా ) జూద మాడో, దొంగతనం చేసో సంపాదిస్తాను.
భోజుడు: ( చౌర్య ద్యూత పరిశ్రమో$స్తి భవతాం ) నువ్వు దొంగతనంలో, జూదంలో నేర్పరివా?
సన్యాసి: ( భ్రష్టస్య కా వా గతిః ) చెడిన వాడికి గత్యంతం ఏమున్నది?
నా అనువాదం .......సీ.
భిక్షుకా! యీ మాంస భక్షణం బుచితమా?
మద్యమ్మునకుఁ దోడు మాంసమె కద!
మద్యపానమ్మెట్లు మంచిదయ్యెను నీకు?
వేశ్యతో మద్య మావశ్యకమ్ము!
వారాంగనల కెట్లు పైకమ్ము నిత్తువు?
జూద మాడియొ కాక చోరవృత్తి!
ద్యూత చౌర్య జ్ఞాన మొప్పుగా నందితే?
భ్రష్టుని గతి యెట్లు స్పష్ట మగును?
తే.గీ.
భోజ భిక్షుక సంవాద పూర్ణ చాటు
పద్య మిది; తెనుంగున ననువాద మొప్ప
జేసితిని; గుణ దోష విశేషములను
చెప్పవలెను పండితులార! చేతు వినతి.