12, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యా పూరణం -423 (వరలక్ష్మీవ్రతముఁ జేయ)

కవి మిత్రులారా,
అందరికీ వరలక్ష్మీవ్రత పర్వదిన శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

31 కామెంట్‌లు:

  1. పరధనమును, నడమంత్రపు
    సిరులను, అవినీతి పనులఁ జెందెడి సొమ్మున్
    పరిపరి విధములఁ గోరుచు
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  2. దరి జేర వీతి బాధలు
    భరియించని కష్ట నష్ట పాపపు భయముల్
    మరి శ్రావణ మాసంబున
    వరలక్ష్మీవ్రతముఁ జేయ ; వల దని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  3. మరియొక ఆర్థిక మాంధ్యము
    పరుగున భువి తాకునంచు వెరువగనేలా?
    కరుణను గాచును శ్రీరమ
    వరలక్ష్మీవ్రతముఁ జేయ! వలదనిరార్యుల్.

    రిప్లయితొలగించండి
  4. ఫణి ప్రసన్నకుమార్ గారూ ! ప్రాసయతి కందములో ?

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత గారూ,
    ‘పరుగున భువి తాకునంచు భయపడనేలా?’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  6. సిరిమెచ్చుబెరుగునాయువు
    వరలక్ష్మీ వ్రతము జేయ; వలదనిరార్యుల్
    పరపీడనమ్ము; మంగళ
    కరమౌ శ్రీలక్ష్మిపూజ కమలాక్షులకున్.

    రిప్లయితొలగించండి
  7. కూడదా? కందము కూడా తెలుగు పద్యమే కదా, వేయవచ్చునేమో అనుకొన్నాను. శంకరయ్య గారూ, సందేహ నివృత్తి చేయవలసినదని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  8. గురువు గారికి ధన్యవాదాలు,నమస్కారములతో

    వరముల నాశించి జనులు
    వరలక్ష్మీవ్రతము జేయ వలదని రార్యుల్
    పరిపరి విధముల జెప్పిన,
    సిరులను గోరుచునె జేయు సిరిపుత్రులెల్లన్,

    రిప్లయితొలగించండి
  9. సిరులొసగెడి మాతల్లికి
    విరులొసగుము పూజచేసి వేడుము. వ్రతముల్
    జరిపెడి పద్ధతి లేదిట,
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  10. పరుల శుభము మది గోరక,
    వెరువక పాపపు పనులకు, విమల మతులు గా
    క,రయక దానాది విధులు
    వరలక్ష్మీ వ్రతము జేయ వలదని రార్యుల్

    రిప్లయితొలగించండి
  11. వఱువాతతలగడుగకను,
    మఱితీరికగామొదలిడి మధ్యాహ్నమునన్,
    తెఱపిన టీవీ(T.V) చూచుచు
    వరలక్ష్మీ వ్రతము జేయ వలదని రార్యుల్!!!

    ఱ - ర లకు ప్రాస సమ్మతమేనాండీ?

    రిప్లయితొలగించండి
  12. మిస్సన్న గారూ,
    కుసంపదలను కోరి వ్రతం చేయవద్దన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వ్రతం చేయడం వల్ల ప్రయోజనాలను వివరిస్తూ చక్కని పద్యం చెప్పారు. బాగుంది.
    కాని ‘వలదని రార్యుల్’ దేనితో అన్వయిస్తున్నది?
    ఓహో ... ‘కష్ట నష్ట పాపపు భయముల్’ తో అన్వయించుకోమంటారా?
    *
    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    ‘వెరువ వలదని రార్యుల్’ అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    కందంలో ‘ప్రాసయతి’ నియమం లేదు.
    *
    అజ్ఞాత గారూ,
    మిత్రుల పూరణలను నిశితంగా పరిశీలిస్తూ, గుణదోష విచారణ చేస్తున్నందుకు ధన్యవాదాలు.
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ర-ఱ ప్రాస పండితసమ్మతమే.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘సిరిపుత్రులెల్లన్’ అన్నప్పుడు గణదోషం. ‘సిరిగలవారల్’ అందామా?
    *
    మందాకిని గారూ,
    పూజలే గాని వ్రతం చేసే సంప్రదాయం లేదంటారు. అద్భుతం. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. నా పూరణ ... (ఎంతకాలానికి అవకాశం చిక్కింది!)

    మరణించెఁ దండ్రి, సంవ
    త్సరకాల మ్ముండుగద మృతాశౌచము, త
    త్తరుణమున నింటిలోనన్
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  14. కవి మిత్రులారా,
    శ్రీ చింతా రామకృష్ణారావు గారు తమ ‘ఆంధ్రామృతం’ బ్లాగులో ‘కట్టమూరి చంద్రశేఖరమ్’ కవి గారి సమస్యాపూరణలను ఇస్తూ వాటికి పూరణలు పంపమని కోరుతున్నారు. ఆ బ్లాగును వీక్షించి మీ మీ ప్రజ్ఞాపాటవాన్ని ప్రదర్శించ వలసిందిగా మనవి. దానికి లింకు ...
    http://andhraamrutham.blogspot.com/2011/08/1.html

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, ఆగస్టు 12, 2011 7:04:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    వరమిచ్చెడు నాతల్లిని
    శరణంచూ వేడుమమ్మ శ్రావణమందున్
    మరిమరి మాసము కోకపరి
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, ఆగస్టు 12, 2011 7:08:00 PM

    టైపాటు- మాసము *కొకపరి

    రిప్లయితొలగించండి
  17. శంకరార్యా ! ధన్యవాదములు. చాలా కాలం తరువాత మీ పూరణం చూచే భాగ్యం కలిగింది. మంచి పూరణ . ఆశౌచము మూలముగా వ్రతము చేయ రాదనే పూరణ చేయాలని మధ్యాహ్నము అనుకున్నాను.ఆఫీసు నుండి రాగానే చేద్దామని. ఈ లోగా మీరు చేసేశారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ,
    నెలనెలా వ్రతం చేయవద్దన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘శరణంచూ ...’? దానిని ‘శరణంబని / శరణమనుచు’ అంటే బాగుంటుంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ మీ పూరణ అద్భుతం. అభినందన లండీ.

    రిప్లయితొలగించండి
  20. కందమును కంది వారలు
    పందెపు గుర్రమ్ము రీతి బరుగెత్తించెన్
    అందున భావప్రకటన
    నందించిన తీరు జూడ నాహా! యోహో!

    రిప్లయితొలగించండి
  21. భావ స్పష్టత కొరకు చిన్న సవరణ తో ...

    దరి ధనము లేని చింతలు
    భరియించని కష్ట నష్ట పాపపు భయముల్
    మరి శ్రావణ మాసంబున
    వరలక్ష్మీవ్రతముఁ జేయ ; వలదని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  22. వరలక్ష్మీ వ్రతానికి కొత్త బంగారం కొని పూజలో పెట్టాలట:
    మరి బంగరు నగ బెట్టక
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్
    ధరలాకసమంటె ననుచు
    చిరుబురు లాడెనట చంద్రశేఖరు డింటన్ !

    రిప్లయితొలగించండి
  23. గురువుగరూ మీ పూరణ చాలా బాగున్నది.
    నాపద్యంలో సవరణ చక్కగా ఉన్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. నాకై ఒక విరుపు మిగిల్చి నట్టున్నారు, మిస్సన్న వారి కవితా! వలె.

    సరిపడ డబ్బులులేని ఓ మొగుడు - శ్రీమతి ఆరోగ్యం పై నెపం, అవసరానికో అబద్ధం చెబుతున్నాడు :

    భరియింపగలేవనిరోయ్
    స్థిరముగకూర్చొనియెధరను సేవింపంగన్
    సరిపెట్టుముదండముతోన్-
    వరలక్ష్మీ!వ్రతముఁ జేయ వలదని రార్యుల్.

    రిప్లయితొలగించండి
  25. వై.యస్.ఆర్.విజయలక్ష్మిని టీవీలో చూస్తే, ఎవరూ కిరస్తానీయులు అనుకోరు. వీరూ ఒకప్పటి హిందువులే. ఆ నేపధ్యంలో,నాపూరణ:
    సూచన: వరలక్ష్మిని ముద్దుగా వరం అనటం మనకేరుకే, కానీ:
    వరమెన్నియొ వత్సరములు
    వరలక్ష్మీవ్రతముఁ జేయ; వలదని రార్యుల్
    మరియిపు డేసును గొలిచెడి
    మరియమ్మమతమునకేగ, మార్పు సులభమా?

    రిప్లయితొలగించండి
  26. అమెరికా పంపేటప్పుడు ప్రతి ఆడపిల్లకీ వాళ్ళ అమ్మ చెప్పే మాటే, "ఏమిటో అమెరికాట, ముత్తైదులుండరట, మరి నోములు వ్రతాలు పట్టింది మాఅమ్మాయి, ఎట్లానో ఏమో!" అదే నాపూరణలో:
    వరమెన్నియొ వత్సరములు
    వరలక్ష్మీవ్రతముఁ జేయ; వలదని రార్యు
    ల్పర దేశమున సువాసిను
    లరకొర, వాయనము లేరి కనియి చ్చెదవో ?

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్న గారూ,
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. చంద్రశేఖర్ గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    ఊకదంపుడు గారూ,
    అద్భుతమైన విరుపుతో చక్కని పూరణ నిచ్చారు. అభినందనలు.
    ఈ ఆలోచన నాకెందుకు రాలేదా అని ఆశ్చర్యపడుతున్నాను.

    రిప్లయితొలగించండి
  29. ఊకదంపుడు గారి విరుపు, భావం భలే ఉన్నాయి.
    చంద్రశేఖరుల మూడవ పూరణలో ఒకటీ, రెండూ పాదాలను
    వరుసగా మూడూ, నాలుగూ పాదాలుగానూ, మూడూ, నాలుగూ
    పాదాలను ఒకటీ రెండూ పాదాలుగానూ మారిస్తే మరింత బాగుండేది.

    రిప్లయితొలగించండి
  30. కరవున రైతుల దోచెడి
    నరవరులకు మ్రొక్కుచుండు నక్కల వోలెన్,
    పరులను మోసము జేసి, చి
    వర, లక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్

    రిప్లయితొలగించండి
  31. కొరగాని వాడు నీవని
    బరువుగ నగలను కొనవని బారెడి నోటన్
    అరచుచు భర్తను సతతము
    వరలక్ష్మీవ్రతముఁ జేయవల దని రార్యుల్

    రిప్లయితొలగించండి