24, ఆగస్టు 2011, బుధవారం

సమస్యా పూరణం -436 (పంటపండించు రైతులే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పంటపండించు రైతులే పాపజనులు.
ఈ సమస్యను సూచించిన
మిట్టపెల్లి సాంబయ్య గారికి
ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. పల్లె పొలమున చేసెడి పని యదేమి ?
    అన్న దాతగ పేరొంది యలరు నెవరు ?
    వారి శ్రమ దోచు కొనునట్టి భ్రష్టు లెవరు ?
    పంటపండించు - రైతులే - పాపజనులు.

    రిప్లయితొలగించండి
  2. కర్షకునికి సానుభూతి తో ...

    విత్తనంబులు నాటగా చెత్త వగును
    పంట వేయగ కరవగు వర్ష మునకు
    పంట పండిన చెప్పక వరద వచ్చు
    పంటపండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  3. టమాట రైతుకు సానుభూతి తో ...

    మాటి మాటికి చూడ టమాట పంట
    కొనగ లేనట్టి ధరకెక్కు, కొనగరాక
    ధరకు ధార వోయుచు నుంద్రు; ధరణి నిట్టి
    పంటపండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  4. ఉల్లి రైతుకు సానుభూతి తో ...

    ఉర్వి 'నమూల్య' మైనది ఉల్లి పంట
    కొనగ లేనట్టి ధరకెక్కు, కొనగరాక
    ధరకు ధార వోయుచు నుంద్రు; ధరణి నిట్టి
    పంటపండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  5. హనుంఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి పరముగా ;

    పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక
    పంట పండని దినముల పస్తు లుండి
    కంట నీరులు తొలుకక గట్టి వడిన
    పంట పండించు రైతులే పాప జనులు !

    రిప్లయితొలగించండి
  6. హనుమఛ్ఛాస్త్రి గారూ చక్కని పూరణలు. మీ వలె సానుభూతి పరముగా ;

    పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక
    పంట పండని దినముల పస్తు లుండి
    కంట నీరులు తొలుకక గట్టి వడిన
    పంట పండించు రైతులే పాప జనులు !

    రిప్లయితొలగించండి
  7. తులసి గంజాయి నొకటిగ తోచు జూడ
    జూడ వాటి తీరులు వేరు, చొక్కిడి దిగ
    జారి తులసి వనమున గంజాయి పత్రి
    పంటపండించు రైతులే పాపజనులు!
    మనవి: చొక్కిడి=మోసపుచ్చి

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    నేటి నేతల అవినీతి వ్యవసాయానికి సాటేది ?

    01)
    __________________________________

    పలుకు పలుకున తేనెలు - చిలుకు నట్లు
    ప్రజల కెన్నిక లందున - బాస లెన్నొ
    పలికి పొందుదు రధికార - పదవులెన్నొ !
    పదవి పొందిన తదుపరి - అదుపు లేని
    పాప కార్యంబులను జేసి - పంచుకొంద్రు
    ప్రభువు లీనాడు యవినీతి - పాలనంబు
    ప్రజల సంపద నంతయు - పాపమనక !
    ప్రీతి యక్రమ విత్తమే - పెరుగు నట్లు
    పంట పండించు రైతులే - పాప జనులు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  9. మూర్తి గారూ ! ధన్యవాదములు.
    చక్కటి పూరణ లిచ్చిన మూర్తి గారికి,మనతెలుగు వారికి, కిషోర్ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. ప్రజల జీవనాధారమౌ పంట పండఁ
    జేయు రైతన్న పూజ్యుఁడు. చెడును కోరి
    వేయరానట్టి పైరు గంజాయి వంటి
    పంట పండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  11. ఇందు గలరందు లేరను సందియమ్ము
    వలదు; దుష్టులన్నింటను గలరు వెతుక,
    హాయి చేకూర్చు నంటు గంజాయి వంటి
    పంట పండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  12. సంపత్ కుమార్ శాస్త్రిబుధవారం, ఆగస్టు 24, 2011 3:35:00 PM

    అధిక దిగుబడి కొఱకు తామాశపడి, క
    లుషిత సేంద్రీయ ఎఱువులు విష సమాన
    పలు రసాయనములజల్లి పైరునందు
    పంట పండించు రైతులే పాప జనులు.

    రిప్లయితొలగించండి
  13. కష్ట నష్టము లెన్నైనఁ కటిక పేద
    లైన, పంటలు పండించి, లాభ మంద
    జాలగనులేరు రైతులు, జాలి గొనుము.
    పంట పండించు రైతులే పాపజనులు.

    వస్తువేది యయిననేమి వర్తకుండు
    ధరనుఁ జెప్పెడి స్వేచ్ఛనుఁ దాను గలిగి
    యుండు, రైతుల పాపమా? యుర్వి లోనఁ
    బంట పండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  14. నా పూరణ ...

    ఆంధ్రదేశమ్మునకుఁ దెచ్చి రన్నపూర్ణ
    యనెడి ఘనతను వారు; పుణ్యాత్ములు గద
    పంట పండించు రైతులే; పాపజనులు
    వారి శ్రమను దోచుకొని సంపన్నులైరి.

    రిప్లయితొలగించండి
  15. అవునూ ! " సగరుడు , సగర పుత్రులు , అని అంటాం కదా ? అందుకనే " సగరు " అని వ్రాసాను. ఆసలు " సాంద్ర తీరాన " అని వ్రాసి చెరి పెసాను ప్చ్! [ అలాగైనా సరిపోనేమో } ఏది ఏమైతేనేం ? తమ్మునికి పనిచేప్పక పొతే అక్కకి తోచదు మరి .[ అసలు అక్కలు తమ్మునికి నేర్పాలి కాని ఇక్కడ ప్చ్ ! తమ్ముడూ ! గ్రేట్ .హేట్సాఫ్

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    నాల్గవపద్యం మొదటి పాదంలో గణదోషం దొర్లింది. బహుశా టైపాటు కావచ్చు. ‘ఉర్విని నమూల్య మైనది ... ’ అంటే సరి!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘పంట పండిన తగినంత (ప్రతి)ఫలము రాక’ దీనిని ‘పంట పండిన తగు ప్రతిఫలము రాక’ అంటే ఆ బ్రాకెట్ అవసరం ఉండదు కదా!
    *
    (మనతెలుగు) చంద్రశేఖర్ గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ నవపాద తేటగీతి పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    శ్రేష్ఠంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    విషతుల్యమైన పంటలు పండించే రైతులపై మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    అయితే ‘ఏ పాపజనులు? అని అర్థం వచ్చేట్లు పాదాంతంలో ప్రశ్నార్థక చిహ్నం పెడితే బాగుండేదేమో?

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరక్కయ్యా,
    సగరుని కారణంగా ఏర్పడింది కనుక అది ‘సాగరం’ అయింది. సగరం అనరాదు. అంతే!

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! తొందరపాటు లో జరిగిన పొరపాటు. సవరించి నందులకు ధన్యవాదములు.చక్కని పూరణ నిచ్చారు.మీకు కవిమిత్రులన్దరకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. సెజ్జులకుఁ,బరిశ్రమలకుఁ,సిరులనొసగు
    పెట్టుబడిదార్లకుఁ,బిలచి ప్రేమతోడ
    నత్తసొమ్మువలెనుదానమను ప్రభుతకుఁ-
    పంట పండించు రైతులే పాపజనులు

    రిప్లయితొలగించండి
  20. అక్రమార్జన యవినీతి యలు పెఱుఁగని
    జార చౌర్యాది ' బీజముల్ ' చల్లి, ' బ్రతుకు
    భువిని ' ' పాపంపు జలము ' ను వోసి ' విషపు
    పంట ' పండించు రైతులే పాపజనులు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 24, 2011 11:00:00 PM

    మిత్రులందరి పూరణలూ బాగున్నాయి. గురుగారి పూరణ ఆంధ్రను అన్నపూర్ణగాచేసింది.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 24, 2011 11:01:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    రైతుబాంధవులనుచును రాష్ట్రమందు
    రోజుకొకరుగ నోదార్చ, రాజులైరి
    పంట పండించు రైతులే. పాపజనులు
    ఎవరు? తెలసిన జెప్పుమా ఎవ్వరైన

    రిప్లయితొలగించండి
  23. ఎన్నికల వేళ వోటర్ల కేది నీతి ?
    ధనము , మద్యమ్ము గైకొని - తమకు తామె
    నుదుటి రాత రాసు కొనిరి - నోట్ల కోట్ల
    పంట పండించు రైతులే పాపజనులు

    రిప్లయితొలగించండి
  24. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  25. పెరటి చెట్టుగ బెంచిన నరటి తోట
    ఫలము లందించె విరివిగ పంచు కొనగ
    పంచి చెడునైతి నేనిటు యెంచి చూడ
    పంట పండించు రైతులే పాప జనులు !

    రిప్లయితొలగించండి
  26. గురువు గారూ మీ పూరణ చాలా బాగుంది.నా పద్యానికి మీ సవరణ బాగుంది.ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  27. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    అత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మంచి విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    అజ్ఞాత గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. రాజేశ్వరక్కయ్యా,
    నిర్దోషంగా చక్కని పూరణ నిచ్చారు. ధన్యవాదాలు.
    *
    నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి