13, ఆగస్టు 2011, శనివారం

సమస్యా పూరణం -424 (రక్షాబంధనము నాఁడు)

కవి మిత్రులారా,
అందరికీ రక్షాబంధన మహోత్సవ శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

47 కామెంట్‌లు:

  1. చెల్లెలి పై కోపంతో వున్న అన్నతో చెల్లి...


    శిక్షను వేయకు మన్నా!
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా
    దీక్షను బూనెద వచ్చెద!
    కక్షెందుకు ! నిన్ను నన్ను కన్నది ఒకరే !

    రిప్లయితొలగించండి
  2. రక్షను గట్టెద నీకే
    రక్షాబంధనము నాఁడు రా ! వల దన్నా
    లక్షలు, మించిన కానుక,
    భిక్షగ నీ ప్రేమ చాలు ప్రియ సోదరుడా !

    రిప్లయితొలగించండి
  3. భక్షణములెన్నొ జేసెను
    రక్షాబంధనము నాఁడు రా ! వల దన్నా
    రక్షణఁజేసి కనె మనను
    కుక్షియది నెపుడునుఁ జల్ల కోవెల గదరా!

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్చ్హాస్త్రి గారి రెందు పూరణలు చాలా బాగున్నాయి.

    శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  5. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 13, 2011 9:18:00 AM

    శిక్షింపకు నన్నీవిధి,
    రక్షాబంధనము నాడు రావలదన్నా
    నా, క్షమియింపుము తప్పుల,
    నీక్షణమే రావలయు, మదీప్సితమిదియే.

    రిప్లయితొలగించండి
  6. ఇదివరలో మాటా మాటా అనుకొన్న అన్నా చెల్లెలి సంభాషణ, చెల్లెలు అన్నతో:
    అక్షయ బంధన సూచిక
    రక్షాబంధనము; నాఁడు రావల దన్నా
    నా క్షణికావేశమునన్
    శిక్షించక రమ్మునేడు చెల్లెలి కొరకున్!
    గమనిక: విభిన్న భాషలవారిని, దేశ విదేశీయులను చూచాక నాకనిపించింది. బహుశ: మన తెలుగు వారిలో ఆగ్రహమూ అనుగ్రహమూ రెండూ యెక్కువేమో!

    రిప్లయితొలగించండి
  7. రక్షణఁ గొలిపెడి బంధము.
    రక్షణ మనకుభయులకును రక్షా బంధం
    బక్షయ సంపత్కరమది.
    రక్షాబంధనము నాఁడు రా! వలదన్నా|

    రిప్లయితొలగించండి
  8. శ్రీనివాస్ గారూ ! ధన్యవాదములు.
    మందాకిని గారూ ! సంపత్ గారూ ! చక్కని పూరణలు చేశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చంద్ర శేఖర్ గారు , చింతా వారి పూరణలు ముచ్చటగా వున్నాయి.

    రిప్లయితొలగించండి
  10. 'రక్షింపుము ప్రేమించితి
    రక్షాబంధమ్మునాడురావలద'న్నా,
    శిక్షింపబూని వాడికి
    రక్షాబంధమ్ముగట్టె రమణీమణియున్

    రిప్లయితొలగించండి
  11. రాజారావు గారూ ! వినూత్న మైన పూరణ ... చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  12. కిష్టకు (కృష్ణకు) ఒక వైపు అన్న మరియొక వైపు చెల్లెలు ఉండగా, ప్రస్థుత ప్రాంతీయ విద్వేషాలు తారాస్థాయికి చేరితే అప్పటి పరిస్థితి .......(ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటూ)

    రాక్షసులై నేతలిటుల
    కక్షలు రేపిరి, మనుజులు కారే వారల్?
    రక్షణ దొరకదు నీకున్
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా||

    రిప్లయితొలగించండి
  13. వీక్షించెద నెపుడా యని
    రక్షా బంధనము; నాడు రావల దన్నా -
    ఆ క్షణము రాక యుందునె?
    పక్షికి వలె నీదు చెంత వ్రాలెద చెల్లీ!

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 13, 2011 3:34:00 PM

    హనుమచ్చాస్త్రి గారు,

    ధన్యవాదములండీ. మీ బోటి వారి ప్రశంస మాకు గర్వకారణములే కదా.

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతిశాస్త్రిశనివారం, ఆగస్టు 13, 2011 4:12:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    శిక్షణ బొందుచు నుంటివి
    రక్షాబంధనమునాడు రావలదన్నా
    రక్షించును శ్రీరాముడు
    అక్షయముగ నిచ్చునాయురారోగ్యములన్

    సుదూరప్రాంతాలలో శిక్షణ పొందుచున్న సోదరునితో
    "నీవు రాలేక పోయిననూ శ్రీరామ రక్షను కట్టుచున్నా"నని
    చెల్లెలు చెప్పినది.

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిశనివారం, ఆగస్టు 13, 2011 4:22:00 PM

    జిగురు సత్యనారాయణగారూ సందర్భోచితమైన మంచి పూరణ నిచ్చారు.అభినందనలు.
    మిత్రులందరి పూరణలు బాగున్నాయి.అందరకు అభినందనలు.
    రాఖీపర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  17. దక్షతగల "కనిమొళి" యనె
    రక్షా బంధనము నాడు రావలదన్నా
    రక్షకులికమీరేగద
    శిక్షను దప్పించలేరె,చెల్లెనుగాదే !!

    రిప్లయితొలగించండి
  18. జీ యస్ యన్ గారూ ! నేటి నికృష్ట రాజకీయ నాయకుల నాలో చింప జేసే పూరణ చెప్పారు.
    ఫణీంద్ర గారూ ! అన్న హృదయాన్ని ఆవిష్కరించారు.
    శ్రీ పతి శాస్త్రి గారూ ! చెల్లి మనసును తెల్లము జీసినారు.
    పీతాంబర్ గారూ ! కనిమొళి ఆక్రందన చక్కగా వినిపించారు.
    అందరకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. పక్షము గడిచిను వచ్చును
    రక్షాబంధనము; నాడు రావలదన్నా
    నక్షత్రములకు జత శశి
    చక్షువులఁ బడని తిథులను; చంద్రిమ! రమ్మా!

    అమావాస్యని నేనే రావద్దన్నాను అని బడాయి.
    శాస్త్రిగారూ! ధన్యవాదాలండి. అందరి పూరణలూ అలరించాయి.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. అద్భుతమైన, వినూత్నమైన, విభిన్నమైన శైలితో మిత్రుల, పెద్దల పూరణలు కర్ణపేయంగా ఉన్నాయి.

    రక్షింపుము పురుషోత్తమ!
    భిక్షగ నాకిమ్ము గ్రీకు విభు, నాప్రియునిన్
    శిక్షింపఁ కదనమందున
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

    రిప్లయితొలగించండి
  21. మందాకిని గారికి,రాజేశ్వరి అక్కయ్య గారికి,ఎన్నెలమ్మకు,భమిడిపాటి సూర్యలక్ష్మి గారికి,మిత్రులందఱికీ రక్షాబంధన శుభాకాంక్షలు

    కంసునితో వసుదేవుడు ;

    రక్షించుట సుక్షాత్రము
    రక్షాబంధనము నాఁడు రా ! వలదన్నా
    శిక్షించుట నీ చెల్లిని
    కుక్షిన్ దా బ్రోచు ననుచు కువలయ నాథున్ !

    రిప్లయితొలగించండి
  22. రక్షింపఁ దగిన వారే
    శిక్షించుటఁ జూడలేవు చెల్లిని, నాపై
    కక్షను నిను నిందింతురు,
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

    రిప్లయితొలగించండి
  23. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రావద్దన్నా రాఖీ కట్టడానికి వచ్చేదే చెల్లెలు. మొదటి పూరణ హృదయపు లోతులను స్పృశించింది.
    రెండవ పూరణలో రావద్దన్న దానిని రమ్మని మార్చిన మీ నైపుణ్యం ప్రశంసనీయం. అభినందనలు.
    సాటి కవిమిత్రుల పూరణలను ప్రశంసించిన మీ సహృదయతకు జోహార్లు. ధన్యవాదాలు.
    *
    మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘కుక్షియది నెపుడునుఁ జల్ల కోవెల గదరా!’ అన్నచోట ‘కుక్షి యది చల్లనైవ కోవెల గదరా!’ అంటే ఎలా ఉంటుంది?
    మీ రెండవపూరణలోని ‘బడాయి’ బాగుంది.
    ‘చంద్రిమ’... ? ‘చంద్రా రమ్మా’ అంటే సరిపోయేది కదా!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. కక్షను, కట్నము కొఱకై
    శిక్షింతువు వదిన నెపుడు, చెల్లెలికిన్ నీ
    యక్షయ దీవన లేలా ?
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

    రిప్లయితొలగించండి
  25. అక్షయమగు మన ప్రేమకు
    యక్షులు గంధర్వులు మిము రక్షిం తురటన్నన్ !
    శిక్షింప వలదు సోదర
    రక్షా బంధనము నాడు రావలదన్నా !

    క్షమిం చాలి " అసలే అంతంత మాత్రం .పైగా నెల రోజుల తర్వాత ఎన్ని తప్పులో ? గురువు గారికి మళ్లీ శ్రమ .
    సోదరు లందరికీ " రక్షా బంధన శుభా కాంక్షలు . "

    రిప్లయితొలగించండి
  26. చింతా రామకృష్ణారావు గారూ,
    ఎవరు వలదన్నా రక్షాబంధనానికి రమ్మని చెల్లెలు అన్నను పిలిచిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణలోని చమత్కారం అదిరింది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    కరుణరసపూరితంగా ఉండి మీ పూరణ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చెప్పింది. బాగుంది. అభినందనలు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    శ్రేష్ఠమైన పూరణ మీది. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మరి ‘కనిమొళి’ అన్నలు ఆమెను రక్షించడానికి ముందుకు వస్తారా?
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘రక్షాబంధనం’ అనగానే పురుషోత్తముడూ, అతనికి రాఖీ కట్టిన అలెగ్జాండర్ ప్రియురాలు గురుకు వస్తాయి. ఆ సందర్భాన్ని విషయంగా చేసుకున్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మీ రెండవ పూరణ నాకొక సంఘటనను గుర్తుకు తెచ్చి కన్నీరు తెప్పించింది. స్వానుభవం మరి! ఇంత చక్కని పూరణ చెప్పినందుకు ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మన బ్లాగు అక్కాచెల్లెళ్ళను గుర్తుకు చేసినందుకు ధన్యవాదాలు.
    వసుదేవుని మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. గురువుగారూ ధన్యవాదాలు. మీకు బాధాకరమైన సంఘటనను గుర్తు చేసినందుకు క్షంతవ్యుణ్ణి. నేటి సమాజంలో అటువంటి చెల్లెళ్ళూ, నా మూడవ పూరణలోని వదినల వంటి వనితలూ ఎందరో ఆడుబిడ్డలు ఇప్పటికీ యాతనలు పడుతూ ఉండడం మనందరికీ తెలిసిందే కదా. వారందరికీ మంచిరోజు రావాలని దేవుణ్ణి ప్రార్థించడం కన్న మనమేం చెయ్యగలం.

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్న గారూ,
    అలాంటి ఆడబిడ్డ ఉన్న వదిన ఎంత అదృష్టవంతురాలు? మంచి పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరక్కా,
    ధన్యవాదాలు. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు? ఎలా ఉన్నారు? మాతృదేశానికి వచ్చారు కదా! సంతోషం.
    ఇక మీ పూరణ. భావం బాగుంది. కానీ తమ్ముడికి పని కల్పించకుండా ఉంటారా? రెండవ పాదంలో గణయతి దోషాలున్నాయి.. ‘యక్షులు గంధర్వులు మిము నరయుదు రన్నన్’ అంటే సరి.

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్న గారూ,
    ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి బాధపడ్డా తన అత్తవారింట్లో అన్న అవమానం పొందకూడదన్న చెల్లెలి ప్రేమాభిమానాలు గుర్తుకు వచ్చి ఒక విధమైన తృప్తీ కలుగుతుంది. ఆ సంఘటన గురించి ఇంతకంటె వివరంగా చెప్పలేను.

    రిప్లయితొలగించండి
  30. స్వక్షేత్రము = నా క్షేత్రము మీకు దూరమౌతుంది, మూర్తిగారు చెప్పినా , మిగతావారు చెప్పకపోయినా సోదరప్రేమను అపారంగా కురిపిస్తున్న, ఇక్కడ ఉన్న సహోదరులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు.

    మీ అందరినీ సంబోధిస్తూ.....

    స్వక్షేత్రము కడు దూరము
    అక్షయముగ దీవనఁ, బ్రియముగా నాకున్
    రక్షగ నొసగితి; శ్రమతో
    రక్షాబంధనమునాఁడు రావలదన్నా!

    రిప్లయితొలగించండి
  31. గురువుగారూ,
    మీ పదాల పొందిక నిజంగానే అద్భుతంగా ఉంటుంది. మీ సవరణలు శిరోధార్యాలు.ధన్యవాదములు.
    నిన్నటి మీ పద్యం కూడా ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    నా సవరణకే సవరణ ... నా సవరణలో గణదోషం, అక్షరదోషం ...
    ‘కుక్షి యదియె చల్లనైన కోవెల గదరా!’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  33. మందాకిని గారూ,
    మీ లేటెస్ట్ పూరణలో అందరికీ చెల్లివైనందుకు సంతోషం, ధన్యవాదాలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘దీవనఁ’ ను ‘దీవనలఁ’ చేస్తే సరి!

    రిప్లయితొలగించండి
  34. సోదరు లందరికి శుభా కాంక్షలు + అభినందనలు. ఇంతటి పవిత్ర మైన రక్షా బంధన దినమున మీ అందరి మధ్యకు రాగలిగి నందులకు నాకు చాలా ఆనందం గా ఉంది. ఇంతకంటే అదృష్టం మరేముంది ? సవరణకు ధన్య వాదములు తమ్ముడూ !
    మందాకిని గారూ ! కుశలమా ? అందరికీ ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  35. గురువుగారూ, ధన్యవాదములు.
    అక్కయ్య గారూ, మీకు పునఃస్వాగతం.

    రిప్లయితొలగించండి
  36. లక్షణ మౌకొలువట" ఆ
    రక్షణ" మూలమున దొరికె రక్షణ శాఖన్,
    శిక్షణ పక్షము రోజులు
    రక్షాబంధనమునాఁడు రావలదన్నా!


    ఆరక్షణ =Reservation

    రిప్లయితొలగించండి
  37. మంద పీతాంబర్ గారూ,
    మీ లేటెస్ట్ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  38. రోజుకో ధర్నా, పూటకో బందులు జరిగే ఈరోజుల్లో ఓ చెల్లెలు ఇలా....
    దీక్షగ చెల్లెలు యన్నకు
    రక్షాబంధనము సేయ రావలెనన్నన్
    దీక్షలు, బందులునేవియు
    రక్షాబంధనమునాడు రావలదన్నా!

    రిప్లయితొలగించండి
  39. పింగళి శశిధర్ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం చెపుతున్నది. సంతోషం!
    చక్కని పూరణతో మీ ప్రవేశం అలరించింది. అభినందనలు.
    ‘చెల్లెలు + అన్నకు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెల్లెలె యన్నకు / సోదరి యన్నకు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  40. అజ్ఞాత గారి పూరణ ...
    rakshita yanundu sodari
    rakshaa bandhanam naadu raakhi todagan
    deekshaga palkan nennati
    raksha bandhanamu nadu raavaddanna

    రక్షిత యనెడి సహోదరి
    రక్షాబంధనమునాడు రాఖీ తొడగన్
    దీక్షగ పల్కెను నిన్నటి
    రక్షాబంధనము నాడు రావలదన్నా!

    రిప్లయితొలగించండి
  41. అజ్ఞాత గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసార్హమైనది. అభినందనలు.
    కాకుంటే మీ భావాన్ని సరిగా వ్యక్తీకరించలేదని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  42. శిక్షించును శ్రీ కృష్ణుడు
    తక్షణమే పారిపొమ్ము తగవుల మధ్యన్
    రక్షణ నీయగ లేనిక
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

    రిప్లయితొలగించండి
  43. భిక్షము పెట్టదు పిల్లికి
    శిక్షించును నన్ను నిన్ను చీపురు తోడన్
    కక్షలు కట్టిన దత్తయ
    రక్షాబంధనము నాఁడు రావల దన్నా|

    రిప్లయితొలగించండి