శ్లో.
సర్వ స్వాపహరో న తస్కరగణో రక్షో న రక్తాశనః
సర్పో నైవ బిలేశయో೭ఖిలనిశాచారీ న భూతోపి చ |
అంతర్ధానపటు ర్న సిద్ధపురుషో నాప్యాశుగో మారుతః
తీక్ష్ణాస్యో నతు సాయక స్తమిహ యే జానంతి తే పండితాః ||(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం ...సీ.
సర్వమ్ము దోఁచు, తస్కరుఁడని యనరాదు;
రక్తమ్ముఁ గొను, కాదు రాక్షసుండు;
బిలమందు శయనింపఁగలదు, పామును గాదు;
తమమందు దిరుగు, భూతమ్ము గాదు;
నెగడి యంతర్ధాన మగును, సిద్ధుఁడు గాదు;
కడు వేగమునఁ బోవు, గాలి కాదు;
మోము వాడిగ నుండు, ములికి కానేకాదు;
*పడకఁ జేరునుగాని పత్ని గాదు
తే. గీ.
దరిసి మేల్కొల్పు, కాదు వైతాళికుండు;
చంపఁగోరెద, మది కాదు శాత్రవుండు;
శివుఁడు కొండపై, విష్ణువు శేషుపైన
నుండఁగాఁ జేసె నది యేదియో తెలుపుఁడు.
సమాధానం - (అందరికీ తెలిసిందే!) నల్లి.
కవిమిత్రులారా,క్రింది సమస్యను పూరించండి.నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు.