25, ఆగస్టు 2011, గురువారం

సమస్యా పూరణం -437 (పాలు గావలెనని యన్న)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
పాలు గావలెనని యన్న పట్టుబట్టె.
ఈ సమస్యను సూచించిన
కోడీహళ్ళి మురళీ మోహన్ గారికి
ధన్యవాదాలు.

33 కామెంట్‌లు:

 1. అన్నదమ్ములు జేరిరి నాన్న వద్ద
  పంచ నెంచెను తండ్రియు భాగములను
  పెండ్లి యైనను చెల్లికి, వేరు యనక
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 2. ఆకలనుచును పెద్దగా నరచి యరచి
  అన్నదమ్ములు జేరిరి అమ్మ కడకు
  బోర్నువీటను కలుపగా ; ' బోరు' వట్టి
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 3. పాలకుల పాప భారమ్ము పండి పోవ,
  ప్రజలమేలుకై దారిజూప ,యవినీతి
  రూపుమాప, హజారెగారు జనలోక
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె!!!

  రిప్లయితొలగించు
 4. తనయు లిద్దరి దరిజేరి తండ్రి యపుడు
  పలక బలపము లిచ్చెను బడికి పంప,
  తనవి చిన్నవి, పెద్దవి తమ్ముని బల
  పాలు, గావలెనని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 5. పీతాంబర్ గారూ ! అన్నన్నా ! అసలు 'పాలను ' పట్టుకున్నారండీ ! అభినందనలు.

  రిప్లయితొలగించు
 6. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  __________________________________

  రాజ్య మీకున్న తప్పదు - రణమ టంచు
  రాయబారిగ పంపెను - రాజ్య మడుగ
  రాజు యొద్దకు కృష్ణుని - రమ్య మలర !
  పాలు గావలెనని యన్న - పట్టు బట్టె !
  __________________________________
  అన్న = ధర్మరాజు

  రిప్లయితొలగించు
 7. పీతాంబరధరుల స్ఫూర్తితో :

  02)
  __________________________________

  పాలనందున యవినీతి - పాళ్ళు పెరిగె
  పాప కర్ముల నందర - పట్టు కొనగ
  భారతావని రక్షింప - ప్రజల లోక
  పాలు గావలెనని యన్న - పట్టు బట్టె !
  __________________________________
  ప్రజల = జన

  రిప్లయితొలగించు
 8. గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
  ఆస్తి పంపకములనందు యావు పోయె
  తమ్మునికి పాలుగా, మేక దనకు దక్కె,
  తమ్మునింట నీనగ యది, తనకు జున్ను
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె|

  రిప్లయితొలగించు
 9. వదిన మాటలు వినియన్న వాత బెట్టె
  అన్న ఇంటను కష్టాలె యనుదినంబు
  అత్త గారాన అడుగగ అడవిలొ పులి
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.
  ---- టేకుమళ్ళ వెంకటప్పయ్య.

  రిప్లయితొలగించు
 10. పాలు గావలెనని యన్న పట్టుపట్టె
  పాల బువ్వలు నాకు గావలెను యనుచు.
  పంట నష్టముఁ బూడ్చను పాల నిచ్చు
  పశువు లమ్మిన యింటను పాడి యేది?

  రిప్లయితొలగించు
 11. శివుని కభిషేకమును నేను చేతునంటి.
  నారికేళంబులను తెచ్చినావు నీవు.
  పాలు తేలేదు. తమ్ముడా వరలు గోవు
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 12. చెల్లి పాలనే త్రావును చిన్న దగుట
  నీకు బువ్వయే బొజ్జకు నిండుగాను
  అనిన వినడాయె సుంతయు నమ్మ మాట
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 13. నా పూరణ ....

  తమ్ముడు పరీక్ష తప్పితే అన్న స్కూలుకు వచ్చి అక్కడి క్లర్క్ తో అంటున్నాడు.

  "వేల కొలఁదిగ ఫీజులు పిండికూడ
  తగిన బోధన లేదు; మా తమ్ముఁ డేల
  తప్పెను పరీక్ష? ప్రశ్నింపఁ దలఁతు; ప్ర్రిన్సి
  పాలు గావలె" నని యన్న పట్టుబట్టె.

  రిప్లయితొలగించు
 14. "ప్రిన్సిపాలు " ఉహకందని పాలు. గురువుగారి పూరణ అద్భుతంగా ఉంది.
  గురువుగారికి అభినందనలు.

  రిప్లయితొలగించు
 15. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 25, 2011 8:57:00 PM

  శ్రీగురుభ్యోనమ:
  గురువుగారూ,సాధారణ సమస్యకు అసాధారణ పూరణ
  వందనపూర్వక అభినందలు.

  రిప్లయితొలగించు
 16. శంకరార్యా ! ధన్యవాదములు.
  ' ప్రిన్సిపాలు ' వద్దకు అన్నను పంపించటం.... భలే ఉందండీ !

  రిప్లయితొలగించు
 17. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మూడు విధాల ‘పాల’తో మీ మూడు పూరణలూ చాలా బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘వేరు + అనక’ అన్నపుడు యడాగమం రాదు. అక్కడ ‘వేరనకను / విధిగ నొక్క’ అంటే ఎలా ఉంటుంది?
  *
  మంద పీతాంబర్ గారూ,
  ‘గోలి’వారు చెప్పినట్లు అసలైన ‘పాలు’ను పట్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘రాజు నొద్దకు / రాజు వద్దకు’ అందాం.
  రెండవ పూరణలో ‘పాలనములోన నవినీతి’ అందాం. బాగుంటుంది.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ ‘జున్నుపాల’ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ఆస్తి పంపకములలోన నావు పోయె" అంటే బాగుంటుంది.
  *
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  ఎక్కడిదండీ ఈ జాపపద కథ? చక్కని పూరణ. అభినందనలు.
  ‘అడవిలొ’ అనడం కంటె ‘అడవిని’ అనండి.
  *
  మందాకిని గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘కావలెను యనుచు’ అనేది ‘కావలె నటంచు’ అంటే ఓ.కే.
  *
  చింతా రామకృష్ణారావు గారూ,
  ‘ఆవు పాల’తో నేను పూరించా లనుకున్నాను. ఆ పని మీరు చేసేసరికి నేను ‘ప్రిన్సిపాలు’ను ఆశ్రయించాను. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  శ్రేష్ఠమైన పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 18. శ్రీపతిశాస్త్రిగురువారం, ఆగస్టు 25, 2011 10:43:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  అప్పగించెను తమ్ముడు ఆలమంద
  ను తన స్నేహితునకు. అతనుదొర వోలె
  అమ్ముకొనుచుండ కనుగొని అతని చేరి
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె.

  పాలు = భాగము. వచనంలాంటి నా పద్యం
  కవిమిత్రుల మంచి పూరణల ముందు దిగదుడుపే.

  రిప్లయితొలగించు
 19. శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  న్యూనతాభావం అవసరం లేదు. ఎవరి ప్రత్యేకత వారిదే.
  కాకుంటే రెందవపాదం నడక కొంత తడబడింది. మొదటి పాదంలో ‘తమ్ముడు + ఆలమంద’ అని విసంధిగా వ్రాసారు. ‘అప్పగించినా డదె తమ్ము డాలమంద’ అంటే సరి!

  రిప్లయితొలగించు
 20. ఉన్నది మిగుల యిరుకైన చిన్ని కొంప
  పైగ చుట్టాలు వచ్చిరి పల్లె నుండి
  వల్ల మానిన పని కాగ వదినకి, మురి
  పాలు గావలెనని యన్న పట్టుబట్టె

  రిప్లయితొలగించు
 21. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
  మీ ప్రిన్సిపాలు పూరణ చాలా బావుంది ! అభినందనలు !

  రిప్లయితొలగించు
 22. పాలు ఎంత మంది తాగినా యింకా సమృద్ధిగా ఉండడము మన అదృష్టము

  జుట్టు తక్కువైన దలకు చుండు రాదు
  జుట్టు తగ్గిన దల బేలు పట్ట వనిన
  జుట్టు దన కిడు బ్రీతి యంచు పెరుగు జుల
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

  రిప్లయితొలగించు
 23. ఆ మధ్య మిస్సన్న గారు ఇంటి నిండా రాళ్ళు పేరుస్తామని చక్కని పద్యము చెప్పారు. ఆ స్ఫూర్తితో,

  సొమ్ము లూరకె వచ్చిన వమ్ము దగదు
  ఇంట చలువపు రాళ్ళుయే గంటి కింప ?
  పంపకమ్మున దన పాలు పాల రాళ్ళ
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

  రిప్లయితొలగించు
 24. ఈ పద్యము సోమరు లైన అన్నలకు అంకితము :

  ఖరము పాలు

  కాల మించుక వ్యర్ధమ్ము గడువ రాదు
  కాల హరణము సేయక మేలు గూర్చు
  మనిన వినక సంవత్సర మంత ఖరము
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

  రిప్లయితొలగించు
 25. మిత్రు లందఱి పద్యాలలో పాలు రుచికరముగా ఉన్నాయి. గురువు గారి ప్రిన్సిపాలు ఊహ చాలా బాగుంది. వరప్రసాద్ గారూ! జున్నంటే యీ అన్నయ్య కిష్టమే. కొన్ని యీ దిశలో పంపించండి. చంద్రశేఖరుల వారితో పాలు పంచుకొంటాను.

  రిప్లయితొలగించు
 26. తప్పు చేసిన చోరాజ తనయుడైన
  ధనికు డైనను తండ్రైన తమ్ము డైన
  కడప నాయకు డైనను కడకు జైలు
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

  రిప్లయితొలగించు
 27. మూర్తి మిత్రమా బాగు బాగు!
  మీరూ వసంత మహోదయుని బాట పడుతున్నారు.
  అబ్బో ఎన్ని రకాల పాలో!

  రిప్లయితొలగించు
 28. శ్రీ మంద పీతాంబర్ వారి పద్యము అదిరింది. వారి పద్యానికి మరో రూపము

  తప్పు చేసిన స్పెక్ట్రపు దైత్యు డైన
  తమిళనాడు వినాయక తనయ యైన
  కడప నాయకు డైనను కడకు జైలు
  పాలు గావలెనని యన్న పట్టు బట్టె !

  రిప్లయితొలగించు
 29. మిస్సన్న గారూ ధన్యవాదములు. నెలాఖరవడము వలనను కొంటాను,యీ రోజు యింటికి త్వరగా రావడము కుదిరింది. మన మిత్రుల పూరణలు చదువుతూంటే వసంత కిశోర్ మహోదయుల ఉత్సాహము నాకు వచ్చింది.

  రిప్లయితొలగించు
 30. జిగురు సత్యనారాయణ గారూ,
  మురిపాలు మూటగట్టిన మీ పూరణ ముచ్చటగా ఉంది. అభినందనలు.
  అన్నట్టు ... తెలుగు టీవీ చానళ్ళు బాగా చూస్తున్నారా? ‘వదినకు‘ అనకుండా ‘వదినకి’ అన్నారు :-)
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ జులపాల మొదటిపూరణ చమత్కారభరింతమై బాగుంది.
  రెండవపూరణలో కొంత సందిగ్ధత గోచరిస్తున్నది.
  మూడవ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  జైలు పాలు చేసిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  మిత్రుల పూరణలను, నా పూరణను ప్రశంసించిన అందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 31. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మందా వారి పద్యానికి మీ ‘మేకప్’ ప్రశంసనీయంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 32. గురువు గారూ ధన్యవాదములు

  రిప్లయితొలగించు