7, ఆగస్టు 2011, ఆదివారం

సమస్యా పూరణం -418 (సత్యమునకంటె మేటి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
సత్యమునకంటె మేటి యసత్యము గద!
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.
కవిమిత్రులారా!
‘సూనృతముకన్న గొప్పది యనృతముగద’ అని ఉదయం ఇచ్చిన సమస్యలో ‘ప్రాసయతి’ తప్పింది. మిస్సన్న గారు చెప్పేవరకు నేను గమనించలేదు. అందువల్ల సమస్యను, దానితో పాటు మీ మీ పూరణలను సవరిస్తున్నాను. కోపం తెచ్చుకొనవద్దని, మన్నించమని మనవి. ఏం చేయను? ‘ఒంట్లో నలతలు, ఇంట్లో కలతలు!’

21 కామెంట్‌లు:

  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ ...

    నూరు బావులు క్రతువులు నూరు మంది
    పుత్ర సంతతి కన్నను, పుడమి లేదు
    సత్యమునకంటె మేటి; యసత్యము గద
    మహిని జూడగ మేలది మరణ మొకటె !
    7 ఆగస్టు 2011 7:54 ఉ

    రిప్లయితొలగించండి
  2. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ...

    భూత రాశుల హితముగ బ్రోవకుండ
    పరిణయమ్ములు పొసగక బాపు చేయు
    ప్రాణ మాన ధనములను క్షీణ పరచు
    సత్యమునకంటె మేటి యసత్యము గద!
    7 ఆగస్టు 2011 9:22 ఉ

    రిప్లయితొలగించండి
  3. కంది శంకరయ్య చెప్పారు...

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘నుతజలపూరితంబులగు నూతులు నూఱిటికంటె సూనృత
    వ్రత యొక బావి మేలు ...’ నన్నయ పద్యభావాన్ని చక్కగా చిన్నపద్యంలోకి దింపి మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘బాపుచేయు’ అనేది ‘బాపుచుండి’ అయితే ...?
    7 ఆగస్టు 2011 10:08 ఉ

    రిప్లయితొలగించండి
  4. మందాకిని చెప్పారు...

    సత్యమునకంటె మేటి యసత్యము గద
    యనుట మూర్ఖపు వాదనయా!వినుమిక
    సూక్ష్మపరిశీలనలఁజేసి చూచి మనకు
    గొప్పవారలు నీతులు గూర్చినారు.
    7 ఆగస్టు 2011 10:55 ఉ

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న చెప్పారు...

    ద్రోణుఁ నిర్జింప మరియొక త్రోవ లేదు
    బొంకఁ బోననఁ బోకుము, పోరు నందు,
    ధర్మ నందన, పొందగ ధర్మ జయము
    సత్యమునకంటె మేటి యసత్యము గద!
    7 ఆగస్టు 2011 11:13 ఉ

    రిప్లయితొలగించండి
  6. సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

    ప్రజల సొమ్మును దోచెడి ప్రత్యవరుల
    కవని భక్షింప నెంచిన యన్యులకును,
    ధర్మపరిరక్షణార్థము ధరణి జెప్పు
    సత్యమునకంటె మేటి యసత్యము గద!.

    అవని = మాతృభూమి,
    ప్రత్యవరులు = దుండగులు
    7 ఆగస్టు 2011 11:33 ఉ

    రిప్లయితొలగించండి
  7. మంద పీతాంబర్ చెప్పారు...

    భూత హితమగు బొంకును పుడమి మెచ్చు ,
    మెలొనర్పని సత్యంబు మూలజచ్చు
    ప్రాణమానవిత్త పదవి భంగ మందు
    సత్యమునకంటె మేటి యసత్యము గద.
    7 ఆగస్టు 2011 11:36 ఉ

    రిప్లయితొలగించండి
  8. లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణ ...

    చెప్పు సత్యము , ప్రియము వచింపుమనిరి
    సత్యమప్రియము , ప్రియమసత్యమైన
    చెప్పవలదనిరి-గనుక నప్పుడపుడు
    సత్యమునకంటె మేటి యసత్యము గద!
    7 ఆగస్టు 2011 2:34 సా

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ఉత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘శుక్రనీతి’ని చక్కగా పూరణలో వినియోగించుకున్నారు. చాలా బాగుంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మాస్టారూ, మీరు అలసిపోతున్నారు. నాకు తెలిసి, స్ట్రెస్ (మానసిక ఒత్తిడి) కి గురి అయినపుడే మనకి బాగా నేర్పు వున్న పనిలోనయినా చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయంటారు, మనం గమనించలేము, అది తెలియక కాదు. ఉదాహరణకి రోజూ నడుస్తూనేవుంటాము, ఒక్కొక్క సారి మనకు కాలు మడత బడి బెణుకుతుంది (ANKLE TWIST అవుతుంది). రోడ్డు బాగుండకపోవటం వల్ల కాదు, అది వేరే విషయం. అంత సహజంగా చేసే పనులలో కూడా పొరపాటు జరుగుతుంది. ఇక్కడ మాకు STRESS గురించి చెప్పే పాఠాలలోంచి ఒక చిన్న విషయం చెప్పాను. మీ దినచర్య కొంచెం మార్చి చూడండి. డా. మూర్తి గారి లాంటి వారు విశదీకరించగలరు.

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ, ఈరోజు సమస్య పూరణ చేద్దామను కోలేదు. కానీ మీమాటల స్ఫూర్తితో:
    ఒంటి లోని నలత దీరెనంటి గాని
    ఇంటిలోని కలత దీరు నెపుడు?
    సత్య పోషణమందున నిత్య పోరు,
    సత్యమునకంటె మేటి యసత్యము గద!
    కొంచెం మార్పుతో:
    ఒంటి లోని నలత దీరెనంటి గాని
    ఇంటిలోని కలత దీరు నెపుడు?
    కలత నలతల నడుమన కలను గంటి
    సత్యమునకంటె మేటి యసత్యము గద!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురుభ్యో నమః
    గురువు గారూ ధన్య వాదములు. మీ సూచన బాగుంది.

    భూత హితమ్ముగా బలుకు బొంకును సత్యఫలమ్ము నిచ్చు త
    ద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకు నట్లు ప్రా
    ణాతురుడైనచో పరిణయంబున నందున బల్కు బొంకు స
    త్యాతిశయంబు నండ్రు మహితాత్మక యిట్టివి ధర్మసూక్ష్మముల్ !

    ఎఱ్ఱన వారి పద్యాన్ని కూడా శ్రీ మందా పీతాంబర్ వారు దృష్టిలో పెట్టుకొన్నారు. తర్వాత శుక్ర నీతిలో దిగారు.

    వారిజాక్షులందు వైవాహికము లందుఁ
    బ్రాణ మాన విత్త భంగ మందుఁ
    జకిత గోకు లాగ్ర జన్మ రక్షణ మందుఁ
    బొంక వచ్చు నఘముఁ బొంద డధిప !

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు చంద్రశేఖర్ జీ !
    హడవుడిలో అందఱికీ పొరబాట్లు జరుగు తాయి. నా తప్పులు తొందర పాటులో ,కొన్ని సారులు తెలియక కొన్నిసారులు తెలిసీ తెలియక కొన్ని సార్లు తెలుసుకొందామని చేస్తాను. గురువుగారు మొహమాటముగా కొన్ని సార్లు చూసీ చూడక వదిలేస్తానని చల్లగా చెప్పారు. గురువు గారూ నా విషయములో మీకా మొహమాటము అక్కఱ లేదు.
    చంద్రశేఖర్ గారూ మీకు కాలు మడత పడినప్పుడు ఒక డాక్టరు మిత్రుడు ఉన్నాడని వానికి బిజినెస్ యివ్వడములో తప్పు లేదని గ్రహింప గలరు !

    రిప్లయితొలగించండి
  14. డా. మూర్తి మిత్రమా!
    నిజమే. మాష్టారు మన తప్పులు చూసీ చూడనట్లు వదిలేస్తారు.
    ఇక, నాకు కాలు బెణికినపుడు, ఏదో కొంచెం జాగ్రత్తగా వుండు బాబూ అని ఒక సూదిపోటు పొడిచి పంపితే పరవాలేదు. కానీ మీరు "చంద్రభాసురం" అడిగి నాచేత "గుఱ్ఱపుస్వారీ" చేయించారనుకొండీ, నా వల్ల కాదు ప్రభో! ఇప్పటికే ట్రెడ్ మిల్లు స్వారీ చేయలేక నీరసం వస్తోంది :-)

    రిప్లయితొలగించండి
  15. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    మీకు శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత త్వరగా చేకూరు గాక.అదే మా కోరిక.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారు త్వరగా కోలుకోవాలని ,వారికున్న నలతలు ,కలతలు తోలిగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను.
    మూర్తిగారు ధన్యవాదాలు .మీరన్నది నిజమే.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ ఈ చిన్న పొరబాటుకు అంత విచార ప్రకటన అవసరమంటారా?
    వత్తిడి మనిషికి చాలా హాని చేస్తుందంటారు. దాన్ని అధిగమించే శక్తి మీకు దేవుడివ్వాలని కొరుకొంటున్నాము.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 07, 2011 10:15:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    గురువుగారూ, మీకు త్వరగా ఆరోగ్యం కుదుటపడి స్వస్థత చేకూరాలని దేవదేవుని కోరుచున్నాను.

    మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రిగారు, మిస్సన్నగారు,మందపీతాంబర్ గారు, మందాకినిగారు, చంద్రశేఖర్ గారు, నరసింహమూర్తిగారు, వసంత కిషోర్ గారు,సంపత్ కుమార్ శాస్త్రిగారు,అప్పుడప్పుడు కనిపించె యితర కవిమిత్రులు ప్రతి ఒకరు ఈ బ్లాగ్ లో ఎంతో చక్కని పద్యాలు వ్రాస్తున్నారు. వారివారి వృత్తులలో ఎంతో బిజీగా వుంటూకూడా తెలుగు పద్యం పట్ల మమకారంతో దేశవిదేశాలనుండీ మిత్రులు పద్యాలు వ్రాస్తునారు. ఒక్కొక్కరోజు కొంతమంది పూరణలు అద్భుతంగా వుంటున్నాయి. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో పద్యాలన్ని పరిశీలించి ప్రతిఒక్కరికి 35 కు పైగా మార్కులు వేసి పాస్ చేసె మన గురువుగారు శ్రీ శంకరయ్యగారు ఎంతో ధన్యులు.

    నా పద్యాలను చదివి అభినందించే గురువుగారికి, యితర మిత్రులకు సర్వదా కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  19. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 07, 2011 10:34:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    నివురుగప్పిన {మాత్రాన} నేమది నిప్పు కాద
    సత్యమన్నది యెన్నడున్ శాశ్వతమది
    భ్రమగ నూహించి చెప్పెడు పద్యమందు
    సత్యమునకంటె మేటి యసత్యముగద


    కవిత్వంలో కొన్ని అపద్ధాలు నిజాలకొంటెకూడా బాగుంటాయనే అభిప్రాయంతోవ్రాశాను.
    ఉదా: ఆ దృశ్యం చూడలేక సూర్యుడు అస్తమించెను

    రిప్లయితొలగించండి
  20. నా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పరామర్శించిన మితులందరికీ ధన్యవాదాలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మంచి పద్యాలు చెప్పారు. అభినందనలు.
    కానీ .. రెండవపాదం ‘ఆటవెలది’ అయి తైతెక్కలాడింది. ‘ట్రెడ్ మిల్లు’ ప్రభావమా?
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. మాస్టారూ, మాకు కూడా 110 డిగ్రీలు ఎండ మండిపోతోంది సార్, దిమ్మ దిరిగే సరికి, తేటగీతి, ఆటవెలది కలసి, వెరసి తేటవెలది క్రింద తయారయింది :-) వచ్చే assignment కరెక్ట్ గా చేస్తాను, ఈ సారికి moderation ఇవ్వండి సార్!

    రిప్లయితొలగించండి